In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, February 10, 2016

దీక్షిత్- 3




Play Audio



ఆధ్యాత్మిక ప్రగతి
సాయినాధుడు అపరదయామయులు. తనని నమ్మిన వారిని దగ్గర ఉండి మరీ రక్షిస్తారు. మానవులకు గమ్యమైన మోక్షమార్గం వైపు నడిపిస్తారు. దీనికి మనలను బాబా దగ్గర ఉండి మరీ ప్రయాణం చేపిస్తారు. ఈ విధంగా దీక్షిత్‌ను కూడా నడిపించడం జరిగింది.

             ఇప్పటి వరకు దీక్షిత్ బాబా పై శ్రద్ధ, భక్తి మొదలగు వాటిని నిరూపించుకున్నాడు. ఒక సాధకుడు ఆధ్యాత్మిక పథంలో ఎదగాలి అంటే మరణాన్ని కూడా అర్ధం చేసుకోవాలి. మరణం అనేది భయంకరమైనది కాదు అనే నిజాన్ని బాబా దీక్షిత్‌కు నేర్పించారు.

             ఒకసారి ఒక ముసలామె పాముకరచిన తన కొడుకును బాబా వద్దకు తీసుకువచ్చి ఊది ఇమ్మని అడిగింది. బాబా ఊది ఇవ్వలేదు. అప్పుడామే ఏడుస్తూ బయటకు వెళ్ళింది. మరలా వెంటనే మశీదుకు వచ్చి తన కొడుకు చనిపోయాడని గుండెలు బాదుకొని ఏడ్చింది. బాబా ఏమి మాట్లాడలేదు. దీక్షిత్ ఇది చూసి ఆశ్చర్యపోయి బాబాను ఆమెకు న్యాయం చేయమని ఆమె కొడుకును బతికించమని అడుగుతాడు. దానికి బాబా నువ్వు దీంట్లో ఇరుక్కోవద్దు. జరిగిందేదో మంచికే జరిగింది. ఈ కుర్రవాడు కొత్త శరీరంలో చాలా అద్భుతకార్యాలు చేస్తాడు. ఆ పనులు ఇప్పుడున్న శరీరంలో చేయడం కుదరదు అని జనన మరణాల గురించి తెలుపుతారు.

కూతురి మరణం
దీక్షిత్ కూతురు వత్సలిని కాపాడి గండం నుంచి బయట పడేస్తారు. అల్మారా మీద పడినప్పుడు, బరువైన వస్తువులు ఏమి తనకు తగలకుండా కాపాడారు. ఒకసారి దీక్షిత్ కూతురు వత్సలి షిర్డిలో ఉంది. ఆమెకు బాగా జ్వరం వచ్చింది. కాని ఈ సారి బాబా ఆమెను రక్షించలేదు, ఆమెకు కలలో కనిపించి "నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు, వచ్చి వేపచెట్టు కింద పడుకో" అని చెప్పారు. తరువాత రోజు ఉదయం బాబా శ్యామాను "శ్యామా కాకా కూతురు చచ్చిపోయిందా" అని అడిగారు. శ్యామా అప్పుడు దేవా అశుభమైన మాటలు చెప్తారేంటి అంటారు. శ్యామా మధ్యాహ్నం కల్లా ఆ అమ్మాయి చనిపోతుంది. అట్లానే వత్సలి చనిపోతుంది. దీక్షిత్‌కు బాధ ఉంది కాని బాబాను ఏమి అర్ధించడు. అప్పుడు కాకా దగ్గర భావార్ధ రామాయణము చేతుల్లో ఉన్నది. బాబా అది తీసుకొని ఒక పేజీ తీసి దీక్షిత్‌కు ఇస్తారు. అది కిష్కిందకాండ. శ్రీ రాముడు వాలిని చంపిన తరువాత తారను ఓదార్చి అద్భుతమైన బోధ చేస్తారు. బాబా ఈ పుస్తకంలో వేలు దూర్చి సరిగ్గా అదే పేజీ తీస్తారు.

             ఇక్కడ బాబా వత్సలిని వేపచెట్టు కింద పడుకోమన్నారు. అంటే ఆయన్ని చేరుకోమని అనుట. తరువాత వత్సలి గురించి దీక్షిత్‌కు ఈ విధంగా చెప్తారు. కాకా వత్సలి ఒక దివ్యాత్మ, ఆమె కర్మ శేషము చిన్నపిల్ల గానే అయిపోయింది. ఆమెకు సద్గతి కలుగుతుంది. చనిపోవడం అనేది ఆమె విషయంలో చాలా మంచిది, అని బోధచేస్తారు. ఈ విధంగా దీక్షిత్‌కు అనేక బోధలు చేసి జీవిత సత్యాన్ని అనుభవింప చేసి తన ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేశారు.

బాబా దీక్షిత్ చేత చేయించిన తపస్సు
మన చిత్త వృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే, భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? సర్వేంద్రియాలు సాయిపైన భక్తి ఉండటమే నిజమైన ఆరాధన. లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా మాట్లాడాలని తలచినా నోరుపెగలదు. క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయిభక్తుడా? ప్రపంచమందు విరక్తి కలుగని వానికి భగవంతునిపై ఆసక్తి ఎలా కలుగుతుంది. తల్లిదండ్రులు మమతను పంచుతారు. పుత్రుడికి తన ఆస్తి పైన దృష్టి ఉంటుంది. భార్య తన పసుపు కుంకుమల కోసం తపిస్తుంది. పరమార్ధంలో సహాయం చేసేవారు ఎవ్వరూలేరు. పరమార్ధం సంపాదించుకోవడంలో సహాయపడే వారు ఎవరు అని ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాము. ఎవరి యందు ఏ ఆశా లేకుండా ఆత్మ యందు దృఢమైన విశ్వాసముంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునేవారికి పరమార్ధం సిద్దిస్తుంది. గురువు యొక్క నామాన్ని జపించడం ద్వారా పరమానందం జనిస్తుంది. సర్వ ప్రాణులలో భగవంతుని దర్శనం కలుగుతుంది.

ఒకసారి దీక్షిత్ బాగవత పారాయణ చేస్తూ, నవనాధుల భక్తి తత్వం గురించి చెప్పుకొని అక్కడ ఉన్న వారితో ఈ విధంగా అంటారు. ఈ నవనాధుల చర్యలు, వారి మనోవృత్తి అంతుపట్టనివి. అక్కడ ఉన్న శ్యామాతో, "ఈ భక్తి ఎంత కఠినమైనది. మనవంటి మూడులకు అంతటి శక్తి ఎక్కడ ఉన్నది? జన్మజన్మలకు ఇది సాధ్యం కాదు. గొప్ప దిట్టమైన ఆ నవనాధులు ఎక్కడ, మొదటి నుండి పాపులమైన మనమెక్కడ" అని వాపోతాడు.

అప్పుడు శ్యామాకు కాకా యొక్క దైన్యం నచ్చలేదు. సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండీ ఇంత దైన్యం ఎందుకు? సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు? మీకు ఏకనాధ భాగవతంలోని ఏకాదశ స్కందము మరియు భావార్ధ రామాయణం చదవమని బాబా ఆజ్ఞ కాదా! దానిని బట్టి హరి నామస్మరణ, గురుస్మరణే సాధన అనే బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా? దీనితో మనం భవాన్ని తరించగలం. మీకు ఎందుకు చింత అని చక్కగా చెప్పారు. భక్తి, జ్ఞాన మార్గంలో సత్సంగము చాలా అవసరం. ఒకరినొకరు ధైర్యం చెప్పుకుని ముందుకు సాగాలి. అట్లానే దీక్షిత్ కూడా వేరు వేరు సమయాల్లో వేరేవాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఆయనకు సాయి పట్ల ఎంతో నమ్మకం ఉన్నా ఇంకా బాబాపై ప్రేమ పెరగాలి అన్న తపనే కాని ఆయనకు బాబా పైన నమ్మకం లేక కాదు.

9 నెలల తపస్సు
1912 తర్వాత దీక్షిత్ దాదాపు వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నట్లే చెప్పవచ్చు. ఒకసారి బాబా దీక్షిత్‌ను వాడా పై గదిలో ఉండి సాధన చేయమని చెప్పారు. నువ్వు ద్వారకామాయికి కూడా రావద్దు, ఎందుకంటే ఇక్కడ జనం చాలామంది ఉంటారు. నీ ఏకాంతానికి అది భంగము. దీక్షిత్ బాబా దర్శనం లేకుండా ఎట్లా అనుకొని అయ్యో బాబా హారతికి వెళ్ళలేక పోతున్నాను అని శ్యామాకి చెప్తాడు. అప్పుడు శ్యామా బాబాను అడిగి మధ్యాన్న ఆరతి, శేష ఆరతికి వచ్చెట్లు అనుమతి సంపాదిస్తాడు. ఈ దీక్షిత్ వాడాలో పై గదిలోకి ఆడవాళ్ళకు అనుమతి లేదు. ఒకసారి దీక్షిత్ భార్య వచ్చి రెండు రోజులు ఉండి బాధతో బాబా దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బాబా, అమ్మా దీక్షిత్ భాద్యత నాది అతని గురించి దిగులు పడద్దు అని చెప్తారు. ఈ విధంగా దీక్షిత్‌ను 9 నెలలు ఒక దీక్షలాగా చేపించడం జరిగింది . 

దీక్షిత్ ఏకనాధ బాగవతాన్ని పగలు చదివేవారు. రాత్రివేళ భావార్ధ రామాయణం చదివేవారు. నిరంతరం సాయి ధ్యానం చేసేవారు. అప్పట్లో కాకా 'హరివరదా' మరాఠిలో బాష్యం వ్రాయబడినటువంటి 10వ స్కందం (భాగవతం) ఇది పారాయణ పూర్తి చేసి బాబా దగ్గరకు వెళ్ళి, "బాబా ఇది చదివాను ఇంకొకసారి చదవమంటారా లేక ఇంకేమైన చదవమంటారా అని అడిగాడు. అప్పుడు బాబా ఏక్‌నాద్ బృందావన పోతి" చదువు అంటారు. ఆ తరువాత భాగవతము, భావార్ధరామాయణం మాత్రమే పారాయణ చేయమని చెప్తారు. ఇట్లా 9 నెలలు కఠిన బ్రహ్మచర్యముతో దీక్ష చేయించి దీక్షిత్ చేత ఆధ్యాత్మిక పథంలో ఎత్తైన శిఖరాలు అధిరోహించేలాగా చేస్తారు బాబా.

ఇక్కడ మనము అనుకోవచ్చు, బాబా దీక్షిత్ చేత ఎందుకు ఇలా చేయించారు ఆయన ఎంత అదృష్టవంతుడు అని.  అప్పుడు చాలా మందికి ఇలా చేయగల అవకాశం ఉంది. కాని దీక్షిత్ ఒక్కడే దీనికి సుముఖంగా ఉన్నారు. మనకు కూడా ఇలా చేయాలి అని పట్టుదల ఉంటే బాబా తప్పక దగ్గర ఉండి చేయిస్తారు. మనలో ఆ శ్రద్దా  భక్తులు ఉండాలే కాని, ఏదీ అసాధ్యం కాదు.  


బాబా ఇచ్చిన సాక్షాత్కారాలు
శివలింగ దర్శనం
ఒకసారి పూణే నుండి ఒక రామదాసు భక్తుడు మసీదుకు వచ్చాడు. బాబాకు నమస్కరించి ఒక శివలింగాన్ని కానుకగా ఇచ్చాడు. అంతలో మేఘా కూడా అక్కడకు వచ్చాడు. అంతకు ముందే బాబా అతనికి త్రిశూల దర్శనం ప్రసాదిస్తారు. మేఘా వచ్చి బాబాకు సాష్టాంగ ప్రమాణం చేస్తాడు. అప్పుడు బాబా " మేఘా ఇదిగో శంకరుడు వేంచాసాడయ్యా ఇక
అతని విషయం నువ్వే చూసుకో" అన్నారు బాబా. అదే సమయంలో దీక్షిత్‌కు కూడా ఒక అద్బుతమైన అనుభవం కలిగింది. దీక్షిత్ వాడాలో స్నానం చేసి హరినామ స్మరణలో మునిగిపోయాడు. తరువాత సాయినామం జపిస్తూ ఉంటే తనకు శివలింగ దర్శనం కలిగింది. అటుగా వెళ్తున్న మేఘా వచ్చి "ఇదిగో బాబా నాకు శివలింగం ఇచ్చారు" ఆని చూపిస్తాడు. ఆశ్చర్యం దీక్షిత్‌కు కనిపించిన శివలింగం కూడా అదే.  ఇదే శివలింగం మేఘా పరమపదించిన తర్వాత గురుస్థానములో ప్రతిష్ట చేయబడింది.

విఠల దర్శనం
ఒకసారి దీక్షిత్ స్నానం చేసి ధ్యానానికీ కూర్చున్నాడు. అప్పుడు ధ్యానంలో విఠల దర్శనం కలిగింది. తరువాత ద్వారకామాయికి వెళ్ళాడు. అప్పుడు "అయితే విఠల్ పాటిల్ నీ వద్దకు వచ్చాడన్న మాట. ఔనా! నువ్వతన్ని కలుసుకున్నావు కదా! కాని జాగ్రత్త విఠలుడు చపలుడు. నీ కన్ను గప్పి క్షణాలలో మాయమయిపోతాడు. అతన్ని గట్టిగా పట్టుకో, అతన్ని ఒక్కచోటనే పెట్టుకో, లేకపోతే అతను మెల్లగా జారుకుంటాడు. నువ్వు ఏ మాత్రం ఒక్క క్షణం కూడా అజాగ్రత్తగా ఉన్నా, అతను మాయమవుతాడు” అని దీక్షిత్‌కు చెప్పారు. ఇంతలో షిరిడికి ఒకతను కొన్ని విఠలుడి చిత్రాలను అమ్ముదామని తెచ్చాడు. ఒక చిత్రంలో విఠలుడి స్వరూపం తన ధ్యానంలో కనిపించిన చిత్రంలాగా ఉంది. వెంటనే బాబా మాటలు గుర్తుకు వచ్చి ఆ చిత్రం కొనేశాడు. దాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించాడు.

ఈవిధంగా బాబా ఎన్నో అనుభూతులను ఇచ్చి దీక్షిత్‌ను కరుణించారు.

No comments:

Post a Comment