ఈ
అధ్యాయంలో హేమద్పంత్ గారు ఎలా బాబా శ్యామా కన్నా ముందు గయకు వెళ్తానని చెప్పారో
అలానే బాబా రెండు మేకలను కొనడం వాటి పూర్వజన్మ గురించి చెప్పడం లాంటి విషయాలను
పొందుపర్చారు. సాయి దర్శనం కర్మ బంధనాలనుండి విముక్తిని
ప్రసాదిస్తుంది. భక్తిభావమున్న వారికి సమాధిలో జాగృతంగా ఉన్న సాయి జ్యోతి స్వరూపం
వెంటనే అనుభవమవుతుంది. బాబా తన భక్తులను ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా సూక్ష్మమైన దారంతో
పట్టి లాక్కుని వస్తారు. తన భక్తులను ఒక తల్లిలాగా ప్రేమతో లాలిస్తారు. ఎంత
పండితులైనా అహంభావంవలన ప్రపంచమనే సుడిగుండంలో ఇరుక్కుపోతారు. లోపలనుండి అనేక లీలలు
చేస్తూ పైకి ఏమి అంటనట్లు కనిపిస్తారు. అంతా చేస్తూ నేను కర్తను కాను అంటారు.
అందువలన శరీరాన్ని, వాక్కును, మనసును బాబా పాదాలకు అర్పించి నోటితో బాబా స్మరణ
చేస్తే పాప ప్రక్షాళన అవుతుంది. కోరికలు గల వారి కోరికలు తీర్చి, ఏ కోరికలు
లేనివారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి సాయి నామం రజో తమో గుణాలను
తొలిగించి సత్వ గుణం అభివృద్ధి చెందేలా చేసి మనలను ముందుకు నడిపిస్తుంది. అప్పుడు
ధర్మవృత్తి జాగృతం కాగానే దాని వెంట వైరాగ్యం పరిగెత్తుకుని వస్తుంది. నిత్యా
అనిత్య జ్ఞానం కలిగి ఆత్మ స్వరూపం వ్యక్తం అవుతుంది. ఇదే సంపూర్ణ గురు అర్పణ. మనసు
సాయి పాదాలకు అంకితం అయింది అనటానికి ఒకటే గుర్తు. సాధకుని మనసు శాంతినే
కాంక్షిస్తుంది. వారి భక్తి పూర్తిగా వికసిస్తుంది. ఇటువంటి భక్తి ఉన్నవారి చెంత
బ్రహ్మీ స్థితి దాసి లాగా ఉంటుంది అని హేమద్పంత్ గారు ఈ అధ్యాయం మొదట్లో చెప్పారు.
బాబాకు
ఆహ్వానం - శ్యామా యాత్ర
బాబు,
కాకాసాహెబ్ పెద్ద కుమారుడు. నాగపూర్లో ఆయనకు ఉపనయనం చేయాలని నిర్ణయిస్తారు. అలానే
నానా చాందోర్కర్ పెద్ద కుమారుడి పెళ్లి కూడా నిశ్చయం అవుతుంది. ఆ పెళ్లి గ్వాలియర్
నగరంలో అని నానా బాబాను పెళ్ళికి ఆహ్వానిస్తాడు. అలానే కాకా కూడా బాబాను రమ్మని
కోరతాడు. సరే తన బదులు శ్యామాను పంపిస్తాను అని బాబా అంటారు. కాకా బాబా కూడా రావాలి అని పట్టు బడితే బాబా ఇలా అంటారు. "కాశీ
ప్రయాగ యాత్రలు పూర్తి చేసి శ్యామాకంటే ముందుగా వస్తాను" అని చెప్తారు. ఇక
శ్యామా ప్రయాణానికి కావాల్సిన వాటిని సిద్ధం చేసుకుంటాడు. శ్యామా నందరామ్ దగ్గర వంద రూపాయలు అప్పుగా తీసుకొని బాబా దగ్గరకు
వెళ్లి ఇలా అంటాడు.
"దేవా! పెళ్ళికి ఉపనయనానికి వెళ్లి అక్కడనుంచి కాశి
ప్రయాగ కూడా వెళదామని అనుకుంటున్నాను మీ అనుమతి ఇవ్వండి" అని వేడుకుంటాడు.
అప్పుడు బాబా " ఇందులో అడగవలిసినది ఏముంది? అలాగే వెళ్లి రా. అప్రయత్నంగా
మనకు ప్రాప్తిస్తున్న వాటిని అనుభవించడంలో తప్పేమి లేదు. తప్పక వెళ్లి, పుణ్య
క్షేత్ర దర్శనం చేసుకో అని తన అనుమతి ఇచ్చారు. శ్యామా కాశి యాత్ర గురించి విని
అప్పా కోతే కూడా వస్తానంటాడు.
శ్యామా,
కోతే మొట్టమొదట కాకా సాహెబ్ పెద్దకొడుకు బాబు ఉపనయనం చూసుకొని గ్వాలియర్
బయలుదేరతారు. కాకా వారికి రెండు వందలు ఇచ్చి పంపుతాడు. తరువాత పెళ్లికి వెళ్తారు.
నానా వీరి యాత్రకు అని వంద రూపాయలు ఇస్తాడు. అలానే పెళ్లికూతురు తండ్రి అయిన జథారు
గారు కూడా నూరు రూపాయలు ఇస్తారు. వారిద్దరూ తరువాత అయోధ్యకు బయలుదేరతారు. అక్కడ
కొన్ని రోజులు ఉండి కాశికి వెళ్తారు. కాశీలో రెండు
నెలలు ఉంటారు. వారు అక్కడినుండి గయకు బయలుదేరితే అక్కడ ప్లేగు వ్యాధి ఉందని చెపితే
కొంచెం ఆందోళన పడతారు. తరువాత పిండ ప్రధానం చేయించే బ్రాహ్మణుడు వచ్చి అక్కడ అంతా
బాగానే ఉంది అని దైర్యం చెప్పి వారిని గయలో ఉన్న తన ఇంటికి తీసుకు
వెళ్తాడు. ఆ ఇల్లు చాలా
పెద్దగా ఉంటుంది కాని శ్యామా అక్కడ ఉన్న బాబా పటాన్ని చూసి ఆశ్యర్యం పొందుతాడు.
బాబా చెప్పినట్లు తనకన్నా ముందే గయకు వచ్చారు అని అనుకుంటాడు. శ్యామా కళ్ళలో
ఆనందాశ్రువులు చూసి ఆ యజమాని విషయం ఏమిటి అని అడిగితే, శ్యామా ఆ పటం గురించి
అడుగుతాడు. పన్నెండేళ్ల క్రితం తను సాయి సమర్థుల గురించి విని షిర్డీ వెళ్ళాను.
అక్కడ బాబా దర్శనము చేసుకొని మాధవరావు గారి ఆతిధ్యం స్వీకరించి ఆయన దగ్గర ఉన్న ఈ పటాన్ని
తెచ్చుకున్నాను అని చెప్తాడు. ఇదంతా విన్న తరువాత శ్యామాకు ఈ విషయం గుర్తుకు వచ్చి
తానే ఆ మాధవరావు అని చెప్తాడు. అప్పుడు వారు బాబా లీల ఎంత అపురూపమైనది అని
భక్తిపారవశ్యంతో ఆనందం చెందుతారు. వారిని ఆ బ్రాహ్మణుడు మంచి రాచ మర్యాదలతో
సత్కరించి అక్కడ జరగవలిసిన పిండప్రదానాలు చేయించి పంపుతాడు. ఇలా బాబా తన భక్తులను
వెన్నంటి రక్షిస్తూ ప్రేమతో అనుగ్రహిస్తారు.
మేకల
పూర్వజన్మ కథ
ఒక సారి
బాబా లెండి నుంచి వస్తూ అక్కడ ఉన్న మేకల గుంపులో ఉన్న రెండు మేకలను 32 రూపాయలు
ఇచ్చి కొంటారు. ఇదేమిటి బాబా ఇంత డబ్బులు పెట్టి కొన్నారు అని శ్యామా, తాత్యాలు
అడుగుతారు. ఆ రెండు మేకలను చూసి వాటిపై ప్రేమతో, చక్కగా నిమిరి వాటికి ఆహరం
తెప్పించి పెడతారు. ఒకప్పుడు మానవ శరీరాలు ధరించి పతనమై జంతు జన్మలు తీసుకున్నా
వాటిని ఆదరించి బాబా అక్కున చేర్చుకున్నారు. శ్యామా, తాత్యాలు అడిగిన దానికి సమాధానంగా
బాబా ఇలా అనుకుంటారు. వీరికి డబ్బు తప్ప మరొకటి కనిపించదు కదా! వారి అజ్ఞానికి
మెల్లగా నవ్వుకొని వీటి పూర్వజన్మ వృత్తాంతం చెప్పారు. ఈ రెండు మేకలు పూర్వ జన్మలో
అన్నదమ్ములు, వారు
నాతోనే ఉండే వారు అని, చిన్న వాడు
కష్టపడి పనిచేస్తుంటే పెద్దవాడు సోమరిలాగా ఉండే వాడని చెప్తారు. మొట్టమొదట ఇద్దరు
బాగానే ఉండే వారు. కాని ధనాశ పెద్దవాడిని మార్చివేసింది. చిన్న వాడి ధనాన్ని కాజేయాలని పెద్దవాడు ఈర్ష్యపడుతూ ఉంటాడు. ఒక రోజు
చిన్నవాడిని చంపాలని ఒక కర్రతో వాడి తలపై కొడతాడు. అప్పుడు చిన్నవాడు గొడ్డలితో
అన్నను కొడతాడు. ఇద్దరు చనిపోయి ఈ జన్మలో మేకలుగా పుట్టారు. వారిని చూసి జాలి పడి
వారిని దగ్గరకు తీసుకున్నాను. బాబా శ్యామాతో ఇలా అంటారు. " ఔను, అంత ధర
ఇచ్చాను. ఇప్పుడేమంటారు? ఇంతకీ డబ్బు పెట్టుకొని నేనేం చేసుకోవాలి? నాకు ఇల్లు
వాకిలి సంసారం ఏమీలేవు. ఇక డబ్బును నేను ఎందుకు దాచిపెట్టుకోవాలి? సరే అయిందేదో
అయిపొయింది. ఈ డబ్బు తీసుకొని దుకాణంకు వెళ్లి వీటికి మంచి ఆహరం
తెండి అంటారు. అలా వాటికి ఆహారం పెట్టి మరల వాటిని ఆ యజమానికే ఇచ్చేస్తారు బాబా.
ప్రారబ్దం
రీత్యా వచ్చే కష్టాలు ఎంత కఠినంగా ఉన్నా అనుభవించవలిసిందే. ఈ జన్మలో చేసుకున్న
పాపాలను తప్పించలేము. వంచన-కపటం-క్రోధం- ఈర్ష్య లాంటి గుణాలు మనుషులను దిగజార్చి
జంతు జన్మలలోకి పతనం అయ్యేలా చేస్తాయి. అందుకే గురువు
చెప్పిన మార్గంలో నడుస్తూ ఈ చెడు గుణాలను దరిచేరనివ్వకూడదు. గురువును పూర్తిగా
నమ్మితే, అన్ని ఆయనకు సమర్పిస్తే ఇంక దారి తప్పడం అనేది ఉండదు.
ఓం
శ్రీసాయినాథార్పణమస్తు !
No comments:
Post a Comment