Play Audio |
ఉపాసని బాబా పూర్తి పేరు కాశినాధ గోవింద ఉపాసని శాస్త్రి. బాబా భక్తులలో ఉపాసని బాబాకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఈయన గురించి సమాచారం సాయిలీల మాసపత్రికలో ప్రచురించబడింది. ఉపాసని బాబా ద్వారా సాయి ప్రచారం బాగా జరిగింది. ఆయనను కలవడం కోసం ప్రజలు గంటలు గంటలు నిలబడి మరీ దర్శనం చేసుకునేవారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలానే 1927లో మహాత్మగాంధి కూడా ఉపాసని బాబాను కలవడం జరిగింది. ఆయన ఒక సిద్ద పురుషుడిగా ఎన్నో మహిమలను చూపారు. స్త్రీ జాతికి ఆయన చేసిన మేలు ఎన్నటికి మరువరానిది. ఆడవాళ్ళకు వేదం మరియు ఆధ్యాత్మిక సంపద దక్కాలని ఆయన చేసిన కృషి అపారమైనది. శ్రీ నరసింహస్వామి గారు షిర్డి దర్శించుకునే ముందు ఉపాసన బాబా ఆశ్రమంలో చాలా రోజులు ఉన్నారు. ఆయన జీవితానికి సంబంధించి విశేషాలను చాలా రాశారు.ఉపాసని బాబా ఖ్యాతి 1920-1934 మధ్య బాగా లోకవిదితమైంది.
ఉపాసని బాబా 1870వ సంవత్సరంలో మే
15వ తేదిన ఒక విశిష్టమైన బ్రాహ్మణ వంశంలో జన్మించారు. ఆయన తాతగారు శ్రీ గోపాలశాస్త్రి
గారు అప్పట్లో బరోడా రాజు ఆస్థానంలో సలహాదారుగా ఉండేవారు. శాస్త్రాలకు సంభందించిన మరియు
దైవసంబంద విషయాలలో వారు సలహాలు ఇచ్చేవారు. గోపాలశాస్త్రి గారు ఎన్నో పుస్తకాలు రాయడం
జరిగింది. ఉపాసని బాబా తండ్రిగారి పేరు గోవింద శాస్త్రి, తల్లి పేరు రుక్మిణి బాయి.
ఆయన మంచి విద్యావంతులైనా వృత్తిరీత్య ధూలియా
కోర్టులో ఉద్యోగం చేసేవారు. గోవింద శాస్త్రి గారికి 5గురు పుత్రులు ఉన్నారు. వీరి కుటుంబం
సంప్రదాయబద్దంగా ఆలయ పూజారులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించేవారు. వీరు సతాన అనే గ్రామంలో
ఉండేవారు. వారి సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. వారి సంపాదన తిండికి మాత్రమే సరిపోయేది.
ఉపాసన బాబాకు చదువు మీద అసలు ఆసక్తి
ఉండేది కాదు. ఆయన ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు ఒకసారి పంతులుగారు ఉపాసనని కొడ్తారు.
అప్పుడు బాలుడైన ఉపాసని గ్రామ మునసబు దగ్గరకు పోయి తనను పంతులుగారు కొట్టారని చెప్తారు.
ఆ తరువాత ఆయన చదువు సాగలేదు. పౌరోహిత్యానికి సంబందించిన కొన్ని వివరాలను మాత్రం నేర్చుకుంటారు.
కాని దాని మీద కూడా ఆయన మనసు నిల్వలేదు. ఉపాసని గారి పెద్ద అన్నయ్య బాలకృష్ణ శాస్త్రి
గారు గొప్ప సంస్కృత విద్వాంసులు. ఆయన బొంబాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉండేవారు.
ఉపాసని మాత్రం అందరు ఎందుకు పనికిరాని వాడని అనుకునేవారు. ఆయన తల్లి తండ్రులు పెళ్ళి
చేస్తే నైనా బాగుపడ్తాడు అని 1883లో 14 ఏళ్ళ వయసులో 8 ఏళ్ళ అమ్మాయితో పెళ్ళిచేస్తారు.
ఆ అమ్మాయి 1885లో చనిపోతుంది. మరల ఇంకో అమ్మాయితో
పెళ్ళిచేస్తే ఆ అమ్మాయి కూడా ఒక సంవత్సరం తర్వాత చనిపోతుంది. ఇట్లా పెళ్ళితో ఆయనను
కట్టివేసారని ఉపాసని చాలా అసహనంతో ఉండేవారు. ఒకసారి ఇంట్లోనుంచి వెళ్ళి కొన్ని రోజులు
బయట ఉండి మరల ఇంటికి వస్తారు.
1890వ సంవత్సరంలో ఇక ఇంట్లో ఉండలేక
తనకి ఇష్టమైన ఆథ్యాత్మిక సాధన కోసం ఇల్లు వదలి వెళ్తారు. ఆయన భూర్కడ్ కొండ అనే అరణ్య
ప్రాంతంలో ఏకాంతం కోసం వెతుకుతూ ఉంటే ఆయనకు ఒక కొండ కనిపిస్తుంది. దానిలో ఎత్తైన ప్రదేశంలో
ఒక గుహ, దానిలోకి వెళ్ళేందుకు ఒక చెట్టుకొమ్మ ఉంటాయి. ఉపాసని మెల్లగా ఆ చెట్టు ఎక్కి
కొమ్మపై నుంచి ప్రాకి ఆ గుహలో ప్రవేశిస్తారు. ఈ ప్రదేశం ఏకాంతంగా ధ్యానం చేసేందుకు
చాలా బాగుందని బావిస్తాడు. అక్కడ ఉంటే ఆహారం దొరకదు తను ఉపవాసం ఉండాలి. అక్కడ నుంచి
క్రిందకు రావడం కూడా కష్టం. ఇలా ఆలోచిస్తూనే ధ్యానంలోకి దిగుతారు. ఇలా చాలా రోజులు
ఆహార పానీయాలు లేకుండా ధ్యానం చేస్తూ ఉంటారు. అప్పుడు శరీరం అంతా గట్టిగా అయిపోయి అపస్మారక
స్థితికి రావడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ స్థితిలో నుంచి బయటపడతారు. వెంటనే
దాహం వేస్తుంది. ఇంతలో ప్రకృతి కరుణించి వర్షం కురుస్తుంది. ఆయన శరీరం అంతా మొద్దుబారుతుంది.
ఒక్క కుడి చేతిలో మాత్రం కదలిక ఉంది. ఆ వర్షం నీరు ఆ గుహ అంచుల మీదగా కారి తన చేతిలో
పడడంతో తన దాహం తీర్చుకొంటారు. తరువాత తన కుడి చేతితో శరీరాన్ని మర్ధన చేసి దానిలో
కొంచెం చలనాన్ని తెప్పిస్తారు. కాని ఇంతలో ఆయనకు ఒక కల వస్తుంది. దానిలో ఒక హిందూ వ్యక్తి
మరియు ముస్లిం వ్యక్తి తన చర్మాన్ని పూర్తిగా లాగేస్తూ ఉంటారు. ఇంతలో తన చర్మం పోగానే
దాంట్లో ఒక కాంతివంతమైన శరీరం కనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఈ విధంగా అంటారు. నీవు ఎందుకు
చనిపోవాలని ప్రయత్నిస్తున్నావు. మేము నిన్ను చనిపోనివ్వము అని మాయమవుతారు. అప్పుడు
ఉపాసని అక్కడ నుంచి వెళ్ళాలని అక్కడ ఉన్న కొమ్మ పైకి ప్రాకి బల్లిలా జరుగుతూ ఉంటాడు.
శరీరంలో శక్తి పూర్తిగా నశించింది.
ఇలా ప్రాకుతూ ఉండగా, పట్టుజారి 20 అడుగులు
క్రిందకు పడ్తారు. అలా తను ప్రాకుకుంటూ ఎవరైన కనిపిస్తారని ఎదురుచూస్తూ ఉంటారు. అదృష్టమేమిటి
అంటే తనకు దెబ్బలు ఏమి తగలకుండా బయట పడ్తారు. ఇంతలో కట్టెలు ఏరుకునేందుకు వచ్చిన గ్రామస్తులు
ఆయనను తీసుకువెళ్ళి మరల మామూలు మనిషిని చేస్తారు. తరువాత కాలంలో ఆయన శిష్యులు అక్కడి గుహను ఒక మందిరంగా మలిచారు.
ఆ తరువాత ఉపాసని బాబా పూణాకు వెళ్తారు. అక్కడ తన అన్నయ్య ప్రొఫెసర్‌గా ఒక కాలేజీలో
పనిచేస్తూ ఉంటారు. తన అన్న దగ్గరకు వెళ్ళకుండా అక్కడే భిక్షాటన చేసి కాలం వెళ్ళబుచ్చుతుంటాడు.
ఒక్కో రోజు ఆహారం కూడా దొరొకేది కాదు. 1891లో తన తాత అయిన గోపాలశాస్త్రి గారు చనిపోతారు.
అప్పుడు ఉపాసని తను ఏదో రకంగా సంపాధన చెయ్యాలని నిశ్చయించు కొంటారు. సంగ్లీ అనే ప్రదేశానికి
వెళ్ళి వెంకట రమణాచారి గారి దగ్గర ఆయుర్వేదం మరియు సంస్కృతం నేర్చుకుంటారు. ఆ తరువాత
1896 నుంచి 1905 దాకా వైద్యుడిగా ఉన్నారు. ఆయన సొంతంగా కొన్ని ఔషధాలను తయారుచేసి అమ్మేవారు.
అక్కడే ఆయనకు బాలగంగాధర్‌కి కుడి భుజమైన జి.ఎస్. కపర్డె గారితో పరిచయం అవుతుంది. కపర్డె
గారు ఉపాసనిగారి దగ్గర మందులు కోసం వచ్చేవారు. ఇలా కొంత ధనాన్ని కూడబెట్టి మాలగుజారి
అనే 2000 ఎకరాల స్థలాన్ని కొంటారు. తరువాత తనుచేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుస్తుంది.
అక్కడ ఉన్న అద్దె వారు డబ్బులు సరిగ్గా కట్టరు. దీనితో ఆయన కట్టాల్సిన డబ్బు కట్టలేక
ఆ స్థలాన్ని పోగొట్టుకుంటారు.అప్పటికే ఆయనకు మూడోసారి పెళ్ళి జరిగి భార్యతో కలసి తీర్ధయాత్రలు
చేయాలని అనుకొంటారు.
ఆయన ఇటు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని అటు
డబ్బులేక చాలా కష్టాలు పడ్తారు. నర్మదా, కావేరి నదుల దగ్గర సోమనాథ్ ఆలయం దగ్గర శివారాధన
చేస్తారు. ఆయన ప్రాణాయామం చేస్తుండగా ఆయన స్పృహ కోల్పోతారు. భార్య కొంచెం నీళ్ళు తెచ్చి ఆయన మీద చల్లగా, స్పృహ వస్తుంది. కాని ఆయన శ్వాస మాత్రం సరిగ్గా ఉండదు. అతి కష్టం మీద కొద్దిగా
శ్వాస మాత్రం ఆడుతూ ఉంటుంది. దానికి మందు కోసం వైద్యులను సంప్రదించినా ఉపయోగం లేకపోతుంది.
ఎవరో యోగులను కలిస్తే వాళ్ళె సహాయం చేయగలరు అని చెప్తారు. ఏప్రియల్ 1911లో రాహరి యోగి
అనే ఆయనను కలుస్తారు. ఉపాసని కథ అంతా విని ఆ యోగి, నువ్వు సాయిబాబా దగ్గరకు వెళ్ళు
అని సలహా ఇస్తారు. ఈ పేరు ముస్లిం పేరులాగ ఉంది. నేను ఆయనకు వంగి నమస్కరించడం ఏమిటి?
అని వెళ్ళడానికి నిరాకరిస్తారు. ఇంతలో ఒక ముస్లిం వృద్ధుడు కనిపించి ఏమిటి నీ బాధ అని
అడుగుతాడు.
చల్లగా ఉండే నీరు తాగవద్దని చెప్పి
ఆయన వెళ్ళిపోతారు. ఉపాసని బాబా ఈ విషయం పట్టించుకోక జిజూరిలో ఉన్న హిందూయోగిని కలుద్దామని
వెళ్తారు. అక్కడ కూర్చుని ధ్యానం చేస్తుండగా మరల దాహం వేసి నీరు తాగుటకు ఒక సెలయేరుని
సమీపిస్తారు, నీరుత్రాగబోతూ ఉండగా ఇంతకు ముందు కనిపించిన ముస్లిం వ్యక్తి వచ్చి ఏమిటి
చనిపోదాము అనుకుంటున్నావా! చల్లని నీరు తాగవద్దని చెప్పానా? అని హెచ్చరించి వెళ్తాడు.
ఈ వ్యక్తి 150 మైళ్ళ దూరం వచ్చి మరల నాకు ఈ విషయం చెప్పాడు అని ఊరిలోకి వెళ్ళి మంచినీరు
తాగి తన దాహం తీర్చుకుంటాడు.
No comments:
Post a Comment