భగవద్గీతలో అసలైన బోధ 11వ శ్లోకం నుంచి
మొదలవుతుంది. గీతకు ఈ శ్లోకమే ప్రధానమైనది. ఒక చెట్టు బీజంలో ఎలా ఇమిడి ఉంటుందో
అలానే 11వ శ్లోకం గీత మొత్తానికి ఆయువుపట్టు. దీన్ని సరిగా చేసుకుంటే జీవిత పరమార్ధం అర్ధం అయినట్లే.
అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే!
గతాసూన గతాసూన్ చ నానుశోచన్తి పండితాః !!
భగవానుడు తన బోధను ఇలా ప్రారంభిస్తున్నారు.
నీవు శోకింప దగని వారి గూర్చి శోకించుచున్నావు. పైగా పండితుడులాగా
మాట్లాడుతున్నావు. జ్ఞానులైన వారు మరణించినవారి గూర్చి గాని, జీవించిఉన్న వారి
గూర్చి గాని దుఃఖించరు.
ఈ శ్లోకం చూడటానికి చాలా సాధారణమైనదిగా ఉండచ్చు కాని లోతుగా
పరిశీలిస్తే ఇందులో ఉన్న అర్ధం బోధపడుతుంది. ఈ శ్లోకంలో వేదాంత సారమంతా
పొందుపరచబడింది. ఇది అర్ధం చేసుకోవాలి అంటే జీవుని వాస్తవ రూపం ఏమిటో
తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువులో ఐదు అంశాలు ఉంటాయి. సత్ చిత్ ఆనందం అనే
మూడు మరియు నామము, రూపము అనే ఐదు ఉంటాయి. కేవలము నామము రూపము మారుతూఉంటాయి. మొదటి
మూడు (సత్ చిత్ ఆనందము) జీవుని యొక్క అసలైన రూపము.
ఇక్కడ "అశోచ్యాన్" అనే పదాన్ని వాడారు. మనము శోకింప తగని
వారికోసం శోకిస్తున్నాము అని భగవానుడు చెప్తున్నారు. మన వారికోసం శోకించకుండా ఎలా
ఉండాలి అని మనకు అనిపించవచ్చు. మనం తెలుసుకోవలసినది మన వారి యొక్క నిజస్వరూపము. ఈ
స్వరూపము ఏ కాలమందు నశించదు. దానికి పుట్టుక,
చావు లేవు. అప్పుడు నామ రూపాలు నిమిత్తమాత్రాలే. అందుకే భగవానుడు శోకింపతగని వారి
గురించి శోకించవద్దు అని చెప్పారు. అంతే కాని ఎవరిమీద ప్రేమాభిమానాలు వద్దు అని
చెప్పలేదు. ప్రేమకు శోకానికి పొంతన పెట్టకూడదు.
ఒక్కోసారి మనకు అన్ని తెలిసినట్లే ఉంటుంది కాని సత్యాన్ని మరిచి మనము
ప్రవర్తిస్తాము. ఇక్కడే మనము తప్పు దారిలో పడతాము. పండితుడు లాగా మాట్లాడుతాము.
ఇక్కడ పండితుడు అంటే ఎవరు? ఆత్మ జ్ఞానము తెలిసిన వారే పండితుడు అనిచెప్పబడతాడు.
ఆత్మ గురించి తెలుసుకున్నవారు పైన చెప్పిన జీవ తత్వాన్ని ఎరిగి ఉంటారు. వారు ఈ
శరీరంలో ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలో అవి మాత్రమే నిర్వర్తిస్తారు.
జ్ఞానులగు వారు మరణించిన వారి గురించి గాని లేదా జీవించిఉన్న వారి
గూర్చి గాని దుఃఖించరు అని భగవానుడు చెప్పారు.
ఆత్మ శాశ్వతత్వమును అర్ధం చేసుకుంటే, జీవన్మరణాలు వాటి ఉనికిని
కోల్పోతాయి. అప్పుడు చావు పుట్టుకల మాటే రాదు. మనము బుద్ధితో ఒక ప్రజ్ఞావంతుడు
లాగా ప్రవర్తించవచ్చు. ఒకరికి సలహాలు చెప్పవలసి వచ్చినప్పుడు చక్కగా చెప్పవచ్చు. కాని
విషయం మన దాకా వస్తే అప్పడు నిజ తత్త్వం బయట పడుతుంది. ఇక్కడ అర్జునుడి విషయంలో
కూడా అదే జరిగింది.
ఈ శ్లోకం మనకు ఏమి నేర్పిస్తుంది ?
జీవుని వాస్తవ రూపాన్ని తెలుసుకుంటే దుఃఖం ఉండదు.
జీవించిఉన్న వారికి వారి కర్మానుసారంగా అన్ని జరుగుతాయి కాబట్టి మనము
దుఃఖించడం మంచిది కాదు.
చనిపోయిన వారు ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరంలోకి వెళతారు కాబట్టి
వారిగురించి చింతించడం తెలివైన పని కాదు.
జీవితంలో మనం ఎక్కువగా ఆలోచించేది జరిగిపోయిన విషయాల గూర్చి గాని
లేదా భవిష్యత్తులో ఎలా ఉంటుందో అన్న చింత గాని మనలను వేధిస్తూ ఉంటుంది. భగవానుడు ఈ
శ్లోకంలోనే గీతా సారాన్ని అంతా రంగరించారు. వర్తమానంలో ఉంటే చాలావరకు మనకు ఈ దుఃఖం
కలగదు. మనము ఈ నామ రూపాల కోసం శోకించ కూడదు. అయ్యో నేను ఈ అజ్ఞానంలో
కొట్టుకుంటున్నానే అని శోకించాలి. ఇప్పటివరికి జ్ఞానం గురించి తెలుసుకోలేక పోయానే
అని దుఃఖించాలి. నాకు సరైన గురువు దొరకలేదే అని శోకించాలి అంతే
కాని అశాశ్వతమైన ఈ శరీరం కోసం, ప్రపంచం కోసం శోకించ కూడదు.
ఓం శ్రీ సాయినాథాయ నమః
No comments:
Post a Comment