సాయి రక్ష |
మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులు జీవితంలో చేస్తూ ఉంటాము. మనం
చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది. ఒక్కోసారి ఈ కర్మ ఫలితం ఒక జన్మలోగాని కొన్ని
జన్మలలో కానీ అనుభవించాల్సి ఉంటుంది. మనం మంచి మార్గంలో నడిస్తే చాలా వరకు తెలిసి చేసే తప్పులు తగ్గి పోతాయి. కానీ మనకు ధర్మం ఏమిటో తెలియక అంటే రూల్స్ తెలియక చేసే
తప్పులు చాలా ఉంటాయి. మరి వీటినుంచి మనలను ఎవరు రక్షిస్తారు. మనకు మంచిది
అనిపించింది మనం చేస్తూ ఉంటాము. ఇది కాలానుగుణం మారుతుంది అని పెద్దలు చెప్తారు.
మనం మంచిది అనుకున్నది చేసినా కానీ మనకు దుఃఖం తప్పటలేదు. ఒక బిడ్డను చిన్నప్పుడు తల్లితండ్రులు
రక్షిస్తూ ఉంటారు. ఆ బిడ్డకు ఈ దారి
మంచిది కాదు అని పెద్దలు చెప్తారు. కానీ ఈ పిల్లలు వారి వాతావరణాన్ని బట్టి వారు
ప్రవర్తిస్తారు. ఎందు కంటే వాళ్లకు అది కరెక్ట్ అని అనిపిస్తుంది. పెద్దలకు తెలుసు
అది మంచి మార్గం కాదు అని. కానీ నిస్సహాయ పరిస్థితి. ఈ పిల్లలకు
పూర్తిగా అర్ధం కాదు కానీ వాళ్లకు తెలిసినంతలో ఆది కరెక్ట్. అలానే మనం అందరం కూడా
ఇదే తప్పు చేస్తాము. మన గురువులు, శాస్త్రాలు చెప్పినవి మనం పట్టించుకోము. అందరు
చేసేదే మనం చేస్తాము.
కానీ మన దురదృష్టం ఏమిటి అంటే? పైన చేప్పిన పిల్లలకు మాదిరిగా మనకు
కూడా మంచి చెడులు తెలియవు. అందుకే జీవితంలో ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటాము. వీటి
నుంచి చాలాతేలికగా బయట పడేసే శక్తి కేవలం గురువుకి మాత్రమే ఉంటుంది. అందుకే మనం
గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మన జీవితంలో గురువు ప్రవేశించే అర్హతను
సంపాయించాలి. సాయి భక్తులుగా మనం ఎంతో పుణ్యాత్ములము. ఆయనే మనకు గురువు దేవుడు
కూడా.
గురు గీతలో గురు రక్ష గురించి పరమశివుడు పార్వతి మాతతో ఇలా చెప్పారు.
మునిభ్య: పన్నగేభ్య శ్చ సురేభ్యచ శాపతోపి వా !
కాలమృత్యు భయా ద్వాపి గురూ రక్షతి పార్వతి !!
పార్వతి! పాములు మొదలైన విషజంతువుల నుంచి, మునులు దేవతులు మొదలైనవారి
శాపాలనుంచి, కాలమృత్యు భయం నుంచి కూడా గురువు శిష్యులను రక్షిస్తాడు.
శ్రీ సాయి సత్చరితలో మనం ఎన్నో ఘట్టాలను చూసాము.
సాయి తన భక్తులను ఎలా రక్షించారో, వారిని రకరకాల జీవిత సమస్యలనుంచి ఎలా బయటపడేశారో మనం చదువుకున్నాము. నన్ను తలిస్తే చాలు నేను మిమ్మలను
రక్షిస్తాను అని సాయి భరోసా ఇచ్చారు.
మనలను ఈ శరీర పరమైన భాదలనుంచి కాపాడడమే కాకుండా, మనలను సన్మార్గంలో
నడిపించి మనకు తెలియని తప్పులనుంచి కూడా మనలను రక్షిస్తారు. మనం చేయాల్సిందల్లా
సాయి చెప్పిన దారిలో నడవటమే.
శ్యామాను పాము విషంనుంచి రక్షించినా, బాలాసాహెబ్ మిరీకర్ను పాము
గురుంచి హెచ్చరించి రక్షించినా, బూటీ మహల్సాపతిలను విషసర్పాల గురించి
హెచ్చరించినా, మరి ఎలా తన భక్తులను రక్షించినా ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించినవే.
కాని గురువు తపన కొన్ని జన్మలలో మనలను రక్షించాలి అని, ఈ జన్మలే లేకుండా చేయాలి
అని గురువు మనకు అనుగ్రహాన్ని ప్రసాదించటానికి రెడీగా ఉంటారు.
ఒక మనిషిని ఒక విష జంతువు కరిస్తే ఒక్క సారి మాత్రమే చనిపోవచ్చు.
కానీ కామ క్రోధాలనే పాములు మనలను కరిస్తే కొన్ని జన్మలెత్తి చనిపోవాలి. అందుకే
గురువు మనలను ఈ చెడు అలవాట్లనుంచి రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేయడం జరుగుతుంది.
కాని మనము ఈ విషయాలను అర్ధం చేసుకోము. మనకు జరిగేవి అన్ని మనం చేసుకున్న
కర్మమూలంగానే అనే సత్యాన్ని అర్ధం చేసుకోవాలి. కాని ఇవన్నీ తెలుసుకోకుండా కోరి
కష్టాలను తెచ్చుకొంటాము. ఆ కష్టాలు వచ్చిన తరువాత నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలి
అని బాధ పడతాము.
పరమ శివుడు మునులనుంచి దేవతలనుంచి కూడా గురువు రక్షిస్తారు అని
చెప్పారు. మరి ఈ కాలంలో మనం మునులను దేవతలను చూడం కదా అని మనము అనవచ్చు. మనం
మహానుభావులను గుర్తించలేము అలానే దేవతలను దర్శించలేము. అలా అని వాళ్ళు లేరు అని తీర్మానించగలమా!
మన శరీరంలో ఒక వైరస్, బాక్టీరియా ఇలా మనం చూడలేని ప్రాణులన్నీ మనకు హాని చేస్తూ
ఉంటాయి. అలానే మనం ఈ ప్రకృతిని నియంత్రిచే శక్తులను గౌరవించము. ఈ శక్తులను మనం
అష్ట దిక్పాలకులు, దేవేంద్రుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పిలుచుకోవచ్చు. లేదా ఈ
శక్తిని అమ్మవారు అని అనుకోవచ్చు. మన కోరికలను తీర్చుకోవడానికి మనం వ్రతాలు పూజలతో దేవతలను పూజిస్తాము. ఒక పురోహితుడిని పిలిచి వారి చేత పూజ చేపిస్తాము
కాని మనలో ఆ నమ్మకం ఉండదు. మనం మన ఇష్టమొచ్చిన పనులు చేస్తూ, ఆ దేవతకు గౌరవం
ఇవ్వకుండా మన పూజా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. దీనివల్ల మనకు మంచి జరుగుతుందో
చెడు జరుగుతుందో తెలియదు. మనం మాత్రం పూజ చేసాము అని అనుకొంటాము. అప్పటికి ఈ
దేవతలు మనలను క్షమిస్తారు. కాని కొన్ని సార్లు మనం క్షమించలేని తప్పులు చేయవచ్చు.
అప్పుడు మనలను ఎవరు రక్షిస్తారు. కేవలం గురువు మాత్రమే మనలను అన్ని పరిస్థుతలనుంచి
రక్షించగలుగుతారు.
అందుకే గురు గీతలో పరమ శివుడు ఇలా చెప్తారు.
శివే రుష్టే గురు స్త్రాతా గురౌ రుష్టే న కశ్చన !
తస్మాత్ పర గురుం లభ్ద్వా తమేవ శరణం వ్రజేత్ !!
పరమ శివుడే కోపగిస్తే గురువు రక్షిస్తారు. మరి గురువే కోపగిస్తే ఇక
రక్షించే వాడే లేడు. కనుక గురువుని ఆశ్రయించి, ఆయననే శరణు పొందాలి.
ఇక్కడ గురువు కోపగించుకోవడం అంటే గురువు నిజంగా కోపం తెచ్చుకోవడం
కాదు. ఆయన మన జీవితంలో లేక పోవడం. గురువు లేని జీవితం తెగిపోయిన గాలి పటం లాంటిది.
ఎటు గాలి వీస్తే ఆటే వెళ్తుంది. ఒక దిశ, అర్ధం లేని జీవితం. సాయి అందుకే ఇలా
చెప్తారు. "నా దగ్గర జ్ఞానం కుప్పలు కుప్పలుగా ఉంది కాని ఎవరూ అది అడగరు".
సాయి భక్తులారా,
మన జీవిత పరమైన కోరికలతో మాత్రమే సాయిని పూజించడం కాకుండా, ఆయనను
గురువుగా మన జీవితంలోకి ఆహ్వానిద్దాము. సాయి మనలను జన్మజన్మలకు రక్షిస్తారు.
"గురు" అంటే అర్ధం గురు గీత ఇలా చెపుతుంది.
"గు" అంటే అంధకారము
"రు" అంటే వెలుతురు.
చీకటి అనే అజ్ఞానాన్ని
పారద్రోలి వెలుతురుగా మిగిల్చే పరబ్రహ్మమే గురువు.
వెలుతురు ఉన్న చోట చీకటి అనేదే ఉండదు. సూర్యుడికి పగలు చీకట్లు అనేవే
ఉండవు. ఉన్నదంతా స్వయంప్రకాశమైన వెలుతురు మాత్రమే. అలానే గురువు మన జీవితంలో
వెలుగు నింపుతారు. ఈ వెలుగుకి చీకటి ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్పుడు కష్ట
సుఖాలనే ద్వంద్వాలు ఉండవు. మనము మన స్వస్వరూపంలో ఉంటాము. ఇదే నిజమైన గురు రక్ష.
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment