జీవితాన్ని అర్ధం చేసుకుంటే కాని మనకు శాంతి
లభించదు. ఈ శాంతి అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఇది ఎవరో మనకు ఇచ్చేది కాదు. ఈ అద్బుత
శక్తి మనలో నుంచే రావాలి. దీనికి సాధన అవసరం. ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ధ్యానం
ద్వారా మెదడులో మంచి తరంగాలు పుడ్తాయి. ఈ తరంగాల వల్ల మనలో విచక్షణా శక్తి పెరుగుతుంది.
మంచి చెడులను గుర్తించ గలిగే జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ విచక్షణా జ్ఞానం పెరుగుతుందో, అప్పుడు మనలో మంచి తరంగాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ తరంగాలు మనకు, మన చుట్టూ ఉన్న వారికి శాంతిని కలగ చేస్తాయి.
ఆధ్యాత్మికత అనే పదాన్ని మనం చాలా చోట్ల వాడుతూ ఉంటాము. ప్రతి కార్యక్రమానికి మనం ఈ పదాన్ని వాడతాము. ఆధ్యాత్మికత అనే పదం కేవలం పరమాత్మకి మాత్రమే వాడాలి. బంధాలనుంచి బయట పడటమే నిజమైన మోక్షం. ఈ మోక్షం వైపు నడిచే ప్రతి అడుగు, నేర్చుకునే ప్రతీ శాస్త్రం మనలను ఈ ఆధ్యాత్మికత తత్త్వంలో ఉంచుతుంది.
ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించాలి. మన గ్రంథాలు మనకు ఒక వరం. అవి జీవన విధానాన్ని
చక్కగా బోధిస్తాయి. ఎందరో మహానుభావులు వాటిని మనకి అందేటట్లు చేశారు. వాటిని ఉపయోగించుకోవాల్సిన
బాధ్యత మన మీద ఉంది. మనల్ని మనం అర్ధం చేసుకొని ఆత్మ విశ్లేషణ చేసుకోకపోతే మనకి సంతోషం
ఎట్లా లభిస్తుంది. తల్లితండ్రులే వాటిని దూరంగా ఉంచితే ఇక పిల్లల పరిస్థితి ఏంటి.
ధ్యానం అంటే రోజూ పది నిమిషాలో, కొద్ది సేపో కూర్చునే ప్రక్రియ మాత్రమే కాదు. ఈ భావన రోజంతా ఉండాలి. మనము చేసే ప్రతి పనిలో దాన్ని వ్యక్తపరచవచ్చు. ఇలా మంచి ఆలోచనలతో మనము మెలిగినప్పుడు, రోజంతా ధ్యానమయం అవుతుంది. మనం రోజంతా చాలా భూమికలు నిర్వహిస్తాము. ఒక్కో చోట ఒక రకంగా మన కర్తవ్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మన వ్యక్తిత్వాన్ని ఆ భూమికకే పరిమితం చేయాలి. మనం చేసే ప్రతి పనిని అర్ధం చేసుకోవాలి. ఎంత వరకు మనం మాట్లాడాలో అంత వరకే మాట్లాడాలి. చేసే పనిలో నిమగ్నం అవ్వాలి. అప్పుడు అది కూడా ధ్యానం అవుతుంది
జీవితం చాలా క్లిష్టమైనది. దాన్ని మనము ఇంకా కష్ట తరం చేసుకుంటాము. అందుకే మనము ఉపయోగపడే అన్ని పద్ధతులను వాడుకోవాలి. జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.
ఓం శ్రీ సాయి రామ్ !
చాలా బాగా చెప్పారు. ఈ సమయములో ఇది చదివాక ఎందుకో గాని చాలా హాయిగా అనిపించింది. థాంక్యూ అండి.
ReplyDelete