Play Audio |
సాయిని
కలిసిన దగ్గర నుంచి దీక్షిత్‌లో చాలా మార్పులు వచ్చాయి. 1910 నుండి అతనికి సాయి సేవలోనే
ఉండాలన్న తపన ఉండేది. న్యాయవాద వృత్తి మీద విరక్తి కలిగింది. ఎక్కువగా షిర్డికి వెళ్తూ
ఉండేవారు. దీనితో తన సంపాదన బాగా తగ్గిపోయింది. ఆయనతో భాగస్వాములుగా ఉన్న రావ్ బహుదూర్
నారాయణ దాస్, ధంజీషా మొదలైనవారు దీక్షిత్‌తో ఉండడం ఇష్టంలేక విడిపోతారు. దీక్షిత్ తనంతట
తానే ఒక సంస్థను ప్రారంభిస్తారు. పురుషోత్తం రామ్ మార్కడ్ అనే ఆయనను భాగస్వామిగా తీసుకుంటాడు.
అది కూడా ఎక్కువ కాలం నిలువదు. 1911 నుంచి దీక్షిత్ ప్రాక్టీస్ బాగా తగ్గిపోయి సంపాదన
పూర్తిగా పడిపోతుంది. ఒకసారి బాబా దగ్గరకు వెళ్ళి "బాబా ఈ వృత్తిలో అబద్దాలు ఆడాలి ఇది
సరియైన వృత్తి కాదు" అని వాపోతాడు. అప్పుడు బాబా "కాకా ఈ వృత్తికి కూడా న్యాయం
చేయవచ్చు, బొంబాయి వెళ్ళి ప్రాక్టీస్ చేయి" అని చెప్తారు. బాబా మాటతో బొంబాయి
వెళ్ళి మళ్ళా ప్రాక్టీస్ మొదలు పెడ్తారు. కాని 1912లో పూర్తిగా మానివేస్తారు. అప్పుడు
అందరూ దీక్షిత్‌ని ఒక ఫకీర్ ఆకట్టుకున్నాడు ఇతడు ఒక పిచ్చివాడిలాగా అయ్యాడు అనుకొన్నారు.
కాని దీక్షిత్ ఇవన్ని లెక్కచేయకుండా బాబానే నమ్ముకున్నాడు.
మామాలుగా అందరూ ఇటువంటి పరిస్థితి వస్తే
దిగాలు పడ్తారు. కాని దీక్షిత్ తన అవసరాలను చాలా తగ్గించుకొని అనవసరమైన ఖర్చులు చేయకుండా
తనకున్న సంపదను జాగ్రత్తగా వాడుకున్నారు. ఎక్కువ సమయం షిర్డిలో ఉండటానికి ప్రయత్నించారు.
ఇది ఒక మాదిరిగా వానప్రస్థ ఆశ్రమంగా అనిపించింది. అప్పటికి తనకు పెళ్ళి అయి ప్రాక్టీస్
మొదలు పెట్టి సుమారు 25 సంవత్సరాలు అయింది.
బాబా రక్షణ
ఒకసారి
కాకాసాహెబ్ షిర్డిలో ఉండగా బాగా జ్వరంతో బాదపడ్తారు. అప్పుడు బాబా దీక్షిత్‌ను బొంబాయి
పంపిస్తారు. జ్వరం నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. నీవు ఆ బంగళాకు వెళ్ళి విశ్రాంతి
తీసుకో కాని మంచంలో ఉండద్దు. చక్కగా శీరా తీపి మాత్రం తిను. దీక్షిత్ విల్లెపార్లెలో తన బంగళాకు వెళ్తారు. అక్కడ ఆయనకు జ్వరం ఇంకా పెరుగుతుంది. డా|| డిమాంటి అనే వైధ్యుడిని
పిలుస్తారు. ఆయన అది నవజ్వరం అని మంచం మీద నుంచి కదలవద్దని, మందులు జాగ్రత్తగా వాడమని
చెప్తారు. కాని దీక్షిత్ బాబా ఆజ్ఞను శిరసావహిస్తాడు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు.
కాని దీక్షిత్ మాత్రం బాబా మాటలను తూచ తప్పకుండా పాటిస్తాడు. 9వ రోజున జ్వరం పూర్తిగా
తగ్గిపోతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడే దీక్షిత్ సాయి మీద నమ్మకాన్ని నిరూపించాడు.
బాబా చెప్పిన శ్రద్ధ, సబూరిలలో శ్రద్ధను చూపిస్తాడు.
బాబా, దీక్షిత్ కుటుంబ సభ్యులను కూడా రక్షించారు. ఒకసారి దీక్షిత్ తమ్ముడు జబ్బుపడ్డట్టు ఉత్తరం వచ్చింది. ఆ తమ్ముడు నాగపూర్‌లో ఉంటాడు. బాబా దగ్గరకు వెళ్ళి "బాబా నేను నా తమ్ముడికి సహాయం చేయలేకపోతున్నాను అంటే, బాబా నేనున్నాను" అంటారు. అదే సమయంలో ఒక సాధువు వాళ్ళ తమ్ముడి దగ్గరకు వచ్చి నేనున్నాను అని ఆయన జబ్బుని నయం చేస్తారు. తరువాత ఈ విషయం తెలుసుకొని బాబా యొక్క శక్తిని అర్ధం చేసుకుంటాడు.
అలానే ఒకసారి దీక్షిత్ కూతురు ఆడుకుంటూ
ఒక అల్మరా ఎక్కితే అది క్రిందపడి ఒక దెబ్బ కూడా లేకుండా బయటపడుతుంది. బాబా అప్పుడే
కాకా కూతుర్ని కాపాడా అని చెప్తారు. ఇలా బాబా కాకా కూతురు వత్సలిని రక్షిస్తారు.
1913లో దీక్షిత్ షిర్డిలో ఉండగా తన కుమారుడు
జబ్బున పడ్తాడు, తనను తొందరగా ఇంటికి రమ్మని ఉత్తరం వస్తుంది. అప్పుడు సాయి నీ కుమారుడినే
ఇక్కడకు పిలిపించు అని చెప్తారు. కాని పిల్లాడికి పరీక్షలు ఉన్నాయి ఎట్లా అని కుటుంబం
సందిగ్దంలో పడ్తుంది. దీక్షిత్ వారిని మందలించి బాబా చెప్పినట్లు కొడుకుని షిర్డి రప్పిస్తాడు.
షిర్డికి రాగానే ఆరోగ్యం కుదుట పడ్తుంది. నవంబర్ 2, 1913న పరీక్షలు మొదలవుతాయి అని
బాబా అనుమతి కోరగా బాబా అనుమతి ఇవ్వరు. రెండవ సారి కూడా పరీక్షలు మార్చబడతాయి. బాబా
అనుమతితో తరువాత దీక్షిత్ కుమారుడు వెళ్ళడం జరుగుతుంది. అతను చక్కగా పరీక్షలు వ్రాసి
ఉత్తీర్ణుడవుతాడు. ఇక్కడ దీక్షిత్ బాబా చెప్పిన సబూరి చూపిస్తారు. బాబాపై అపార నమ్మకం,
గురి చూపిస్తారు. ఈ విధంగా బాబా దీక్షిత్‌ను అతని కుటుంబాన్ని కంటికి రెప్పవలే కాపాడారు.
బాబా మాట వేదవాక్కు
ఒకసారి
దీక్షిత్ బాగా ధ్యానం చేయాలని, రాత్రి పూట ఆహారం మానేయాలి అని అనుకుంటాడు. సాయి ఆశీర్వాదం
కోసం వెళ్ళి, బాబాకు నమస్కరిస్తాడు. అప్పుడు బాబా, కాకా ఈరోజు రాత్రి భోజనానికి ఏమి
చేస్తున్నావు? అని అడిగి కూర, రొట్టె చేయించి నాకు నైవేద్యం పెట్టి నీవు కూడా తిను అని
చెప్తారు. దీక్షిత్‌కి బాబా మాటల్లోని అర్ధం తెలిసి ఉపవాసం చేయాలనే ఆలోచన మానేస్తాడు.
ఇలా
బాబా చెప్పిన ప్రతి మాటను వేదంలాగా పాటిస్తూ సాయి ప్రేమను చూరగొన్నాడు. బాబా హేమద్‌పంత్‌కు,
పురందరేకు, దీక్షిత్ మంచి యోగ్యుడని అతని మాటకు ఎప్పుడూ అడ్డు చెప్పకు,
నీకు మంచి జరుగుతుందని చెప్తారు. అట్లానే దీక్షిత్ ఉత్తమ సాధకుడు అనికూడా పొగిడారు.
మేకను చంపేకథ
జీవుడు
వాస్తవానికి త్రిగుణాతీతుడు కాని మాయా మోహితుడై తన సచ్చిదానంద స్వరూపాన్ని మరచిపోయి
శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్ధమైన
జనన మరణ పరంపరలో పడి బాధపడతాడు. వాటి నుంచి బయటపడే మార్గమే ఎరుగడు. గురువు పాదాలయందు
ప్రేమపూర్వకమైన భక్తి యోగమే అనర్ధాలను ఉపశమింపచేసే మార్గం. ఆ గురువు పట్ల శ్రద్ధను
తెలియచేసేదే ఈ కథ.
ఒకసారి మరణానికి సిద్ధంగా ఉన్న మేకను
ఎవరో తీసుకొని వచ్చారు. దానిని చూడటానికి జనం వచ్చారు. ఏ దిక్కులేని వారిని రక్షించే
దైవమే సాయిమాత. అప్పుడు బాబా ప్రక్కనే ఉన్న బడేబాబాను "ఒక దెబ్బతో దీన్ని చంపేసి
బలి ఇవ్వు" అని అన్నారు. అప్పుడు బడేబాబా "దీన్ని ఊరికే ఎందుకు వధించాలి"
అని అన్నాడు. అక్కడే ఉన్న శ్యామాతో బాబా "శ్యామా నీవైన వెళ్ళి కత్తి పట్టుకురా
ఈ మేకను కోద్దాం, వెళ్ళు" అని ఆజ్ఞాపించారు. శ్యామా, రాధాకృష్ణబాయి దగ్గరకు వెళ్ళి
కత్తి తెచ్చి బాబా ముందుంచాడు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణ బాయికి తెలిసి, ఆమె కత్తిని
తెప్పించుకున్నది. శ్యామా మరో కత్తి తేవడానికి వెళ్ళి వాడాలో కూర్చుంటాడు. తరువాత కాకా
దీక్షిత్ మనసు పరిక్షించాలని బాబా "నీవు వెళ్ళి కత్తిని పట్టుకురా, ఈ మేకను భాద
నుండి విముక్తి చేద్దాం" అని ఆజ్ఞాపించారు. గురువు ఆజ్ఞ మేరకు సాఠె వాడాకు వెళ్ళి
కత్తిని తెచ్చాడు. దీక్షిత్ కత్తిని దృడంగా పట్టుకున్నాడు. దీక్షిత్ పవిత్రమైన బ్రాహ్మణ
వంశంలో జన్మించి, పుట్టినది మొదలు అహింసా వ్రతాన్ని ఆచరించినవాడు. గురువు ఆజ్ఞా పాలనే
ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాని గుండె దడదడ లాడింది. శరీరం చెమటలు పట్టింది. దీక్షిత్
ఒకచేతిలో పంచెను నడుముకు బిగించి, రెండవ చేతిలో కత్తిని పుచ్చుకొని చొక్కాను పైకి జరుపుకుంటూ
మేక దగ్గరకు వచ్చాడు. మరలా బాబాను అడిగాడు "బాబా దీన్ని నరకమంటారా" దీక్షిత్
మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలో కరుణ వలన చేయి వెనుకకే కాని ముందుకు సాగటం లేదు.
"ఇంకా చూస్తూన్నావేమి? చంపేసేయి" అని బాబా అన్నారు. అప్పుడు కాకా చేయి ఎత్తి
కత్తిని కిందకు దించపోతున్నాడు. ఇంతలో బాబా "వద్దులేరా ఊరుకో! బ్రాహ్మణుడవై ఇంత
కఠోరంగా హింస చేయడానికి సిద్దమయ్యావు నీ మనసుకు ఆలోచనే లేదా" అని అడిగారు.
అప్పుడు దీక్షిత్ కత్తిని కిందపడేశారు.
కాకా అప్పుడు "బాబా! మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం మేము రెండో ధర్మాన్ని ఎరుగం,
మాకు సిగ్గు, లజ్జ లేవు, గురువచనా పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. అహింస మేమెరుగం.
మమ్ము తరింప చేసేవి సద్గురుచరణాలు. ప్రాణాలు ఉండనీ, పోనీ మాకు గురువు ఆజ్ఞయే ప్రమాణం"
అని ఎంతో చక్కగా వివరించాడు. తరువాత బాబా కాకాతో ఈ నీళ్ళ డబ్బా పట్టుకో నేను ఇప్పుడు
హలాల్ చేసి సద్గతిని కలిగిస్తానని అన్నారు. అంతలో ఫకీర్ బాబా ఈ మేకను తకియాలో వధించటానికి
అనుమతి తీసుకున్నాడు. దాన్ని బయటకు తీసుకు వెళ్ళగానే చనిపోయింది. మేక చావటం తధ్యం అని
అందరకు తెలుసు కాని బాబా ఈ లీల చూపించటానికే ఇదంతా చేశారు.
ఈ విషయంలో దీక్షిత్ పరిక్షలో నెగ్గారు.
అందుకే బాబా దీక్షిత్‌ను ఎప్పుడూ పొగిడేవారు. ఆయనకు నిన్ను విమానంలో తీసుకుపోతా అని
వాగ్దానం చేశారు. ఇటువంటి శిష్యుడే బ్రహ్మజ్ఞానానికి అర్హుడు. గురుసేవా తత్పరులు, గురువు
ఆజ్ఞ యందు గౌరవం ఉన్నవారు తమ ఇష్టాయిష్టాలను, ఆలోచనలను గురువు శిరసుపై ఉంచుతారు. గురువు
ఆజ్ఞను పాటించేవారు మంచి చెడులను, సారాసారాలను చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలో,
దృష్టి సాయి సమర్దుని చరణాలలో ఉంటాయి. మనోవృత్తి సాయిధ్యాన ధారణల యందు ఉంటుంది. వారి
శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను, ఆజ్ఞా పాలనను రెండింటిలో ఒక్క క్షణమైన ఆలస్యం సహింపరానిది.
ఇది విలక్షణమైన విధానం.
ఈ విధంగా దీక్షిత్ బాబా మాటే వేదవాక్కు
లాగా పాటించటానికి వెనకాడలేదు. ఈ మహాభక్తుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా
ఉన్నాయి. గురువు మీద అపార నమ్మకం ఉండటం అంటే ఇదేనేమో. ఎవరైనా గురువు చెప్పిన మంచి పనులు
చేస్తారు. కాని గురువుని పూర్తిగా నమ్మి తన జీవితాన్నే పణంగా పట్టగలిగిన శిష్యులు ఎంత
మంది ఉంటారు.
ఓం శ్రీ సాయి రాం !
No comments:
Post a Comment