మన జీవితంలో జరిగే
కొన్ని అనుభవాలు మనం మాటలతో వర్ణించలేము. మనం ఎంత చెప్పినా కానీ అవి మన అనుభవానికి
సరిపోదు. మనం ఒక తీపి పదార్ధం తిని, అది ఎలా ఉంది అని
ఎవరైనా అడిగితె తియ్యగా ఉంది అని చెపుతాము. కానీ తియ్యగా అంటే ఏమిటి అని అడిగితే;
నువ్వు తిని చూడు, అప్పుడే నీకు తెలుస్తుంది అని చెప్పాలి. తల్లి ప్రేమ ఎలావుంటుంది అంటే ఎవరు చెప్పగలరు? ఎందుకంటే అది మాటలతో
చెప్తే తెలిసేది కాదు. నీకు నువ్వు అనుభవించాలి. అలానే భగవంతుని భక్తిలో ఉన్న పారవశ్యం చెప్తే అర్ధం అయ్యేది కాదు. దాని
గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అందుకే బాబా మాటల గురువుగా కాక చేతల
గురువుగా అన్ని నేర్పిస్తారు. అంటే మనం కోరుకునే దాన్ని అనుభవ పూర్వకంగా ఇస్తారు.
మనము చూసేవి కూడా
శాశ్వతం కావు. ఒక కాలంలో ఉండి మరో కాలంలో నశించేవే. మనం మనస్సుతో గ్రహించి
చెప్పేది కూడా అనుభవానికి సరిపోదు. మనం ఎలా అయితే పాలల్లో నుంచి వెన్న తీస్తామో,
అలానే ఆత్మ విశ్లేషణ చేసి ఈ అనుభవాన్ని పొందాలి. దీనికి గురు కృప కావాలి. గురు కృప
ఎలా ఉపయోగ పడుతుంది అంటే, మన అజ్ఞానాన్ని తొలిగించడానికి మాత్రమే. ఎందుకంటే
అనుభవమనేది నీలోనే ఉంది. అది ఒకరు ఇచ్చేది కాదు. అందుకే అది మనస్సుకి మాటలకు
అందనిది అని చెప్తారు.
ఒక సారి నానా
చందోర్కర్ శుద్ధచైతన్యము
అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అని బాబాను అడిగారు.
దానికి బాబా ఈ
విధముగా సమాధానం ఇచ్చారు.
నానా! ఇది
జగత్తుకు ఆధారమైనది, చరాచర సృష్టి అంతా వ్యాపించి ఇంకా ఏదైతే మిగిలి ఉన్నదో,
ఎందులో సర్వం చివరకు లయం అవుతుందో, అన్నింటికి మూలమైనదేదో అదే శుద్ధ చైతన్యము.
కంటికి కనబడే యీ జగత్తు రూపంలో ప్రకాశించేదంతా నారాయణుడే! ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే
ఎలాంటి అంతరాయం లేకుండా అందరిలో ఉన్నాను అనే అనుభవరూపంలో సాక్ష్యం ఇస్తున్నది. ఇది ప్రతిక్షణం అనుభవమవుతూ ఉన్నది.
ఆ చైతన్యం ఎక్కడ ఉంది అని అడిగావు. అది ఎక్కడ లేదో చెప్పు. ఎంత వెదికినా ఆ చైతన్యం లేని చోటే లేదు. కనబడేదంతా చైతన్యమే. అది నామరూప రహితమైనది. గాలి ఎలాగైతే రంగు మొదలైన గుణరూపాలకతీతమో, చైతన్యం కూడా అలాంటిదే. ఇది ఎప్పటికీ మరువవద్దు.
చైతన్యం అంటే
బ్రహ్మవేత్తలు, వృక్షకోటి, జీవకోటి, జంతుకోటి, ఇవన్నీ ఆ చైతన్యం యొక్క రూపాలే.
చూచేవాడు, చూడబడేవి, చూపు, కనిపించడం, తెలుసుకోవడం, ప్రకాశించడం, వాటన్నింటికీ
మూలకారణము చైతన్యం.
ఈ చైతన్యం
సర్వవ్యాపి, దుఃఖరహితము, సత్యజ్ఞానానందరూపము. మీరందరూ ఆ చైతన్యానికి భిన్నంగా
లేరు. ఆ చైతన్య స్వరూపమే బ్రహ్మము అని బాబా చెప్పారు.
ఈ ఆత్మ చైతన్యం
మనస్సుకి వాక్కుకి అతీతమైనది. అంటే ఈ అనుభవం మాటలతో చెప్పలేనిది. మన మనస్సుకి
అందనిది. అందుకే మనం పరమాత్మను స్తుతించినప్పుడు మనోవాగతీతాయా నమః అనే మంత్రాన్ని
జపిస్తాము. ఈ అనుభవం ఇంద్రియాలతో పోల్చుకోలేనిది. చర్మ చక్షువులతో చూసేది కాదు. కానీ మన ఋషులు, మహాత్ములు మనకు కొంచెమైనా అర్ధం కావాలి అని, ఈ
చైతన్య అనుభవం గురించి చెప్పే ప్రయత్నం చేశారు.
మనం బాబా హారతిలో
ఇలా పాడుకుంటాము.
భవాద్వాoత విధ్వంస మార్తాoడ మీడ్యo
మనోవాగతీతం
మునీర్ధ్యాన గమ్యం !
జగద్వ్యాపకం
నిర్మలం నిర్గుణం త్వాం
నమామి ఈశ్వరం సద్గురుం
సాయినాథం!!
భవ సాగరమనే ఈ
సంసార అజ్ఞాన అంధకారాన్ని నశింపచేసే సూర్యుడవు నీవు. మనో వాక్కులకు అతీతుడవు. మునుల యొక్క ధ్యాన గమ్యం నీవే. జగత్ వ్యాపకుడవు, నిర్మలము నిర్గుణత్వము గల ఈశ్వరస్వరూపుడైన
సద్గురు సాయినాథునకు నమస్కరించుచున్నాను.
ఈ శ్లోకం శ్రీ
సాయినాథుని మహిమా స్తోత్రంలో ఉంది. దీన్ని మనం మధ్యాన్న హారతిలో మరియు సాయం
హారతిలో పాడుకుంటాము. ఇక్కడ కూడా పరమాత్ముని మనోవాక్కులకు అతీతుడుగా చెప్పారు.
బాబా మన ప్రాపంచక కోరికలు తీర్చడమే కాకుండా మనకు ఈ పరమాత్మ తత్వ అనుభవం కోసం కృషి
చేయమని బోధించారు.
ఈ మానవ జన్మ మాటి
మాటికీ వచ్చేది కాదు. అందుకే మనం అందరమూ శాశ్వతమైన, మరియు మాటలకు అందని ఈ ఆత్మ
సాక్షత్కారమనే అనుభవం కోసం ప్రయత్నించాలి. అప్పుడే మన జన్మ సార్ధకం అవుతుంది.
ఓం శ్రీ సద్గురు
సాయినాథాయ నమః - ఓం శ్రీ మనోవాగతీతాయా నమః
No comments:
Post a Comment