In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, April 13, 2016

దాము రసానే




సాయినాధులు మనలను ఆధ్యాత్మిక మార్గంలో నడవమని చెప్పారు. కాని మనలో నున్న కోరికలను మనకు అవసరమైన నిత్య జీవిత అవసరాలను కూడా తీర్చారు, తీరుస్తూ ఉంటారు. ఆయన తన భక్తులకు ఇలా హామి కూడా ఇచ్చారు. నా భక్తులు మొదట ప్రాపంచిక కోరికల కొరకు నా దగ్గరకు వస్తారు. వారు కోరిన కోరికలు తీర్చిన తరువాత వారిని భక్తి మార్గంలో నడిపించి ముక్తి పధానికి చేరుస్తాను, అని బాబా చెప్పారు. మనము ప్రాపంచిక కోరికలు తీర్చుకోవచ్చు కాని మన జన్మలను ఈ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించ రాదు. దాము రసానే ద్వారా మనకు ఒక చక్కటి సందేశాన్ని అందించారు. దాము అన్న ఈ ప్రశ్న బాబాను అడిగి ధన్యుడయ్యాడు. మామిడి పండ్లు, పూత అనే ఉదాహరణ ద్వారా మనకు ఆయన మనం ఏ దారి అవలంబించాలో చెప్పారు. ఈ అధ్యాత్మిక సత్యాన్ని బాబా ఎంతో ఆర్తిగా, ప్రేమగా మనలాంటి సాయి భక్తులకు ఒక ఆదేశం లాగా చెప్పడం జరిగింది.

దాము రసానేను బాబా రామియా అని, దాము అన్నా అని పిలిచేవారు. దాము అన్న గురించిన వివరాలు శ్రీసాయి సచ్చరితలో 25వ అధ్యాయంలో చెప్పటం జరిగింది. సాయి పరమదయా మూర్తి, వారి యందు అనన్య భక్తి ఉంటే చాలు. భక్తి శ్రద్ధలున్న, భక్తులు కోరుకున్న దానికి కొదవలేదు. శ్రీకృష్ణుడు ఉద్దవునితో సద్గురువు నా రూపమే అని చెప్పారు. ఇటువంటి సద్గురువులను భక్తితో, ప్రేమతో పూజించాలి. దీనినే అనన్య భక్తి అంటారు. 

సాయి కథను ఏ సందేహాలు లేకుండా ఏకాగ్ర మనసుతో విన్నా, చదివినా కలిమలం దూరం అయిపోతుంది. ఒకసారి సాయి యందు అనన్య నిష్ట కుదిరితే ఆ భక్తుల కష్టాలు అరిష్టాలు అన్ని తొలగి వారి అభీష్టాలు తీరుతాయి. ఇటువంటి గురిగల భక్తుడే దాము అన్నా. ఈ కథలో ఎంతో జ్ఞానం ఉంది. దీన్ని జాగ్రత్తగా వింటే కష్టాలు అన్నీ దూరం అవుతాయి అని హేమద్‌పంత్ ఘంటాపధంగా చెప్పారు.

అహ్మద్ నగరంలో సుఖంగా ఉన్న శ్రీమంతుడైన భక్తుడు దాము అణ్ణా కాసార్ సాయి పాదాల యందు మిక్కిలి ప్రేమ కలిగి ఉండేవాడు. ఆయన తన జీవితాన్ని ఒక చిన్న గాజుల వ్యాపారిగా ప్రారంభించి చాలా అభివృద్దిని సాధించి ధనవంతుడై వెలుగొందాడు. అయినా చాలా నమ్రతతో మెలిగేవాడు. ఆయనకు అన్ని ఉన్నాయి కాని పిల్లలు మాత్రం లేరు. మొదటి భార్యకు పిల్లలు లేకపోతే, రెండో పెళ్ళి కూడా చేసుకుంటాడు. అయినా పిల్లలు పుట్టలేదు. సరే జాతకం చూపించుదామని చూపిస్తే కేతువు తన అదృష్టాన్ని ఆపుతున్నట్లు, గురు బలం అసలు లేదని పిల్లలు ఖచ్చితంగా పుట్టరని తేల్చి చెప్తారు.

సాయి అనుగ్రహం, సంతాన ప్రాప్తి
దాము అణ్ణా బాబా గురించి తెలుసు కొని షిర్డి వెళ్తాడు. దామియా షిర్డి వెళ్ళిన సమయానికి గోవా నుంచి ఎవరో మామిడి పళ్ళ పార్శిల్ పంపిస్తారు. వారు సవినయంగా బాబాకు సమర్పించు కుంటారు. దానిలో దాదాపు మూడు వందలకి పైగా మామిడి పళ్ళు ఉన్నాయి. బాబా వాటన్నింటిని అందరకు పంచి ఒక 8 పళ్ళను దాచి పెడ్తారు. అవి పిల్లలు అడిగితే ఇవి దాముకు మీకు కాదు అని చెప్తారు. వాళ్ళు దామ్య ఇక్కడ లేడు కదా! మాకివ్వు అంటారు. బాబా ససేమిరా ఒప్పుకోరు. కాని ఆ పిల్లలు నాలుగు పళ్ళను దొంగతనంగా తీసుకుంటారు. ఇంతలో పూజా సామాగ్రి పట్టుకుని దామియా ద్వారకామాయికి వస్తాడు. బాబా అతనికి మామిడి పళ్ళను ఇద్దామని చూస్తే నాలుగు మాత్రం ఉంటాయి. ఆ నాలుగు దామూకు ఇచ్చి ఇవి ఎవరివో వారే తీసుకోవాలి, ఎవరివో మనమెందుకు తినాలి? అవి ఎవరివో వారే తినాలి, తిని చావాలి అని అన్నారు. అది బాబా ప్రసాదంగా దామియా స్వీకరించాడు. బాబా మాటల వివరీత అర్ధానికి ఏం భయపడనవసరం లేదని అణ్ణాకు బాగా తెలుసు పూజను ముగించుకొని దాము ఈ పళ్ళను ఏ భార్యకు ఇవ్వాలి అని బాబాను అడిగాడు.

చిన్న భార్యకు ఇవ్వమని బాబా చెప్తారు. ఆమెకు ఎనిమిది మంది పిల్లలు పుడతారు అని బాబా ధైర్యం చెప్తారు. ఆయన అంతకు ముందు ఎంతో మంది సాధుసత్పురుషులను ఆశ్రయించి సంతానం కోసం ప్రయత్నించాడు. గ్రహాల అనుగ్రహం కోసం జ్యోతిష్యం విద్య నేర్చుకొని స్వయంగా జ్యోతుష్యుడు అయ్యాడు. జ్యోతిష్యం ప్రకారం తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని నిరుత్సాహపడ్డాడు. కాని బాబా లీలలే వేరు. తరువాత కొంతకాలానికి మొట్ట మొదటి బిడ్డ పుడ్తాడు. బాబా ఆ మామిడి పళ్ళు ఇచ్చినప్పుడు ఇలా చెప్పారు. ఆమెకు 8 మంది పుడ్తారు. మొదటి ఇద్దరు అబ్బాయిలు. మొదటి అబ్బాయికి దౌలత్ షా , రెండో అబ్బాయికి లానాషా అని పేర్లు పెట్టు అని చెప్తారు. అప్పుడు దామియా తన దగ్గర ఉన్న చిన్న పుస్తకంలో ఈ వివరాలు వ్రాసు కుంటారు. ఎనిమిది మామిడి పళ్ళు ఎనిమిది పిల్లలు, కాని నాలుగు పళ్ళు మాత్రమే ఇవ్వడం జరిగింది. అందుకని నలుగురు చనిపోయి, నలుగురు మాత్రం ఆరోగ్యంగా ఉండి బతుకుతారు. పెద్ద కొడుకుకు 15 నెలలు వచ్చిన తర్వాత బాబా దగ్గరకు తీసుకు వెళ్ళాడు దామియా. అక్కడకు వెళ్ళి బాబాను ఏమని పేరు పెట్టమంటారు అని అడిగాడు. దామియా నేను చెప్పినది అప్పుడే మరచిపోయావా? నువ్వు ఆ పుస్తకంలో మూడో పేజీలో ఆ పేర్లు వ్రాసుకున్నావు కదా! దౌలత్ షా అనే పేరు చెప్పాను కదా. ఆ కుమారుడికి నానా సాహెబ్ రసానే, దత్తాత్రేయ రసానే అనే పేర్లు కూడా ఉన్నాయి. దౌలత్ షా తరువాత కాలంలో బాబా గురించి చాలా ప్రచారం చేయడం జరిగింది. బాబా గురించి ఉపన్యాసాలు చెప్పేవాడు. బాబానే ఈ దౌలత్ షాతో అక్షరాభ్యాసం చేయించారు. బాబా పలక మీద "హరి" అనే అక్షరాలు రాయించారు. అతనిని అధ్యాత్మిక పధంలో చక్కగా నడిపించారు. అతనికి పెళ్ళి సంబందాలు వచ్చినప్పుడు అమ్మాయిని కూడా బాబానే చూసి పెట్టారు. బాబా చెప్పిన పేద ఇంటి అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు. ఈ దౌలత్ షా పెళ్ళి పండరీపురంలో జరిగింది. పెళ్ళికి రమ్మని దామియా పట్టుపడితే శ్యామాను తన ప్రతినిధిగా బాబా పంపించారు.

దాము - రామ నవమి ఉత్సవాలు
శ్రీరామ నవమి ఉత్సవంలో రెండు పెద్ద పతకాలను షిర్డి గ్రామంలో ఊరేగించడం అక్కడి ఆనవాయితి. ఒక పతకం నిమోనకర్‌ది, రెండవది దాము అణ్ణాది. తనకు పిల్లలు పుట్టినందుకు గాను బాబా పట్ల ప్రేమతో ఈ పతకం ఇవ్వడం జరిగింది. వడ్రంగి కోండ్యా ఇంటి వద్ద పతా కం ఊరేగింపుకు సిద్ధమై అక్కడి నుండి వాద్యాల మ్రోగింపుతో పతకాలను ఊరేగించేవారు. పొడవైన ఆ పతాకాలను మసీదు పైన రెండు వైపుల కట్టేవారు. ప్రతి సంవత్సరం ఈ పండగ జరిగేది. వచ్చిన వారందరికి చక్కగా భోజనం పెట్టేవారు. ఇలా దాము అణ్ణా ఈ రామనవమి ఉత్సవానికి ఒక భాగంగా నిలిచిపోయాడు. ఇలా తను కూడా  ఒక అంకిత భక్తుడిగా స్థానాన్ని పొందాడు. బాబాను అడగకుండా ఏ పనులు చేసేవాడు కాదు. బాబా మహా సమాధి తరువాత కూడా చీట్ల మీద వ్రాసి బాబా పేరుతో వాటిని తీసి ఏది వస్తే అదే చేసేవాడు. ఇలా ప్రతీసారి బాబా అనుగ్రహమే తనను రక్షించిందని చెప్పేవాడు దాము అణ్ణా.

దామియాకు బాబా రక్షణ 
దాము అణ్ణా ప్రతి పనిలో బాబా యొక్క సంరక్షణ కోసం తపించేవాడు. బాబా ద్వారానే ఊరట పొందేవాడు. అన్ని కష్టాలకు సమాధానం కేవలం బాబా మాత్రమే అని అనుకునేవాడు. ఒకసారి తన భార్య ముక్కు పుడక దొంగలించబడింది. ఈ ముక్కు పుడక మాంగల్యముతో సమానమైనది. అందువల్ల దామియా కుటుంబం చాలా కలత చెందింది. పోలీసులు వచ్చి వాళ్ళింట్లో 30 ఏళ్ళుగా పనిచేసిన అతను దొంగిలించినట్లుగా కనుక్కొని అతన్ని తీసుకువెళ్తారు. దామియాకు మనస్సు బాగా వికలమవుతుంది. అతన్ని 30 ఏళ్ళుగా నమ్మినాడు. అతను ఇలా చేయడం తనకు చాలా భాద కలిగింది. వెంటనే బాబా దగ్గరకు వెళ్తాడు. బాబా అతనిని ఓదార్చి దామియాకు మంచి విందు భోజనం ఇవ్వమని శ్యామాకు చెప్తాడు. అతనిలో మరల ఆత్మవిశ్వాసం నింపి పంపిస్తారు. 

దామియా హరిజనుడుతో భోజనం
ఎప్పుడు దామియాకు అవసరం అయినా బాబాను తలిచేవాడు. బాబా పై అమితమైన విశ్వాసం, శ్రద్ధ చూపించేవాడు. దామియాకు ఆచార వ్యవహారాల పట్ల మిక్కిలి శ్రద్ద. ఒకసారి ప్రత్యేక సందర్భంలో  బాబాను భోజనానికి రావలసినదిగా కోరతాడు. బాబా కుదరదని చెప్తే దామియా కనీసం బాలాపటేల్‌ను పంపించమని అడుగుతాడు. బాలా పటేల్ నిరంతరం బాబా సేవ చేసే భక్తుడు. ఈ బాలా పటేల్ ఒక హరిజనుడు. బాబా అప్పుడు "దామియా బాలా పటేల్‌ను పంపిస్తాను కాని అతను వెనుకబడిన జాతివాడని అతన్ని దూరంగా ఉంచద్దు". అని అంటారు. అప్పుడు దామియా అతన్ని తప్పక పంపించండి అంటాడు. అలాగే అతని ప్రక్కనే కూర్చుని భోజనం చేస్తాడు దామియా. ఆ రోజుల్లో ఇలా ఒక వెనుక బడిన జాతి వాడితో కలసి కూర్చుండటం ఒక సాహసం. కాని దామియా ఆచార వ్యవహారాలన్ని ప్రక్కనపెట్టి బాబా ఆజ్ఞను పాతించాడు. దామియా ఎప్పుడూ బాబా చింతనే చేసేవాడు. బాబా ఎన్నోసార్లు తిట్టడం కూడా జరిగింది. అయినా దామియా విశ్వాసం కొంచెం కూడా సన్నగిల్ల లేదు. ఇంకా ఆ తిట్లను ఆశీర్వదంగా స్వీకరించేవాడు. ప్రాపంచిక విషయాలను బాబాకు చెప్పకుండా చేసేవాడు కాదు. 

ప్రత్తి కొనుగోలు కథ
ఒకసారి దూదివ్యాపారం చేద్దామని బొంబాయి నుంచి ఒక స్నేహితుడు ప్రతిపాదించాడు. ఇది రెండు లక్షలు లాభం వచ్చే వ్యాపారం అని స్నేహితుడు చెప్పాడు. ఇది విని అణ్ణా మనస్సు ఆరాటపడింది. వ్యాపారం చేయాలా వద్దా అనే సంశయంతో బాబాకు ఒక లేఖ వ్రాసి కొనాలా లేదా అని అడుగుతాడు. శ్యామా ఆ ఉత్తరాన్ని బాబాకు వినిపించాడు. అప్పుడు బాబా,  ఇతనికి దేవుడు ఇచ్చినది చాల్లేదా! ఆకాశాన్ని అందుకోవాలా! అని ఆ ఉత్తరం వినకముందే చెప్తారు. అప్పుడు శ్యామా మీరు చెప్పినట్లు ఖచ్చితంగా అదే ఉంది అన్నాడు. బాబా భాదతో సేటుకు మతిపోయింది. నీ ఇంట్లో ఏం లోటు ఉంది? ఉన్న సగం రొట్ట చాలు లక్షల వెంటపడకు అని జవాబు రాయమంటారు.కాని దాము ఈ లేఖ చూసి నిరాశ చెందుతాడు. ఇప్పుడు ఒక లక్ష సంపాదించి అరలక్ష వడ్డీకి తిప్పవచ్చు అని అనుకుంటాడు. తరువాత బాబాకు తనే స్వయంగా వెళ్ళి చెబితే సరే అంటారు అని షిర్డి వెళ్తాడు. సాయికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సమీపంలో కూర్చున్నాడు దాము అణ్ణా. సంకల్ప, వికల్పాలు మనస్సు యొక్క లక్షణం.  మానవుడు చాలా కోరికలు కోరుకుంటాడు. తనకు ఏవి మంచివో తెలుసుకోలేడు. కాని గురువు సర్వజ్ఞుడు. దామియా, బాబాతో వ్యాపారంలో లాభం వస్తుంది. దాంట్లో సగం మీకు సమర్పించుకుంటాను అని అనుకుంటాడు. ధన కనకాలను మట్టితో భావించేవారికి వ్యాపారంలో భాగ మెంతటిది? ఈ ఆలోచన దామియా మనసులో ఉండగానే బాబా ఇట్లా చెప్పారు. మేము ఎందులోను లేము బాబు, అని ప్రేమగా వ్యాపారం సరియైనది కాదని హెచ్చరించారు. దామియా లోలోపల సిగ్గు పడ్డాడు. దూది కొనే ఆలోచన మానుకున్నాడు.

గోధుమల వ్యాపారం
దాము అణ్ణాకు ఇంకోసారి గోధుమల వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తే బాగుంటుందని బాబాను అడుగుతాడు. అందరూ లాభాలు పొందవచ్చని చెప్తారు. కాని బాబా ఇలా సమాధానం ఇచ్చారు. అయిదు సేర్లు చొప్పున కొని ఏడు సేర్లు చొప్పున అమ్ముతావు అని చెప్పారు. సరే దాము ఈ వ్యాపారం కూడా చెయ్యలేక పోతాడు. ఒక నెల, రెండు నెలలు గోధుమల రేట్లు బాగా పెరుగుతాయి. కాని తరువాత బాగా వానలు పడి పంటలు బాగా పండి ధాన్యం ధర బాగా తగ్గి పోతుంది. బాబా చెప్పిన మాట ప్రకారం తన స్నేహితులందరూ బాగా నష్టపోతారు. దామియా బాబాకు నమస్కరించు కొని తనను మరల రక్షించినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.

  
బాబా దామియా ద్వారా ఇచ్చిన సందేశం
ఒకసారి దాము అణ్ణా షిర్డిలో ఉండగా వస్తున్న జన సందోహాన్ని చూసి బాబాని ఒక ప్రశ్న అడగాలని మనసులోనే అనుకుంటాడు. ఇంత మంది బాబా దగ్గరకు వస్తున్నారు. వీళ్ళందరు బాబా అనుగ్రహం పొందగలుగుతారా అని లోలోపల అనుకుంటాడు.
బాబా అప్పుడు,  అరే! మామిడి చెట్టును చూడు దాంట్లో ఉన్న పూలన్ని కాయలు అవుతాయా, కొన్ని పూతగా రాలిపోతాయి,  కొన్ని పిందెలుగా రాలిపోతాయి. కొన్ని కాయలుగా పోతాయి, పండ్లు అయ్యేవి చాలా తక్కువ అని చెప్తారు.


ఓం శ్రీ సాయి రామ్ !

No comments:

Post a Comment