In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, April 20, 2016

హాజీ ఫాల్కే కథ




ఆథ్యాత్మిక మార్గంలో ఉన్నవారు. అహంకార రహితంగా ఉండాలని కోరుకుంటారు. కాని ఈ మనో బుద్దులను దాటటం చాలా కష్టతరం. ఈ దారి కష్టమైనా, దుర్లభమైనా నిరుత్సాహ పడవలసిన పనిలేదు. సద్గురువుల కృప ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాని మనకు భగద్గీతలో ఇలా చెప్పబడింది.

అహంకారం బలం దర్పం కామక్రోధం పరిగ్రహమ్|
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మ భూమాయ కల్పతే||

అహంకారమును, కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యాన యోగ పారాయణుడై యుండువాడు మమతా రహితుడు, శాంతి మంతుడు అయిన పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మము నందు భిన్నభావంతో స్థితుడగుటకు పాత్రుడగును.

శరీరేంద్రియ అంతః కరణముల యందు ఆత్మ బుద్ది కలిగి యుండుటను అహంకారం అని అందురు. ఈ కారణము వల్ల మనస్సు బుద్ది, శరీరముల ద్వారా చేయబడు కర్మలకు మనుష్యుడు తనను కర్తగా భావించును. కనుక ఈ దేహాభిమానములను త్యజించుటయే అహంకార రహితంగా ఉండటం అని అంటారు. ఈ విషయములను నేర్పేందుకే బాబా హాజీ  ఫాల్కే ను కొన్ని రోజులు దూరంగా ఉంచి, తరువాత దగ్గరకు తీయడం జరిగింది. ఈ కథను దానిలోని గూడార్ధాలను ఇప్పుడు మనము చెప్పుకుందాము.

ఒకసారి కళ్యాణి నివాసియైన సిద్దిక్ ఫాల్కే అనే ముస్లిం, మక్కమదీనా యాత్రలు చేసి షిర్డికి రావడం జరిగింది. ఆ వృద్దుడైన హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. బాబా దర్శనం చేసుకోవాలని అని అనుకుంటాడు. కాని తొమ్మిది నెలలు అయినా బాబా అతనిని ద్వారకామాయిలో అడుగు పెట్టనివ్వలేదు. ఫాల్కే దుఃఖానికి అంతేలేదు. ఇదేమిటి ద్వారకామాయి తలుపులు అందరికి తెరిచే ఉంటాయి కాని ఏమిటి నా కర్మ నేనేం పాపం చేశాను అని అనుకుంటాడు. ఎవరో శ్యామాను పట్టుకుంటే పని జరుగుతుందని చెప్తే ఆశతో ఆయనను సంప్రదించాడు.ఫాల్కే శ్యామాతో ఇలా అన్నాడు. ఒకసారి నా తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బ్రతిమాలాడు. అప్పుడు శ్యామా బాబా దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. దేవా! ఆ వృద్దుడు చాలా భాద
పడుతున్నాడు అతనిని కరుణించండి, హాజీ మక్కామదీనా యాత్రలు చేసి షిర్డికి తమ దర్శనార్ధమై వచ్చాడు. అతనిపై దయ చూపడం లేదు ఎందుకు? అతనిని మసీదులోకి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా! మరి ఇతని విషయంలో విషమ భావం ఎందుకు? ఒక్కసారి మీ కృపా దృష్టిని ప్రసరించండి. అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి. తన మనసులోని మాటను చెప్పుకొని వెళ్ళిపోతాడు.
అప్పుడు బాబా శ్యామా! నువ్వు ఇంకా ముక్కుపచ్చలారని పసివాడవు అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే అతనిని నేనేం చేయగలను. అల్లామియాకు ఋణపడి ఉండకపోతే ఎవరైన మసీదు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీల అపూర్వం. నేను అతనికి యజమానిని కాను, ఇంకా ఈ సంభాషణ ఇలా సాగుతుంది.  

బాబా అడిగిన ప్రశ్నలకు హాజీ  సమాధానాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సంభాషణ శ్యామా మద్యవర్తిగా జరుగుతుంది.

బాబా : సరే అక్కడ బారవి బావి సమీపంలో వెనుక వైపున ఇరుక బాట ఉండి. అతడు ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని అన్నాడు.
హాజీ  : ఎంతటి కష్టమైన మార్గమైన వస్తాను, నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి నన్ను వారి చరణాల వద్ద కూర్చోనివ్వాలి.
బాబా : నాలుగు వాయిదాలతో నాకు నలభై వేల రూపాయలను ఇస్తాడా!
హాజీ  : ఈ మాట అడగాలా, వేలు ఏమిటి, అడగాలేకాని నలభై లక్షలైనా ఇస్తాను.
బాబా : ఈ రోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. మరి నీకు మాంసం కావాలా! ఎముక మాంసం కావాలా లేక వృషణాలపై కోరికా? ఆ ముసలి వాణ్ణి నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు.
హాజీ  : ఇవేమి నాకు వద్దు. వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒక్కటే    కొళంబో లోని  ఒక ముక్క లభిస్తే చాలు కృతజ్ఞుణ్ణి అని చెప్పాడు.

ఇది విని బాబా ఉగ్రులయ్యారు మట్టి పాత్రను, నీళ్ల కుండను స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరివేసారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ  దగ్గరకు వచ్చారు.

బాబా తమ కఫినీని రెండు చేతులా పట్టుకుని నీ మనసులో ఏమనుకుంటున్నావు?  నా ముందా,  నీ ప్రతాపం. ముసని వానిలా బడాయి చూపిస్తున్నావు. ఇలాగేనా ఖురాను పఠించడం? మక్కా యాత్ర చేసానని గర్విస్తున్నావు గాని నన్ను ఎరుగలేకున్నావు. ఇలా ఆయనను మందలించి బాబా అక్కడ నుంచి వెళ్తారు. 

హాజీ  గాబరా పడ్తాడు. మసీదు ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్ళను అమ్మడం చూసారు. మొత్తం బుట్టను కొని హాజీకి  పంపించారు. వెంటనే వెనుదిరిగి మరల ఆ హాజీ  వద్దకు వెళ్ళారు. తమ జేబులో నుండి డబ్బు తీసి 55 రూపాయలను లెక్క పెట్టి అతని చేతిలో పెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతనిని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మరచి పోయారు. హాజీ ఆత్మానందంలో లీనమైపోయాడు.

ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను పరిశీలిద్దాము.

బాబా హాజీ  మధ్య జరిగిన సంభాషణలలో ఉన్న అర్ధం ఏమిటి? సద్గురువులకు మాత్రమే ఇది అర్ధం అవ్వాలి.
బాబా బారవి బావి దగ్గర ఉన్న ఇరుకు మార్గం దగ్గరకు రమ్మన్నారు. బారవి బావి అనేది షిర్డిలో ఉన్నట్లుగా చెప్పలేదు. బారవి అంటే 12, ఇది ఆధ్యాత్మిక మార్గంలో కావాలసిన 12 సాధనాలు. ఇరుకు మార్గం అంటే శమధమాది సాధనాలతో, వివేక వైరాగ్యములతో, శ్రద్ద సబూరిలతో, మనస్సును నిర్మలం చేసి గురు కృప పొందడమే ముక్తికి సోపానము. ఈ పన్నెండు  ఆధ్యాత్మిక మార్గంలో ఉపయోగపడ్తాయి.

బాబా 40 వేలు నాలుగు దపాలుగా ఇవ్వమన్నారు. ఇవి మనస్సు, బుద్ది , అహంకారం, చిత్తము. వీటిని అంతఃకరణ చతుష్టయము అంటారు. వీటిని సమర్పిస్తే కాని మనకు గురు కృప కలగదు. ఈ నాలుగు అంతరించినప్పుడే మన నిజ స్వరూపం మనకు అవగతమవుతుంది.
  
తరువాత ఎముక మాంసం కావాలా లేక వృషణాలపై కోరికా అని అడుగుతారు, కాని పాల్కే బాబా దగ్గర ఉన్న కాళంబలోని ఒక్క మెతుకు లభిస్తే చాలు అని అంటారు.

ఇక్కడ బాబా అడిగింది ఏమిటి? ఈ ప్రాపంచిక వ్యవహారాల మీద ఇంకా ఆశ ఉందా, లేదా. 
ఎముకల్లో ఉన్న మజ్జ ద్వారా మన శరీరంలో కణాలన్ని సృష్టించబడతాయి. వృషణాలు అంటే కోరికలకు ప్రతీక. మనలో ఉన్న కోరికలు నశిస్తే కాని హాజీ  కోరుకునే ఆ మోక్షం లభించదు. మక్కామదీన యాత్రలు చేయడం అంటే సామన్యం కాదు. దానికి పరిపూర్ణ హృదయం ఉండాలి. మనం కాశీ లాంటి యాత్రలు చేస్తాము కాని మన మనస్సు పవిత్రం కాకపోతే ఏమి ప్రయోజనం లేదు.
ఇవన్ని విన్న తర్వాత బాబా వెళ్ళి హాజీ ను పోట్లాడతారు. ఖురాను చదువుతావు కాని నన్ను తెలుసుకోలేక పోతున్నావు. మక్కా యాత్ర చేసానని గర్విస్తున్నావు, అని మదలించారు. గురువు మందలిస్తే మన మనస్సులోని దుర్గుణాలు నశిస్తాయి. మనంతట మనము మార్చుకోలేని బుద్ది అహంకారములు నశిస్తాయి. గురువు ఆగ్రహం వీటి మీద మాత్రమే. మనం వాటిని అపార్ధం చేసుకోరాదు. గురువు తిట్టినా కొట్టినా గురువు పాదాలను మాత్రము వదలరాదు. గురువుకు మన కర్మ శేషములన్ని ఎరుకయె. వీటిని దగ్ధం చేస్తే కాని మనకు జ్ఞానం లభించదు. అందుకే మనము అహంకార రహితులమై నమ్రతతో జీవించాలి. బాబా 55 రూపాయలు ఇవ్వడంలో కూడా ప్రత్యేకత ఉంది. ఇది బ్రహ్మజ్ఞానికి కావాల్సిన అర్హతలు . ఇలా ఈ సంభాషణల్లొ ఎన్నో అర్ధాలు దాగి ఉన్నాయి. 
  
తరువాత హాజీ  12 సంవత్సరములు బాబాను సేవిస్తూ షిర్డికి వస్తూ ఉండేవాడు అని చెప్తారు.

మనలో కూడా ఈ హాజీ  లాంటి మనస్తత్వమే ఉంది. దానిలో అహంకారం మెండుగా ఉండచ్చు. కాని దాన్ని మనకి మనముగా తెలుసుకోలేము. మనం మంచి అలవాట్లతో ఉండచ్చు. ఎవ్వరికి తెలిసి అన్యాయం చేయకపోవచ్చు. దయా గుణాలు ఉండవచ్చు. భక్తి, జ్ఞానం ఉండచ్చు. వీటన్నింటికి  వెనుక దాగి ఉన్న ఆ అహంభావనను అర్ధంచేసుకోవాలి. అది చాలా లోతుల్లోకి వెళ్ళి ఆత్మ విశ్లేషణ చేస్తేకాని అర్ధం కాదు. ఈ మాయను చేధించాలి అంటే బాబా కృప తప్పక ఉండాలి. బాబా లాంటి సద్గురువులు అరుదు. అటువంటి వారిని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు మన మార్గం సుగమనం అవుతుంది.  


ఓం శ్రీ సాయి రామ్ !

No comments:

Post a Comment