Play Audio |
నానా సాహెబ్ పూర్తి పేరు
నారాయణ గోవింద చందోర్కర్. నానాకు సాయి మీద ఎనలేని నమ్మకము, అపారమైన భక్తి.
సాయిభక్తులలో నానాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎవరి కోసమైతే సాయి మూడుసార్లు కబురు
చేసి మరీ తన దగ్గరకు రప్పించుకున్నారో, ఎవరికైతే సాయితో 4 జన్మల సంబందం ఉందో
అటువంటి పుణ్యాత్ముడే నారాయణ గోవింద చందోర్కర్. నానా బాబాకు ఎనలేని సేవ చేసారు.
సాయి లీలలను నలుదిశలా వ్యాపించేలా ప్రచారం చేసిన భక్తులలో మొట్టమొదటి రత్నం
నానాసాహెబ్.
జననం, కుటుంబ వృత్తి
వివరాలు
నానా జనవరి 14, 1860 వ
సంవత్సరం, మకర సంక్రాంతి రోజు కళ్యాణ అనే ఊరిలో జన్మించారు. ఆయన పూర్వీకులు సదాచార
సంపన్నులు. వారు "అతిధి దేవోభవ" అన్న సంప్రదాయానికి ప్రతీక. వారు భోజనము
చేసే ముందు ఎవరైన అతిధులు వస్తారా అని ఎదురుచూసేవారు. ఆయన తండ్రి డిప్యూటి
కలెక్టర్‌గా చేసి రిటైర్ అవుతారు. నానా కూడా తండ్రి అడుగు జాడలలో నడిచి అతి తక్కువ
వయసులో తనుకూడా డిప్యూటి కలెక్టర్ అవుతారు. ఆయన బి.ఏ లో భగవద్గీతపై ప్రత్యేక
శ్రద్దతో శంకర భాష్యము అధ్యయనం చేశారు.
1878లో నానాకు బాయజాబాయి అనే జమిందారి వంశంకు చెందిన ఆమెతో వివాహం
జరుగుతుంది. బాబా ఆమెను నాని అనిపిలిచేవారు. ఆమె కూడా పతికి తగినట్లుగా సదాచార
సంపన్నురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు మైనతాయి మరియు ద్వారకామాయి. ఇద్దరు
కుమారులు వాసుదేవ్ మరియు మహాదేవ్.
నానాకు శంకరభాష్యంలో చాలా ప్రావీణ్యం ఉండేది. భగవద్గీతను తన
జీవితంలోకి అన్వయించాలి అనే కోరికతో ఉండేవారు. ఆయన అనేక అధ్యాత్మిక గ్రంధాలు
చదివారు. నానా కార్యదీక్షత, పట్టుదల, అందరికి సహాయం చెయ్యాలన్న తపన అన్నిటికి
మించి నమ్రత కలిగి ఎంతో ఉన్నతమైన స్వభావములతో నిండి ఉన్న మనస్థత్వం కలిగినవారు. ఈ మంచి గుణాలవల్ల బొంబాయి ప్రభుత్వ అధికారుల్లో ఆయనకు మంచి పేరు
వచ్చింది. అందరు ఆయనతో స్నేహం చెయ్యాలని తపన పడేవారు. కాని ఇన్ని సుగుణాలు ఉన్నా,
పరిచయాలు ఉన్నా, ఏదో తెలియని కొరత. బాబాను కలసిన దాకా ఆ కొరత తీరలేదు. అదే గురువు
కావాలన్న తపన. అధ్యాత్మిక పథంలో ముందుకు సాగాలి అన్న లక్ష్యం.
బాబా పిలుపు - తొలి
దర్శనం
సాయి దగ్గరకు చాలా మంది
భక్తులు వచ్చారు. ఆయన వారిలో అక్కడకు రావాలనే సంకల్పాన్ని కలుగచేసి
రప్పించుకునేవారు. కాని నానాకు బాబాతో నాలుగు జన్మల సంబంధం ఉంది. అంటే ఋణాను బంధం
ఉంది. దీనివల్లే బాబా మూడుసార్లు కబురు పెట్టి మరీ తన దగ్గరకు రప్పించుకున్నారు.
ఒకసారి నానా 1892వ సంవత్సరంలో జమాబందీ లెక్కలకోసం కోపర్‌గావ్ రావడం జరిగింది.
అప్పుడే అప్పా కులకర్ణి షిర్డీకి కరణంగా ఉన్నారు. ఆయన నానాను కలిసేందుకు బాబా
దగ్గర అనుమతి తీసుకునేందుకు వస్తారు. అప్పుడు బాబా నానాను నా దగ్గరకు రమ్మని
చెప్పు అని అంటారు. బయపడుతూనే అప్పాకులకర్ణీ, నానాకు ఈ విషయం చెప్తారు.
అప్పుడు నానా ఈ ఫకీర్ నన్నెందుకు రమ్మన్నారు నాతో పనేంటి? అని
వెళ్ళారు. ఇలా రెండోసారి కూడా బాబా అప్పాతో కబురు పెడ్తారు. ఇక మూడోసారి అప్పా
వణికిపోతూ మళ్ళీ బాబా ఆదేశం వినిపిస్తారు. ఈసారి నానా సరే వస్తానులే అని అంటారు.
అప్పుడు అప్పా మనసు తేలికపడ్తుంది. నానా ప్రక్క ఊరిలో పనిమీద వస్తూ షిర్డిలో
ఆగుతారు. ఆయన బాదంపప్పు, కలకండ ముక్కలతో బాబా దగ్గరకు వెళ్తారు. బాబా అప్పుడు
శ్యామా, మహాల్సాపతి మొదలైన వారితో కూర్చుని ఉంటారు. నానా సాయికి నమస్కరించి మీరు
నన్ను పిలవటానికి గల కారణం ఏమిటి? అని అడిగారు.
అప్పుడు బాబా ఈ విధంగా
అంటారు.
"నానా ఈ ప్రపంచంలో నీ కంటే ధనవంతులు, నీ కంటే గొప్ప అధికారులు
ఉన్నారు. వారందరిని నేను రమ్మంటానా? మనకు 4 జన్మల సంబంధం ఉంది. అది నీకు తెలియదు,
నాకు తెలుసును. నీవు ఆ సంబంధం కలుపుకోవడానికి రాలేదు. అందుకే నేనే నీకోసం కబురు
పెట్టాను" నీకు అవకాశం ఉన్నపుడల్లా వస్తూ ఉండు అని చెప్పారు. నానాకు అప్పుడు తను సాయి గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అవి
అన్ని సాయికి తెలిసినవి. సాయిని నమ్మకపోయినా ఒకరకమైన ఆనందాన్ని సాయి సన్నిధిలో
అనుభవించాడు. ఈ విధంగా నానాకు మొట్టమొదటి దర్శనం లభించింది.
మామూలు మానవులమైన మనకు ఒక
మాయతెర కమ్మి ఉంటుంది. అందువలన మనము గురువు చూసే విషయాలను చూడలేము. అజ్ఞానం అనే
అడ్డుగోడ ఉంటుంది. మనంతట మనము గురువుని ఎన్నుకోలేకపోవచ్చు. కాని గురువుతో
ఋణానుబంధం ఉంటే ఆయనే మనల్ని కలిసేటట్లు చేస్తారు. ఇదే నానా విషయములో కూడా జరిగింది.
మనము గురు అన్వేషణలో తప్పటడుగులు వేయచ్చు. అందుకని జాగ్రత్త ఉండాలి. మన కర్మశేషము
ఫలించినప్పుడు పూర్వ పుణ్యఫలం తోడైనప్పుడు గురువు మన ముందుకు వస్తారు. మనము
ఎలాగైతే దేవుణ్ణి చూడకుండానే పూజిస్తామో అలానే గురువును చూడకుండా కూడా
పూజించవచ్చు. అప్పుడు ఋణానుబంధం పెరుగుతుంది.
సాయిపై నమ్మకం
నానా ఒకసారి బాబాను
కలిశాడు, కాని ఆయనలో ఇంకా గురి కుదరలేదు. గురువుపై పూర్తి నమ్మకం లేనిదే మనకు
ఆధ్యాత్మిక ప్రగతి లభించదు. ఒకసారి కలెక్టర్ నానాను పిలిచి ప్లేగువ్యాధి ప్రబలమై
పోతుంది. మనము ప్రజలకు టీకాలు వేయాలి. వారు ఈ టీకా వేయించుకోవటానికి
బయపడుతున్నారు. మీరు కనుక ఈ టీకాలు వేయించుకుంటే వాళ్ళకు నమ్మకం కుదురుతుంది అని
చెప్పారు. అప్పుడు నానా, తనతో పనిచేసే ఉద్యోగులు బయపడతారు. కాని నానాపై ఒత్తిడి
వస్తుంది. ఇంతలో బాబా గుర్తుకు వచ్చి షిర్డి బయలుదేరతాడు. బాబాని కలిసి
నమస్కరించగానే బాబా ఈ విధంగా అంటారు. "నానా టీకా వేయించుకో నీకేమి జ్వరం
రాదు, ప్రాణాపాయం లేదు" అని చెప్పగానే బాబా మహానుభావుడు అని అర్ధం అవుతుంది.
ఆయన సర్వజ్ఞతకు నానా ఆశ్చర్యపడతాడు. అప్పుడు బాబా చెప్పిన నాలుగు జన్మల సంబంధం
కూడా నిజం అయి ఉంటుంది అని నమ్ముతాడు. నానాలో ఉన్న గుణం ఏమిటి అంటే ఎవరిని తొందరగా
నమ్మడు కాని నమ్మితే మాత్రము దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. భగవద్గీతలో
చెప్పబడినట్లు "శ్రద్దావాన్‌లభతే జ్ఞానమ్". అంటే నమ్మకము ఉన్న వాడికి
జ్ఞానము లభించును.
నానాకు బాబా రక్ష
నానా చాలాభక్తి తత్పరతతో
మెలిగేవాడు. చాలా దేవాలయాలను దర్శించేవాడు. ఒకరోజు మహరాష్ట్రలోని హరిశ్చంద్ర
పర్వతముపై ఉన్న గుడిని సందర్శించేందుకు వెళ్ళాడు. అది సుమారు షిర్డికి 40 మైళ్ళ
దూరంలో ఉంటుంది. ఆ కొండపై అమ్మవారి గుడి ఉంది. ఆ పర్వతము మీద ఎక్కడా నీళ్ళు ఉండవు.
చాలా దూరం నడిచి ఆ కొండ ఎక్కాలి. బాగా ఎండగా ఉంది ఆ రోజు కొంచెం దూరం నడిచిన
తర్వాత నానాకు దాహం వేస్తుంది. అట్లానే నడుస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత
ఇంక నడవలేక ప్రాణానికే ప్రమాదం అవుతుంది. తనతో వచ్చిన అతనిని నీళ్ళకోసం అడుగుతాడు.
అయ్యో బాబా ఇక్కడ ఉంటే మనకే కష్టం రాదు కదా అంటాడు. ప్రక్కనున్న స్నేహితుడు బాబా
ఇక్కడ లేరు కదా నేను వెళ్ళి నీరు ఎక్కడన్నా దొరుకుతుందేమో చూస్తాను అని వెళ్తాడు. నానా ఇంక నడవలేక ఒక బండరాయి మీద కూర్చుంటాడు. బాబాను మరింతగా
ప్రార్ధిస్తాడు. మనము శ్రద్ధతో ప్రార్ధన
చేస్తే భగవంతుడు తప్పక దారి చూపిస్తాడు. ప్రార్ధన భక్తుడిని, భగవంతుడికి దగ్గరగా
చేస్తుంది. మనలో అప్పుడు ఆ జీవ చైతన్యం ఉత్తేజితమవుతుంది. ఈ కలయికలో నుంచి సమాధానం
పుట్టుకు వస్తుంది. ఆ చైతన్యమే మనమైనప్పుడు ఇంక ఈ శక్తికి అవధులు లేవు. నానా
ప్రార్ధనలో ఆ శ్రద్ధ ఉంది. అందుకే సాయి చైతన్యం ఆయనకోసం ప్రత్యక్షమైంది.
అంతలో అటుగా ఒక భిల్లుడు రావడం జరిగింది. నానా అతనిని నీరు కోసం
అడుగగా అతడు మీరు కూర్చున్న బండ కింద నీరు ఉంది త్రాగండి అని సమాదానం చెప్తాడు.
అప్పుడు నానా అతని స్నేహితుడు ఆ బండను జరుపగా వాళ్ళకు స్వచ్చమైన నీళ్ళు
కనిపించాయి. నానా ఆత్రుతతో ఆ నీటిని త్రాగి తన దాహం తీర్చుకున్నాడు. తరువాత ఆ
భిల్లుడు కనిపించలేదు. అప్పుడు నానా సాయికృప వల్ల నీరు దొరికింది అనుకున్నాడు.
కాని సాయే భిల్లుని రూపంలో వచ్చిన సంగతి నానా గ్రహించలేక పోయాడు. తరువాత తను దేవీ
దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం కట్టాడు.
తరువాత కొన్నిరోజులకు
షిర్డికి వెళ్ళగా, బాబా నానాతో ఈ విధంగా అన్నారు, నానా నీకు దాహం వేసింది, నేను
నీకు నీళ్ళు ఇచ్చాను నువ్వు త్రాగావా! అని అడిగారు. బాబా యొక్క లీలను చూసి నానా
పులకరించిపోయాడు. బాబాను కేవలం తలవడంతోటే భిల్లుడు వచ్చి నీరు చూపించడం ఎంత అద్భుతం.
అప్పుడు అక్కడున్న వారు నానాతో బాబా ఏ విధంగా ఈ విషయం గురించి వారికి చెప్పింది,
నీరు ఇవ్వడం ఇలా అన్ని విషయాలు నానాకు చెప్పారు. నానాకు బాబా పట్ల ఉన్న శ్రద్ధ
మరింత దృఢమైంది.
గణపతి గుడి దగ్గర బాబాలీల
ఒకసారి నానా పద్మాలయ అనే
ఊరిలో ఉన్న గణపతి గుడిని దర్శించాలని సంకల్పించాడు. ఆ ఊరు అరణ్యంలో ఉంది.
రైల్వేస్టేషన్ నుంచి దాదాపు పది మైళ్ళ దూరంలో ఉంది. నానా తగినటువంటి జాగ్రత్తలు
తీసుకుని చీకటిపడే లోపల రావాలని నిశ్చయించాడు. కాని రైలు లేటు కావడంతో వారు ఆ ఊరు
చేరుకునేటప్పటికి చీకటి పడింది. ఆ గుడి రాత్రి 9 గంటలకు మూసివేస్తారు. అయినా నానా
తన నడక సాగిస్తాడు. ఆయనతో వచ్చినవారు కూడా ఆ పది మైళ్ళ దూరం నడవడానికి
నిశ్చయిస్తారు. కాని వారు సగం దూరం వెళ్ళేసరికి 9 గంటలు అవుతుంది. ఏమిచేయాలో
అర్ధంకాక గుడి తలుపులు తెరిచి ఉంటే బాగుండును అనుకుంటారు. నానాకు ఆకలి బాధ ఎక్కువై
బాబాను తలుచుకుని బాబా నాకు ఎక్కువ ఆశలేదు కనీసం ఒక కప్పు టీ దొరికితే బాగుంటుంది
అని అనుకుంటాడు. వాళ్ళు గుడీ దగ్గరకు చేరేటప్పటికి 11 గంటలు అవుతుంది. వారు
అక్కడికి చేరేటప్పటికి దూరం నుంచి ఎవరో నానా వస్తున్నాడా అని అడుగుతారు. ఆయన ఆ
గుడి పూజారి. నానా మరియు ఆయనతో వచ్చినవారు ఆశ్చర్యపోయి పూజారి గారు మేము
వస్తున్నట్లు మీకు ఎవరు చెప్పారు. అప్పుడు గుడి పూజారి నాకు శ్రీ సాయిబాబా దగ్గరి
నుంచి ఆదేశం వినిపించింది. "నానా వస్తున్నాడు ఆయనకు టీ ఇవ్వు, ఆకలిగా
ఉన్నాడు" అని చెప్పారు. అందరూ బాబా యొక్క ఈ దివ్యలీలకు ముగ్ధులయ్యారు. నానా నిజంగా
ఎంతటి పుణ్యాత్ముడో బాబా ఆయనను కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చారు.
టాంగా ప్రమాదం
ఒకసారి నానా అతని
మిత్రుడు రేలే శాస్త్రితో కలసి పూణా నుండి ప్రక్కనున్న గ్రామానికి ఒక టాంగాలో బయలు
దేరారు. వాళ్ళు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసిన తరువాత గుర్రం బెదిరి వాళ్ళ బండి బోల్తాపడింది.
మామూలుగా అయితే చాలా దెబ్బలు తగలాల్సి ఉంది మరియు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అదే
సమయంలో బాబా తన రెండు చేతులను శంఖంలాగా పూరించి భంభం అనే శబ్దాన్ని చేశారు.
నానా చనిపోతున్నాడు కాని నేను చనిపోనిస్తానా! అని ప్రక్కన ఉన్న వాళ్ళకు చెప్పారు.
నానాకు చిన్న దెబ్బ కూడా తగలకుండా ఆ ప్రమాదం నుంచి బయటపడ్తాడు. రేలే శాస్త్రి కూడా
ప్రమాదం తప్పించు కుంటారు. తరువాత షిర్డి వచ్చినప్పుడు బాబా కాపాడిన విధానం తెలుసు
కుంటారు.
ఓం శ్రీ సాయి రామ్!
No comments:
Post a Comment