In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, July 18, 2018

శ్రీ సాయి సత్చరిత అధ్యాయం - 45



మన చిత్త వృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే, భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? భక్తితో మనసు, సర్వేంద్రియాలు సాయిపైన నిలపటమే నిజమైన  ఆరాధన. లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా, మాట్లాడాలని తలచినా నోరుపెగలదు. క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయిభక్తుడా? ప్రపంచమందు విరక్తి కలుగని వానికి భగవంతునిపై ఆసక్తి ఎలా కలుగుతుంది. తల్లిదండ్రులు మమతను పంచుతారు. పుత్రుడికి తన ఆస్తి పైన దృష్టి ఉంటుంది. భార్య తన పసుపు కుంకుమల కోసం తపిస్తుంది. పరమార్ధంలో సహాయం చేసేవారు ఎవ్వరూలేరు. పరమార్ధం సంపాదించుకోవడంలో సహాయపడే వారు ఎవరు అని ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాము. ఎవరి యందు ఏ ఆశా లేకుండా ఆత్మ యందు దృఢమైన విశ్వాసముంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునేవారికి పరమార్ధం సిద్దిస్తుంది. గురువు యొక్క నామాన్ని జపించడం ద్వారా పరమానందం జనిస్తుంది. సర్వ ప్రాణులలో భగవంతుని దర్శనం కలుగుతుంది.

ఒకసారి దీక్షిత్ బాగవత పారాయణ చేస్తూ, నవనాధుల భక్తి తత్వం గురించి చెప్పుకొని అక్కడ ఉన్న వారితో ఈ విధంగా అంటారు. ఈ నవనాధుల చర్యలు, వారి మనోవృత్తి అంతుపట్టనివి. అక్కడ ఉన్న శ్యామాతో, "ఈ భక్తి ఎంత కఠినమైనది. మనవంటి మూడులకు అంతటి శక్తి ఎక్కడ ఉన్నది? జన్మజన్మలకు ఇది సాధ్యం కాదు. గొప్ప దిట్టమైన ఆ నవనాధులు ఎక్కడ, మొదటి నుండి పాపులమైన మనమెక్కడ" అని వాపోతాడు. ఈ నవనాథుల గురించి భాగవతం 11వ స్కంధంలో చెప్పారు. స్వాయంభువ మనువునకు కుమారుడు ప్రియవ్రతుడు. ఆయనకు అగ్నీధ్రుడు, అతనికి నాభి, వానికి ఋషభుడు అనువారు పుత్రులై జన్మించారు. ఋషభునకు వందమంది పుత్రులు ఉన్నారు. వారిలో భరతుడు శ్రేష్ఠుడు. అతని ద్వారా భారతదేశమనే పేరు వచ్చినది. భరతుని సోదరులలో తొమ్మిది మంది పుణ్యశీలులు,
ఆత్మవిద్యా తత్పరులై సన్యాసులైనారు. వీరు దిగంబరులై విశ్వమంతటిని తమ స్వరూపంగానే భావింతురు. వీరు నిమి మహారాజుకు కలుగచేసిన సత్సంగమే ఈ నవనాథుల ఘట్టం. వీరిలో మొదటివాడైన కవి యనే ఋషి అర్పణ భావాన్ని గురించి చెప్పారు. భగవంతుడి పట్ల మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని బోధించారు. హవి అనే ఋషి భక్తుని లక్షణాల గూర్చి, అంతరీక్షుడు మాయా స్వరూపం గురించి, ప్రబుద్ధుడు ఆ మాయను దాటటం గురించి, పిప్పలాయనుడు నారాయణ పరబ్రహ్మ  స్వరూపం గురించి, అవిర్హోత్రుడు కర్మ గురించి, ద్రుమిళుడు భగవంతుని అవతార లీలల గురించి, చమనుడు భక్తిహీనుల అధోగతి గురించి, కరభాజనుడు వేరు వేరు యుగములలో భగవంతుని ఉపాసించు విధముల గూర్చి చెప్పారు. వీరు సంపూర్ణ ఉపనిషద్ జ్ఞానాన్ని, కర్మ మరియు అపార భక్తి తత్వాన్ని బోధించడం జరిగింది. అందుకే దీక్షిత్ గారు అంత వ్యాకులత పొందారు. ఆయన ఈ అధ్యాయాలను అనేక సార్లు పారాయణ చేశారు. వాటిలో ఉన్న పరమార్ధం ఎంత ఉన్నతమైనదో ఆయనకు తెలుసు. 

మరి  శ్యామాకు కాకా యొక్క దైన్యం నచ్చలేదు. సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండీ ఇంత దైన్యం ఎందుకు? సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు? మీకు ఏకనాధ భాగవతంలోని ఏకాదశ స్కందము మరియు భావార్ధ రామాయణం చదవమని బాబా ఆజ్ఞ కాదా! దానిని బట్టి హరి నామస్మరణ, గురుస్మరణే సాధన అనే బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా? దీనితో మనం భవాన్ని తరించగలం. మీకు ఎందుకు చింత అని చక్కగా చెప్పారు. భక్తి, జ్ఞాన మార్గంలో సత్సంగము చాలా అవసరం. ఒకరినొకరు ధైర్యం చెప్పుకుని ముందుకు సాగాలి. అట్లానే దీక్షిత్ కూడా వేరు వేరు సమయాల్లో వేరేవాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఆయనకు సాయి పట్ల ఎంతో నమ్మకం ఉన్నా ఇంకా బాబాపై ప్రేమ పెరగాలి అన్న తపనే కాని ఆయనకు బాబా పైన నమ్మకం లేక కాదు.

ఆనందరావు పాఖాడే అనే అతను శ్యామాను కలవాలి అని పురాణకాలక్షేపం జరిగే స్థలానికి వస్తారు. కాకాసాహెబ్ భాగవతం చదువుతూ ఉంటారు. పాఖాడే శ్యామా చెవిలో తనకు బాబా చూపించిన స్వప్నం గురించి చెప్తూ ఉంటారు. కాకాసాహెబ్ భాగవతం చదవడం ఆపి విషయమేమిటి అని అడుగుతాడు. అప్పుడు శ్యామా "నిన్న నీ సంశయానికి సమాధానంగా బాబా పాఖాడేకు స్వప్నంలో ఏమి చెప్పారో వినుము" అని అంటాడు. బాబా స్వప్నంలో పాఖాడేకు ఇలా చెప్పారు " రక్షకమైన భక్తి గాక వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును" అని బాబా చెప్పారు. ఇక ఆ స్వప్నదృశ్యం గురించి పాఖాడే ఇలా చెప్పారు. లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అక్కడ బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్న బాబాను చూసాను. అప్పుడు శ్యామా "ఆనందరావు! బాబా పాదాలపై బడుము" అని సలహా ఇచ్చెను. కాని బాబా పాదాలు నీటికింద ఉండడం వల్ల నమస్కరించడం కష్టం అవుతుంది. శ్యామా బాబాను "ఓ దేవా! మీ పాదాలను బయటకు తీస్తే అతను నమస్కరించుకుంటాడు. ఆలా ఆయన నమస్కారం చేయగా బాబా ఇలా ఆశీర్వదించారు " ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయము కాని ఆందోళన గాని అవసరం లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చేయుము. దాని వల్ల మేలు పొందెదవు". ఆలా పాఖాడే పట్టుపంచె తీసుకొని శ్యామాకు ఇవ్వడానికి వస్తే శ్యామా వద్దు అంటాడు. అప్పుడు కాకా చీట్లు వేసి శ్యామా పంచె తీసుకోవాలి అని వస్తే శ్యామా తీసుకుంటాడు. ఇలా కాకా సంశయం కూడా తీరింది. మనం బాబాపై అపార నమ్మకాన్ని ఉంచితే ఆయనే మనలను ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు చేరుస్తారు.
 

ఇక చివరగా ఈ అధ్యాయంలో బాబా పడుకున్న జానెడు బల్ల గురించి చెప్పారు. మొట్టమొదట అధ్యాయాల్లో బాబా ఈ బల్లపై పడుకున్న లీలను మనం చెప్పుకున్నాము. ఒక నాడు బాబా ఈ బల్ల గురించి చెపుతూ ఉంటె, కాకాసాహెబు మరొక బల్లను మీకు తెప్పిస్తాము అని అంటే, బాబా ఇలా అంటారు " మహాల్సాపతిని దిగువవిడిచి నేను పైన ఎలా పడుకుంటాను" అని అంటారు. మహాల్సాకు కూడా ఒక బల్ల తెప్పిద్దాము అంటే బాబా ఇలా అంటారు. మహల్సాపతి అక్కడ పడుకోలేడు, అంత ఎత్తున పడుకోవడం అంత సులభమైన పని కాదు. ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారే అక్కడ పడుకోగలరు. నేను నిద్రపోవునప్పుడు నా గుండెలపై చేయి ఉంచి అక్కడినుంచి వచ్చు భగవన్నామ స్మరణ వినమంటే కునుకులు తీస్తూ ఉంటాడు. నా హృదయంపై వాని చేతి బరువుని గమనించి "భగత్" అని పిలిస్తే వెంటనే కళ్ళు తెరిచేవాడు. ఇలా మహాల్సాపతిని ఆట పట్టిస్తూ, బాబా మనకు ఆధ్యాత్మిక రహస్యాన్ని బోధించారు. కళ్ళు తెరిచి నిద్రించడం అంటే ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా ఆత్మ తత్వంలో ఉండడమే. ఈ అధ్యాయం ముగిస్తూ హేమద్పంత్ గారు బాబా మిక్కిలి ప్రేమతో చెప్పిన ఒక సత్యాన్ని చెప్పారు. "మంచి గాని చెడ్డ గాని, ఏది మనదో యది మన దగ్గర ఉన్నది. ఏది ఇతరులదో యది ఇతరుల దగ్గర ఉన్నది". బాబా ఇక్కడ మొత్తం కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా ఒక వాక్యంలో చెప్పారు. మనం చేసుకున్న కర్మలు యొక్క ఫలితం మనమే అనుభవించాలి. దానికి ఇంకొకరు కారణం అని మనం ఎప్పుడు భావిస్తామో అప్పుడు మనలో మనస్తాపం కలుగుతుంది. ఎవరి కర్మలు వారివే. ఇలా ఈ అధ్యాయం మనకు కర్మను, భక్తిని మరియు జ్ఞాన మార్గాలను నేర్పిస్తుంది. 


ఓం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు !

No comments:

Post a Comment