Play Audio |
మానవుడు తరించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎందరో మహానుభావులు ఈ మార్గాలను మనకు చూపించి మార్గదర్శకత్వం చేశారు. మహానుభావుడు, విష్ణు అంశ అయిన వేదవ్యాసుడు ఎన్నో ఆథ్యాత్మిక గ్రంథాలను లోకానికి ఇవ్వడం జరిగింది. వేదాలను విభజించి, బ్రహ్మ సూత్రాలు వ్రాసి ఉపనిషత్తులు చెప్పారు. అలానే మహాభారతం, భగవద్గీత, అష్టాదశ పురాణాలను ఆయన లోకానికి ఇచ్చారు. కాని ఆయనలో ఏదో అసంతృప్తి. అప్పుడే భాగవతం ఆవిర్బవించింది. భాగవతం అంటే భగవంతుని లీలలు. అలానే సాయి భక్తులు సాయిలీలలను తెలుసుకొని పారాయణం చేస్తూ, సాయి పట్ల ఋణానుబంధం పెంచుకోవడమే సాధన. సాయి అపరదయామయులు ఆయన కృప అపారమైనది. ఆయన ఏ సాధనలు లేకుండానే మనకు అనుభవాలను కలుగచేస్తారు.
ఆయన మనల్ని అడిగింది ఏమిటి?
జీవితాన్ని సరిదిద్దుకొని మంచి బాటలో నడుస్తూ, ధర్మాన్ని పాటిస్తూ, దయ, కరుణలతో ఉండమన్నారు. నమ్మకం, ఓర్పు అనే రెండు మంత్రాలను మనకు ఇచ్చారు. అన్నింటికన్నా సులువైన సాధన భగవంతున్ని ప్రేమించడమే. ఆ ప్రేమతత్వాన్ని శ్రీ కృష్ణుడు సర్వమానవాళికి పంచాడు. అలానే సాయి అవతార మహిమ కూడా ఇదే తత్వాన్ని తెలియచేస్తుంది. ఈ విశ్వంలో ప్రేమకు లొంగని వస్తువు ఉండదు. ఎందుకంటే ఉన్నది ఒకే తత్వం, అదే తత్వం అనేక రూపాలుగా కనిపిస్తూ ఉంది. ఉన్నది ఒక్కటే అయినప్పుడు అది మనతత్వమే అయినప్పుడు మనకు అంతుచిక్కకుండా ఉండదు. అందుకే మనము సాయితత్వాన్ని, ఆయన లీలలను తెలుసుకొని తరిద్దాము.
నాచ్నే పూర్తిపేరు శాంతరాం బల్వంత్
నాచ్నే. ఆయన ఒక మెజిస్త్రేట్ కోర్టులో హెడ్ గుమస్తాగా పనిచేసేవారు. ఆయన 1923 లో సాయిలీల
మాసపత్రిక ద్వారా తన అనుభవాలను కొన్ని తెలియచేసారు. తరువాత శ్రీ నరసింహస్వామి గారికి
సెప్టెంబర్ 1936 లో మరి కొన్ని అనుభవాలను చెప్పారు. ఆయన జీవితంలో బాబా ఎలా ప్రవేశించారు.
ఆయన కుటుంబాన్ని ఎలా రక్షించారు అన్న విషయాలు మనము తెలుసుకుందాము.
బాబా సాధువుగా వచ్చుట
మానవ
జీవితం కష్టాలతో నిండి ఉంటుంది. ఒక్కోసారి ఏదో ఒక అదృశ్య శక్తి మనలను కాపాడుతూ ఉంటుంది.
మనక్కూడా అర్ధం అవుతుంది. ఈ అదృశ్యశక్తి లేకుండా ఈ కష్టం నుంచి నేను బయట పడడం అసాధ్యం
అని. అలాంటి సంఘటనే నాచ్నే విషయంలో కూడా జరిగింది. బాబా అంటే ఎవరో తెలియనప్పుడు కూడా
బాబా దగ్గర ఉండి రక్షించారు.
ఒకసారి 1909 లో నాచ్నే అన్నగారికి
గొంతుదగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆయనను బొంబాయిలోని జజేకర్ హాస్పిటల్‌లో చేర్పించారు.
అప్పుడు నాచ్నే దహను అనే ఊరిలో ఉండేవారు. నాచ్నే ఇంటికి ఒక సాధువు రావడం జరిగింది.
ఆయన వచ్చి రెండు రొట్టె ముక్కలు ఉంటే పెట్టమని అడిగాడు. వారు అతనిని లోపలికి సాదరంగా
ఆహ్వానించి నాచ్నే వదినగారు అన్ని వడ్డించారు. ఆమె ఇంట్లో ఉన్న బెండకాయ కూర తప్ప అన్ని
సాధువుకు పెట్టడం జరిగింది. ఆ బెండకాయ కూర అంతకుముందు వండినది. ఆ సాధువు నాకు ఆ కూరే
కావాలని అడిగి పెట్టించుకుంటారు.
ఆ సాధువు భోజనంచేసి అందరిని ఆశీర్వదించి
హాస్పిటల్‌లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోతారు. అందరూ ఆశ్చర్యపోతారు.
ఈయనకు ఆపరేషన్ గురించి ఎలా తెలిసింది ఈయన ఎవరో మహానుభావుడని భావిస్తారు. అదే రోజు నాచ్నే
స్నేహితుడైన హలిభావు మోరేశ్వర్ పాన్సే" సాయిబాబా కృప వలన అంతా చక్కగా జరుగుతుంది"
అంటారు. నాచ్నే అదే మొదటిసారి సాయి పేరు వినడం.
ఇంతలో నాచ్నే నాన్నగారు బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ బాగా జరిగిందని ప్రమాదం ఏమీలేదని
చెప్తారు. ఆపరేషన్ అయిన తర్వాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన భాగంపై తన చేతిని ఉంచి
"అంతా మంచే జరుగుతుంది" అని ఆశీర్వదించి వెళ్ళారు. ఇలా నాచ్నే తండ్రి గారు చెప్పగానే వాళ్ళకి అర్ధం
అయింది. ఒకే సాధువు దహనులో మరియు బొంబాయిలో కనిపించి మహత్తరమైన లీలను చూపి రక్షించారు.
ఇదే విషయాన్ని తరువాత కాలంలో నాచ్నే షిర్డి వెళ్ళినప్పుడు బాబాయే ఆ సాధువు అని గ్రహించారు.
నాచ్నే షిర్డిలో ఉన్నపుడు ఒకరోజు ధీక్షిత్, జోగ్, దాబోల్కర్ లతో బాబా ఇలా అన్నారు. నేను
ఈ నాచ్నే ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర పెట్టలేదు.
అప్పుడు నాచ్నేకు బాబాయే సాధువు రూపంగా వచ్చి వాళ్ళ అన్నయ్యను రక్షించారు అని తెలిసింది.
బాబా చేసే లీలలకు అంతులేదు.
బాబాతో తొలి కలయిక
1909
లో బాబా ఒక సాధువు రూపంలో వాళ్ళింటికి వచ్చిన తరువాత నాచ్నే తండ్రి గారు దాసగణు గారి
సంకీర్తనకు వెళ్తారు. ఆ కీర్తనలో బాబా సాక్షాత్తు దత్తాత్రేయులని దాసగణు చెప్తారు. అప్పుడు
వారు సాయి ఫోటోను తెచ్చుకొని ప్రతిరోజు పూజచెయ్యడం ప్రారంభిస్తారు. 1912 లో మొట్టమొదటిసారిగా
నాచ్నే షిర్డి వెళ్తారు. అప్పటికి ఆయన తన వృత్తిలో పై స్థానానికి ఎదగడానికి కొన్ని
పరీక్షలు వ్రాశారు. అప్పటికి ఫలుతాలు రాలేదు. నాచ్నే తన మిత్రులైన శంకర్ బాలకృష్ణ్
వైద్య, అచ్యుత దాతే అనేవారితో కలిసి షిర్డి ప్రయాణమవుతాడు. వారు రైలులో ప్రయాణించి కోపర్‌గావ్
స్టేషన్‌లో దిగుతారు. వాళ్ళు సాయిని దర్శించుకోవటానికి వెళ్తున్నారని తెలిసి అక్కడ
ఉన్న స్టేషన్ మాష్టర్ సాయి గురించి చులకనగా మాట్లాడుతాడు. సాయి తన గారడి విద్యలతో ప్రజలని
మోసగిస్తున్నాడని ఆయన అంటాడు. అప్పుడు నాచ్నే మనసు కలవరపడుతుంది. ఆయనలో సంశయం మొలకెత్తుతుంది.
కాని సాయిని దర్శించకుండా వెళ్ళకూడదు అని నిశ్చయించు కొని షిర్డికి వెళ్తాడు. బాబా
అప్పుడే లెండి తోట నుండి వస్తూ ఉంటారు. బాబా నాచ్నేను చూడగానే ఏమిటి? మామలత్‌దారు అనుమతి
తీసుకోకుండా వచ్చావా? అని అడిగారు. అలా ఎప్పుడూ చేయకు అని వారిస్తారు. బాబా అలా అని
వెళ్ళిపోతారు. నాచ్నే తేరుకుని బాబాకు నాపేరు చెప్పలేదు. నేనెవరో చెప్పలేదు, కాని నేను మామలత్‌దారుకు చెప్పకుండా వచ్చిన విషయాన్ని కూడా
చెప్పారు. ఆ స్టేషన్ మాష్టర్ వ్యర్ధ ప్రేలాపనలు చేశాడు. సాయి మహానుభావుడు, మహాత్ముడు
అని అనుకున్నాడు. వెంటనే సాయి మీద అమిత విశ్వాసం, భక్తి, శ్రద్ధలు ఏర్పడ్డాయి.
తరువాత మశీదుకు వెళ్ళినప్పుడు, బాబా
నాచ్నేపై ప్రత్యేక అభిమానం చూపిస్తారు. వారు
స్వయంగా నాచ్నే చేతిలో ఊది పెట్టి, ఆ ఊది తీసి నుదిటిపై పెట్టారు. ఈ భాగ్యం అందరికి
లభించేది కాదు.
ఏకాదశి ఉపవాసం
నాచ్నే
మొట్టమొదటి సారి షిర్డి వెళ్ళినప్పుడు ఒక రోజు ఆరతి సమయానికి మశీదుకు వెళ్తాడు. బాబా
నాచ్నేను చూసి వాడాకు వెళ్ళి బోజనం చేసి రమ్మంటారు. అప్పుడు నాచ్నే మామూలుగా ఏకాదశి
రోజు ఉపవాసం ఉండడు. కాని తనతో వచ్చిన ఇద్దరు మిత్రులు ఉపవాసమున్నారు. వారు తినకుండా
తను తినడం బాగుండదని నాచ్నే కూడా ఏమీ తినలేదు. అప్పుడు బాబా వైద్య, దాతేలను చూపిస్తూ
"వీళ్ళు పిచ్చివాళ్ళు నువ్వు వాడాకు వెళ్ళి భోజనం చేసిరా" అంటారు. నాచ్నే
వాడాకు వెళ్ళి భోజనం పెట్టమని అడుగుతాడు. అక్కడ వడ్డించే వ్యక్తి విసుక్కుని ఆరతి అయ్యేంత
వరకు భోజనం పెట్టను అంటాడు. చేసేది ఏమిలేక మశీదుకు తిరిగి వచ్చిన నాచ్నేను బాబా అన్నం
తిన్నావా అని అడుగుతారు. జరిగిన విషయం తెలుసుకొని బాబా ఆరతి ఆగుతుంది. నువ్వు తిని
వచ్చిన తరువాతే ఆరతి మొదలవుతుంది వెళ్ళు అని మరలాపంపిస్తారు. ఇక గత్యంతరం లేక ఆ వడ్డించే
వ్యక్తి నాచ్నేకు అన్నం పెడ్తాడు. భోజనం చేసి మరల మశీదుకు వెళ్తాడు నాచ్నే. ఒక భక్తురాలు
బాబాకు తాంబూలం ఇస్తుంది. బాబా ఆ తాంబూలం నాచ్నేకు ఇస్తారు. అదివేసుకున్న తరువాత ఆరతి
మొదలవుతుంది. ఆరతి అయిన తరువాత బాబా నాచ్నే దగ్గర 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయల
దక్షిణ అడిగి తీసుకుంటారు. దాతే బాబాకు దక్షిణ ఇవ్వాలని అనుకోలేదు అందుకే
బాబా అతన్ని దక్షిణ అడగలేదు. అంతలో ఒక మార్వాడి బాలిక బాబా దగ్గరకు వచ్చి నారింజపండు
కావాలని అడిగింది. దాతే తన అల్పాహారం కొరకు కొన్ని నారింజపండ్లు వాడాలో ఉంచి, మిగిలినవి
బాబాకు సమర్పిస్తాడు. కాని బాబాకు అన్ని తెలుసు, వాడాకు వెళ్ళి మిగిలిన నారింజపండ్లు
తెమ్మంటారు. కాని దాతే వాటిని ఇచ్చేందుకు నిరాకరిస్తాడు. బాబాకూడా ఒత్తిడి చేయలేదు.
తరువాత నాచ్నే తను వ్రాసిన పరీక్షలలో
ఎటువంటి ఫలితం వస్తుందని బాబాను అడుగుతాడు. బాబా "అల్లామాలిక్" అని తన చేతిని
నాచ్నే తలపై ఉంచి ఆశీర్వదిస్తారు. నాచ్నే తరువాత పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు. ఇలా నాచ్నే
మొట్టమొదటి కలయిక ముగిసి వారు బాబా దగ్గరనుంచి అనుమతి తీసుకొని దహను బయలుదేరుతారు.
హరిభావ్ పాన్సే శిక్ష తప్పించుట
1913లో
నాచ్నే షిర్డి వెళ్తునప్పుడు పాన్సే అనే అతను ఒక కేసులో ఆఫీసు డబ్బు దుర్వినియోగ పరచాడనే
అభియోగంపై శిక్ష పడవచ్చని బాబాను రక్షించమని అడగమన్నాడు. తాను ఆ తప్పు చేయలేదు బాబాకు
అంతా తెలుసు అని విన్నవించు కుంటాడు. నాచ్నే షిర్డి వెళ్ళి, చావడిలో కాకడ ఆరతి జరుగుతున్నపుడు
బాబాను సందర్శించాడు. బాబా అప్పుడు చాలా కోపంగా ఉన్నారు. నాచ్నే చెప్పక ముందే పాన్సే
కేసు గురించి ఇలా అన్నారు. అతను అప్పీలుపై విడుదల అవుతాడు చింతించనవసరం లేదు అని చెప్పు
అన్నారు. తరువాత షిర్డి నుంచి వెళ్ళి పాన్సేను కలుస్తాడు. బాబా దయవలన అప్పటికే విడుదల
అయినట్లు నాచ్నేకు చెప్తాడు.
ఓం శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment