Play Audio |
జామ్నెర్ చమత్కారం
నానా
చందోర్కర్‌ని ఎలాగైతే బాబా దగ్గర ఉండి కాపాడారో అదే విధంగా తన కుటుంబాన్ని కూడా రక్షించారు.
నానా ఒకసారి జాంనేరులో మామల్తాధారుగా పనిచేస్తున్నపుడు తన కూతురు మైనతాయి ప్రసవ వేదనతొ
బాధపడుతూ ఉంది. ప్రసవం అవ్వటం కష్టమై ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. కాని నానా దగ్గర
బాబా ఊది లేదు. నానాకు ఏమి చేయాలో అర్ధంకాక బాబాను తలచుకుంటాడు. అదే సమయంలో బాబా నానాకు
ఊది పంపించాలని రామ్‌గీరు బువా అనే గోసావితో ఈ చమత్కారానికి శ్రీకారం చేస్తారు. అదే
సమయంలో ఈ గోసావికి తన ఊరు అయినా భాండేశ్‌కు వెళ్ళాలన్న కోరిక కల్గుతుంది. ఆయన బాబా
దగ్గర అనుమతి తీసుకునేందుకు ద్వారకామాయికి వస్తారు. అప్పుడు బాబా కొంత ఊది గోసావికి
ఇచ్చి జాంనేరులో ఉన్న నానాకు అది అందజేసి తన ఊరికి వెళ్ళవలసినదిగా ఆదేశిస్తారు. ఆ ఊదితో
పాటుగా అడ్కర్ వ్రాసిన ఆరతి సాయిబాబా అన్న ఆరతిని శ్యామాతో ఒక కాగితం పై వ్రాయించి
ఇస్తారు. అప్పుడు గోసావి బాబాతో బాబా నా దగ్గర రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి, నేను
జాంనేరు ఎలా చేరుకోగలను? అని అడుగుతాడు. నువ్వు నిశ్చితంగా వెళ్ళు నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి అని బాబా చెప్తారు. ఆ గోసావి ఆ ఊది మరియు
ఆరతి కాగితం తీసుకుని బయలుదేరుతాడు. జాంనేరు వెళ్ళాలి అంటే జలగాంలో దిగాలి. అక్కడ నుంచి
జాంనేరుకు సరిగా ప్రయాణ సౌకర్యం లేదు. సరే జలగాంకు ఒక రూపాయి 14 అణాలతో టిక్కెట్టు
కొన్నాడు. ఇక మిగిలింది 2 అణాలు మాత్రమే వీటితో జాంనేరు ఎలా వెళ్ళగలను? అని ఆలోచిస్తూ
స్టేషన్‌లో టికెట్టు ఇచ్చి బయటపడగా దూరాన ఒక సిపాయిని చూశాడు.
అప్పటికే అతడు షిర్డి నుంచి వచ్చిన
బాపూగిర్ ఎవరు? అని అడుగుతూ ఉన్నాడు. ఇలా ఇద్దరు కలుసుకున్నారు. ఆ సిపాయి నన్ను నానా
పంపించారు అని చెప్పి బాపూగిర్‌ని ఆ టాంగాలో ఎక్కించుకుని జాంనేరు వైపు కదిలారు. ఆ
సిపాయి చాలా చురుకైన వాడిలా కనిపించాడు. గడ్డం, మీసాలు, గిరజాలు ఉన్నాయి. టాంగా చాలా
అందంగా ఉంది, గుర్రాలుకూడా దానికి తగినట్టుగా ఉన్నాయి. వారు సుమారు రాత్రి 11 గంటలకు
బయలుదేరారు. తెల్లవారు జామున దారిలో ఒక కాలువ దగ్గర ఆగింది. గుర్రాలను నీరు తాగించేందుకు
వదిలి తినడానికి కావలసిన ఫలహారాన్ని తయారుచేశాడు ఆ సిపాయి. అతను చూడడానికి ముస్లింలా
ఉన్నాడు అని గోసావి సంకోచిస్తుంటే అతను నేను రాజ్‌పూత్ వంశం వాడ్ని ఈ ఫలహారం కూడా నానా
పంపించారు అని చెప్తాడు. ఇద్దరూ ఫలహారం తిని మరల ప్రయాణం సాగిస్తారు. బండి నానా కార్యాలయం
దగ్గరకు రాగానే ఆగిపోయింది. రామ్‌గీర్‌కు చాలా సంతోషం వేసింది. ఏ కష్టం లేకుండా అక్కడకు
చేరుకున్నాడు. గోసావి మూత్రవిసర్జనకు వెళ్ళి వచ్చే లోపల అక్కడ టాంగా లేదు, సిపాయిలేడు.
సరే ఆరోజు నానా కార్యాలయంకు రాలేదని తెలుసుకుని ఇంటికి వెళ్ళి ఆ ఊది, ఆరతి నానాకు ఇస్తాడు.
మైనతాయికి సుఖప్రసవం అవుతుంది. నానా కూడా బాబా దయకు ఆశ్చర్యపడ్తాడు. గోసావి నానాను
ఆ టాంగా పంపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ సిపాయి మరల ఎక్కడకు వెళ్ళాడు అని అడుగుతాడు.
నానా ఆశ్చర్యపడి నేను టాంగా పంపించలేదు మీరు వస్తున్నట్లు కూడా నాకు తెలియదు, అప్పుడు
వారికి అర్ధం అవుతుంది ఇదంతా బాబాలీల అని.
జాంనేరు చమత్కారం వెనుక రహస్యం
బాబా
మైనతాయిని కేవలం తన సంకల్పంచేత మాత్రమే కాపాడవచ్చు కాని ఈ ఊది, గోసావి, టాంగా సిపాయి
మొదలగు అంశాల నుంచి మనకు ఏం నేర్పించాలని అనుకున్నారు. ఇక్కడ బాబా "ఆరతి సాయిబాబా"
అన్న ఆరతిని కూడా పంపించారు. బాబా మనకు ఏమి చెప్పాలనుకున్నారో బాబానే మనకు అర్ధం అయ్యేట్లు
చెప్పాలి.
మనకు ఊది గురించిన లీలలు తెలుసు. బాబా
ఎందుకు ఊది ఇచ్చారు. ఈ విభూతి ప్రకృతి యొక్క నశ్వరతత్వాన్ని బోధిస్తుంది. ఈ సకల విశ్వం
దానిలోని వస్తువులు బూడిదవంటి వని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం.
శరీరంలో నుంచి జీవుడు వెళ్ళగానే కుప్పకూలుతుంది. ఇది బూడిద అని నిరూపిస్తుంది. మీది,
నాది కూడా ఇదే పరిస్థితి. ఇది మీరెప్పుడూ తెలుసుకోవాలని ఊది ఇస్తాను అని బాబా చెప్తారు.
ఇక్కడ విభూది యొక్క తత్వార్ధం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం. బాబా దక్షిణ తీసుకోవడానికి
కూడా కారణం ఈ వైరాగ్యాన్ని మనకు నేర్పించేందుకే. బాబా చాలా ఉల్లాసంగా ఒక పాట పాడేవారు.
"రమతే రామ ఆయోజి, ఆయోజి ఉదియాంకి గోనియా లాయోజి!" రాముడు తిరుగుతూ తిరుగుతూ
వచ్చాడు, ఊది సంచులను పట్టుకుని వచ్చాడు. బాబాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం అయ్యుండాలి
లేకపోతే అంత ఉల్లాసంగా ఎందుకు పాడేవారు. ఆ రామనామం ఇచ్చేటువంటి పరమానందం కంటే మోక్షం
ఇంకెక్కడ దొరుకుతుంది. దక్షిణ ఇచ్చి ఊది తీసుకుంటే గాని అది అర్ధం కాదు.
రామ్‌గిరి బువా దగ్గర రెండు రూపాయలు
మాత్రమే ఉన్నాయి. ఇవే శ్రద్ద, సబూరి. అలానే ఆయన జలగాంకు టిక్కెట్టు తీసుకున్న తర్వాత
ఆయన దగ్గర మిగిలినది రెండు అణాలు. ఈ శ్రద్ధ, సబూరినే ఆయనకు జలగాం స్టేషన్‌లో దారి చూపించింది.
మనము బాబాను పూర్తిగా నమ్మినప్పుడు ఆయన మనలను తప్పక రక్షిస్తారు.
బాబా ఇచ్చిన ఆరతి, సాయం ఆరతిగా మనం
పాడుకున్నాము. ఇదే సంధ్యా ఆరతి. అలానే గోసావి జలగాం చేరిన సమయం 11 గంటలు (రాత్రి) సంధ్య
అంటే రెండింటి మధ్యలో ఉండేది. మనం జీవించడానికి, మరణానికి ఉన్న సంధ్య కూడా అలాంటిదే.
ఆ సంధ్య సమీపించే లోపలే మనం మేలుకొని భగవంతుడ్ని చేరుకునేందుకు ప్రయత్నించాలి. ఆంగ్లంలో 11th hour అంటే ఇక ఏమి దిక్కు తోచని మరియు చివరి సమయం. ఆ 11 గంటల సమయంలోనే బాబా రామ్‌గిరి
బువాకు దారి చూపించారు.
నానా నమ్మకాన్ని దృడపరచి మైనతాయిని
రక్షించారు. ఆమెకు సుఖ ప్రసవం జరిగేలా చూశారు. ఇక్కడ నానాకు ఆరతి సాయిబాబా అనే ఆరతిని
ఇచ్చారు. నానాకు కూడా వైరాగ్యం నేర్పించాల్సిన
సమయం వచ్చింది. మైనతాయికి పుట్టిన బిడ్డ కొన్ని నెలల తర్వాత చనిపోవడం జరుగుతుంది. అలానే
మైనతాయి భర్త కూడా ప్రసవం ముందు చనిపోతారు. ఇలా నానాకు చాలా ఎదురుదెబ్బలు తగులుతాయి.
ఇవన్ని సర్వజ్ఞుడైన బాబాకు తెలుసు. నానాకు ఈ వైరాగ్యం బోధించడానికే ఆరతి సాయిబాబా అనే
ఆరతిని పంపించారు. ఇలా బాబా ఒక్క లీలలో ఎన్నో అంశాలను మనకు చూపించారు.
ఇలా మైనతాయి 17 సంవత్సరములకే భర్తను
కోల్పోయి, బిడ్డను పోగొట్టుకొని దుఃఖితురాలు అయింది. కొన్ని రోజుల తర్వాత వారందరు షిర్డికి
వెళ్తారు. నానా బాబాను దర్శించి ఏమీ మాట్లాడక కూర్చుంటాడు. అప్పుడు బాబా, నానా! ఏమయింది?
ఎందుకు మౌనంగా కూర్చున్నావు? అని అడుగుతారు. అప్పుడు నానా, బాబా! నీకు తెలియనిది ఏముంది?
నీకు సర్వము తెలుసు. మీ రక్షణలో ఉన్న మాకు కూడా కష్టాలు వచ్చాయి. నా అల్లుడు, మనువడు
చనిపోయారు, అని చెప్తాడు.
బాబా అప్పుడు నానా! నీకు అల్లుడు,
బిడ్డ, బందువులే ప్రధానమైతే వారికోసమే నా దగ్గరకు వస్తే, మీరు నా దగ్గరకు రానక్కరలేదు.
ఇవన్ని నాకు సాధ్యములు కావు. బిడ్డలు, జననాలు, బందువుల మరణాలు వారి వారి పూర్వజన్మ
కర్మలపై ఆధారపడి ఉంటాయి. సృష్టి-స్థితి-లయ కారకుడగు ఆ దైవం కూడా వీటిని
మార్పు చేయలేడు. వేరొక దిక్కున ఉదయించమని సూర్యుడిని ఆ పరమేశ్వరుడైన ఆజ్ఞాపించగలడా?
ఆ విధంగా చేస్తే సృష్టి తారుమారు కాదా! అని బాబా చెప్పెను. తరువాత బాబా నానాతో ఇట్లా
అన్నారు. నీవు ప్రాపంచిక కోరికలతో నా దగ్గరకు వచ్చే పనైతే, నీవు నా దగ్గరకు రానవసరం
లేదు. ఈ విధంగా బాబా నానాను ఆధైన్య స్థితి నుండి కాపాడి సరైన మార్గంలో నడిపించారు.
ఓం శ్రీ సాయి రామ్!
No comments:
Post a Comment