వేదవేదాంగ
అధ్యయనాలు, శృతి శాస్త్ర పారాయణాలు చేసినా గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి లేదు.
ఇతర సాధనాలన్నీ వృధా శ్రమ మాత్రమే. ఈ ప్రపంచాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు. దీని
వేళ్ళు పైకి ఉంటాయి. దాని శాఖలు విస్తారంగా వ్యాపించి ఉంటాయి. ఇది దూరమునుండి
రమణీయంగా కనిపిస్తుంది. అరటి చెట్టు స్థంభం వలె ఇది సత్తువ లేనిది. నిస్సారమైనది.
ఇది అజ్ఞానంవలన కలిగిన కోరికల కారణంగా చేసే కర్మలనుండి ఉద్బవించింది. అవ్యక్త
బీజములోనుండి పుట్టినది. ఆశతృష్ణ మొదలైన వాటితో నీరులాగా చుట్టబడి ఉంటుంది.
ధనధాన్యాలు, భార్యాబిడ్డలు, పరివారం వగైరా శరీర బుద్ధి కారణంగానే. ఇది మాయోపాధి
బ్రహ్మలో ఆవిర్భవించింది. ఇది వైరాగ్యమనే శస్త్రంతో నశిస్తుంది. సద్భావం దీనికి
మూలాధారం. బ్రహ్మ సత్యం మరియు జగత్తు మిధ్య. ఇలా హేమద్పంత్ గారు ఈ ఉపోద్ఘాతంతో
మొదలుపెట్టి తరువాత బాబా చెప్పిన కథను మనకు చెప్పారు.
ఇది బాబా
స్వయంగా చెప్పిన ఒక మధురమైన కథ. ఒక సారి మేము నలుగురం పురాణాది గ్రంధాలను చదివి
జ్ఞానసంపన్నులం అయిపోయామని తలిచి బ్రహ్మ నిరూపణ చేయసాగాము. ఉద్ధరేతాత్మా నాత్మానాం
అనే గీతా వచనం ప్రకారం పరావలంబనం ఎప్పుడూ పనికిరాదు అని ఒకరు చెప్పారు. మనసు
అధీనంలో ఉంచుకునే వాడే ధన్యుడు. సంకల్పవికల్పాలు లేకుండా ఉండాలి అని రెండవవాడు
చెప్పాడు. వికారాలతో మార్పులు చెందేది అనిత్యం. ఒక్కటి మాత్రమే నిత్యం. అందువలన
నిరంతరం ఈ నిత్యానిత్యాల గురించి చింతన చేయాలి అని మూడో వారు చెప్పారు. నాలుగవ
వానికి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. అతని ఉద్దేశం శాస్త్రాలు చెప్పినవి ఆచరించాలి
కాని పంచప్రాణాలు గురువు యొక్క చరణాలకు సమర్పించాలి. గురువే పరమాత్మ. నిర్మలమైన
భక్తి ఉండాలి అని చెప్పారు. ఇలా మాట్లాడుకుంటూ మేము నలుగురం అడివిలో సంచరిస్తూ
వుంటే ఒక వనజరి మాకు తారస పడి మీ ప్రయాణం ఎంత వరకు? దేని నిమిత్తం? అని అడిగాడు.
అతనికి వారు నిజం చెప్పడం ఇష్టం లేక అక్కడినుండి వెళ్ళబోతూ ఉంటే అతను ఇలా అన్నాడు.
ఈ అడవి చాలా దట్టమైనది. ఒక మార్గదర్శి ఉంటె దారితప్పకుండా ఉంటారు. రహస్యమైన విషయం
అయితే చెప్పకండి కాని ఈ ఆహారం స్వీకరించి వెళ్ళండి అంటాడు. కాని వారు అతనికి బదులు
ఇవ్వకుండా మల్లి అన్వేషణకై బయలుదేరతారు. చాలాసేపు తిరిగి మరల ఆ వనజరి ఉన్న
ప్రదేశానికి వస్తారు. మరల అతను వారిని ఆహరం తీసుకోమని, మార్గదర్శి ఉంటే మంచిది అని
చెప్తాడు. ఈ సారి నాకు చాలా ఆకలిగా ఉంది అతని మాటవిని ఉండాలి అని నేను ఉండిపోయాను.
మిగతా ముగ్గురూ వెళ్లిపోయారు. ఇలా నిస్వార్ధ ప్రేమ చూపిస్తూ ఏ లాభాన్ని ఆశించని
వాడే నిజమైన జ్ఞాని. నేను రొట్టె ముక్క తిని నీరు త్రాగిత్రాగిన తరువాత
అకస్మాత్తుగా నా ముందు గురు మహారాజ్ ప్రత్యక్షమయ్యారు.
ఆయన మా
గురించి తెలుసుకొని నన్ను తీసుకువెళ్లి ఒక బావిలో తాడుతో తలక్రిందులుగా వేలాడతీసి
ఉంచి వెళ్లిపోయారు. అప్పుడు నాచేతులు నీటికి అందకుండా ఉండే విధంగా నన్ను ఉంచారు. కొంత సమయం తరువాత మరల వచ్చారు. నన్ను పైకి లాగి ఎలా ఉంది అని
అడిగారు. చాలా ఆనందంగా ఉన్నాను. ప్రవాసం పొందాను అని చెప్పాను. అయన మెచ్చి నన్ను ఆయన తన పాఠశాలకు తీసుకువెళ్లారు. ఆ పాఠశాల చాలా రమ్యంగా ఉంది. అక్కడ మాయా మోహాలు
తొలిగిపోయాయి. ముక్తి సునాయాసంగా లభించింది. గురువు ప్రతిబింబం లేని కళ్ళు వృధా
అనిపించింది. క్షణంకూడా ఆయనను వదిలిఉండాలి అనిపించలేదు. నా ఇల్లు వాకిలి ,
తల్లి తండ్రి దైవం సర్వం ఆయనే అయ్యారు. గురుధ్యానమే ఏకైక
లక్ష్యంగా మిగిలిపోయింది. మా గురువు నన్ను బాగా సేవలో నియమించి నాకు జ్ఞాననిధిని
చూపించారు. దానిని వెతుక్కునే అవసరం కలుగలేదు. అన్ని వాటంతట అవే అర్ధం అవడం
మొదలైంది. గురు కృప కారణంగా శోధన అక్కడికక్కడే ఆగిపోయింది.
గురువు తల్లక్రిందులుగా వెళ్లాడకట్టి ప్రపంచం నిత్యమూ సత్యము కాదని, నిత్యమైనది
సత్యమైన దాన్ని తెలుసుకొనేలాగా చేశారు. ఇక్కడ శ్రద్ధ విశ్వాసాలు తప్ప ఏవి సాగవు.
పైన
చెప్పిన కథలో సాయి తనను ఒక భాగంగా చెప్పి మనకు సరిఅయిన దారి చూపించారు. ఆయన గొప్ప
వైరాగ్య మూర్తి, జ్ఞాని, పరమగురువు. తాను స్వయంగా అవతార పురుషులై ఉండి ఆ వనజరి
ఇచ్చిన ఆహారం స్వీకరించి అన్నం పరబ్రహ్మ స్వరూపమని, దానిని తిరస్కరించకూడదని,
అలానే గురువు యొక్క గొప్పతనం ఏమిటో తెలియ చెప్పి, శ్రద్ధ సభూరిల అవసరం ఏమిటో చేసి
చూపించారు. అందుకే సాయి భక్తులమైన మనం సాయి చూపించిన మార్గంలో నడిచే ప్రయత్నం
చేయాలి.
సాయి
ఎప్పుడూ ఉపవాస దీక్షలను ప్రోత్సహించే వారు కాదు. పైన చెప్పిన కథలో ఆ వనజరి పెట్టిన
భోజనం తిన్న తరువాతే తనకు గురువు సాంగత్యం కలిగింది అని చెప్పారు. బాబా ఇతరులను
కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కాదు. ఉపవాసం చేస్తే మనసు స్థిమితంగా ఉండదని అట్టి
వారికి పరమార్ధం ఎలా లభిస్తుంది అని చెప్పేవారు. ఉత్తకడుపుతో దేవుని చూడలేము అని
చెప్పారు. అలా అని అమితంగా తినరాదు. మనకు ఎంత అవసరమో అంతే స్వీకరించాలి. ఒక సారి
గోఖలేగారి భార్య బాబా పాదముల వద్ద ఉండి మూడు రోజులు ఉపవాసదీక్ష చేయాలి అనుకొని
వస్తుంది. బాబా అంతకుముందు రోజు కేల్కరుతో హోలీ పండుగరోజు ఎవరినీ ఉపవాసం
చేయనివ్వనని చెప్పారు. ఆమె అక్కడకు వచ్చినప్పుడు బాబా ఇలా అంటారు " ఉపవాసము
చేయవలిసిన అవసరం ఏమి? కేల్కర్ ఇంటికి వెళ్లి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి
నీవును తినుము" అని అంటారు. ఆమె బాబా చెప్పిన విధంగా చేసి బాబా దగ్గరే ఉండి
ఆనందాన్ని పొందుతుంది.
తరువాత
బాబా చెప్పిన ఇంకో కథను హేమద్పంత్ గారు ఈ అధ్యాయంలో చెప్పారు. బాబా ఇలా చెప్పారు. " నా చిన్న తనంలో జీవనం కోసం బీడు గావ్ వెళ్ళాను. నేను బట్టలపై అల్లిక చేయు పని
దొరికినది. శ్రమ అనుకోకుండా కస్టపడి పనిచేసాను. యజమాని సంతోషించి మిగిలినవారి కంటే
నాకు ఎక్కువ మొత్తం ఇచ్చెను. నా తెలివితేటలు చూసి యజమాని నన్ను పేమించి మెచ్చుకొని
నాకు బట్టలిచ్చి గౌరవించెను. ఇక్కడ బాబా మన సాధన ఎలా ఉండాలో చెప్తున్నారు. అందరూ ఈ
ప్రాపంచిక విషయానందంలో మునిగి వారు చేయగలిగినంత సాధన చేయరు. ఇక్కడ యజమాని అంటే
గురువు. అందుకే బాబా ఇలా అంటున్నారు. మానవుడు ఇచ్చినది త్వరలో సమసిపోవును.
దైవమిచ్చునది శాశ్వతము. నా ప్రభువు "తీసుకో తీసుకో" అనును కాని,
ప్రతివాడు నా వద్దకు వచ్చి "తే తే " యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో
గ్రహించువాడొక్కడు లేడు. నా సర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనం) నిండుగా
నున్నది. అది అంచువరకు నిండి పొంగిపొరలుచున్నది. కాని దీని కోసం ఆరాటపడువారు
కరువైయ్యారు. ఇట్టిఅవకాశం తిరిగిరాదు. ఎవరైనా వారి వారి సాధనను బట్టి అంత ఫలితం
పొందెదరు. నా ఈ పలుకులను ఎవరైతే జ్ఞప్తియందుంచుకొనెదరో వారు అమూల్యమైన ఆనందం
పొందెదరు అని బాబా చెప్పారు.
ఓం శ్రీ
సాయినాథార్పణమస్తు!