ఒకసారి
షిర్డిలో మరియు చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్లేగు వ్యాధి బాగా ప్రబలింది. ఖపర్డె కుమారుడైన
బల్వంత్ ఖపర్డె తన తల్లితో ఆనందంగా షిర్డిలో ఉన్నాడు. అప్పుడే ఆ పిల్లవానికి ఒళ్లు కాలి పోయెంత
జ్వరం. ఆ కన్న తల్లి హృదయం ద్రవించిపోయి అశాంతితో మనసు తల్లడిల్లిపోయింది. ఆమె బాబుని
తీసుకొని తన ఊరైన అమరావతికి వెళ్ళాలని నిశ్చయించి బాబా అనుమతి కోసం వచ్చింది. బాబా
అప్పుడే బయటకు వెళ్తూ వాడా దగ్గరకు రాగానే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది. తన కుమారునికి
ప్లేగు జ్వరం వచ్చిందని విన్నవించుకొంది. ఆమెతో బాబా మృదువుగా పలుకుతూ ఈ విధంగా అన్నారు.
"ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి,
వర్షం పడి పంట పండుతుంది. మేఘాలు తొలగిపోతాయి, ఎందుకు భయపడతావు" అని అంటూ తన కఫినీని
ఎత్తి నిగనిగలాడుతున్న కోడి గుడ్డంత ప్రమాణంలో ఉన్న నాలుగు బొబ్బలను చూపించారు. "చూడు మీ కష్టాలను నేనిలా అనుభవించాలి"
అని చెప్పారు. దివ్యము అలౌకికము అయిన ఈ లీలలను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. సత్పురుషులు
భక్తుల కొరకు అనేక కష్టాలను ఎలా అనుభవిస్తారో కదా! మైనం కంటే మెత్తగా నవనీతం లాంటి
మనసు గల బాబా ఏ లాభం లేకుండానే భక్తులను ప్రేమిస్తారు. భక్తులే వారి బంధువులు.
సాయి ఖపర్దెలో తీసుకువచ్చిన మార్పులు
సాయి
తన భక్తుల కష్టాలను, వ్యాధులను స్వీకరించడమే కాకుండా వారిని సరియైన మార్గంలో నడిపిస్తారు.
మనలో ఉన్న దుర్గుణాలను నిర్మూలిస్తారు. అట్లానే మంచి అలవాట్లను కలగ చేస్తారు. మానసిక
పరివర్తనను తీసుకు వస్తారు. అందుకే గురువులను మించిన మానసిక తత్వవేతలు లేరు. మనము గురువుకు
సర్వము సమర్పించుకోవాలి. అప్పుడే వారు మనలను కావలసిన విధంగా మలచగలరు. ఇదే ఖపర్డె విషయంలో
కూడా జరగవలసి ఉంది.
ఒకరోజు సాయి శ్యామాతో ఇలా అన్నారు.
"నేను, ఖపర్డె ఒకే కుటుంబానికి చెందినవారము, కాని కొంతకాలానికి అతడు కుటుంబాన్ని
విడిచిపోయి రాజుగారి కొలువులో ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. కీర్తి, ధనం, సంసార సుఖం,
పదవి కోరే రాజస ప్రవృత్తి, అతడికి వెనుకటి జన్మలోనే ఉన్నది" అని తెలిపారు.
ఈ మాటలలో ఎంతో గూడార్దం ఉంది. మనమందరం
ఆ కోవకు చెందిన వారమే. మనము పరమాత్మ పరమానందాన్ని వదలి క్షణికమైన ప్రాపంచిక సుఖం వైపు
పరుగులు పెడ్తాము. మనకు కీర్తి కావాలి, మన మాట నెగ్గాలి. అందరూ మన గురించి గొప్పగా
చెప్పుకోవాలి. దీనికి ధనం మరియు పదవీ కావాలి. ఇక భోగాలు, సుఖాలకు మనము బానిసలవుతాము.
ఇవన్నీ అధ్యాత్మిక ప్రగతికి అడ్డువస్తాయి. అలా అని బాబా ముక్కుమూసుకుని తపస్సు చేయమన
లేదు. ధర్మముతో, న్యాయముగా ఈ సంఘంలో నడుచుకొని ఆ భగవంతుడ్ని స్మరించమన్నారు
.
ఖపర్డెకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి.
బాగా ధనం సంపాయించాడు. కుటుంబంతో సర్వసుఖాలు అనుభవించాడు. కాని బాబా నేర్పాలనుకున్నవి
వైరాగ్యం, భక్తి, జ్ఞానము, అహకారము లేకుండా ఉండుట గురువు పట్ల శ్రద్ద మరియు సబూరి వీటికి
తగ్గట్లుగా మన జీవితంలో జరిగే సంఘటనలను బాబా వాడుకున్నారు. ఒక్కోసారి ఆయనే కొన్ని సంఘటనలను
సృష్టించారు. వీటివల్ల మనలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. అట్లాంటి సంఘటనే ఖపర్డె జీవితంలో
కూడా జరిగింది.
ఒకసారి ఖపర్డె కుటుంబం షిర్డిలో
చాలా రోజులు ఉంటారు. ద్వారకామాయిలో బాబాకు పరిచర్యలు చేస్తూ లక్ష్మీబాయి ఖపర్డె
ఆనందంగా ఉంటారు. ఇంకోవైపు ఖపర్డె కూడా కూర్చుని ఉంటారు. వారు తెచ్చుకున్న డబ్బు అంతా
అయిపోతుంది. లక్షలలో మునిగి తేలినవారు, ఇప్పుడు అసలు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఈ విషయం
బాబా గ్రహించి, దీక్షిత్ చేత 200 రూపాయలు శ్రీమతి ఖపర్డెకు ఇప్పిస్తారు. ఇది చూసిన
ఖపర్డె మనసు విలవిలాడిపోతుంది. ఇంత బతుకుబతికి చివరికి వేరేవాళ్ళ దగ్గర అదీ నా ఎదురుగా,
నా భార్యకు డబ్బు ఇవ్వడం అని చాలా బాద పడ్తాడు. ఇక్కడే బాబా ఖపర్డెకు వైరాగ్యం, అహంకార
రహితముగా ఉండటం అనే అంశాలను నేర్పాలని అనుకున్నారు. తరువాత కాలంలో ఖపర్డె కుటుంబానికి
ఇవి చాలా ప్రశాంతతను చేకూరుస్తాయి.
బాబాను కలసిన తర్వాత బాలగంగాధర్
తిలక్ ఆగస్టు 1, 1920 వ సంవత్సరంలో చనిపోతారు. తిలక్ గారు జైలులో ఉండి వ్రాసిన భగవద్గీత
రహస్యం సచ్చరితలో చెప్పబడింది. తిలక్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలను పాటిస్తూ సాయి
నేర్పిన బోధలతో జీవితమే ఒక సాధనగా ఖపర్డే ముందుకు సాగుతూ వెళ్తారు.
శ్రీమతి ఖపర్డె నిర్యాణము
1928
తర్వాత లక్ష్మీబాయి ఖపర్డె ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆమెకు మాటిమాటికి జ్వరం, ఆస్త్మ(ఉబ్బసం)
వస్తూ ఉండేవి. మోకాళ్ళలో నీరువచ్చి ఆమెకు నడవడం కష్టమైంది. ఖపర్డె గారు వ్రాసిన ఏప్రిల్
30, 1928 డైరీలో ఈ విధంగా చెప్పారు. ఆమెకు ఆ రోజు బాగా తలనొప్పి, జ్వరం వచ్చాయి.
ఆమె ఆరోగ్యం ప్రతిరోజు క్షీణిస్తోంది. మందులు కూడా పనిచేయడం లేదు. ఆమెకు ఈ విషయం ముందే
తెలుసేమో కుటుంబం అందర్ని పిలిపించి ఫొటోలు తీపించమని అడిగింది. తరువాత ఆయన ఈ విధంగా
వ్రాసారు.
నేను సంధ్య ఆరతులు చేసుకుంటుండగా,
నా భార్య వచ్చి, నన్ను పూజించడం మొదలు పెట్టింది. అదెలా ఉంది అంటే ఒక దేవుడికి ఎలా మనము
పూజ చేస్తామో అలానే ఆమె చేసింది. ఇలా ఆమె ఎన్నడూ చేయలేదు. అప్పుడు ఇలా చెప్పింది. నేను
ఈ ప్రపంచం నుండి ప్రశాంతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. తరువాత ఆమె 8 రోజులు అస్వస్థతో
ఉండి జులై 20, 1920వ సంవత్సరంలో కన్నుమూసారు. ఆమెకు చనిపోయే ముందు బాబా దర్శనం అవుతుంది.
ఆమె చనిపోయిన విషయం గురించి ఖపర్డె
గారు ఈ విధంగా తన డైరీలో వ్రాసుకున్నారు. ఆమె 3.15 మధ్యాహ్నం ఈ శరీరం వదిలి వేసింది.
నన్ను నేను ఓదార్చుకోవాల్సి వచ్చింది. అందరూ అన్నారు ఆమె చాలా అదృష్టవంతురాలని పసుపు,
కుంకుమలతో చనిపోయిందని. అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇంటికి వచ్చాము. అప్పుడు నాకు తెలిసింది
కొన్నివారాల క్రితమే తన దగ్గర ఉన్న వస్తువులను అందరికి పంచిపెట్టిందని. అందరిని సుఖంగా
ఉండమని ఆశీర్వదించిందని తెలిసింది. అంతేకాక బాబా దర్శన బాగ్యం కూడా కల్గిందని తెలిసింది.
చివరలో ఆమె మందులు అడగలేదు, ఏదో తెలియని ప్రశాంతత, అమిత ఆనందం ఆమెలో కనిపించేవి,. అని
ఎంతో చక్కగా వ్రాసారు.
ఖపర్డెగారి
చివరి రోజులు
ఖపర్డె
గారు 1894 నుంచి 1938 వరకు దాదాపు 45 డైరీలు వ్రాసి ఉండవచ్చని అతని కుమారుడు చెప్పడం
జరిగింది. ఆయన వాడిన డైరీలు ఒక్కొక్కటి 12.5 అంగుళాల పొడుగు, 8 అంగుళాల వెడల్పు ఒక్క
పేజీ ఒక్క రోజుగా ఉండేది. ఆయన ఎప్పుడూ ఆ డైరీని తనతో తీసుకు వెళ్ళేవారు.ఒక్కోసారి అర్ధరాత్రిలో
కూడా వ్రాసి పడుకునే వారు. తరువాత కాలంలో ప్రొద్దునే లేచి నిన్నటి విషయాలు వ్రాసేవారు.
ఆయన తన డైరి చనిపోయే దాకా వ్రాస్తూనే ఉన్నారు. ఒక్క చనిపోయే రోజు, అంతకు ముందు రోజు
ఆయన డైరీ వ్రాయలేకపోయారు. ఆయన సాయిని చింతిస్తూ ప్రశాంతంగా జులై 1, 1938లో పరమపదించినారు.
ఖపర్డె గారి కుటుంబంకు మనము ఎంతో ఋణపడి ఉన్నాము. వారి ద్వారా మనకు బాబా ప్రసాదించిన
దివ్య సందేశాలు వెలుగులోకి వచ్చాయి. అటువంటి వారిని గురించి తెలుసుకోవడం మన పూర్వ జన్మపుణ్యం.
ఇలా బాబా ఖపర్డెలో మరియు శ్రీమతి
ఖపర్డెలో ఎన్నో మార్పులు తీసుకువస్తూ ఒక ప్రక్క దృష్టిపాతాలతో వాళ్ళలో జాగృతిని కలిగించారు.
ఖపర్డె తన డైరీలో చాలా సార్లు ఈ విషయం ప్రస్తావిస్తారు. హారతి జరిగే సమయంలో బాబా చూపులలో
నుంచి ఒక రకమైన శక్తి అక్కడ ఉన్నవాళ్ళలోకి ప్రవేశించింది. దీని కారణంగానే ఖపర్డె షిర్డిలో
ఉన్నప్పుడు ఎంతో ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాడు. ఆయన పంచదశి, దాస బోధ లాంటి వేదాంత గ్రంధాలను
సులువుగా అందరికి భోదించేవారు. వీటిని అర్ధం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. మరి
వాటిని ఇంకొకరికి నేర్పించాలి అంటే బాబా కృప అనుగ్రహం ఉండాలి. ఇవి రెండు ఖపర్డెకు బాబా
ప్రసాధించారు. ఉపాసని మహారాజ్ ఒకసారి ఖపర్డె గారి గురించి మాట్లాడుతూ సాయి మనకు గురువు
కాని ఖపర్డె కూడా ఒక రకంగా నాకు గురువు అని చెప్పారు. అంటే దీని వెనుక సాయి అనుగ్రహం
ఎంత ఉందో అర్ధంచేసుకోవాలి.
ఆయన షిర్డిలో ఉన్నన్ని రోజులు సత్సంగ
భాగ్యాన్ని పొందారు. అప్పుడప్పుడు కుటుంబం దగ్గర నుంచి ఉత్తరాలు, కబురురావడం లాంటివి
జరిగినప్పుడు కొంచెం వ్యధకు లోనయ్యేవారు. కాని బాబా రక్షణలో మరల ప్రశాంతత పొందేవారు.
బాబా మహాసమాధి తరువాత ఖపర్దె అమరావతిలో నివసిస్తూ షిర్డి కార్యక్రమాల్లొ పాల్గొంటూ
తన జీవితాన్ని గడిపారు. బాలగంగాధర్ తిలక్ గారు బాబాను కలసి నప్పుడు మహాత్ముడు ద్వారా
మనకు స్వాతంత్రం వస్తుందని తిలక్‌ను ఈ భాద్యత నుంచి పదవీవిరమణ చేయమని బాబా చెప్తారు.
ఓం శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment