In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, September 26, 2018

సద్గురు సాయి మానస పూజ




ఆత్మ స్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలలతో బహుచక్కగా కనిపిస్తుంది. అద్దంలో కనిపించేవన్ని వాస్తవానికి అద్దంలో ఉండవు. నిద్రలో కనిపించినవి మెలుకువ రాగానే నశించిపోతాయి. జాగ్రదావస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. విశ్వం యొక్క స్పురణ, సత్తా మరియు ఆధిష్టానమైన, గుర్వాత్మ అగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ స్వరూపము సత్య స్వరూపము మరియు స్వప్రకాశకమైనది. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయమైన ఈ దృశ్యజగత్తు తత్వ జ్ఞానంతో  లయమై పోతుంది.

అందుకే మనము బాబాను ఇలా ప్రార్ధించాలి. 

బాబా నా బుద్ది ఆత్మ పరాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయుము తండ్రి.

నేను అవివేకిని మూఢుణ్ణి. నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడూ దారి తప్పుతుంది. నాకు నీయందు దృడ విశ్వాసం ఉండేలా దీవించు.

నా అంతఃకరణం అద్దంలా  నిర్మలమై, అందు ఆత్మ జ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి.

సద్గురుసాయీ! శరీరమే, నేను అని తలచే మా అహంభావాన్ని మీ చరణాల యందు అర్పిస్తాము. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి.

మా శరీర అభిమానాన్ని తీసుకోండి. మాకు సుఖ-దుఃఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇష్ఠానుసారం  మీ సూత్రాన్ని నడిపించి మా మనసులను అరికట్టండి. లేదా మా అహంభావం కూడా మీరే అయి మా సుఖ-దుఃఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. మాకు దాని చింత వద్దు.

జయజయపూర్ణకామా! మాకు మీయందు ప్రేమ స్థిరపడుగాక, మంగళదామా! ఈ చంచలమైన మనస్సు మీపాదాలయందు విశ్రాంతిని తీసుకొనుగాక.

శంకరాచార్యులవారు శివ మానసపుజా స్తోత్రం ఈ జగతికి ప్రసాదంగా ఇచ్చారు. ఆయన ఈ మానసపూజను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు. ఆయన ఆ స్తోత్రంలో ఇలా చెప్తారు.

ఆత్మత్వం గీరిజామతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

నా ఆత్మవు నీవే, పార్వతియే శక్తి. నా పంచప్రాణాలు నీ ఆధీనాలు, ఈ శరీరమే నీకు గృహం. నా ఇంద్రియ సుఖాలే నీ పూజలో ఉపయోగించే సాధనాలు. నా నిద్రే నా సమాధి స్థితి. నేను ఎక్కడ నడచిన చుట్టు నీవే ఉంటావు. నా వాక్కు ఉన్నది నిన్ను స్తుతించదానికే, నేనేమి చేసినా అది నీ పట్ల భక్తిని వ్యక్తపరచాలి దేవా! అని చక్కగా వర్ణిస్తారు. 

ఇలానే హేమద్‌పంత్ సాయి సచ్చరితలో సాయిమానసపూజను చక్కగా వ్యక్తపరిచారు.

సాయిదేవా! మాకు ప్రేరణ కలిగించేది మీరే. మావాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయడానికి నేనెవరిని? చేసేవారు చేయించేవారు మీరొక్కరే. మీతో సత్య సమాగం మాకు ఆగమనిగమాలు.

నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామవర్తనే మాకు కథా కీర్తన. అదే మా నిత్యానుష్టానం, అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాల మాకు వద్దు. పరమార్ధంలో ఇంతకంటే అధికంగా అధఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి?

ఆనందాశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను.
నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పుస్తాను.
మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను.

బాహ్యోపచారపూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నులను చేసి సుఖ సంతుష్టుణ్ణి అవుతాను.
సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనస్సుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను.

శ్రద్ధ, భక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసమనే మొలత్రాటిని మీ నడుముకు బంధించి, మీ పాదాంగుష్టాల  యందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను.

ప్రేమరత్నాలతో మిమ్ములను అలకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదిడుపు దిష్టి తీస్తాను.

నా పంచప్రాణాలను వింజూమరలుగా వీస్తాను.

మీ తాపనివారణ కొరకు తన్మయత్వమనే గొడుగు పట్టుతాను.

ఈ విధంగా గంధం, అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా! మా మంచికోసం మీకు స్వానందపూజ చేస్తాను.


నా మనోభీష్టాలు తీరడానికి ఎల్లప్పుడూ సాయి సమర్ధ అని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్ధం సాధిస్తాను.

నిష్ఠతో కృతార్థుడను అవుతాను. 



ఓం శ్రీ సాయి రామ్ !

No comments:

Post a Comment