మనము సాయి
అష్టోత్తరములో ఓం
సర్వాంతర్యామినే నమః అని చదువుతాము.
భగవంతుడిని అర్ధం చేసుకోవాలి అంటే ఈ మంత్రాన్ని బాగా తెలుసుకోవాలి.
ఒక సారి బాబా ఇలా
చెప్పారు.
బంధాలతో విషయ
వాంచలతో ఉన్నవారు మంచి చెడుల గురించి తెల్సుకోలేరు అట్లానే భగవంతుడ్ని అర్ధం
చేసుకోలేరు. వాళ్ళకు మానవత్వం బహు తక్కువగా ఉంటుంది. ధర్మమార్గం తెలియదు. ఎప్పుడూ
ఈ ప్రపంచం అనే సాగరంలో మునిగి శాస్త్రాలపట్ల, సంతుల పట్ల శ్రద్ద లేక బతుకుతూ
ఉంటారు. వారు భగవంతుని కాక నరకానికి చేరుకొంటారు.
ముముక్షువులు
బంధాలతో విసిగి, వివేక విచారములతో, సదా భగవంతుడినే కోరుకుంటారు. వాళ్ళు తప్పకుండా
ధర్మమార్గంలో నడుస్తారు. వీళ్ళే సాధకులై, జాగరూకులై, భగవంతుని స్మరిస్తూ
తపోధ్యానాదులతో జీవనాన్ని సాగిస్తారు. భగవంతుడి నుంచి ముక్తి తప్ప వేరేమి
కోరుకోరు. వారికి నేను గురువు రూపంలో ఉండి ఈ శరీరం వాళ్ళది కాదు అని, వారిలోనే
పరమాత్ముడు ఉన్నాడని అనుభవపూర్వకంగా తెలియచేస్తాను. అప్పుడు వారికి
భగవంతుడు సర్వవ్యాపి అని, అన్ని రూపాలలో తనే ఉన్నాడన్న అనుభవం కల్గుతుంది.
కదిలేవి, కదలనివి అంతా దేవుడే అని వారికి అనుభూతి అవుతుంది. దేవుడు లేని స్థలము
లేదని అర్ధం అవుతుంది. కాని మాయ అనే తెర
వలన ఇది చాలా కష్టం అనిపిస్తుంది. ఆ మాయను కేవలం గురుకృప ద్వారా మాత్రమే
దాటగల్గుతాము. గురువు పట్ల శ్రద్ద, ఆ తరువాత ఈ కర్మలను నశింప చేసుకొనే దాకా ఓర్పు
కలిగి యుండాలని బాబా చెప్పడం జరిగింది.
భగవంతుడు
సర్వవ్యాపి అని, అందరిలో భగవంతుడిని చూడమని మనము యుగయుగాలుగా వింటూనే ఉన్నాము.
కాని ఈ సత్యం మన మనస్సులోతుల్లోకి ప్రవేశించలేకపోతుంది. భగవద్గీతలో పరమాత్ముడు ఈ
విధంగా చెప్పారు.
సర్వభూత స్థితం యో
మాం భజత్యేకత్వమాస్థితః !
సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే !!
భగవంతునియందు ఏకీ
భావ స్థితుడైన పురుషుడు సర్వభూతములయందును ఆత్మ రూపమున సచ్చిదానందుడై ఉన్న నన్ను భజించును. అట్లాంటి యోగి సర్వధా సర్వ కార్యములయందు
వ్యవహరించుచున్నను నా యందే
ప్రవర్తించుచుండును.
ఇక్కడ భగవంతుడిని
సర్వ భూత స్థితుడుగా భజించాలి అని చెప్పడం జరిగింది. ఎలాగైతే నీటి బిందువులలో,
ఆవిరిలో, పొగమంచులో మరియు మంచులో అంతా నీరే ఉందో, అలానే భగవంతుడు పరిపూర్ణుడై
చరాచర విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు.
ఈ అనుభూతిని మన
నిజ జీవితంలో పొందలేకపోతున్నాము. మరి ఎట్లా? ఏ మార్గంలో వెళ్ళాలి!
అందుకే బాబా మనకి
సులభమైన మార్గం చెప్పటం జరిగింది. ఆయన ఎల్లప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ, భగవంతుడే
మనకు దారి అనే తత్వాన్ని బోధించారు. కేవలము శ్రద్ధ, సబూరితో మాత్రమే మనము ఈ
గమ్యాన్ని చేరుకోగల్గుతాము.
ఉదాహరణకి మనం
చిన్నప్పుడు కొన్ని మాటలు తప్పు వ్రాసినప్పుడు మన టీచర్స్ మన చేత కాంపోజీషన్
వ్రాయించేవారు. దాని మూలాన మనకు ఆ తప్పుని దిద్దుకొనే అవకాశం కల్గింది. అట్లానే
కేవలము భగవంతుని యొక్క స్మరణతో ఈ కలియుగంలో ముక్తిపథం వైపు నడవచ్చు.
ఏదైనా సాధన ద్వారా
మాత్రమే సాద్యపడుతుంది. ఈ సాధనలో మనకు మార్గదర్శి కావాలని బాబా చెప్పడం జరిగింది.
లేకపోతే ఈ అరణ్యంలో మనము దారి తప్పుతాము. ఈ మాయ
మనల్ని మింగేస్తుంది.
ఈ సర్వవ్యాపకత్వం
మనకు అలవాటు చెయ్యడానికి బాబా వివిధ రూపాలలో దర్శనం ఇచ్చి, వారికి వారి కర్మలు,
వాసనలకనుగుణంగా వారిని నడిపించి మార్గదర్శకత్వం చేయడం జరిగింది. కేవలము పరమ గురువులు
మాత్రమే ఈ విధంగా మనలను ఉద్దరించ గల్గుతారు. ఏ విధంగా భగవంతుడు (కృష్ణుడు)
అన్నింటా ఉన్నాడని విభూధి యోగంలో కృష్ణపరమాత్మ చెప్పడం జరిగిందో అదే బాబా చేసి
చూపించారు. ఆయన జంతువుగా వచ్చిన, మనిషిగావచ్చిన, గురువులుగా కనిపించినా, మన ఇష్ట
దైవంలా కనిపించినా, ఇలా ఏ రూపముగా వచ్చినా, ఇదంతా మనకు ఈ
భావనను అనుభవ పూర్వకంగా చూపించగల పరమదయాళువు మన సాయి పరమాత్మ.
ఓం శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment