Play Audio |
దాదాసాహెబ్
ఖపర్డె మొట్టమొదట 7 రోజులు మాత్రమే షిర్డిలో ఉన్నారు. అక్కడ నుండి వెళ్ళిన తర్వాత
ఆయన షిర్డిలో ఉన్న ప్రశాంతతను గుర్తిస్తారు. బాబా పై నమ్మకము, ఆయన మీద భక్తి కలిగాయి.
ఎంతో మంది పెద్ద పెద్ద అధికారులు సైతం వచ్చి బాబా దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఆయన
అనుగ్రహం కోసం తపిస్తున్నారు. బాబా ఖపర్డెకు తన పూర్వజన్మ సంబంధాన్ని కూడా చెప్పారు.
రెండవసారి షిర్డికి డిశంబర్ 1911లో రావడం జరిగింది. దాదాపు 100 రోజులు ఉంటారు. ఖపర్డె
ఆయన భార్య మాటిమాటికి అమరావతి వెళ్ళాలని ప్రయత్నించినా బాబా అనుమతిని ఇవ్వలేదు. ఖపర్డెకు
బాబా మీద ఉన్న నమ్మకం ఆయనను షిర్డిలో అన్ని రోజులు ఉండేటట్లు చేసింది. బాబా అనుమతిని
ఇవ్వకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అప్పట్లో బాలగంగాధర్ తిలక్‌కు కుడి భుజముగా
ఖపర్డె చాలా భాద్యతలను నిర్వర్తించారు. తిలక్ గారిని జైలులో పెట్టిన తర్వాత ఖపర్డె
కూడా బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో ఉన్నాడు. బాబా ఖపర్డెను బ్రిటిష్ ప్రభుత్వం నుంచి రక్షించాల్సిన
అవసరం ఏర్పడింది. కాని బాబా ఉద్దేశ్యం ఖపర్డెను ఆద్యాత్మిక పథంలో నడిపించడం. ఈ విషయం
గురించి బాబా మాట్లాడుతూ ఖపర్డె గురించి ఇలా చెప్పారు. నేను, ఖపర్డె ఒకే కుటుంబానికి
చెందినవారము. కాని కొంతకాలానికి అతడు కుటుంబాన్ని విడిచి, వెళ్ళి రాజుగారి కొలువులో
ఉద్యోగానికి వెళ్ళాడు. కీర్తి, ధనం, సంసార సుఖం, పదవి కోరే రాజస ప్రవృత్తి అతనికి వెనుకటి
జన్మలోనే ఉంది.
ఖపర్డె గారికి ఈ పూర్వజన్మ వాసనలను
వదలగొట్టి అద్యాత్మిక మార్గంలో నడిపించారు. సాయి లాంటి పరమగురువు మనలను పట్టుకుంటే
మనము తప్పుదారిలో ఉన్నా, మళ్ళా మనలను మంచి మార్గంలోకి లాక్కుని వస్తారు. ఇదే ఖపర్డె విషయంలో
కూడా జరిగింది. అట్లానే బాబా ఒకరోజు ఖపర్డెతో ఇలా చెప్పారు. ఒకప్పుడు నేను, నీవు, జోగ్,
ధీక్షిత్, శ్యామా, దాబోల్కర్ అందరమూ మన గురువు గారితో కలసి, ఒక వీధి చివర జీవించాము.
అందుకే ఇప్పుడు మీ అందరిని మరలా కలుపుతున్నాను అని చెప్పారు.
ఖపర్డె రెండవసారి షిర్డిలో ఉన్నపుడు
బాబా చిన్న చిన్న కథలు ఖపర్డెకు చెప్పడం జరిగింది. ఖపర్డె తన డైరిలో ఆ కథలు వాటి అర్ధం
తనకు తెలియలేదని, కాని తనకు బాబా సన్నిదిలో అమితమైన ప్రశాంతత కల్గింది అని వ్రాసారు.
అలానే బాబా చేసిన దృష్టిపాతాలు ఖపర్డెలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. తను రోజు బాబా
ఆరతుల్లో పాల్గొని, ఆద్యాత్మిక గ్రంధాలు చదువుతూ, దీక్షిత్, బీష్మ, జోగ్ ఇంకా మరి కొంత
మందితో సత్సంగము చేసేవారు. రాత్రి ఆరతి అయిన తర్వాత వాడాకు వచ్చి దీక్షిత్ గారి రామాయణాన్ని
అందరూ వినేవారు. పగలు పంచదశి సత్సంగము జరిగేది. ఖపర్డె పంచదశిని అందరికి చెప్పేవారు.
ఉపాసని బాబా కూడా ఈ సత్సంగములో పాల్గొనేవారు.
నాటేకర్ (హంస) తో సాంగత్యం
ఖపర్డె
షిర్డిలో ఉన్నప్పుడు చాలా మందిని కలవడం జరిగింది. ఈ నాటేకర్ అనే ఆయన గురించి ఖపర్దె
తన డైరీలో ఈ విధంగా వ్రాసారు. ఆయనను హంస అని పిలిచేవారు. నాటేకర్ కొంచెం చిన్న మనిషి,
మంచి రూపు రేఖలతో తెల్లగా ఉండేవారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మంచి గొంతుతో అందరిని
ఆకట్టు కొనేట్లు ఉండేది. ఆయన హిమాలయాలు, మానససరోవరం మొదలైన వన్ని దర్శించారు. ఆయన మానస
సరోవరం దగ్గర ఉన్నపుడు ఆయనకు ఉపనిషత్ ఒక పాటలా వినబడింది అని చెప్పారు. తరువాత ఆయన
కొన్ని అడుగు జాడలను చూసి వాటి వెంబడే వెళ్తే ఒక గుహ వచ్చింది. ఆ గుహలో ఒక మహాత్ముడు
కనిపించాడు. ఆ మహాత్ముడు బాలగంగాధర్ తిలక్ గారిని జైలులో పెట్టడం గురించి చెప్పారు.
తరువాత ఆయన ఒక గురువుని కలిసినట్లు
చెప్పారు. ఇలా తన అనుభవాలను ఖపర్దెకు చెప్పడం
జరిగింది. అదే రోజు బాబా ఖపర్డెను ఇంకో రెండు నెలలు షిర్డిలో ఉండాలని ఆదేశించారు. తరువాత
ఖపర్డె గారి శ్రీమతి బాబాను కలిసినప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు, "అమ్మ నా ఊదికి
చాలా మహత్యం ఉంది, గవర్నర్ ఒక బరిన తీసుకుని వచ్చాడు, నేను అతనితో కలబడి అతన్ని తరిమేసాను"
దీన్ని అప్పట్లో అర్ధం చేసుకోవడం కష్టమైంది. కాని ఖపర్డె కుటుంబానికి తెలుసు, వారు బాబా
రక్షణలో ఉన్నారని. తరువాత కాలంలో ఖపర్దె కుమారుడైన బాబుసాహెబ్ ఖపర్డె వాళ్ళ నాన్న గురించి
ఒక పుస్తకం వ్రాసారు. దానిలో నాటేకర్ గురించి ఇలా వ్రాసారు. ఖపర్డె గారు లండన్‌లో ఉన్నపుడు
నాటేకర్ వాళ్ళింటిలో ఒక నెలపాటు ఆతిధ్యం స్వీకరించారు.
1913లో ఖపర్డె గారు వ్రాసిన 9 డైరిలు
దొంగలించబడ్డాయి. అవి తరువాత ప్రభుత్వం వాళ్ళకు తిరిగి ఇచ్చేసింది. వాటిలో ఎటువంటి
దేశవ్యతిరేఖ సమాచారం లేదని తేల్చారు. ఈ హంస అనే ఆయన బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన గూడాచారి
(CID) అని తెలిసింది. అందుకే ఆయన ఖపర్డె గారిని వెంబడించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు
బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేశారు.
ఈ విషయం బాబాకు తెలియకుండా ఎందుకు
ఉంటుంది. కాని బాబా ఎవరితో అన్నట్లు సమాచారంలేదు. అందుకే ఆ రోజు ఖపర్డె శ్రీమతితో బాబా
గవర్నర్‌తో పోట్లాడిన విషయాన్ని ఆ నాటేకర్ ఖపర్డె గారితో ఉన్న రోజు చెప్పడం జరిగింది.
బాబా తన భక్తులను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. ఖపర్డెకు ఆ నాటేకర్ సి.ఐ.డి అన్న విషయం
తెలియదు. సాయి భక్తులారా సాయిపట్ల శ్రద్ధను పెంచుకోండి. ఆయన మనల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచరు.
ఖపర్డెగారిని బ్రిటీష్ ప్రభుత్వం నుంచి ఎలా బాబా కాపాడారు అని ఆలోచిస్తే ఇది చాలా లోతైన
విషయం. కేవలం పరమ యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది. ఆ ప్రభుత్వ అధికారుల మనస్సులో ఖపర్డె
గురించిన ఆలోచనలను బాబా తొలగించడం జరిగింది. ఆ విషయాన్ని సద్దుమనిగిన దాకా ఖపర్డెను
అమరావతి వెళ్ళనివ్వలేదు.
శ్రీమతి ఖపర్డె అనుభవాలు
శ్రీమతి
ఖపర్డె పూర్తి పేరు లక్ష్మీబాయి గణేశ ఖపర్డె. ఆమె చాలా అణుకువతో ఖపర్డె గారి పెద్ద
సంసారాన్ని నడుపుతూ వచ్చారు. ఆమెకు బాబాకు కూడా చాలా ఋణానుబంధం ఉంది. ఆమె 7 నెలలు షిర్డిలో
ఉన్నారు. ఆమె సాయికి చేసిన సేవ అపారమైనది. లక్ష్మీబాయి అత్యంత నిష్టావంతురాలు. ఆమెకు
సాయి పాదాలయందు అత్యంత ప్రేమ. ఆమె నిత్యం మసీదుకు నైవేద్యాన్ని స్వయంగా తీసుకుని వచ్చేది.
బాబా నైవేద్యాన్ని స్వీకరించే వరకు ఉపవాస వ్రతంలో ఉండేది. సాయి మహరాజు ఆరగించిన తరువాత
మాత్రమే ఆమె భోజనం చేసేది. ఒకసారి ఆమె భక్తికి మెచ్చి ఆమెకు పరమార్ధ మార్గాన్ని చూపించారు.
బాబా బోధనా
పద్దతి ప్రత్యేకమైనది. వారు ఆడుతూ పాడుతూ, నవ్వుతూ హృదయంలో బాగానాటుకొనేలా అనుగ్రహాన్ని
ప్రసాధించేవారు.
ఒకసారి ఖపర్డె భార్య అన్నం, పప్పు, పూరి, హల్వ, పాయసం,
అప్పడాలు, వడియాలు, వడపప్పు పళ్ళెంనిండా పెట్టుకొని వచ్చింది. బాబా వెంటనే ఆత్రంగా
తమ ఆసనంపై నుండి లేచారు. చేతిపైన కఫినీని పైకి జరుపుకొని భోజనం చేసేందుకు సిద్దం అయ్యారు.
అప్పుడు శ్యామా బాబానుద్దేశించి "దేవా అందరూ రుచికరమైన పదార్దాలు తెస్తారు, కాని
ఈమె తెచ్చిన ఆహారం మీద మీకు ఎందుకు ఇంత ప్రేమ" అని అడిగితే అప్పుడు బాబా ఈ విధంగా
చెప్పారు. ఈ భోజనం యొక్క విశేషం ఏంటో చెప్పమంటావా! పూర్వం ఈమె బాగా పాలిచ్చే ఆవు. ఆ
తరువాత కనిపించకుండా పోయింది. తరువాత ఒక మాలికి జన్మించింది. ఆ తరువాత ఒక క్షత్రియని
ఇంట్లో పుట్టింది. మరుజన్మలో ఒక వైశ్యుని పత్ని అయింది. తరువాత బ్రాహ్మణ గర్భంలో జన్మించింది.
చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో తెచ్చిన అన్నం రెండు ముద్దలు సుఖంగా తిననివ్వు,
అని ఆహారం తృప్తిగా తిన్నారు.
బాబా అన్నం తినిన తరువాత ఆమె బాబా
పాదాలను వత్తుతు సేవ చేయసాగింది. బాబా చరణాలను పట్టుకున్న ఆమె చెయ్యి నెప్పట్టకుండా
బాబా ఆమె చేతిని వత్తసాగాడు. ఇది చూసి శ్యామా ఆహా ఏమి భాగ్యము! భగవంతుని భక్తురాలి పరస్పర
ప్రేమను, సేవను చూసి శ్యామా పరిహాసమాడాడు. ఆమె
సేవకు బాబా ప్రసన్నులై ఆమెతో మెల్లగా రాజారాం, రాజారాం అను, అలా ఎల్లప్పుడూ
అంటూ ఉండు. అమ్మా నీ జీవితం సఫలమౌతుంది. నీ మనస్సు శాంతిస్తుంది. నీకు అపరిమితమైన శుభం
కలుగుతుంది. అని చెప్పారు. ఇలా బాబా మాటలు ఆమె హృదయంలోకి చొచ్చుకుపోయి తక్షణం శక్తి
పాతం చేస్తాయి. జ్ఞాని అయిన గురువుని ఆశ్రయించిన శిష్యుని అధ్వైతం నశించిపోతుంది. గురువు
ఒక ఊరిలో ఉండి శిష్యుడు మరో ఊరిలో ఉన్నట్లు భావిస్తే అది బాహ్యమైన సంబందం మాత్రమే,
అసలు వారు ఇద్దరు కానప్పుడు వారు వేరు ఎలా అవుతారు. ఒకరు లేక ఒకరు ఉండరు. గురువు మరియు
శిష్యులయందు బేధంలేదు. ఇది నిత్య సత్యం.
గురుచరణాలపై భక్తుడు శిరసు నుంచడం
స్థూలంగా కనిపించే ఆచారం. శిష్యుడు, గురువు యందు అద్వైత భావాన్ని, గురువు కూడా శిష్యుని
యందు అట్లే అభేద బావం కలిగి వారిరువురు పరస్పరం సమరస భావంతో ఉండకపోతే వారి సంబంధం నామ
మాత్రమే. సర్వానర్దాలకు బీజ భూతమైన, అజ్ఞానమనే నిద్రలో మునిగిఉన్న వారిని సమయానికి
మేలుకొలిపే గురు జ్ఞానామృతాన్ని సేవించండి. దాని కొరకు అత్యంత వినమ్రతతో గురుచరణాలలో
శరణాగతులవండి. మనస్సు సంకల్ప, వికల్పాల ఆధీనంలో ఉంటుంది. దానిని సాయి చరణాల యందు సమర్పించండి.
అట్లే కర్మలను చేసే శక్తినంతా సాయికి సమర్పించి వారు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకోండి.
సాయి యొక్క శక్తి అంతటా ఉన్నదని తెలుసుకోండి.
ఓం శ్రీ సాయి రామ్ !
No comments:
Post a Comment