ఆత్మ నిత్యము, సత్యము అని మనం చాలా సార్లు విన్నాము అయితే ఇది మనకు
జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది. ఇది తెలుసుకున్నందువల్ల మనకు ఒరిగేది ఏంటి?
శ్రీకృష్ణులవారు మనలోఉన్న విషాధం పోవాలి అంటే ఏమి తెలుసుకోవాలో దాన్ని గురుంచి చెప్తున్నారు. మనలో మానశిక ధైర్యం రావాలి. అంటే మనం ఎవరో
అర్ధం చేసుకోవాలి. నేను నాది అన్న వాటిలో నుంచి మాత్రమే దుఃఖం వస్తుంది.
మనకు ఇతర ప్రాణులకు ఉన్న అతి ముఖ్యమైన తేడా ఏమిటి అని పరిశీలిస్తే, మన గురించి మనకున్న అవగాహన అని తెలుస్తుంది. ఈ అవగాహన వల్లే మన గురించి
మనము అర్ధం చేసుకో గలుగుతున్నాము. అందుకే మన గురుంచి మనం తెలుసుకోవాలి. మనం అంటే ఈ
శరీరమా, మనస్సా లేక ఆత్మ అని తెలుసుకోవాలి అని వేదాంతం చెపుతుంది. కాని ఒక్క సారి
శరీరానికో మనసుకో బాధ కలిగితే ఆత్మ
గురుంచిన ఆలోచనే రాదు. ఆత్మ సాక్షాత్కారము పొంది ఆత్మ నిష్ఠలో ఉన్న మహానుభావులు
అయితే ఈ శారీరిక, మానసిక సుఖ - దుఃఖాలకు అతీతంగా ఉంటారు. సరే సామాన్య మానవులుగా
మనం ఈ తత్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
అందుకే భగవానుడు గీతలో ఈ శ్లోకం చెప్పారు.
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాదిపా:!
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ !!
నీవు కాని, నేను కాని, ఈ రాజులు కాని ఉండని కాలమే లేదు. ఇక ముందు
కూడా మనము లేకపోవడమనే సమస్యే లేదు. అన్ని కాలములలో మనము
ఉన్నాము. ఆత్మ శాశ్వతము. శరీరము పోయినా కాని ఆత్మ నశించదు.
మనము ప్రస్తుతమున్న శరీరముకన్న ముందు కూడా ఉన్నాము, అలానే ఈ శరీరం
పోయిన తరువాత కూడా మనము ఇంకో శరీరంలో ఉంటాము అని భగవానుడు
చెప్తున్నారు.
ఈ విషయాన్ని నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఇప్పడు చూద్దాము.
మనము రోజు చాలా సమస్యల్లో సతమతమవుతూ ఉంటాము. ఒక సమస్య ఉన్నప్పుడు
మనము ఉన్నాము. ఆ సమస్య తీరిన తరువాత మనము ఉంటాము. కాని కొన్ని సమస్యలు మనలను
తీవ్రమైన అగాధంలోకి తోస్తాయి. ఇక వాటిలోనుంచి మనం బయట పడలేము అని తలుస్తాము. కాని
ఇది ఎంత వరుకు నిజం. మనం ఇప్పటి దాకా చాలా సమస్యలను ఎదుర్కొన్నాము కాని వాటినుంచి
మనం ఎమన్నా నేర్చుకున్నామా అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే సమస్య
ఏదైనా మన స్పందన ఒకే లాగా ఉంటుంది. ఎప్పుడూ హైరాన పడటం, ఉద్రేకాలతో ఊగి పోవడమే
మనకు అలవాటై పోయింది. ఒక్కసారి స్థిమితంగా ఆలోచిస్తే మనకు ఈ నిజం చాలా స్పష్టంగా
తెలుస్తుంది.
ప్రతి ప్రాణికి వాటివాటి శరీరాలు వదలాలి అంటే భయమే. చావు అనేది నిజం
అని మనందరికీ తెలిసిన సత్యం. మన పూర్వీకులు ఇప్పడు ఆ
శరీరారాలలో లేరు.
అందుకే భగవానుడు ఇలా చెప్పారు.
దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యవ్వనం జరా !
తధా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి !!
జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరియొక
దేహము ప్రాప్తించును. ధీరుడైనవాడు ఈ విషయమున మోహితుడు కాడు అని భగవానుడు చెప్పారు.
ఈ సత్యాన్ని మనం ఎంత బాగా జీర్ణం చేసుకుంటే అంత తేలికగా మనం ఈ
జీవనమనే సుడిగుండంలో సతమతమవకుండా ఉండ గలుగుతాము.
ఓం శ్రీ సాయినాథాయ నమః