Play Audio |
సాయి భక్తులందరిలో దీక్షిత్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. ఈయన జీవితం మనలాంటి సామాన్య సాయి భక్తులకు ఎంతో ఆదర్శప్రాయము. దీక్షిత్ గారు 45 ఏళ్ళ వరకు చక్కని ప్రాపంచిక జీవితంలో ఉండి ఎంతో ప్రగతిని సాధించిన వ్యక్తి. తరువాత ఆయన జీవితం మార్పులు చెంది బాబా కృపతో అధ్యాత్మిక పథంలో నడిచింది. సాయి ప్రతిక్షణం దీక్షిత్‌ని రక్షిస్తూ, ఎటువంటి ఒత్తిడులకు లొంగనీయకుండా, వృత్తి, కుటుంబ వ్యవహారాలలో చేయూత నిస్తూ అనుక్షణం కాపాడారు. మనందరి లాగా ఆయన కూడా చాలా కష్టనష్టాలకు లోనై మానసిక ఒత్తిళ్ళకు గురి అవ్వటం జరిగింది. దీక్షిత్ గారి గురించి మనకు చాలా విషయాలు సాయిసఛ్ఛరిత ద్వారా తెలుస్తాయి. సాయిలీల మాసపత్రికలో ఆయన గురించిన చాలా విషయాలు విధితమవుతాయి. శ్రీ నరసింహస్వామి గారి ద్వారా మరికొన్ని విషయాలు, ధీక్షిత్ గారి డైరి ద్వారా కొన్ని సంఘటనలు మనకు తెలిశాయి. వీటన్నింటిని మనం అర్ధం చేసుకొని వారి జీవితం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక్కోసారి ఆయన జీవితం మన సామాన్య జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాని దీక్షిత్ గారి గొప్పతనం, సాయి అనుగ్రహం ఎక్కడ బయట పడుతుంది అంటే ఆయన బాబాని కలిసిన తరువాత తనకు ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నా, పెద్ద పదవులు వచ్చే సమయంలో దీక్షిత్ గారు వీటన్నింటిని తృణప్రాయంగా బావించి, బాబానే ముఖ్యమని నమ్మిన ఆ మహానుభావుడు మనందరికి ఆదర్శం.
జననం, కుటుంబ వృత్తి వివరాలు
దీక్షిత్
గారి పూర్తిపేరు హరి సీతారాం దీక్షిత్. ఆయనను బాబా ముద్దుగా కాకా అని పిలిచేవారు. ఆయన
1864వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్టంలో భాండ్వా అనే తాలూకాలో జన్మించారు. ఆయన నాగరి బ్రహ్మణ
కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య ఖాండ్వాలో మరియు హింగన్ షూట్‌లలో జరిగింది.
తరువాత ఆయన ఆల్పిస్టన్ కాలేజీ (బొంబాయి)లో చేరి, యల్.యల్.బి. డిగ్రీని సంపాదించి ఒక
లాయర్‌గా బయట పడ్తారు. అప్పటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత అవసరమైన
పరిక్షలన్నింటిలో ఉత్తీర్ణుడై, 21వ సంవత్సరంలో లిటిల్ & కో అనే సంస్థలో పనిచేస్తారు.
ఆ తరువాత తనంతట తనే ఒక సంస్థను పెట్టి చాలా మంచిపేరు తెచ్చుకొని బాగా డబ్బు సంపాదిస్తారు.
మంచి బంగళాలు కూడా కట్టిస్తారు. ఇన్ని పనులలో తలమునకలైనా రోజూ ఆధ్యాత్మిక గ్రంధాలను
చదివేవారు.
ఆయన చాలా మంది కేసులను తీసికొని బాగా
పేరు తెచ్చుకున్నారు. వీటిలో ముఖ్యమైనవి బాల గంగాధర్ తిలక్ గారి కేసు, టైమ్స్ ఆఫ్ ఇండియా
పూణా వైభవ్ వంటి ప్రాముఖ్యమైన వాటిల్లో విజయం సాధించారు. ఆయనకు అటు బ్రిటిష్ ప్రభుత్వం
ఇటు కాంగ్రెస్ అధినేతలతో మంచిపేరు వస్తుంది. ఆయన బొంబాయి కౌన్సిల్లోకి ఎన్నిక అయ్యారు.
ఇది 1901వ సంవత్సరంలో జరిగింది. 1904వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి సెక్రటరి
అయ్యారు. ఆయనకు బొంబాయి విశ్వవిద్యాలయంలో కూడా ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. ఇలా ఎన్నో
అత్యున్నత పదవులు ఆయనను అలంకరించినవి. ఇలా జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఆయన జీవితం
మలుపు తిరగాల్సిన సమయం ఆసన్నమైంది.
1906వ సంవత్సరంలో దీక్షిత్‌గారు లండన్
వెళ్ళడం జరిగింది. ఆయన అప్పుడే బయలుదేరిన రైలులో ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఆయన
క్రింద పడి కాలుకు దెబ్బ తగులుతుంది. ఈ దెబ్బ ఆయన జీవితాన్ని మార్చివేసింది. చాలా వైద్యాలు
చేపించినా ఆయన సరిగ్గా నడవలేక పోయారు. ఈ అవిటితనం ఆయనను చివరి దాకా వెన్నంటే ఉంది.
ఇది ఆయనను ఒక రకమైన మానసిక రుగ్మతకు గురిచేసింది. కొంచం దూరం నడిస్తే కాలులో నెప్పి
వచ్చేది. బయటకు ఈ దెబ్బ ఆయన ప్రాపంచిక జీవితంలో ఒక లోపంగా కనిపించినా అధ్యాత్మిక జీవితానికి
మాత్రం ఇది తొలిమెట్టు. ఆయనలో ఒక రకమైన మానసిక విశ్లేషణ ప్రారంభమయింది. దీంట్లో నుంచి
వైరాగ్యం ఆవిర్భవించింది. ఇలా 1909వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆయనకు 45 ఏళ్ళు వచ్చాయి.
అదే సమయంలో ఆయన దత్తమహారాజ్ లాంటి ఆధ్యాత్మిక గురువులను కలిశారు. ప్రాపంచిక విషయాలలో
ఏమి సారం లేదని ఈ జీవితం యొక్క అర్ధం ఏమిటి అనే ఆలోచన కలిగింది.
సాయితో తొలికలయిక
1909వ సంవత్సరంలో సెలవలకై తన బంగళాకు వెళ్ళి విశ్రాంతి
తీసుకుంటూ ఉన్న సమయంలో నానా సాహెబ్ చందోర్కర్‌ను కలుస్తారు. వీరిద్దరు కలసి చదువుకున్నారు.
నానా ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని స్థిరపడతాడు. దీక్షిత్ మాత్రం లాయర్‌గా స్థిరపడ్డాడు.
ఆ తరువాత వాళ్ళు కలవడం ఇదే మొదటిసారి. వారు అనేక విషయాలు మాట్లాడుకుంటూ చివరికి దీక్షిత్
కాలు దెబ్బ గురించి చెప్పుకుంటారు. అప్పుడు నానా సాయి గురించి చెప్తారు. సాయి నీ కాలుని
సరి చేస్తారు అని నానా అంటే అప్పుడు దీక్షిత్ ఈ కాలు బాగుకావడం ముఖ్యం కాదు నా మనసు
కుంటితనం పోవాలి. నాకు మోక్షం కావాలి. నాకు గురు దర్శనం కావాలి. అల్ప సుఖభోగాల కోసం
కాదు, బ్రహ్మ జ్ఞానమే పరమ సుఖం. అంతకు మించిన సుఖం మరేమిలేదు. నేను ఎన్నెన్నో పూజలు చేశాను, భజనలు చేశాను, అలసి
పోయాను. ఈ మనసు మాత్రం నిశ్చలం కావడం లేదు. మనసును ఎంతగానో నిగ్రహిస్తున్నాను. అయినా
అది చలిస్తూనే ఉంటుంది. నా మనసు కుంటితనం నయం అవ్వాలి, అని దీనంగా చెప్తాడు.
1909వ సంవత్సరంలోనే విధాన సభ ఎన్నికలు
జరుగబోతున్నాయి. ఆ ప్రచార సందర్భంలో అతను అహ్మద్‌నగర్ వెళ్తారు. అక్కడ సర్ధార్ మీర్‌కర్
అనే స్నేహితుడు దగ్గర బస చేస్తారు. వారు గుర్రాల ప్రదర్శనకు వెళ్తారు. అక్కడ దీక్షిత్
తను బాబాను కలవాలి అని అంటారు. మీర్‌కర్ కుమారుడు బాలా సాహెబ్ మీర్‌కర్ కూడా కోపర్‌గావ్
నుంచి అక్కడకు వస్తారు. అదే సమయంలో తన అత్తగారికి బాగుండలేదని శ్యామా అహ్మద్‌నగర్ వస్తారు.
ఈ విషయం తెలిసి మీర్‌కర్ శ్యామాకు కబురుపెడ్తారు. శ్యామాను చూడగానే దీక్షిత్‌కు ఎక్కడా లేని ఉత్సాహం
వచ్చి బాబాను చూసినంత అనుభూతి పొందుతారు. ఇంక ఆయనలో ఆతృత పెరుగుతుంది. అక్కడ క్షణం
కూడా ఉండాలని అనిపించలేదు. ఎప్పుడు బాబాను కలుస్తాను అన్న భావనతో మనసు నిండిపోయింది.
అంతలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాలా
సాహెబ్ మీర్‌కర్ వారింట్లో ఉన్న బాబా చిత్రంపై నున్న తెరను తొలగించాడు. అది మేఘా పూజించే
సాయిపటం. దాని అద్దం పగిలితే బాగుచేయించేందుకు అహ్మద్‌నగర్ తీసుకువస్తారు. బాబా దర్శనం
కాగానే దీక్షిత్ ఆ పటం ముందు మోకరించాడు. మనస్సులో ఏదో తెలియని అనుభూతి, ఈ పటాన్ని
వీరిద్దరికి ఇచ్చి శిరిడి పంపాలని నిశ్చయించారు. శ్యామా మరియు దీక్షిత్ ఆ రాత్రి
10 గంటలకు రైలులో శిరిడికి బయలు దేరారు. రెండవ తరగతి కిక్కిరిసి ఉండటంతో ఏం చెయ్యాలో
అర్ధం కాలేదు. అంతలో దీక్షిత్ రైలు గార్డుని
కలిసి మొదటి తరగతిలో ప్రయాణం చేస్తారు. వారు కోపర్‌గావ్‌లో దిగగానే నానాసాహెబ్ చందోర్కర్
కలుస్తారు. ముగ్గురు టాంగా మాట్లాడుకొని శిరిడికి వస్తారు.
దీక్షిత్ ద్వారకామాయిలో అడుగుపెట్టగానే
"రా లంగడా కాకా" అని ఆహ్వానం పలుకుతారు. దీక్షిత్ కళ్ళు చెమరుస్తాయి.
ఆ తొలిదర్శనం దీక్షిత్ మనసులో చెరగని ముద్ర వేస్తుంది. ఆయన కళ్ళు ఆర్పకుండా బాబాను
అట్లానే చూస్తుండి పోతాడు. వెంటనే బాబా పాదాలపై తన తలను ఉంచుతాడు. అప్పుడు బాబా ప్రేమతో
"నీ కోసం ఎదురు చూస్తున్నాను అందుకే శ్యామాను నీదగ్గరకు పంపించాను" అని చెప్పగా
దీక్షిత్ హృదయం పులకరించిపోయింది. సాయి స్పర్శతో అపారమైన ఆనందాన్ని పొంది సాయి ప్రేమకు
ఆశ్చర్యపడ్డాడు.
హేమద్‌పంత్ సాయిసచ్చరితలో ఈ ఘట్టం గురించి
ఇలా వ్రాసారు. భక్తి శ్రద్ధలు మూర్తీభవించినట్లుగా దీక్షిత్ మొదటి నుండి పుణ్యకార్యలలో
కీర్తి గడించినాడు. ఇంగ్లాండుకు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ పారమార్ధిక బీజం నాటుకున్నది.
కాశీ ప్రయాగ, బదలీ, కేధార్‌నాధ్, మధుర, బృందావనం, ద్వారకా మొదలైన యాత్రలు చేసిన పుణ్యం
దీక్షిత్‌కు ముందే ఉంది. అంతేకాక తల్లితండ్రుల పుణ్యం వలన అమితమైన భాగ్యం కొద్దీ పూర్వార్జిత
పుణ్యఫలం కారణంగా సాయి దర్శనం కలిగింది. తన కుంటి తనం పైకి అశుభం లాగా అనిపించినా నిజానికి
పరిణామం శుభప్రధమైంది. అలా గురువు యొక్క సన్నిధికి చేరుకునే యోగం లభించింది. ఆ రోజు
నవంబర్ 2, 1909వ సంవత్సరం దీక్షిత్‌కు మొదటిసారిగా పుణ్యపావనమైన సాయినాధుని దర్శనం
లభించింది, అని ఎంతో చక్కగా హేమద్‌పంత్ వర్ణించారు.
దీక్షిత్ వాడా నిర్మాణం
నవంబర్
1909 తరువాత, దీక్షిత్ గారు డిశంబర్ నెలలో మరల షిర్డికి వస్తారు. ఆయనకు సాధెవాడాలో
సరిగా ఏకాంతం లభించక ఇబ్బంది పడ్తారు. ఆయనకు షిర్డిలోనే బాబాతో ఉండిపోవాలి అని అనిపిస్తుంది.
తనే ఒక రేకుల షెడ్ నిర్మించాలి అనుకొని ఒక భవనం కట్టాలి అని నిర్ణయిస్తారు. బాబా అనుమతితో
1910 డిశంబర్ 9న పునాది వేస్తారు. అదే రోజున రెండు విశేష సంఘటనలు జరుగుతాయి. ఖపర్డెకు
షిర్డి నుంచి వెళ్ళడానికి బాబా అనుమతి ఇస్తారు. అదే రోజు శేజారతి చావడిలో మొదలవుతుంది.
ఈ వాడా నిర్మాణం నాలుగు నెలలో పూర్తి అయి శ్రీరామ నవమి రోజున గృహప్రవేశం జరుగుతుంది.
ఈ వాడాను కాకావాడా మరియు దీక్షిత్ వాడా అని పిలుస్తారు. దీక్షిత్ క్రింది భాగం యాత్రికులకు
ఇచ్చి, పై భాగం తనకు వాడుకుంటారు.
ఓం శ్రీసాయి రాం!
No comments:
Post a Comment