In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, April 11, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం -30



సాయినాథా! మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భావసూత్రంతో కట్టుబడి సగుణ సాకార రూపంలో వచ్చారు. సాయి గురువులకే గురువు. సాయి పరమగురువు. తమ భక్తులను ఉద్ధరించడం సత్పురుషులకు తప్పనిసరి. తమ భక్తుల మనోభీష్టాలు సాయినాథునకు పూర్తిగా తెలుసు. వానిని తీర్చే సమర్థులు కూడా వారే. కష్టాలలో ఉన్న భక్తుల మనసును శాంత పరిచి వారి చింతలను దూరం చేసే దయాసాగరులే సాయినాథులు. ఆలా ఒక భక్తుని శాంతపరిచిన కథనమే ఈ అధ్యాయంలో మొట్టమొదటగా చెప్పారు. 

నాసిక్ జిల్లాలో వణి అనే గ్రామంలో సప్త శృంగి మాత దేవాలయం ఉంది. ఆ దేవాలయ పూజారి పేరు కాకాజీ వైద్య. ఆయన ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని అనేక కష్టాలతో సతమవుతూ బాధపడుతూ ఉండే వాడు. ఆయనకు మానసిక శాంతి కరువైంది. కాల చక్ర భ్రమణంలో మనసు సుడిగుండంలా గిర గిరా తిరుగుతూ ఉంది. కాకాజీ మొట్టమొదటి భార్య చనిపోతే మరల పెళ్లి చేసుకుంటాడు. మొదటి భార్య ద్వారా ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమెకు పెళ్లి అయినవెంటనే భర్త జబ్బు చేసి చనిపోతాడు. పిన తల్లి ఆమెను కష్ట పెడుతూ ఉంటుంది. కాకాజీ నిస్సహాయంగా ఉండి ఆమె యొక్క దీన పరిస్థితి చూసి దిగులుపడుతూ ఉంటాడు. తరువాత కూతురు కూడా దూరమవుతుంది. కాకాజీ దుఃఖితుడై తన బాధను తొలిగించుకోవడానికి మాత దగ్గరకు వెళ్లి కరుణించమని
వేడుకుంటాడు. అప్పుడు సప్త శృంగి మాత అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి " నీవు బాబావద్దకు వెళ్ళు, మనసు కుదుటపడుతుంది" అని చెప్తుంది. కాని ఆ బాబా ఎవరో అర్ధం కాక కాకాజీ సందిగ్ధంలో పడతాడు. మాత త్రయంబకేశ్వరంలో ఉన్న పరమశివుడు గురించి చెప్పి ఉండచ్చు అని అక్కడకు వెళ్లి పూజలు చేస్తాడు. అయినా ఆతని మనసు శాంతపడదు. మరల వణికి తిరిగి వచ్చి మాతను ప్రార్ధిస్తే మరల ఆమె స్వప్నంలో కనిపించి షిర్డీలో ఉన్న సాయిబాబా దగ్గరకు వెళ్ళు అని చెప్తుంది. సరే ఈ బాబా ఎవరో తెలియదు. ఈ షిర్డీ ఎక్కడో తెలియదు. కాని బాబాను ఎలాగైనా కలవాలి అన్న తపన బాగా ఎక్కువ అవుతుంది. 

సాయిని ఎలా కలవాలా అని కాకాజీ మదన పడుతూ ఉంటె, ఒక అనుకోని అతిధి షిర్డీ నుంచి రావడం జరుగుతుంది. మనలో సత్పురుషులను కలవాలి అనే తీవ్రమైన అభిలాష ఉంటె చాలు వారు మనలను అనుగ్రహిస్తారు. అలానే శ్యామాను వణి పంపించి బాబా కాకాజీని  అనుగ్రహించారు. చిన్నప్పుడు శ్యామాకు జబ్బు చేస్తే అతని తల్లి సప్త శృంగి మాతకు మొక్కుకుంటుంది. అప్పుడు శ్యామా జబ్బు నయం అవుతుంది. అలానే ఒక సారి ఆమెకు జబ్బు చేస్తే అమ్మవారికి వెండి స్థనముల తొడుగు చేపిస్తాను అని కూడా మొక్కుకుంటుంది. ఆమె చనిపోయేటప్పుడు శ్యామాకు ఈ రెండు మొక్కుల గురించి చెప్పి శ్యామాను తీర్చమని చనిపోతుంది. శ్యామా ఈ విషయాన్ని తరువాత మర్చిపోతాడు. ఒక సారి శ్యామా తమ్ముడు బాపాజీకి వారి కుటుంబంలో ఉన్న కస్టాలు ఈ మొక్కులు తీర్చక పోవడమే అని ఒక జ్యోతిష్యుడు ద్వారా తెలుసుకుంటాడు. బాపాజీ శ్యామాకు ఈ విషయం చెప్తే వెంటనే శ్యామా ఈ వెండి తొడుగులు చేపించి బాబా దగ్గరకు వచ్చి నీవే నా సప్త శృంగి. వీటిని స్వీకరించండి అని వేడుకుంటాడు. బాబా అప్పుడు శ్యామాను వణికి వెళ్లి మాత దర్శనం చేసుకొని ఆమెకు ఆ తొడుగులు సమర్పించమని పంపిస్తారు. ఇలా శ్యామా ఆ దేవాలయంకు వచ్చి పూజారిని వెతుక్కుంటూ కాకాజీ ఇంటికి వస్తాడు. ఇలా బాబా వాళ్ళిద్దరిని కలపడం జరుగుతుంది. వారు ఆ మొక్కులు తీర్చుకొని షిర్డీ ప్రయాణం కడతారు. 

కాకాజీ షిర్డీ చేరి బాబా పాదాలను తన అశ్రువులతో అభిషేకం చేస్తాడు. సాయి దర్శనంతో సంతుష్టుడైన కాకా మనస్సు ప్రసన్నమైనది. దేవి యొక్క  దృష్టాంతం ఎవరికోసం సంభవించిందో ఆ సాయి సమర్ధుని కళ్లారా చూసి కాకాజీ యదార్ధమైన సుఖాన్ని పొందాడు. అతని మనోభీష్టం నెరవేరింది. సాయి దర్శన సేవతో అతని చిత్తం ప్రసన్నమైనది. బాబా చూపించిన కృపతో అతనిలో ఉన్న చింతలన్ని దూరం అవుతాయి. ఇక్కడ ప్రవచనాలు లేవు. ప్రశ్నలు సమాధానాలు లేవు. ఆశీర్వచనాలు లేవు. కేవలం దర్శనంతోనే సుఖం కలిగింది. దీనినే దర్శన మహిమ అంటారు. కాకాజీ అద్భుతమైన ఆత్మానందాన్ని పొంది పన్నెండు రోజులు షిర్డీలో ఉండి తరువాత వణికి తిరిగి వెళ్తాడు. 

ఒక సారి బాబా దీక్షిత్కు గుర్రం బండి తీసుకొని రహతాకు వెళ్లి కుషాల్ భావుని వెంటనే తీసుకురమ్మని పంపుతారు. దీక్షిత్ రహతాకు వెళ్లి ఆయనను కలిసి బాబా వెంటనే రమ్మన్నారని చెపుతాడు. కుషాల్ భావుకి కూడా బాబా దర్శనం ఇచ్చి వెంటనే షిర్డీ రా అని చెప్పారు అని చెపితే దీక్షితుకు ఆశ్చర్యం కలుగుతుంది. కుషాల్ భావు దగ్గర గుర్రాలు లేక పొతే తన కొడుకుని బాబా దగ్గరకు పంపిస్తాడు. వారు ఊరు దాటకముందే దీక్షిత్ గారు అక్కడకు వస్తారు. ఇలా తన భక్తులను తన వద్దకు రప్పించుకున్నారు బాబా. అలానే ఒక పంజాబీ బ్రాహ్మణుడైన రాంలాల్ అనే అతనికి కలలో కనిపించి తన దగ్గరకు రమ్మంటారు. కాని రాంలాలుకు కలలో కన్పించిన వారెవరో తెలియక నిరుత్సాహ పడతాడు. ఒక రోజు ఒక దుకాణంలో ఉన్న పటం చూసి ఈయన ఎవరు అని ఆ దుకాణం అతనిని అడిగి బాబా అని తెలుసుకుంటాడు. ఎలాగైనా షిర్డీ వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. అలానే షిర్డీ చేరి బాబా మహాసమాధి అయ్యేంతవరకు అక్కడే ఉండి బాబాను సేవించుకుంటాడు. 

భక్తులను తన వద్దకు రప్పించుకొని వారి ప్రాపంచిక మరియు పారమార్ధిక కోరికలను తీర్చడమే బాబా సంకల్పం. బాబా నిష్కాములు, నిరహంకారులు, నిస్వార్థులు. ఏ మమకారాలు లేనివారు. భక్తులకోరికలు తీర్చేందుకే వారి అవతారము. ఎవరి వద్దకు క్రోధం దరిచేరదో, ఎవరి వద్ద స్వార్ధ దృష్టి లేదో, ఎవరివద్ద ద్వేషానికి తావు లేదో అతడే నిజమైన సాధువు. అందరి యందు సాయికి నిస్వార్ధ ప్రేమ. అదే పరమ పురుషార్థం. ధర్మమైన విషయాలయందు తప్ప ఇతర విషయాలను చెప్పడంలో ఒక్క క్షణమైనా వ్యర్థం చేయరు. సాయి కథలను మనస్ఫూర్తిగా విన్నా, పారాయణం చేసినా తప్పక మనశ్శాంతి కలుగుతుంది. 

ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!








  

No comments:

Post a Comment