ఓం పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితామ్ పురాణ మునినా మధ్యే మహాభారతం !
అద్వైతామృత వర్షిణీమ్ భగవతీమష్టాదశాధ్యాయినీమ్
అమ్బ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం !!
భగవంతుడే స్వయంగా చెప్పిన శాస్త్రమే భగవద్గీత.
సర్వ మానవాళిని ఈ భవసాగరంనుంచి రక్షించడానికి శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునిని
అడ్డుగా పెట్టుకొని భగవద్గీతను చెప్తే, దాన్ని వ్యాస భగవానుడు గ్రంధస్తం చేయడం
జరిగింది. ఈ గీత పద్దెనిమిది అధ్యాయాలతో సర్వ ఉపనిషత్తుల సారాన్ని మనకు అందించిన ఏకైక శాస్త్రము. భగవంతుడు
ఒక్కడే అని, ఉన్నదంతా ఆ విరాట్ స్వరూపమే అని, ఆ అధ్బుత చైతన్యమే మనమని తెలియచెప్పే
శాస్త్రమే భగవద్గీత.
సాయినాథుడు షిర్డీవాసుడై, జ్ఞానేశ్వరీ అని పిలవబడే
ఈ భగవద్గీతను కేవలం చదవడమే కాకుండా, దాన్ని మన జీవితంలో ఎలా అవలంబించాలో చేసి
చూపించిన పరమ గురువు. ఆ పరమ గురువు ఆశీస్సులతో మన మందరము ఈ భగవద్గీతను
అనుసరించడానికి ప్రయత్నిద్దాము.
"సర్వ శాస్త్రమయీ గీతా" అని మహాభారతంలో
చెప్పడం జరిగింది. ఈ గీతనే సుగీతా అన్నారు. మనకు జీవన విధానాన్ని, జీవన
లక్ష్యాన్ని, దాన్ని చేరుకొనే మార్గాన్ని చూపించిన అద్భుతమైన శాస్త్రము.
ప్రతిఒక్కరు గీతను విని, అర్ధం చేసుకొంటె వేరే శాస్త్రాల అవసరమే లేదు. శ్రీ మహా
విష్ణువే స్వయంగా వరాహ పురాణంలో ఇలా చెప్పారు. నేను గీతను ఆశ్రయించి ఉంటాను. గీతయే
నా నివాసము. పాలనకర్తగా పాలించుటకు నాకు ఉపయోగపడే సాధనమే గీతా జ్ఞానము అని
చెప్పారు.
మహాభారతము పద్దెనిమిది పర్వాలతో పంచమవేదంగా
పిలవబడుతుంది. అలానే భగవద్గీత కూడా పద్దెనిమిది అధ్యాయాలతో మనకు అందించటం
జరిగింది. వేదాలకు చివరిభాగంలో ఉన్న
ఉపనిషత్తుల సారమంతా రంగరించి శ్రీకృష్ణ భగవానుడు గీత రూపంలో ఇచ్చి మనలను కరుణించారు. మహానుభావులు
ఎందరో ఈ గ్రంథరాజానికి భాష్యం వ్రాసి మనకు అర్ధం అయ్యేలా చేశారు. వారందరూ చూపిన
మార్గంలో మనం కూడా ప్రయాణిద్దాము. ఈ ప్రయాణంలో వారందరి ఆశీస్సులు మనపై ఉండాలని
ప్రార్థిద్దాము.
మహాభారతం నుంచి చాలా నేర్చుకోవాల్సిన అంశాలు
ఉంటాయి. భారతంలో లేనిదంటూ ఏమీ లేదని మన పెద్దలు చెప్తారు. భారతంలో ధర్మానికి
పెద్దపీట వేశారు. భీష్మ, ద్రోణ, కర్ణులు వారికి తెలిసిన ధర్మాన్ని వారు పాటించారు.
వారిలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి. కానీ వారు అధర్మాన్ని ఆశ్రయించారు. అలానే మనం
కూడా ధర్మంగానే బతుకుతున్నాము అని అనుకుంటాము. నేనెవరికి అన్యాయం చేయడం లేదు, ఒకరి
సొమ్ము తినడం లేదు. కాబట్టి నేను న్యాయంగానే బతుకుతున్నాను అని మనం అనుకోవచ్చు.
కాని మనమెందుకు సుఖ దుఃఖాలతో సతమతం అవుతున్నాము. జీవితంలో ఈ ఒడిదుడుకులను
ఒక్కోసారి తట్టుకోలేక పోతున్నాము అంటే మనం ఇంకా తెలుసుకోవాల్సినదేదో ఉంది అని అర్ధం చేసుకోవాలి. మనం నిజాన్ని అర్ధం చేసుకొంటే కాని ఈ
ద్వంద్వాలను మనం సంయమనంతో ఎదుర్కోగలుగుతాము.
మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది.
పదోరోజు భీష్ముల వారు పడటం జరిగింది. అప్పడు సంజయుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ఈ
విషయం చెప్పగా, అప్పటి దాకా జరిగిన యుద్ధం అంతా విపులంగా చెప్పమని ధృతరాష్ట్రుడు
కోరడం జరిగింది. అలా భగవద్గీత శ్లోకం మొదలవుతుంది. మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి.
దీన్ని మూడు షడ్గాలుగా విభజిస్తే, మొదటి ఆరు అధ్యాయాలు కర్మ యోగంగా, తరువాత ఆరు
భక్తి యోగంగా, చివరి ఆరు అధ్యాయాలు జ్ఞాన యోగంగా చెప్తారు. వేదాలలో కర్మ కాండ,
ఉపాసనా కాండ మరియు జ్ఞాన కాండ అనే మూడు భాగాలు ఉన్నాయి. జీవితంలో సర్వ కర్మలు
ఆచరించినా, ఎంత ఉపాసన చేసినా, మానవుడు సరియైన జ్ఞానం లేకుండా తన గమ్యాన్ని చేరుకోలేడు. ఈ
జ్ఞానమే యోగం అంటారు.
యోగం అంటే కలయిక అనే అర్ధం ఉంది. మనం ఎక్కడనుంచి
వచ్చామో, ఈ సంసారమనే భవ బంధంలో మనం ఎలా ఇరుక్కు పోయామో, మనకు మనంగా ఎలా మిగిలిపోతామో
తెలుసుకొనే జ్ఞానమే ఈ భగవద్గీత. అందుకే కర్మను కర్మ యోగంగా, భక్తిని భక్తి యోగంగా
మార్చుకోవాలి. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, అనుసరించి, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు
అది జ్ఞాన యోగం అవుతుంది.
ఇవన్ని ఆచరించడానికి మనకు అడ్డుపడే
పరిస్థితులనుంచి, గుణాలనుంచి ఎలా తప్పించుకొని ముందుకు సాగాలో తెలిపే జ్ఞానమే గీతా
జ్ఞానము. మనందరిని ఒక గీతలో నడిపించేదే ఈ సుగీత.
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment