అంతిమ సమయంలో
ఉన్న మనోస్థితిని బట్టి వచ్చే జన్మ ఆధారపడి ఉంటుంది అని మన శాస్త్రాలు చెప్తాయి.
కీటకం భయంతో భ్రమరం అవుతుంది. జడభరతుడు ఒక జింకపై ప్రీతితో దాన్నే మరణ కాలమునందు
తలుచుకుంటూ జింక లాగా జన్మ తీసుకుంటాడు. అంతిమ సమయంలో ధ్యానించిన రూపమే
పునర్జన్మలో కలుగుతుంది. మనం అంతిమ సమయంలో కనుక భగవంతుడిని తలుచుకోగలిగితే తన్నే
చేరుకుంటారు అని గీతలో భగవానుడు చెప్పారు. కాని మనం జీవితం అంతా వేటికోసం
తపిస్తామో అవే మనకు చివరలో కూడా గుర్తుకి వస్తాయి. అందుకే మనం వయసు వచ్చిన తరువాత
ఆధ్యాత్మిక మార్గంలో వెళదామని అనుకుంటే ఆ భావన ఒక్క సారిగా రాదు. జీవితం అంతా సాధన
చేయాలి. సత్సంగం చేస్తూ మహానుభావుల సాంగత్యంలో గడపాలి. ఈ అధ్యాయంలో బాబా తన
భక్తులను అంతిమ కాలంలో తన వద్దకు రప్పించుకొని వారికి సద్గతిని ఏ విధంగా కలిగించారో చెప్పడం జరిగింది.
విజయానంద
ఒక సారి
విజయానంద్ అనే సన్యాసి మద్రాసు నుండి మానస సరోవర యాత్రకు వెళ్ళాలి అనే ఆలోచనతో
బయలుదేరుతాడు. అతనికి ఒక జపాను ప్రయాణికుని దగ్గర ఉన్న మానస సరోవర చిత్రపటం చూసిన
వెంటనే అక్కడకు వెళ్ళాలి అని అనిపిస్తుంది. మార్గమధ్యంలో షిర్డీలో ఉన్న సాయి
కీర్తి ప్రతిష్టలు విని, అలాంటి మహాత్ముని కలిసి వెళ్ళచ్చు అని అక్కడ ఆగుతాడు.
అక్కడే ఉన్న హరిద్వారపు సోమదేవ స్వామిని కలిసి మాట్లాడుకుంటూ మానస సరోవర యాత్ర ఎంత
కఠినమో తెలుసుకొని నిరుత్సాహ పడతాడు. అతని మనసు వికలమైనది. అప్పుడు ఆ సన్యాసి బాబా
దర్శనానికై ద్వారకామాయికి వస్తే బాబా వెంటనే "ఈ సన్యాసిని వెళ్ళగొట్టండి.
ఇతని సాంగత్యం పనికిరాదు" అని అరుస్తారు. అతను భయపడిపోయి దూరంగా కూర్చుని
మిగిలిన భక్తులను చూస్తూ ఉంటాడు. అందరూ బాబాకు సేవలు చేస్తూ పరవశిస్తూ ఉంటారు. అది
చూసి ఈ సన్యాసికి కూడా భక్తి ఉప్పొంగుతుంది. షిర్డీలో రెండురోజులు ఉన్న తరువాత తన
తల్లి చాలా జబ్బుతో ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు దుఃఖంతో బాబా దగ్గరకు వచ్చి శెలవు తీసుకొని వెళదామని వస్తాడు. అప్పుడు బాబా ఇలా అంటారు "తల్లికి గారాల పట్టివైతే ఈ
సన్యాసి వేషాన్ని ఎందుకు స్వీకరించావు? ఈ వేషానికి మమకారం శోభించదు. కాషాయానికి
కళంకాన్ని తెచ్చావు. నీవేం చింతించకు. కొన్ని రోజులు గడవని అప్పుడు ఆలోచిద్దాము. ఇక్కడే ఉండు. వాడాలో దొంగలున్నారు. నీ
మీద దాడిచేసి ఉన్నదంతా అపహరించుకుపోతారు. ఈ శరీరం ఎప్పుడూ అశాశ్వతం. మృత్యువు
ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నదని తెలుసుకొని ధర్మాచరణలో ఉండాలి. ఈ ప్రాపంచిక
విషయాసక్తి వదిలి ఏ కోరికలూ లేకుండా భాగవతాన్ని పారాయణ
చేయి. భగవంతుడు ప్రసన్నుడై సకల దుఃఖాలను అంతం చేస్తాడు. నీ మాయా మొహాలు తొలిగి
అత్యంత సుఖం లభిస్తుంది. మొహంనుండి విముక్తుడవు అవుతావు" అని చెపుతారు.
అప్పుడు ఆ సన్యాసి ప్రశాంతమైన లెండి వనం దగ్గర రెండు సప్తాహాలు పూర్తి చేసి మూడో
సప్తాహం చేస్తుంటే తీవ్రమైన అనారోగ్యం కలుగుతుంది. బాగా నీరసించి వాడాకు
తిరిగివచ్చి రెండు రోజులు కష్టంగా గడిపి మూడో రోజున ఫకీరు బాబా ఒడిలో కన్ను మూస్తాడు.
బాబాకు ఆ
సన్యాసి మరణం గురించి ముందే తెలిసి అతనిని తన తల్లి వద్దకు పోనివ్వలేదు.
షిర్డీలోనే బాబా సన్నిధిలోనే ఉండి, భాగవతం పారాయణ చేస్తూ, చివరి రోజులలో
భగవన్నామ స్మరణతో శరీరం వదలటం అనే భాగ్యం అందరికి కలుగదు. ఈ సన్యాసి పూర్వజన్మ సాధన
ఫలించి బాబా సమక్షంలో సద్గతి పొందారు.
బాలారాం
మాన్కర్
బాలారాం
బాబాకు మంచి భక్తుడు. అతని భార్య చనిపోతే తనకు ప్రపంచంపట్ల సంపూర్ణ విరక్తి కలిగి
కుటుంబ బాధ్యతలను కొడుకుకి అప్పచెప్పి షిర్డీకి వస్తాడు. ఇది ఒక రకమైన సన్యాసమే.
బాబా ఆయన భక్తికి మెచ్చి ఆయనను కరుణించడం జరిగింది. షిర్డీలో బాబా సన్నిధిలో
గడుపుదామని ఆశతో వస్తే అతనిని బాబా మచ్చింద్ర గడ్ అనే ప్రదేశానికి వెళ్లి ధ్యానం
చేయమంటారు. బాలారాంకు కొంచెం నిరుత్సాహం కలిగి మరల తేరుకుని బాబా ఆదేశాన్ని
పాటిస్తాడు. బాబాతో లేని జీవనం వ్యర్థం అనుకుంటాడు. అక్కడకు వెళ్తే బాబా దర్శనం
ఉండదు అని బాధపడతాడు. అక్కడకు వెళ్లి బాబా చెప్పినట్లు బాబా ధ్యానం చేస్తూ ఆ
రమ్యమైన ప్రదేశంలో శాంతిని పొందుతాడు. మాన్కర్ ఒక రోజు ధ్యానంలో ఉండగా కొండ మీద
బాబా ప్రత్యక్షంగా దర్శనం ఇస్తారు. అప్పుడు మాన్కర్ ఆనందానికి అవధులు లేవు. కేవలం దర్శనమే కాకుండా తనను అక్కడకు ఎందుకు పంపించారు అని అడిగిన ప్రశ్నకు బాబా ఇలా సమాధానం చెప్పారు " షిర్డీలో ఉండగా
నానారకాల తరంగాలు నీ మనసులో లేచేవి కదా. అందుకని నీ చంచలమైన మనసు కుదుటపడాలని
పర్వత ప్రయాణాన్ని ఏర్పాటు చేసాను. నా ఈ పంచభూతాత్మకమైన శరీరం షిర్డీలోనే కాదు
ఎక్కడైనా దర్శించవచ్చు. నేనంతట ఉన్నాను అని చెప్తారు. తరువాత కొన్ని రోజులకు మరల
తన నివాస స్ధలమైన బాంద్రా చేరాలి అని పూణే స్టేషనుకు వెళ్తాడు. అక్కడ చాలామంది
ప్రయాణికులు ఉండడం వల్ల టిక్కెట్ కొనడం కష్టం అయితే, ఒక రైతు వేషంలో బాబా వచ్చి
అతనికి టిక్కెట్ ఇస్తారు. డబ్బులు ఇద్దామని చూసే లోపల ఆ రైతు మాయం అవుతాడు. ఇలా
బాబా యొక్క లీలలను ప్రత్యక్షంగా అనుభవించి సాయి పాదాలయందు దృఢమైన ప్రేమను
పెంచుకున్నాడు. తరువాత చాలా సార్లు షిర్డీకి వెళ్లి చివరకు షిర్డీలోనే ప్రాణాలు
వదిలాడు.
పూర్వజన్మలలో
పుణ్యమున్న వారు సాయి దృష్టిలో పడి సాయి చరణాలలో లీనమై
మరణాన్ని నిర్భయంగా పొందుతారు. తాత్యాసాహెబ్
నూల్కర్ మరియు మేఘ శ్యాముడు కూడా ఇలానే షిర్డీలోనే తమ ప్రాణాలను వదలటం జరిగింది.
భక్తులంతా రాగా గ్రామస్థులు మేఘాను స్మశానికి ఊరేగింపుగా తీసుకువెళ్ళినప్పుడు బాబా కూడా వెళ్లి మేఘా శరీరంపై పుష్పాలను
కురిపించారు. అలానే ఒక పులికి కూడా బాబా సద్గతి కలిగించడం జరిగింది.
పులికి సద్గతి
బాబా
మహాసమాధికి 7 రోజుల ముందు ఒక ఎద్దుల బండి వచ్చి మసీదు ద్వారం వద్ద నిలబడింది.
దానిలో ఒక భయంకరమైన పులి గొలుసులతో కట్టబడి ఎదో జబ్బుతో బాధపడుతున్నట్లుగా ఉంది. ఆ
పులిని ఆడించేవారు ఊరూరూ తిరిగి దానిమీద జీవనం సాగిస్తున్నారు. కాని దానికి జబ్బు
చేస్తే ఎన్నో చికిత్సలు చేయించి చివరకు బాబా దగ్గరకు తీసుకువస్తారు. అప్పుడు వారు
ఆ పులిని కిందకు దించి సాయి ఎదురుగా ఉంచుతారు. మెట్లవద్దకు రాగానే బాబా యొక్క
తేజస్సును చూసి ఆ పులి తన తలను కిందకు వంచుతుంది. పులి బాబాను ప్రేమతో చూస్తుంది.
అంతే వెంటనే తోకను పైకి ఎత్తి ముమ్మారు భూమికి కొట్టి సాయి చరణాలయందు శరీరాన్ని
వదిలింది. భయంకరంగా ఒక్క సారి అరిచి ప్రాణాలను వదిలి సద్గతిని పొందింది.
సాధుసత్పురుషుల సమక్షంలో ప్రాణం పోవటం గొప్ప పుణ్యం. పులికి ముక్తి కలిగినందుకు
అందరు సంతోషించారు. వారు సాయిని ఆ పులిని ఎక్కడ పాతిపెట్టాలి అని అడిగితే బాబా ఇలా
అంటారు " మీరేం చింతించకండి. దాని మరణం ఇక్కడే ఉంది. గొప్ప పుణ్యం చేసుకోవడం
వల్ల ఇక్కడ అత్యంత శాంతిని పొందింది. తకియా వెనుకనున్న శివాలయం వద్దకు
తీసుకువెళ్లి నంది సమీపంలో పూడ్చిపెట్టండి. అలా చేస్తే మీ నుండి బంధ విముక్తి,
రుణవిముక్తి కలిగి దానికి సద్గతి కలుగుతుంది. గతజన్మలో బాకీపడ్డ రుణాన్ని
తీర్చుకోవడానికి ఈ రూపంలో జన్మించి, ఇంతవరకు మీ బంధనంలో ఉంది అని సాయి మహారాజ్
చెప్పారు. అప్పుడు వారు బాబా చెప్పినట్లు శివాలయం దగ్గర నందికి వెనుక గోతిలో
పూడ్చిపెట్టారు. ఈ సంఘటన బాబా మహాసమాధికి సరిగ్గా ఏడు రోజులముందు జరగడంతో ఈ పులికి
సద్గతిని ప్రసాధించడం చాలా మధురమైన ఘట్టంగా మిగిలిపోయింది.
ఇలా బాబా
తన భక్తులను షిర్డీకి రప్పించుకొని మరి సద్గతిని కలుగచేయడం వారు చేసుకున్న
పూర్వజన్మ పుణ్యం, మరియు వారి సాధన మాత్రమే.
ఓం
శ్రీసాయినాథార్పణమస్తు !
No comments:
Post a Comment