గురు ధ్యానం గురించి గురు గీతలో ఇలా చెప్పబడింది.
ధ్యానం అనేది త్రికరణ శుద్ధిగా చేయాలి. ఈ ధ్యానం మనో వాక్కాయ
కర్మలన్నింటిలో జరగాలి.
శ్రీమత్పరబ్రహ్మ గురుం స్మరామి
శ్రీమత్పరబ్రహ్మ గురుం భజామి !
శ్రీమత్పరబ్రహ్మ గురుం వదామి
శ్రీమత్పరబ్రహ్మ గురుం నమామి !!
మనము ధ్యానించే వస్తువుకన్నా గొప్పది మరొకటి ఉండకూడదు. లేకపోతె
మనసులో సందేహాలు మొదలౌతాయి. సర్వవ్యాపకము, సర్వానికి ఆధారము, ఏకము, అద్వితీయము
అయిన పరమాత్మే గురువు. అటువంటి గురువె మన ధ్యేయము కావాలి. అప్పుడు మన మనస్సులో
అనుమానాలు తలెత్తవు.
అటువంటి గురువుని స్మరిద్దాము.
అటువంటి గురువుని భజిద్దాము,
అటువంటి గురువుని కీర్తించుదాము.
అటువంటి గురువుకి నమస్కరించుదాము.
గురువే పరమాత్మ. గురువే మన ఆత్మగా మనలో కొలువై ఉన్నారు. ఇటువంటి
గురువు యొక్క గుణాలు లక్షణాలు ఈ విధంగా గురు గీతలో చెప్పారు.
బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం !
ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షి భూతం
భావాతీతం త్రిగుణ రహితం సద్గురుమ్ తమ్ నమామి!!
పరమాత్మ నిర్గుణము, నిరాకారము మరియు గుణాలన్నిటికి అతీతమైనదిగా
చెప్పుకుంటాము. కానీ మనం మాట్లాడుకోవడానికి ఈ విధంగా చెప్పుకోక తప్పదు.
బ్రహ్మానంద స్వరూపుడు, సుఖప్రదుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడు,
ద్వంద్వాలకు అతీతుడు, ఆకాశంలాగా నిర్మలుడు, తత్వమసి అనే వేద వాక్యముల అర్ధముగా
భాసించేవాడు, ఏకం (రెండు అనేది లేని వాడు), నిత్యుడు, నిశ్చలుడు, మనో బుద్దులకు
అందని వాడు, త్రిగుణ రహితుడు అయిన శ్రీ గురువుకి నమస్కరిస్తున్నాను.
మనము ధ్యానించే తత్వము పైన చెప్పిన విధంగా ఉండాలి. ఇవన్నీ పరమ
గురువుల్లో ఉంటాయి. షిర్డీ సాయి అందుకే కుదిరితే నిరాకార ధ్యానం మంచిది లేక పొతే
నన్ను సాకార రూపంలో ధ్యానం చేయండి అని చెప్పారు. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మ
దర్శనము.
అందుకే గురువుని ప్రశాంత స్వరూపుడిగా చెప్తారు. గురువు జ్ఞాన
స్వరూపుడు. గురువు ఆత్మ జ్ఞాని, యోగి శ్రేష్ఠుడు, సంసారమనే రోగానికి వైద్యుడు.
అందుకే గురువుని కేవలం ఆత్మ స్వరూపుడిగా ధ్యానం చేయాలి. ఇదే విషయాలను పరమ శివుడు
గురు గీతలో పార్వతి మాతకు చెప్పారు.
కానీ నిరాకార ధ్యానం అందరికి సాధ్యపడదు. అందుకే గురు గీత కూడా సాకార
ధ్యానం గురుంచి కూడా చెపుతుంది.
హృదంబుజే కర్ణిక మధ్య సంస్థే
సింహాసనే సంస్థిత దివ్యమూర్తిమ్ !
ధ్యాయేత్ గురుం చంద్రకళా ప్రకాశం
సత్చిత్సుఖాభీష్ట వరం దదానం !!
హృదయ పద్మం మధ్యలో, కర్ణిక మీద ఉన్న
సింహాసనంలో కూర్చుని, దివ్యమైన రూపంతో చంద్రుని వలె ప్రకాశిస్తు, సచ్చిదానందమనే
వరాన్ని ఇచ్చేవాడైన సద్గురువుని ధ్యానించాలి.
మనము గురువుకి చాలారకాలైన అలంకారాలతో పూజలు చేస్తాము. కానీ వాటివెనక
ఉన్న అర్ధాన్ని తెలుసుకోవాలి. లేక పొతే బయట ఉన్న రూపంలోనే ఉండి పోతాము.
కాషాయము త్యాగానికి ధర్మానికి ప్రతీక.
తెలుపు జ్ఞానానికి సూచన.
నీలి రంగు సర్వ వ్యాపకత్వానికి గుర్తు.
ఇలా ఈ అలంకారాల వెనక ఉన్న తత్వాన్ని అర్ధం చేసుకోవాలి. అలా కాకుండా
ఆర్భాటాలకు పొతే మనము మన లక్ష్యానికి దూరం అవుతాము. అలా అని మన గురువుకి అలంకరణ
చేయకూడదు అని కాదు. గురువుకి ఏ సేవ అయినా చేయవచ్చు. కానీ అది మనసా వాచా
శుద్ధమైనదిగా ఉండాలి. మనం గురువుని పూజించేటప్పుడు అష్టావధానాలూ చేయకూడదు. నోటితో
గురువు నామాన్ని చెపుతూ, మనసుని ఎక్కడో వదిలేస్తే ఎలా!
న గురో రధికం న గురో రధికం
న గురో రధికం న గురో రధికం !
శివ శాసనత శివ శాసనత
శివ శాసనత శివ శాసనత:!!
గురువుకన్నా అధికమైనది ఏది లేదు. ఇది శివ శాసనం అని పరమ శివుడు
చెపుతున్నారు.
ఇదే మార్గాన్ని బాబా మనకు చూపించారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం. సాయి
చెప్పిన బాటలో నడుద్దాము. సాయిని గురువుగా మన జీవితంలోకి ఆహ్వానిద్దాము.
శ్రీమత్పరబ్రహ్మ సాయిం స్మరామి
శ్రీమత్పరబ్రహ్మ సాయిం భజామి !
శ్రీమత్పరబ్రహ్మ సాయిం వదామి
శ్రీమత్పరబ్రహ్మ సాయిం నమామి !!
సాయినే స్మరిద్దాము
సాయినే భజించుదాము !
సాయినే కీర్తించుదాము
సాయికె నమస్కరించుదాము !!
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment