సాయినామమే పవిత్రం, సాయి భోదలే విచిత్రం.
సాయినామాన్ని తలచినంత మాత్రమే మనస్సుకి శాంతి లభిస్తుంది. సాయి అంటే సాక్షాత్ ఈశ్వరుడని
మనము చెప్పుకోవచ్చు, కాని బాబా తనే పరా శక్తి అని చెప్పారు. బాబా ఒకరోజు మథ్యాన్న ఆరతి
అయిన తర్వాత ఇలా చెప్పారు.
మీరెక్కడ ఉన్నా, ఏంచేస్తున్నా మీ చర్యలన్ని
ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తించుకొండి. నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో
ఉండేవాణ్ణి అంతటా చరించే వాణ్ణి. ఇలా నేను అందరికి స్వామిని. లోపల బయట నేను, చరాచర సృష్టిలో
అన్ని ప్రాణిలలో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచే నియమింప బడింది. దానిని
నడిపించే సూత్రధారిని నేనే. నేను సకల ప్రాణులకు తల్లిని. ఆ గుణాల సౌమ్యావస్థను. సకల
ఇంద్రియాలను నడిపించే వాణ్ణి నేనే. సృష్టి, స్థితి, లయ కారకుణ్ణి నేనే, నా యందు శ్రద్ధ
ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరిచి పోయినవారిని మాయ కొరడాతో కొడుతుంది. ఈ దృశ్య
జగత్తు నా రూపం. అంటే చీమ, దోమ, క్రిమి కీటకం, రాజు, పేద, స్థావర జంగమాలు ఈ జగత్తంతా
సాయి యొక్క స్వరూపం.
బాబా తనే సర్వప్రాణులకు తల్లిని, పరాశక్తిని
అని చెప్పారు. పరాశక్తి అంటే త్రిగుణాతీతమై ఏ శక్తి అయితే ఉందో అదే ఆ శక్తి. అందుకే
బాబా త్రిగుణాల సౌమ్యవ్యవస్థను నేనే అని చెప్పారు. ఈ సత్వ రజ తమో గుణాలకు అతీతమైన స్థితే ఆ శక్తి, ఈ త్రిగుణాలతో కలసినప్పుడు, దానికి ఒక రూపం ఏర్పడుతుంది. సాయి బోధలు ఈ జీవితానికి
ఎంతో అవసరం. అవి మనలను సరియైన దారిలో నడిపిస్తాయి.
సాయి సకల దేవతామూర్తుల సమాహారం. భగవంతునిలో
ఉన్న సర్వ గుణాలతో అవతరించిన సంపూర్ణ అవతారం. ఆయన తన సగుణ రూపాన్ని ధ్యానించమన్నారు
కాని మన దృష్టి ఆయన నిర్గుణ రూపంపై ఉండాలి అని కూడా చెప్పారు. ఈ నిర్గుణ రూపం అర్ధం
చేసుకోవాలంటే అసలు ఈ గుణాల గురించి తెలుసుకోవాలి. గుణము అంటే మనలో ఉన్న ప్రకృతి స్వభావమైన
తత్వము. కాని మన అసలు తత్వమేమో సచ్చిదానంద స్థితి. కాని మనము సత్వరజో మరియు తమో గుణాలను
మన తత్వంగా భావిస్తాము. ఈ మూడు గుణాలు మనలో ఇమిడి పోయి ఉన్నాయి. మన మానసిక స్థితి ఈ
మూడు గుణాలు ఏ పాళ్ళలో ఉన్నాయో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మన స్వభావం
నిర్ణయించబడుతుంది. మన జీవితంలో కలిగే మార్పులు కూడా ఒక్కోసారి వీటిని భిన్నంగా చూపించడం
జరుగుతుంది.
బాబా మనకు నేర్పినది ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని
భగవంతుడు నిర్మించినట్లుగా చూడడం. అంతేకాని మనం ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మార్చడానికి
ప్రయత్నించకూడదు. ఈ సాధనలో కావాలసిన రెండు ఆయుధాలు శ్రద్ధ, సబూరి. మనకు నమ్మకం దృఢంగా
ఉంటే దాని వెనకే సహనము అంటే సబూరి కూడా వస్తుంది. ఈ రెండు మన జీవితంలో ఉన్నంత వరకు
మనము ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవచ్చు.
ఇప్పుడు మనము ఒక ఉదాహరణ చెప్పుకుందాము. పాలను
తీసుకొని దానిలో కొన్ని చుక్కలు నీళ్ళు కలుపుదాము. పాలు స్వభావం ఏమి మారదు. ఆ నీళ్ళను
మనం గుర్తించలేము. తరువాత మరి కొంచం నీళ్ళు కలుపుదాము. అప్పుడు కూడా పాలు పాలుగానే
కనిపిస్తాయి. చాలా నీళ్ళు కలిపాము అనుకొండి. అప్పుడు ఆ పాలు పలుచగా ఉంటాయి, నీళ్ళు
కలిపినట్లు తెలుస్తుంది. అలానే మన నిజ స్వభావం పాల వలే స్వచ్చమై ఉంటుంది. అదే సచ్చిదానంద
స్థితి. దానికి కొన్ని చుక్కలు నీళ్ళు కలపడం అంటే సత్వ గుణాన్ని జోడించడం. మరికొన్ని
నీళ్ళు కలుపుకుంటూపోతే అవి పల్చబడి రజోతమో గుణాలు స్పష్టంగా బయటపడ్తాయి. కాని దుస్థితి
ఏమిటి అంటే? మనము బాగానే ఉన్నామన్న భ్రమలో ఉంటాము. కాని ఎదుటి వాళ్ళకు మన లోని లోపాలు
తెలుస్తాయి. వాళ్ళకు తెలుసు మన పాలు పలుచగా నీళ్ళు కలుపబడి ఉన్నాయని. ఈ రజో తమో గుణాలు
మన దారికి అడ్డుగా నిలబడి మన జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తాయి.
బాబా ఎప్పుడూ చిన్న చిన్న కథలతో, మామూలు మాటల్లో
ఈ సత్యాన్ని మనకు బోధించడానికి ప్రయత్నించారు. ఆయన మన నిజ జీవితాన్నే ఒక ఉదాహరణగా చూపించారు.
ఆయన కూడా మనిషి రూపంలో అన్ని రకాల బాధలను, సుఖాలను అనుభవించినట్లుగా మనకు కనిపించారు.
చూసినవారు ఆయనను ఒక సామాన్యుడిగా లేదా పిచ్చి వాడుగా కూడా అర్ధం చేసుకున్నారు. కాని
ఆయన ఎప్పుడు ఆయన నిజ, సత్యమైన సచ్చిదానంద స్థితిలోనే ఉన్నారు. ఆయన సర్వాంతర్యామి. భగవంతునిగా
సకల కళా వల్లబుడిగా దర్శనమిచ్చారు. అలానే నిర్గుణ తత్వం కూడా చూపించారు. మన పూర్వ వాసనలను
బట్టి మన ఆలోచనా విధానాన్ని బట్టి ఆయన వివిధ రూపాలలో దర్శనం ఇచ్చారు. రాముడుగా, విఠలుడుగా,
గణపతిగా, హనుమగా, దత్తుడిగా ఇలా ఎన్నో రూపాలతో కనిపించారు. ఆయన ఎప్పుడు తన పేరు ఇదని
చెప్పలేదు. మహాల్సాపతిచే సాయి అని పిలవబడి
యావత్ ప్రపంచానికి సాయిబాబాగా ఉండిపోయారు. భగవంతుడ్ని ఏ పేరుతో పిలిస్తే మాత్రం ఏమి? అన్ని పేర్లు ఆయనవే. బాబా సర్వరూపాలలో తననే చూడమని బోధచేసారు. సాయి గురించి ఏమని చెప్తాము.
ఆయన ఈ త్రిగుణాలకు అతీతమైన పరమేశ్వర స్వరూపము.
మనము ఎప్పుడైతే ఈ సాయి తత్వాన్ని అర్ధం చేసుకుంటామో
అప్పుడు ఈ జీవితంలో మార్పులు రావడం అనివార్యం. ఆయన చేసిన బోధలు వింటానికి చాలా సాదారణంగా
ఉన్నా వాటి వెనుక జీవిత సత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు ఉంటాయి. మన మనో స్థితిని బట్టి
మనం వాటిని అర్ధం చేసుకో గల్గుతాము. కాబట్టి సాయి బందువులారా, మనందరం సాయి బాటలో నడుద్దాము,
మన జీవితాలను మార్చుకుందాము. సాయిని మనము ఎన్నో కోరికలు కోరుతాము. ఆయన మన కోరికలు తీరుస్తారు.
కాని ఆయన మన నుంచి అడిగినది ఇది ఒక్కటే, ఈ సత్యం తెలుసుకోమని. సాయి తత్వమే సచ్చిదానంద
స్వరూపము.
ఓం శ్రీ సాయి రాం !
No comments:
Post a Comment