భగవంతుడి ధ్యానం మనలను వర్తమానంలో ఉంచుతుంది.
ఈ ప్రపంచం ఉన్నంత వరకు సృష్టి స్థితి లయలు జరుగుతూనే ఉంటాయి. మన మానసిక ప్రపంచంలో ఆలోచనల
సృష్టి జరుగుతూ ఉంటుంది. ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చి ఒక స్థితిని కల్పించుకుంటాయి.
కాని ఎన్ని ఆలోచనలు లయం అవుతున్నాయి. బ్రహ్మ సృష్టి చేస్తే, విష్ణువు స్థితికారకుడైతే
శివుడు లయకారుడయ్యాడు. ఈ తత్వం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, వారు బ్రహ్మాండ రచన చేస్తే
మనము ఈ శరీరమనే అండానికి కారణమవుతున్నాము.
మనము అంటే ఎవరు?
మనమంటే ఈ శరీరం లోని మనసా,
ప్రాణమా లేక బుద్ది అహంకారములా? ఇది అర్ధం చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత . కేవలము
పుట్టడం చనిపోవడమే మానవ ధర్మము కాదు.
మన శాస్త్రాలు మాయ గురించి ఎన్నో విషయాలు
చెప్పడం జరిగింది. ఈ మాయ పరమాత్ముని ఆధీనంలో ఉంది అని కూడా చెప్పుకుంటాము. మనమందరము
మాయ ఆధీనంలో ఉన్నాము.
అసలు మాయ అంటే ఏమిటి?
మనము దీని గురించి ఎందుకు ఆలోచించాలి?
ఈ మాయను అధిగమించడం చాలా కష్టతరం, కాని మన గురువులు మనకు మార్గాన్ని చూపించారు.
ఈ మార్గాన్ని అనేక మతాలు సంప్రదాయాలు రకరకాలుగా చెప్పాయి. మన సద్గురువులు మాత్రం ఈ మాయా
తీత స్థితిలో మనకు ఎప్పుడు దర్శనం ఇస్తూనే ఉంటారు. వారిని వారు చూపించిన మార్గము ద్వారా
మాత్రమే మనము ఈ మాయ అనే భవసాగరాన్ని సులభంగా దాటగలము. అసలు సాగరము అంటేనే అంతులేనిది.
మనము మామూలు పడవలో ఈ అంతులేని సాగరం దాటడం అనేది ఊహాతీతము. మన జీవితాలు ఏ ఆధారము లేని,
మరియు తెడ్డు కూడా లేని స్థితిలో ఈ అంతులేని సాగరాన్ని ఏలా ఈదగలము. మనకు గురుకృప అనే
సాధనం కావాలి. మనము పెద్ద షిప్‌లో కూడా ఈ సముద్రంలో ప్రయాణం చెయ్యచ్చు. ఈ షిప్ అంటే
మనం అనుసరించే భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు. వీటి ద్వారా ఒకరోజు ఈ భవసాగరాన్ని దాటచ్చు.
కాని విమానం ఎక్కితే సప్త సాగరాలన్ని చుట్టిరావచ్చు. ఈ విమానం సాయి కృప, సద్గురువు
యొక్క కృప. ఈ విమానాన్ని ఎక్కడం మనం చెయ్యాల్సిన పని. ఆ గురుకృప లభించిందా, ఇట్లాంటి
సాగరాలు మనల్ని ఏమి చేయలేవు. వాటిలో ఉండే అలలు, భయంకరమైన జంతువులు మన దరి దాపుల్లోకి
కూడా రాలేవు. అందుకే మనందరం ఈ గురుకృప కోసం తపించాలి. బాబా అందుకే ఇలా చెప్పారు. నాకు
షోడోపచారాలు, అష్థోపచారాలు అక్కరలేదు. కేవలం "సాయి సాయి" అని అంటే చాలు అని బాబా అన్నారు. కలియుగంలో కేవలం భగవంతుని నామమే మనలను గమ్యానికి చేరుస్తుంది అని మన శాస్త్రాలు కూడా గట్టిగా చెప్పాయి. ఇంతకంటే ఏమి కావాలి?
ఏ సంప్రదాయమైన ఈ విషయాన్ని కాదనలేదు.
గురువే మనకు ఆధారం.
No comments:
Post a Comment