In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, March 30, 2016

ఉపాసని బాబా- 3



Play Audio




కాశీనాధ్‌కి సాయి బోధ 
సాయి చాలామంది భక్తులకు తన సర్వంతర్యామి తత్వాన్ని భోదించారు. అలానే కాశీనాధ్‌కి కూడా తెలియచెప్పారు. ఒక రోజు బాబా కాశీనాధ్‌తో నేను ఖండోబా ఆలయంకు వస్తాను. నాకు ప్రసాదం పెట్టు అన్నారు.

              కాశీనాధ్ వంట చేసి, ఆహారం తయారు చేస్తుండగా ఒక నల్లటి కుక్క ఆ ఆహారం చూస్తూ నిలబడింది. కాశీనాధ్ ఆ ప్రసాదం తీసుకుని ద్వారకామాయి దగ్గరకు వస్తున్నా, ఆ కుక్క తన వెంబడే వస్తూ ఉంటుంది. ద్వారకామాయి చేరిన తర్వాత బాబాకు ప్రసాదం సమర్పించగా బాబా ఇంత దూరం ఎందుకు వచ్చావు నేను నీ దగ్గరకు వచ్చాను కదా అంటారు. నాకు నువ్వు ప్రసాదం ఇవ్వలేదు.

కాశీనాధ్ : మీరు నాకు కనబడలేదు. ఒక నల్ల కుక్క తప్ప ఇంకెవరు లేరు.
బాబా:   ఆ నల్ల కుక్కను నేనే.

ఇలా బాబా చెప్పగా కాశీనాధ్ ఈ సారి ఈ తప్పు చేయకూడదు అనుకుంటాడు.
మరొకసారి వంట వండుతూ ఉంటే ఒక అంటరాని వాడు వచ్చి ఆహారాన్ని చూస్తూ ఉంటాడు. ఆ ప్రసాదానికి దిష్టి తగులుతుంది అని అతనిని వెళ్ళమని కాశీనాధ్ హెచ్చరిస్తాడు. అప్పుడు అతడు వెళ్ళి పోతాడు. తరువాత బాబా దగ్గరకు వెళ్ళగా సాయి కోపంతో నువ్వు నాకు ప్రసాదం ఇవ్వలేదు నీ దగ్గరకు నేను వచ్చాను అంటారు.

కాశీనాధ్: ఎక్కడ బాబా! నువ్వు రాలేదు
బాబా: నేను వచ్చాను
కాశీనాధ్ : అయితే నువ్వు ఆ అంటరాని వాడి  రూపంలో వచ్చావు. నేను అజ్ఞానంతో నిన్ను గుర్తించలేదు.

ఇలా సాయి కాశీనాధ్‌లో మార్పులు తీసుకువచ్చి, ఈ ద్వైత భావనలకు స్వస్తి పలికించారు. సకల సృష్టిలో నేనున్నాను అని నిరూపించి బాబా తన భక్తులలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేస్తారు.
  
కాశీనాధ్-ఉపాసని మహారాజ్‌గా అవతరణ
ఇలా కాశీనాధ్ ఖండోబా ఆలయంలో మూడు సంవత్సరాలకి పైగా ఉంటారు. ఆ ఆలయంలో పాములు తిరుగుతూ ఉండేయి అయినా కాశీనాధ్ అక్కడే పడుకుని ఎంతో దీక్షతో తన సాధనను సాగిస్తారు. ఇంతలో తను మూడో భార్య కూడా చనిపోయిందని వార్త. 1912లో అందుతుంది. ఇప్పుడు ఉపాసనికి ఇక ఏ బందం లేదు. ఆయన ఒక గోనె సంచి మాత్రం నడుముకి చుట్టుకునేవారు.

ఒక రోజు బాబా చంద్రబాయి అనే ఆమెను కాశీనాధ్ దగ్గరకు పంపించి నన్ను పూజించినట్లే కాశీనాధ్‌ని పూజించు అని చెప్తారు. ఆమె వెళ్ళి కాశీనాధ్‌ని పూజించాలని సంకల్పం చేయగా కాశీనాధ్ అడ్డు చెప్తారు. కాని తరువాత బాబా ఆజ్ఞను పాటించారు.  బాబా ఆయనను సద్గురు ఉపాసని మహారాజ్‌గా మారుస్తారు.

షిర్డి నుంచి పయనం
తరువాత బాబా చాలా మంది భక్తులను ఉపాసని మహారాజ్ దగ్గరకు పంపిస్తూ ఉంటారు. 1914లో ఉపాసని మహారాజ్ షిర్డి నుంచి బయలుదేరి సింది మరియు నాగపూర్‌లకు వెళ్తారు. 1911 తర్వాత షిర్డి నుంచి వెళ్ళడం అదే మొదటిసారి. తనకు జనసందోహాలతో ఉండటం ఇష్టంలేక పోయినా జనం మాత్రం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఆయన భిక్షను స్వీకరిస్తూ ఒక సన్యాసి లాగా జీవిస్తారు. అప్పట్లో కులమతాలు పెద్ద అడ్డుగోడలుగా ఉండేవి. ఆయన దీన్ని వ్యతిరేకిస్తూ 1915 ఫిబ్రవరి నెలలో ఒక అంటరాని వాని ఇంటిలో బస చేస్తారు. బాగా డబ్బున్న వారు పై కులాల వారు సైతం ఆ అంటరాని వాడింటికి రావలసి వస్తుంది. అయినా జన సందోహం ఆగదు. తరువాత కొన్ని రోజులకు ఉపాసని మహారాజ్ షిర్డికి తిరిగి వస్తారు. మరల ఖండోబా ఆలయంలో ఉంటారు. ఆయన ఎక్కడ ఉన్నా బాబా ఆయనలోనే ఉన్నారు. ఇప్పుడు ఖండోబా ఆలయం పరిస్థితి మారిపోతుంది. చాలా మంది భక్తులు రావడం మొదలు పెడ్తారు. తరువాత ఆయన సకోరి అనే గ్రామంలో తన నివాసం ఏర్పాటు చేసుకుంటారు. బాబా అక్కడకు కూడా భక్తులను వెళ్ళమని ఆదేశించేవారు.

 మత్తు లేకుండా శస్త్ర చికిత్స
ఉపాసని మహారాజ్ గారు ఒకసారి సింధి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనను మొల్లలు ఇబ్బంది పెడతాయి. దానికి శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు చెప్తారు. వాటిని బయటకు లాగి తీసివేయాలి. మహారాజ్ వైద్యులను మత్తులేకుండానే శస్త్ర చికిత్స చేయమంటారు. వైద్యులు అట్లానే చేస్తారు. ఆయన మనో నిగ్రహాన్ని చూసి వారు ఆశ్చర్యపడతారు. ఇలా ఉపాసని మహారాజ్ తన శక్తి చేత ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తారు. ఆయన ఒక సిద్ధ గురువుగా అందరిచేత పూజింపబడ్డారు. ఆయన తన దగ్గరకు వచ్చిన భక్తుల మనస్సులలో ఏముందో తెలుసుకుని వారిని అనుగ్రహించేవారు.

సకోరి ఆశ్రమం
ఉపాసని మహారాజ్ అన్ని ప్రదేశాలు తిరిగి చివరకు సకొరి అనే గ్రామంలో తన ఆశ్రమాన్ని స్థాపించారు. సకోరి గ్రామం షిర్డికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన జూలై 1917లో సకోరిలో ఉంటారు. సాయి 1918లో
తన శరీరాన్ని వదిలినప్పుడు ఉపాసని మహారాజ్ దగ్గర ఉండి అంత్యక్రియలు జరిపించారు. ఆయన 1921 లో తన భక్తుల కోసం ఒక వెదురు కర్ర బోనులో 13నెలలు ఉంటారు. ఆ బోనులో ఎటూ కదిలేందుకు వీలుగా ఉండదు. అక్కడ నుంచే రోజూ సత్సంగ్ చెప్పేవారు. జనవరి 31న 1924లో ఆ బోను నుండి బయటకు వస్తారు. ఆయన ఒక బాలికను అనుగ్రహించేందుకు బయటకు వచ్చారు. ఆ బాలిక పేరు గోదావరి వాసుదేవ్ హట వాలికర్. ఆమె తర్వాత గోదావరి మాతగా ఉపాసని మహారాజ్ గారి శిష్యురాలై ఆశ్రమ భాద్యతలు వహించేది.

              ఆయన ముఖ్యశిష్యుడైన మెహర్‌బాబా, ఉపాసని మహారాజ్ యొక్క పేరును ప్రపంచానికి తెలిసేలా చేసారు. ఇలా సాయికీర్తి కూడా నలదిశలు ప్రాకింది. సకోరి ఆశ్రమం ఎంతో మంది భక్తులతో అలరాడుతూ ఉన్నది. గోదావరి మాత ఆద్వర్యంలో అది కన్యాస్థాన్‌గా ఎంతోమంది స్త్రీలకు అధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఉంది. ఉపాసని మహారాజ్ డిసెంబర్ 29, 1941 తెల్లవారు జామున తన దేహాన్ని వదిలేస్తారు. తరువాత రోజు సకోరిలోనే అంత్యక్రియలు జరుగుతాయి.


ఉపాసని మహారాజ్ సాయి కృపకు పాత్రులై సాయి చెప్పినట్లుగా ఎంతో మందికి వెలుగు చూపించారు. సాయి తనకు నిజమైన వారసులు ఉన్నట్లు ఎప్పుడు చెప్పలేదు. కాని ఉపాసని మహారాజ్ దాదాపు ఆస్థానాన్ని పొందారు.


ఓం శ్రీ సాయి రామ్ !

No comments:

Post a Comment