బాబా ఎందరినో అనుగ్రహించి,
వారి జీవితంలో మార్పులు తీసుకురావడం జరిగింది. మనము ఉన్న పరిస్థితులను బట్టి మన పూర్వజన్మ
కర్మలకు అనుగుణంగా మనలో మార్పులు తీసుకువచ్చి, మనలను మార్చగల సమర్ధ గురువు సాయి. బయ్యాజి
తన 11వ ఏటనుంచే బాబాను సేవించాడు. బాబా బిక్ష తీసుకున్న 5 ఇళ్ళలో బయ్యాజి ఒకరు.
బయ్యాజిని బాబా ఒక ధనవంతుడిలాగా
మార్చారు. బాబా అతనికి రోజు 4 రూపాయలు ఇచ్చి దానిని ఖర్చు చేయకుండా ఉంచమన్నారు. ఈ డబ్బుతో
బయ్యాజి 84 ఎకరాల భూమికి యజమాని అయ్యాడు. బాబా ఆ భూమిలో ఏమి పంటలు పండించాలో కూడా చెప్పేవారు.
ఇలా నిజ జీవితానికి దగ్గరగా ఉంటూనే బయ్యాజిలో మానసిక మార్పులు తెచ్చారు బాబా.
బయ్యాజికి తను చాలా బలవంతుడను
అనే భావన ఉండేది. తనకు భీముడు లాంటి బలము ఉందని చెప్పేవాడు. బయ్యాజి అప్పుడప్పుడు బాబాకు
ఒళ్ళంతా పట్టి మర్ధనచేసి బాబాను చేతులతో పైకి లేపి ధుని దగ్గర కూర్చుండ పెట్టేవాడు.
ఈ అహంకారాన్ని గమనించిన బాబా ఒకరోజు బయ్యాజికి పరీక్ష పెట్టారు. బయ్యాజి మామూలుగా బాబాను
లేవనెత్తపోగా చతికిలపడతాడు. ఇదేంటి ఎప్పుడు చాలా సునాయాసంగా లేపగలిగేవాడ్ని ఇప్పుడు
ఏమైంది? అని అనుకుంటాడు. బాబా బయ్యాజిని చూసి
పరిహాసం చేస్తారు. ఈ సన్నివేశం కేనోవనిషత్‌లోని కథను గుర్తు చేస్తుంది.
మన పురాణాల్లో దేవ ధానవ యుద్దాల
గురించి విన్నాము. ఒకసారి ఇలా జరిగిన యుద్దంలో దానవులది పై చేయిగా ఉంది. దేవతలు దాదాపు
ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు పరమాత్మ దేవతలను రక్షించేందుకు రహస్యంగా సహాయం
చేస్తాడు. దేవతలు దానవులపై విజయం సాధిస్తారు. అయితే తమ విజయానికి కారణం ఈ దివ్య శక్తి
అని వారు గ్రహించలేకపోతారు. వారు చాలా గర్వంగా విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు.
వాళ్ళు ఈ విజయానికి విర్రవీగి కన్ను మిన్ను కానరాక ప్రవర్తిస్తారు.
ఈ అహంకారం నుంచి వారిని రక్షించటానికి
పరమాత్మ ఒక యక్షుని రూపంలో దేవతల ముందు ప్రత్యక్షమవుతాడు. వారు ఆ ఆకారం ఏమిటో తెలియక
భయపడ్తారు. ఈ రూపం ఏమిటో తెలుసుకోవాలని ఆలోచించి వారు మొట్ట మొదట అగ్నిని పంపిస్తారు.
అగ్నిని వాళ్ళు బాగా పొగిడి నీవు దేన్ని అయినా కాల్చగలవు నీ శక్తి అపారమైనది వెళ్ళి
ఈ రూపం ఏంటో తెలుసుకునిరా అని పంపిస్తారు. అగ్ని మంచి ఉత్సాహంతో ఆ రూపం వైపు పరుగు
తీసాడు. తనకు దేనినైనా తెలుసుకోగలను అనే అహంకారం, గర్వం. ఆ యక్షుని దగ్గరకు వెళ్ళి ఎవరని
కూడా అడగడు. ఆ యక్షుడే నీవెవరు? అని ప్రశ్నిస్తాడు. నేను అగ్నిని. నేను దేన్ని అయినా
కాల్చగలను అంటాడు. అప్పుడు ఆ యక్షుడు అయితే ఈ గడ్డిపోచను కాల్చు అంటాడు. అగ్ని ఓటమిపాలై
వెనుదిరుగుతాడు. అలానే తరువాత వాయు దేవుడు వచ్చి పరాజయం పాలు అవుతాడు. చివరకు ఇంద్రుడే
వస్తాడు. ఇంద్రుడు రాగానే ఆ శక్తి మాయమవుతుంది. అంతలో ఉమాదేవి అమ్మవారు ప్రత్యక్ష మయి
పరమాత్ముడే ఆ యక్ష రూపం అని చెప్పడం జరిగింది.
ఇంద్రుడు సమీపించగానే యక్షుడు
అదృశ్యమయ్యాడు. అహంకారులైన వారికి ఆత్మదర్శనం కాదు. ఇంద్రునికి దేవతల రాజుననే గర్వం
ఉంది, అహంకారం ఉంది. అట్టి గర్విష్టులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. పరమాత్మ
అయితే ఇంద్రుడు, అగ్ని, వాయువుల్లాగ తిరిగి రాలేదు. జిజ్ఞాస చూపించాడు. ధ్యాన పూరిత
హృదయముతో అక్కడే ఉండటం వలన పార్వతి దేవి ఒక గురువులాగా పరమాత్మ అసలు తత్వాన్ని తెలియచేసింది.
బాబా మన ప్రాపంచిక కోరికలను
తీరుస్తూనే మనలో ఒక రకమైన జిజ్ఞాస కల్గిస్తారు. కాని మనము శ్రద్ద, సబూరి చూపించాలి.
ఇక్కడ బయ్యాజి బాబాను పైకి లేపలేక పోతాడు. ఆశ్చర్యానికి గురి అవుతాడు. ఈ ప్రపంచంలో
నూటికి తొంబై తొమ్మిది మంది ప్రాపంచిక వ్యవహారాలలోనే గడిపేస్తారు. అయితే ఏ ఒక్కరికో పరమాత్మను తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలుగుతుంది. మన మనో బుద్ధులకు శరీర శక్తికి
అతీతమైన ఈ శక్తిని మనము తెలుసుకోవడం కష్టం. ఈ ఆలోచన మనలో రావడానికి కూడా ఆ పరమాత్మే
కారణం. ఒక గురువు రూపంలో మనల్ని ఉద్దరిస్తాడు.
మనం జీవితంలో చాలా విజయాలు
సాధించ వచ్చు. కాని నమ్రతతో జీవించడం నేర్చుకోవాలి. అహంకారం దగ్గరకు రాకుండా చూసుకోవాలి.
మనము గాలి పీలుస్తున్నాము అంటే ప్రాణాలతో ఉన్నాము, అంటే పరమాత్మయే దానికి కారణం. ఇది
మరిచి మనం విర్రవీగరాదు.
కేనోపనిషత్తు ఈ విషయాన్ని
ఎంతో చక్కగా చెప్తుంది. మనము చెవితో వింటాము. కంటితో చూస్తాము. మనం నోరు, నాలుక ద్వారా
మాట్లాడతాము. మనస్సు ఈ విషయాలను గ్రహిస్తుంది. ప్రాణాలు పనిచేస్తాయి. ఈ ఇంద్రియాలు
మనస్సు, ప్రాణం వాటి పనులు చేస్తున్నాయి అంటే వాటి వెనుక ఉన్న శక్తి ఏంటి? ఏ శక్తి
వల్ల కన్ను చూడగలుగుతుంది. చెవి విన గలుగుతుంది, అట్లానే నాలుక మాట్లాడుతున్నది. మనలో
ఉన్న చైతన్యమే వీటన్నింటికి వెనుక ఉండి నడిపిస్తున్నది. ఆ చైతన్యమే మనము ఆత్మగా చెప్పుకుంటాము.
అందుకే కేనోపనిషత్తు ఇలా చెప్తుంది, బుద్దిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాలనుండి
భిన్నంగా చూడగలుగుతాడు. ఇంద్రియ బద్దమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు.
ఇలా చెప్పబడిన విషయాన్ని
నిజ జీవితంలో ఆచరించడం కష్టం అని మనం అనుకోవచ్చు. కాని ఈ సత్యాన్ని అర్ధం చేసుకొని
మనం కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుచేసుకోగలిగితే మనం ఈ మాయలోనుంచి బయట పడవచ్చు. ఇక్కడ
నేను అనే అహంకారం లేదు. అహంభావన మనలను బాధపడేట్లు చేస్తుంది. ఈ నేనులో నుంచి ఒక్కసారి
బయటకు వచ్చి చూస్తే మనకున్న సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక్కసారి అహంకారాన్ని
ప్రక్కన పెడితే సమస్య చాలా సులభంగా పరిష్కరింప బడుతుంది. కాని మనము ఈ అహంకారం అనే పోరతో
మనమున్న గుంతను ఇంకా లోతుగా తవ్వుతాము, అప్పుడు బయట పడటం ఇంకా కష్టమైపోతుంది.
ఓం శ్రీ సాయి పరమాత్మనే నమః
No comments:
Post a Comment