గురు పాదములే మన పూజకు తగిన ఆరాధ్య వస్తువుగా వివరించిన పరమశివుడు ఇంకా ఇలా చెపుతున్నారు.
సంసారమనే రోగాన్ని పోగొట్టేది, దుఃఖ సముద్రాలను దాటించేది, సర్వ
లోకాలను భరించేది అయిన గురు పాదమే నాకు శరణం అని చెపుతున్నారు. సాయి నిరాకార
ధ్యానాన్ని చేయమని, ఇది కనుక కుదరక పొతే తన సాకార రూపాన్ని ధ్యానించమని చెప్పారు.
గురు గీతలో గురువుని గూర్చి పరమశివుడు పార్వతి ఇలా అంటున్నారు.
అత్రినేత్ర శివ సాక్షాత్ ద్విభుజశ్చాపరో హరి:!
యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురుః కథితః ప్రియే !!
పార్వతి! గురువు అంటే
మూడు కళ్లు లేని శివుడు, నాలుగు చేతులు లేని విష్ణువు, నాలుగు ముఖాలు
లేని బహ్మ
అని శాస్త్రాలు కీర్తిస్తున్నాయి.
నిత్యాయ నిర్వికారాయ నిరవద్యాయ యోగినే !
నిష్కలాయ నిరీహాయ శివాయ గురవే నమః !!
గురువు నిత్యుడు, వికార రహితుడు, దోష రహితుడు, యోగి, నిష్కలుడు, ఆశలు
లేని వాడు, మరియు మంగళప్రదుడు. అలాంటి శ్రీ గురువుకి నమస్కారము.
ఇక్కడ శివాయ గురవే నమః అని వాడడం జరిగింది. ఇక్కడ శివుడు అంటే మంగళ
స్వరూపుడు. అంతే కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉన్న శంకరుడి గురించి కాదు. ఇది
పరమాత్మ స్వరూపంగా తెలుసుకోవాలి. ఈ తత్వము త్రిమూర్తులకు అతీతమైనది.
శిష్య హృత్పద్మ సూర్యాయ సత్యాయ జ్ఞానరూపిణే !
వేదాంతవాక్య వేద్యాయ శివాయ గురవే నమః !!
మన అందరికి ఆధ్యాత్మిక హృదయం కుడి వైపున ఉంటుంది. మనకు తెలిసిన గుండె
ఎడం వైపున ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక హృదయాన్ని పద్మంతో పోల్చి చెప్పారు చెప్పారు. వీటిని వికసింప చేసే సూర్యుడే గురువు.
జ్ఞానమే ఆయనకున్న వెలుగు. సూర్యుడు పగలు మాత్రమే ఈ పద్మాలను వికసింప చేయగలడు కానీ
గురువు యొక్క వెలుగు శాశ్వతమైనది. దీనికి పగలు రాత్రితో సంబంధం లేదు. ఇలా గురు
కృపతో విచ్చుకున్నహృదయ పద్మం మళ్ళా
ముడుచుకోవడమనేదే ఉండదు.
మనం ఒక పని చేస్తే దానికి ఒక కారణం వేరుగా ఉంటుంది. అలానే ఒక వస్తువు
తయారు అయింది అంటే, ఈ వస్తువుకి కావాల్సిన ముడి సరకు అవసరం ఏంటో ఉంటుంది. కానీ ఈ
సృష్టి ఏ వస్తువునుంచి భగవంతుడు తయారు చేసాడు. ఆ వస్తువు భగవంతుడు కన్నా వేరుగా
ఉందని చెప్పలేము. మరి ఈ ప్రపంచాన్ని తయారుచేయవలిసిన ముడి సరకు ఎక్కడనుంచి
వచ్చింది. దీనికే మన శాస్త్రాలు సాలి పురుగుని ఉదాహరణగా తీసుకున్నాయి. సాలిపురుగు
తన గూడు కట్టడానికి తనలోని పదార్ధాన్నే వాడుకుంటుంది. ఎక్కడో బయటినుంచి ఆ దారం
రాదు.
అందుకే గురు గీత ఇలా చెపుతుంది.
కార్య కారణ రూపాయ రూపారూపాయ తే సదా !
అప్రమేయ స్వరూపాయ శివాయ గురవే నమః !!
దృగ్దృశ్య ధ్రష్ట్రు రూపాయ నిష్పన్న నిజ రూపిణే !
ఆపారాయా అద్వితీయాయ శివాయ గురవే నమః !!
గుణాధారాయ గుణినే గుణవర్జిత రూపిణే !
జన్మినే జన్మ హీనాయా శివాయ గురవే నమః !!
కార్య కారణాలు రెండూ గురువుయొక్క రూపాలే. సాకారుడు
నిరాకారుడు కూడా తానే. ఇలా మన ఊహకు అందని స్వరూపముకలవాడే గురువు.
చూడబడేది, చూచేది మరియు చూపు కూడా గురువే. ఇలా తన స్వస్వరూపంలో
నిలిచి ఉండే వాడే గురువు. అపారమైన వాడు అద్వితీయుడు అయిన గురువుకి మనం
నమస్కరిస్తున్నాము.
మనము సాయి హారతిలో ఇలా గానం చేస్తాము.
సదా స్వస్వరూపం చిదానంద కందం
జగత్సంభవ స్థాన సంహార హేతుం!
స్వభక్తేచ్చయా మానుషం దర్శయన్తం
నమామి ఈశ్వరం సద్గురుమ్ సాయినాథం !!
ఈ శ్లోకంలో పైన చెప్పిన పరమాత్మ తత్వమే ఉంది.
గురువుకి మొదలు లేదు. అంతం లేదు. అలానే ఆత్మకు మొదలు అంతం లేవు.
ఆత్మే గురువు. మనలో ఉన్న ఈ ఆత్మే మన స్వస్వరూపము. ఈ రూపం
గురించి తెలుసుకొనే జ్ఞానమే ఆత్మ జ్ఞానము. మాయ అనే తెర ఈ ఆత్మను కప్పి ఉంటుంది. ఈ
మాయ గురువు అధీనంలో ఉంటుంది. కానీ జీవులందరూ మాయ అధీనంలో ఉంటారు.
గురువుకి మాయ లేదు. గురువుకి రూపం లేదు. ఎప్పుడు స్వస్వరూపంలోనే
ఉంటారు. అట్టి స్వస్వరూపమైన శివునికి నమస్కారమని గురు గీత గానం చేస్తుంది.
సాయి మనలోని మాయను తొలగించడానికి ఆయన మరింత మాయను ధరించినట్లు
కనిపిస్తారు. మనం ఓర్పుతో సాయి నేర్పిన సత్యాలను అర్ధం చేసుకొని వాటిని
అనుసరించాలి. అప్పుడే ఈ మాయను దాటి మనం స్వస్వరూపంలో ఉండగలుగుతాము. ఇదే
ఆత్మసాక్షాత్కారమని మన శాస్త్రాలు చెపుతాయి. ఈ బ్రహ్మానుభూతి మనకు కలగాలి అంటే
మనకు గురు కృప కలగాలి. గురు కృప కలగాలి అంటే మన చిత్తం శుద్ధి పడాలి. చిత్త శుద్ధి
లేని శివ పూజ వ్యర్ధమే. శ్రద్ధ సభూరి లేని సాయి పూజ కూడా మనలను గమ్యానికి తీసుకు
వెళ్ళదు.
కావున సాయి భక్తులారా!
సాయిని భక్తితో గురువుగా పూజిద్దాము.
సాయి నుంచి ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే కోరుకుందాము.
సాయి కృపకు పాత్రులమవుదాము.
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment