In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, January 20, 2016

నానా సాహెబ్ -3


Play Audio



సాయి తన దగ్గరకు వచ్చిన భక్తుల చిత్తంలో ఏముందో తెలుసుకొని, వారివారి పూర్వకర్మలను బట్టి, వారికి ఏ విధమైన బోధ చెయ్యాలో అది మాత్రమే చేసేవారు. అందుకే సాయిని ఒక సిద్దాంతానికి, ఒక మతానికి, ఒక ఆచారానికి చెందినట్లు చెప్పలేము. ఈ సకలసృష్టిలో భిన్నత్వం ఉంది. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఈ ఏకత్వాన్ని అర్ధం చేసుకోవడమే మానవజన్మ యొక్క లక్ష్యం.

               నానాకు బాబా ఎన్నో బోధలు చేశారు. నానా ద్వారా సర్వమానవాళి ఉపయోగపడే మంచి ఉపదేశాలను బాబా మనకు ఇచ్చారు. నానా సామాన్యుడు కాదు, మంచి తత్వవేత్త, బాగా చదువుకొన్నవాడు ఆచారవ్యవహారాలను మిక్కిలి శ్రద్ధగా పాటించే వ్యక్తి. కాని మనలో మనకు తెలియకుండా కొన్ని నిక్షేపాలు దాగి ఉంటాయి. అవి గురువు మాత్రమే బయటికి తీయగలరు. బయటకు తీసి వాటిని సమూలంగా నాశనం చెయ్యగల శక్తి ఒక్క గురువుకే ఉంది. మనమందరం కామ, క్రోద మధ మాత్సర్యములకు బానిసలమే. ఈ అరిషట్‌వర్గములు అందరిని లొంగ తీసుకుంటాయి. ఇవె మన అధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడతాయి. అందుకే బాబా వీటికి సంబందించిన లీలలు చేసి నానాకు నేర్పించకుండా నేర్పించారు. బాబా భగవద్గీత శ్లోకానికి చక్కటి అర్ధం చెప్పి నానాలో ఉన్న అహంకారాన్ని పారద్రోలాడు. ఆ తరువాత బాబా యొక్క పరిజ్ఞానం అర్ధం చేసుకుని నానా ఈ విధంగా బాబాను కోరాడు. బాబా ఇన్నాళ్ళు నాకు భగవద్గీత తెలుసు అనుకున్నాను కాని నాకు ఆ గీత అర్ధం కాలేదని తెలిసింది. నాపై దయయుంచి నాకు భగవద్గీత అంతా రోజు కొంచెం చెప్పండి. అని అడుగుతాడు.

               అప్పుడు బాబా. నానా నేను బోధించేది ఏమీలేదు. రోజు నా దగ్గరకురా నీవే అర్ధం చేసుకుంటావు అని అంటారు. ఆ తరువాత నానా రోజు బాబా దగ్గర కూర్చుని బాబా ఏమి బోధించకుండా భగవద్గీతలోని గూడార్ధములను నేర్చుకున్నాడు. ఇదే బాబా ప్రత్యేకత. బాబా మౌన వాక్య చేస్తారు. అంటే మౌనంగానే మనకు అది అర్ధం అయ్యేలా చేసి, మన జీవితంలో మార్పు తీసుకువస్తారు. దీన్నే దక్షిణామూర్తి విధానమంటారు. ఆ ఆదిగురువు సనక సనందాదులకు మౌనంగానే బ్రహ్మజ్ఞాన బోధచేసారు. అందుకే బాబాను దక్షిణామూర్తిగా మనం ధ్యానించాలి. బాబా మానసిక పరివర్తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. మనం ఎన్ని గ్రంధాలు చదివినా ఆ సద్గురువుల కృపలేనిదే మనం కొంచెం కూడా ముందుకు వెళ్ళలేము. సాయి కోరిన శ్రద్ధ, సబూరి ఉంటే చాలు పెద్ద పర్వతాలనైన కదిలించవచ్చు.
 
               ఒకసారి నానా ద్వారకామాయిలో కూర్చుని ఉండగా, మహల్సాపతి మరియు బాబా ఏదో సంబాషణలో ఉన్నారు. ఇంతలో ఒక గృహస్తుడు వైజాపురం నుంచి బాబా దర్శనార్ధం వచ్చాడు. అతనితో స్త్రీలు ఘోషా (అంటే ముసుగు) దరించి ఉన్నారు. వారిని చూచి నానా అక్కడ నుంచి లేచి వెళ్ళబోతుంటే బాబా నానాను వారించి కూర్చోమంటారు. వారిలో ఒక స్త్రీ బాబాకు వందనం చేస్తున్నప్పుడు ఆమె ముఖముపై ముసుగు తొలగింది.
ఆమె సౌందర్యానికి నానా మనసు చలించింది. మరల ఆమె ముఖం చూడాలి అని అనిపించింది. అలానే దొంగచూపులతో చూస్తాడు. కాని బాబా దగ్గర తన మనసు దారి తప్పటంతో నానా చాలా సిగ్గుపడ్తాడు. బాబా ఆయనను తొడమీద కొట్టి నేను ఎందుకు కొట్టాను? అని అడుగుతారు. అప్పుడు నానా, బాబా మీకు తెలియంది
ఏముంది. నా మనసు మీ సమక్షంలో కూడా ఎందుకు చలించింది. అని అడుగుతాడు. అప్పుడు బాబా! నానా నీ మనసు ఎందుకు కలవరపడుతోంది? ఇంద్రియాలు వాటి ధర్మం ప్రకారం నడుచుకొంటాయి, వాటిని ఎందుకు అడ్డగించాలి? వాటి వల్ల మనకు ఎటువంటి హానిలేదు. బ్రహ్మదేవుడు సృష్టికర్త. అతని రచనను మనం ఆస్వాదించాలి. లేకపోతే ఈ సృష్టి వైశిష్ట్యం వ్యర్ధమై పోదా? ఈ సృష్టి, సృష్టిగానే ఉంటుంది. మనసు క్రమంగా శాంతిస్తుంది. మనకు ఎన్నో అందమైన దేవాలయాలు చక్కటి రంగులతో ఉన్నాయి. మనము దేవాలయాల బాహ్య సౌందర్యం కోసం వెళ్తామా లేక లోపల ఉన్న భగవంతుడి కోసం వెళ్తామా. బాహ్యసౌందర్యాన్ని ఆస్వాదిస్తూ లోపలనున్న దేవుడ్ని గుర్తు చేసుకోవాలి. అలానే భగవంతుడు ఒక్క దేవాలయంలోనే లేడు, అన్ని ప్రాణులలో ఉన్నాడు. కాబట్టి నీవు ఒక అందమైన ముఖము చూసినప్పుడు దానిలోని సౌందర్యంతో పాటు ఆ అందాన్ని ఇచ్చిన భగవంతుడ్ని ఆ అందంలో చూడు. ఇంత అందాన్ని సృష్టించిన ఆ భగవంతుడు ఎంత శక్తి వంతుడో అర్ధం చేసుకో. ఇలా బాబా ఎంతో చక్కటి బోధచేసి నానాలోని ఆలోచనలకు అర్ధం చెప్పారు.  
 
               ఆ తరువాత నానా ఈ బోధన ఆచరణలో పెట్టి తన మనసుపై విజయం సాధిస్తాడు. ఇప్పుడు ఆ కథను మనము చెప్పుకుందాము.

బన్నూ మాయి కథ 
               బన్నుమాయి అనే 20 ఏళ్ళ ముస్లిం యువతి బోడేగావ్ అనే ఊరిలో ఉండేది. ఆ ఊరు అహ్మద్‌నగర్‌కు 50 మైళ్ళ దూరంలో ఉండేది. ఆమె నగ్నంగా అక్కడ ముళ్ళ పొదల్లో అడవి ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. ఆమె పిచ్చిదని అందరూ అనుకునేవారు. ఆమె తల్లి బన్నుమాయి పిచ్చి కుదరటం కష్టమని ఆశలు వదులుకొంది. కాని కొంతమంది మాత్రము ఆమె ఒక దివ్యాత్మ అయి ఉంటుంది అని అనుకునే వారు. ఆమెకు శరీర స్పృహ ఉండేది కాదు. ముళ్ళు గుచ్చుకుని నెత్తురు వస్తున్నా ఆమె పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేది. నానాకు ఈ విషయం తెలిసి ఆమె దర్శనం చేసుకోవాలి అనుకొన్నాడు. బాబాను అనుమతి అడిగాడు. మొట్టమొదట బాబా వద్దన్నాతరువాత కలవమని చెప్తారు. నానా ఇంకొకరితో కలసి చీర పసుపు, కుంకుమ, గాజులు మరియు ఆహారం తీసుకొని వెళ్తాడు. వారు ఒక గుడారం వేసి ఆమె దర్శనం కోసం వేచి ఉంటారు. కాని ఆమె జాడ తెలియలేదు. అక్కడ వాళ్ళను ఆమె గురించి అడిగితే వారు నానాను అనుమానించి, విసుక్కుంటారు. తరువాత నానా బాబాను తలుచుకుంటాడు. కళ్ళు తెరవగానే బన్నుమాయి తన ఎదురుగ నిలబడి ఉంది. ఆమెకు నమస్కరించి, చాలా భక్తితో ఆమె కాళ్ళలో ఉన్న ముళ్ళు తీస్తాడు. ఆమె వెంటనే మాయమవుతుంది. నానా తను తెచ్చిన వస్తువులను ఆమె స్వీకరించి ధరించాలి అని కోరుకుంటాడు. మళ్ళీ బాబాను ప్రార్ధిస్తాడు. ఆమె మరల ప్రత్యక్షం అయి తను తెచ్చిన బట్టలు కట్టుకుని, అక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుంది.

               నానా అక్కడ దేవాలయంలో తలుపులు వేసుకుని, తెల్లవారిన తరువాత వెళ్ళవచ్చు అనుకొంటాడు. తను ఆ పార్వతి మాతను దర్శించినంత ఆనందంతో మరల ఒక్కసారి ఆమె దర్శనం కలిగితే బాగుండు అనుకొంటాడు. మరో నిముషంలో ఆమె నానా ముందు ప్రత్యక్షం అవుతుంది. గుడి తలుపులు వేసినవి వేసినట్లే ఉన్నాయి, కాని ఆమె లోపల ప్రత్యక్షం అయింది. ఆమెకు భక్తి పూర్వకంగా నమస్కరించి ఆమె పాదాలపై మోకరిల్లుతాడు. నానాలో ఏదో తెలియని ప్రశాంతత, నిర్మలత్వం చోటు చేసుకున్నాయి. ఆమె మరల అదృశ్యమైంది. ఈ విధంగా నానా తన మనసులో ఎటువంటి భావోద్రేకం లేకుండా భక్తి భావనతో బాబా భోదించిన తీరులో తనలోని మనో చాంచల్యాన్ని అధిగమించాడు. సద్గురుసాయి ఎంతటి దయామయుడో ఎంతటి కరుణ చూపిస్తారో మనం ఈ సందర్భాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాలను మనకు అందించిన శ్రీ నరసింహస్వామి  గారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము. ఆయన ఎంతో మంది సాయి భక్తులను కలసి సేకరించిన విషయాలు మనలాంటి సాయి భక్తులకు ఆయన ప్రసాదించిన వరం.

అట్లానే శ్రీ నరసింహ స్వామి గారు చెప్పిన మరో సన్నివేశం ఇప్పుడు మనం చూద్దాము.
               నానా బాబాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. నానా మంచి విద్యావంతుడు. బ్రాహ్మణ కుటుంబంలో నున్నవాడు. బాబాతో ఉన్న ఈ సఖ్యతను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోతాడు. బాబా ఆరతి సమయంలో వందల మంది నిలబడి ఆరతి పాడేవారు. ఉపాసని బాబా, బాపు సాహెబ్‌జోగ్ మొదలైనవారు కూడా నిలబడి ఆరతిలో పాల్గొనేవారు. నానా మాత్రం బాబా పక్కనే కూర్చుని ఆరతిలో పాల్గొనేవారు. అట్లానే బాబా తీర్ధం కూడా అందరూ తీసుకునే వారు. నానా మరియు దాసగణు మాత్రం తీర్ధం తీసుకునేవారు కాదు. బాబాకు ఆరతి దగ్గర నిలబడటం తీర్ధం తీసుకోవడం ముఖ్యం కాదు. కాని గురువులో దైవాన్ని గుర్తించడం ముఖ్యం. ఇదే నానాకు నేర్పించాలి అని అనుకున్నారు.

               నానాకు 8 పూరే పోలిలు తయారుచేసి నైవేద్యంగా తెమ్మంటాడు. నానా చాలా భక్తితో చేసుకుని వచ్చి బాబా ముందు ఉంచుతాడు. బాబాను తినమని ప్రార్ధిస్తాడు. కాని బాబా ఏమి తినకుండా కూర్చుంటారు. మళ్ళీ నానా, బాబాను తినమని అర్ధిస్తాడు. బాబా అప్పుడు నేను తినను, నీవు దీన్ని ప్రసాదంగా తీసుకు వెళ్ళు అని అంటారు. నానా వాటి మీద ఉన్న ఈగలను చూస్తూ అసహనంతో వాటిని తీసుకొని వెళ్తాడు. బాబా మరల నానాను పిలిపిస్తారు. నానా వచ్చి మీరు నేను పెట్టిన నైవేద్యం ఎందుకు స్వీకరించలేదు అని ప్రశ్నిస్తాడు.

               అప్పుడు బాబా, నానా నాతో 18 ఏళ్ళు ఉన్నావు. నన్ను అర్ధం చేసుకున్నది ఇంతేనా, బాబా అంటే ఈ శరీరం మాత్రమే అనుకున్నావా? నేను దాని మీద ఈగలో లేనా? అక్కడ ఉన్న చీమలో లేనా? అని అంటారు. అప్పుడు నానా ఆ విషయం నాకు తెలుసు, కాని నాకు ఇది అనుభవంలోకి లేకుండా ఎట్లా దృడపడుతుంది. దేవుడు, గురువు సర్వంతర్యామి అని తెలుసు కాని నాకు ఆ అనుభూతి కలుగలేదు. అప్పుడు బాబా తనచేతిని గాలిలో తిప్పుతారు. అంతలో నానాకు ఒక అనుభూతి కలుగుతుంది. కాని నానా ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పలేదు. కాని అనుభూతి పొందానని మాత్రం వెళ్ళడించారు.

               ఈ విధంగా బాబా మరొక్కసారి తను మౌనభొద చేసే వారే కాని, మాటల్తో చెప్పేవారు కాదు అని నిరూపించారు. ఇలా నానాకు ఎన్నో అనుభవాల్ని ఇచ్చి, తను అధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళేందుకు చేయూతనిచ్చారు. నానా 1921లో పూణాలో దేహత్యాగం చేశారు.


               మనకు మన ఆచార వ్యవహారాలు, మనం మంచి అలవాట్లు అనుకునే సంప్రదాయాలు, విద్యావాసన (అంటే శాస్త్రాల పరిజ్ఞానం) ఒక్కోసారి అడ్డుగోడలు అవుతాయి. నానా విషయంలో కూడా ఇవే ఆటంకాలు అవుతాయి. కాని బాబా సర్వజ్ఞులు వారికి సర్వం తెలుసు. ఒక సాధకుడ్ని ఏ మార్గంలో నడిపించాలి, ఏమి అడ్డుపడుతున్నాయి, ఏమి అవసరమో అది మాత్రమే నేర్పించేవారు బాబా . అన్ని జబ్బులకు ఒకే మందు ఇచ్చే గురువులు ఎంతోమంది ఉండవచ్చు. కాని బాబా తత్వమే వేరు. అసలు ఒక తత్వము అని చెప్తే అది తప్పే అవుతుంది. సద్గురువులు సాధకుడికి తగ్గ మందుని ఇచ్చి, ఈ ఆది వ్యాదులనుంచి రక్షిస్తారు. ఈ భవసాగరాన్ని దాటించే అద్భుతశక్తి సద్గురువు.

ఓం శ్రీ సాయి రాం!

No comments:

Post a Comment