In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, June 22, 2016

హేళనవద్దు-నమ్మకం ముద్దు



బాబా చెప్పిన మాటలు చెవిన పడగానే శ్రోతల మనసులు ఆనందంతో ఊగి శరీరం రోమాంచితం కాకపోతే ఆ మాటల వలన ప్రయోజనం ఏమిటి? అది వ్యర్ధమే. మహానుభావులు మనపై కరుణతో మనకు మంచి మార్గాన్ని బోధిస్తారు. దాన్ని మనం పట్టుకుంటాము, లేదా అన్నది మన చేతుల్లో ఉంది. వారి మాటల వల్ల మన మనసు కరగకపోతే, బాష్పాలతో వారి కంఠం గద్గదమై నయనాల నుండి ప్రేమానందాశ్రవులు ప్రవహించకపోతే ఆ మాటలు వ్యర్ధమే. బాబా యొక్క వాణి మనోహరం. వారి ఉపదేశ పద్ధతి అలౌకికం. వారి ప్రతి మాటలోను కొత్తదనం ఉంటుంది. 

బాబా నోటి నుంచి వచ్చిన ప్రతీమాటా మానవాళికి ఉపయోగపడేదే. అలాంటి ఒక బోధే హేళన వద్దు-నమ్మకం ముద్దు. మనం వేరే వాళ్ళుచేసే పనులను, వారి నమ్మకాన్ని అవహేళన చేస్తాము. ఇదే ఒక వకీలు కథలాగా సచ్చరితలో చెప్పబడింది.

ఒకసారి ఒక వకీలు షిర్డీకి వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబాకి దక్షిణ ఇచ్చి, పాదాభివందనము చేసి ఒక ప్రక్కన కూర్చున్నాడు. బాబా ఎవరితోనో సంభాషిస్తుంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది. బాబా అతని కేసి చూస్తూ ఇలా అన్నారు, జనులు ఎంత మోసగాళ్ళు, పాదాలపై పడతారు, దక్షిణ కూడా ఇస్తారు మనసులో తిడతారు కూడా, ఎంతటి ఆశ్చర్యం? ఆ మాటలను విన్న వకీలు ఆ మాటల్లోని అర్ధాన్ని గ్రహించాడు. అది తన మనసులో బలంగా నాటుకుంది. కాని అక్కడ ఉన్న ఎవరికి దాని అర్ధం పూర్తిగా బోధపడలేదు. 

తరువాత ఈ వకీలు తన బసకు వెళ్ళి దీక్షిత్తో ఇలా అంటాడు.

బాబా చెప్పిన మాటలన్ని అర్ధభరితమైనవి. నేను రాగానే నాపై చెణుకు విసిరారు. నిందాహేళనలతో ఎవరి మనసుని బాధపెట్టరాదని సూచించారు. మా మునసబు ఆరోగ్యం బాగాలేక బాధపడుతూ శరీరం కుదుటపడాలని సెలవు మీద ఇక్కడకు వచ్చాడు. మేము వకీలు కూర్చునే గదిలో ఉండగా ఆయన గురించి అనేక రకాల అర్ధం పర్ధం లేని చర్చలు చేసాము. ఆయన సాయిని ఆశ్రయించినంత మాత్రాన జబ్బులు తగ్గుతాయా! మునసబు లాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సబబా అని అందరూ ఆయన గురించి  అపహాస్యం చేసారు. నేను కూడా నా వంతు హేళన చేయడం జరిగింది. బాబా అన్న మాటలు అనుచితం కాదు. అది వారి ఆగ్రహము కాదు. వారి అనుగ్రహం, అని వకీలు గట్టిగా నమ్మాడు. ఈ నమ్మకమే ఆయన మార్పుకు కారణం అయింది. వారెక్కడో చేసిన ఈ చర్చ గురించి బాబాకు తెలుసు. ఈ హేళన మంచిది కాదు అని చూపించడానికే బాబా ఈ లీల చూపించడం జరిగింది.

ఈ కథ నుంచి  మనం నేర్చుకోవలసిన విషయాలు.
1. వందల మైళ్ళ దూరంలో ఉన్నా సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకుంటారని మనం గ్రహించాలి. నిజంగా బాబా ఎంతటి అంతర్ జ్ఞాని. పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏవీ అడ్డుతగలవు. ఎంతో రహస్యంగా ఉన్నవి వారికి తేటతెల్లం.

2.మన ఎదుటి వారి నమ్మకాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉండే మనుషులు రకరకాలుగా ఉంటారు. కొందరికి కొన్ని నమ్మకాలు, కొన్ని ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. అవి మన దృష్టిలో సరియైనవి కాకపోవచ్చు. కాని వారికి మాత్రం అవి విశేషమైనవి. వారు ఆ నమ్మకం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. వారి మనోభావాల్ని అర్ధం చేసుకొనేంత శక్తి మనకు లేకపోవచ్చు. కానీ ఎదుటి వారిని, వారి నమ్మకాలను హేళనచేయవద్దు.

మనము వారి నమ్మకాన్ని గౌరవించకపోవచ్చు, కాని హేళన మాత్రం చేయకూడదు. ఇలా హేళనచేయడం మూలానా మనం మనసుకు తాత్కాలిక ఉల్లాసం కలిగిస్తాము. కాని మన నిజ స్వరూపం ప్రేమ, శాంతం మరియు ఆనంద స్వరూపం. ఇలా చేయడం వలన మనకు తెలియకుండా మనసులోతుల్లో ఒక అగాధం ఏర్పడుతుంది. కాని మనము దాన్ని చూడలేము. ఇది కాలాంతరంలో ఒక సంచితకర్మలాగా మారి, మనలను కూడా ఈ దుఃఖాన్ని అనుభవించేలాగా చేస్తుంది. అందుకని బాబా ఈ బోధలు చేయడం. 

మనమందరం ఆయన భక్తులం. మనం కష్టపడితే ఆయన చూడలేరు. కాని మనం కష్టాలను కోరి తెచ్చుకుంటాము. ఒక్కోసారి మనం ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది? నేనేం తప్పు చేసాను? అని అంటాము. ఇక్కడ మనం తెలుసుకోవల్సింది ఏమిటి అంటే మనం మనకి తెలిసి తెలియకుండా ఎన్నో తప్పులు చేసాము. వాటిని ఎప్పుడో ఒకప్పుడు ఫలితం రూపంలో అనుభవించాల్సి ఉంటుంది.

ఈ విషయం అర్ధం చేసుకుని బాబా మాటలను దృడంగా మన మనసులో నాటుకునేట్లు చేద్దాము. మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు. 

సాయి సర్వాంతర్యామి.



ఓం శ్రీ సాయిరాం!

Wednesday, June 15, 2016

శ్రేయం - ప్రియం




ప్రియమైనవన్నీ శ్రేయం కాకపోవచ్చు. అలానే శ్రేయమైనది మనకు ప్రియం కాకపోవచ్చు. ఈ శ్రేయ, ప్రియాల మధ్య మన జీవితం ఊగిసలాడుతూ ఉంటుంది. మన వ్యక్తిత్వానికి ఒక రూపం ఆపాదిస్తుంది. ఒక్కోసారి ఈ వ్యక్తిత్వం సమాజం కోసమా అన్నట్లు ఉంటుంది.  దీని వెనుక ఒక మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది.  మనము మన కుటుంబం కోసం, సమాజం కోసం మనకు ప్రియమైనవాటిని అణిచిపెట్టుకోవచ్చు. కాని దీని మూలంగా మనిషిలో ఒక అసంతృప్తి మొదలవుతుంది. దీనిలో నుంచి నిర్లిప్తత, బాధ, దుఃఖము కలగవచ్చు. లోకంలో చాలా మంది పరిస్థితి ఇదే అవ్వచ్చు. కాని కొంత మంది ఇదేమి లెక్కచేయకుండా, వాళ్ళకు ఇష్టమైన రీతిలో ప్రవర్తించవచ్చు. వీరు బయటకు అన్ని సుఖాలను అనుభవిస్తున్నట్లు మనకు అనిపించవచ్చు. కాని వారిలో ఒక అబద్రత బావం ఉంటుంది. ఈ అబద్రతా భావమే వారిని తప్పుదోవ పట్టేట్లు చేస్తుంది. వారిని వివేకహీనులుగా, మందబుద్ధులుగా మారుస్తుంది. 

చీకటి వెలుగులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నా, అవి పరస్పరం భిన్నంగా ఉంటాయి. అలానే శ్రేయ-ప్రియాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఏది నిజమో ఏది కాదో తేల్చుకోలేని పరిస్థితి. మానవులుగా మనం ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసాన్ని అర్ధంచేసుకోలేక పోతున్నాము. మన ఋషులు చూపించిన మార్గాన్ని మనము ఎప్పుడో వదిలేశాము. అందుకే మానవ జీవితం మరింత దుర్భరమైపోతుంది. అందరం క్షణిక సుఖాల కోసం పరుగులు తీస్తూ ఉంటాము. ప్రియమైన వాటి కోసం పరుగులు తీసే మనసు గలవారు స్వార్ధంతో పతనమైపోతారు. అందుకే ఈ రెండింటి మధ్య బేధం తెలుసుకోవాలి. మన జీవితాల్ని  మార్చుకోవాలి. సాయి చేసిన ప్రతి బోధలో ఈ తత్వం కనిపిస్తుంది.

శ్రేయాలు ఏవి? ప్రియాలు ఏవి?
ఈ రెండింటిని మానవులు బాగా తెలుసుకున్నా, స్వతంత్ర బుద్ధి కలవారవటం వలన రెండింటిలో దేనిని గ్రహించాలి అన్నది వారి ఆధీనంలోనే ఉంటుంది. అయినప్పటికీ రెండూ లభించినప్పుడు దేనిని గ్రహించాలో నిర్ణయించుకోవటం కష్టం.

 శ్రేయం వివేక రూపమైతే, ప్రియం అవివేక రూపం.

 శ్రేయాలకు సంబంధించిన విషయాలు కేవలం జ్ఞానికి సంబంధించినవి.

ప్రియాలు అజ్ఞానికి సంబంధించినవి. ప్రియాలు వివేకులను ఎప్పుడూ పొరపాటు పడనివ్వవు. 

మరి శ్రేయాలు అజ్ఞానులకు రుచించవు. 

ఇంద్రియ విషయ సుఖాలపై కోరిక ప్రభలంగా ఉన్నంత వరకు, వివేక వైరాగ్యాలు లేనంతవరకు ప్రియాలే మధురంగా ఉంటాయి. నీళ్ళు, పాలు కలిసిపోయినట్లు ఈ శ్రేయ, ప్రియాలు కలిసిపోయి ఉంటాయి. కేవలం ధీరులు, బుద్ధిమంతులు మాత్రమే శ్రేయాన్ని ఆపేక్షిస్తారు. మానస సరోవరంలోని హంస పాలను మాత్రమే సేవించి నీటిని వదిలేస్తుంది. అలానే వివేకవంతులు శ్రేయాన్ని మాత్రమే గ్రహించి ప్రియానికి విముఖంగా ఉంటారు. కాని మందబుద్ధులు శరీరం, సంతానం, ధనం, గౌరవం మొదలగు యోగ క్షేమాల వెంటబడి ఒక్క ప్రియాలనే సాధించుకుంటారు.

మనం శ్రేయాన్ని తెలివిగా గ్రహించడం, ప్రియంలో ఉన్న అనర్ధాన్ని అర్ధం చేసుకోవడమే పురుషార్ధం.


సరే ఈ చిక్కుముడిని విప్పడం ఎలా, ఏది శ్రేయమో ఏది ప్రియమో అర్ధంచేసుకోవడం ఎలా?
మనం అసలు ఈ విషయం ఎందుకు అర్ధంచేసుకోవాలి?

ప్రపంచం యొక్క చక్రభ్రమణం అంతుపట్టనిది. అహర్నిశలూ ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. అంటే మానవుడు త్రితాపాలను అనుభవిస్తూ సహిస్తూ ఉంటాడు. దానివలన అత్యధికమైన దుఃఖాలను సహిస్తూ, విసిగిపోయి వానిని తొలంగించుకోవడానికి సుఖకరమైన సాధనాలను వెతుకుతాడు. భరించలేని భవచక్ర భ్రమణం (అంటే జనన మరణ చక్రం) లో పడి నలిగిపోతూ ఉంటాడు. ఈ భ్రమణం ఆగటానికి ఏఏ సాధనాలు ఉన్నాయని అన్వేషిస్తాడూ. గొప్ప భాగ్యం వలన ఇటువంటి బుద్ధి పుట్టినప్పుడు పురుషార్ధం అనేది ఉదయిస్తుంది.

ముందుగా శ్రేయం దేనిలో ఉంది అని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ తరువాత ఏమైనా ప్రతిబంధకాలు కలిగితే వానిని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఇక్కడే పురుషార్ధాలు కళ్ళెదుట గట్టిగా నిలబడతాయి. కనుక బుద్ధితో బాగా నిశ్చయించుకొని శ్రేయాల కొరకే పోరాడాలి. మన శాస్త్రాలు సాధన చతుష్టయంలో నిత్యానిత్య వస్తు వివేకం గూర్చి చెప్పడం జరిగింది. ఏది నిజమో ఏది అశాశ్వతమో తెలుసుకోవాలి. ఈ విచక్షణ రావాలి అంటే దైవము మరియు గురుకృప కావాలి. మన పుణ్యము, సదాచారము, సత్సంగము మనలను ఆ దారిలో నడిపిస్తాయి.

స్వప్నంలో బంగారపు వడగళ్ళవాన పడుతుంది. అవసరానికి పనికివస్తుందని అత్యంత శ్రమతో వానిని మూటకట్టుకునే ప్రయత్నం చేస్తే మెలుకువ రాగానే అవి మాయమైపోతాయి. కనిపించే వాటిని కనిపించని వాటిని అనుభవించాలన్న తృష్ణ, కోరిక ప్రతిబంధకం అవుతుంది. ముందు వీనిని సమూలంగా తీసివేయాలి.

మన బుద్ధికి అందని దానిని, నిత్యమైన దానిని, నాశనంలేని దానిని మనం చూడలేము. కాని ఈ వివేకాన్ని ఒక్క గురువు మాత్రమే ఇవ్వగలరు. కామక్రోధాలనే మనోవృత్తులు జ్ఞానప్రాప్తిని కలుగనివ్వవు. మన వివేకాన్ని దెబ్బతీస్తాయి. కర్పూరం కనుక దీపంతో కలిస్తే చాలు అదే కర్పూరం దీపమై వెలుగుతుంది. అలానే మనం వివేకంతో శ్రేయాన్ని ఆశ్రయిస్తే మనలో జ్ఞానదీపం వెలుగుతుంది. ఒక్కసారి ఈ దీపం వెలిగితే, మనలోని వివేక వైరాగ్యాలు ఈ ప్రియాలు అనే చీకటిని తొలగిస్తాయి. నిశ్చలమైన మనసుతో ఆత్మానుసంధానం చేసే వాడొక్కడే జ్ఞానసంపన్నుడు. 

అంతఃకరణంలోని కలవరం కారణంగా, ఎప్పుడూ అశాంతిగా ఉండేవారు, ఇంద్రియలోలత్వం వలన మనసులో ఆందోళన పడేవారు, జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. సదాచారంతో శాస్త్రాలను తెలుసుకొని శ్రేయాన్ని ఆశ్రయించిన వాడు మనసులో సంతృప్తిని కలిగి ఉంటాడు. మనసు ఎప్పుడూ చెడుగా ఉన్నవారికి శాంతి ఉండదు. వారికి పరబ్రహ్మ ప్రాప్తికలగదు. జనన మరణాల చక్రం తప్పదు. మంచివి మరియు శ్రేయమైన అంటే విహితకర్మలు చేయకపోతే చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధిలేక జ్ఞానసంపాదన సంభవం కాదు.  పరిశుద్ధమైన అంతః కరణంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై, సాధన సంపత్తి లభించిన ఈ శరీరమందే మోక్ష ప్రాప్తికలుగుతుంది. 

సాయి మనలను ఈ మార్గంలో నడిపించడానికే వచ్చారు. ఆయనను నమ్ముకున్నచో మనకు ఏవి మంచివో అంటే ఏది శ్రేయమో అదే ఇస్తారు. మనల్ని ప్రియమైన మరియు దుఃఖ కారకము అయిన వాటినుండి రక్షిస్తారు. ఇది కేవలం సాయిలాంటి సద్గురువులకే సాధ్యపడుతుంది.

ఓం సాయిరాం


Wednesday, June 8, 2016

కోరిక



మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా కోరికలనే వలయంలో పడి సతమతమవుతూ ఉంటాడు. ఈ కోరికల్లో మనకు సుఖం లభిస్తూ ఉంటే, మరి మనకు దుఃఖము ఎందుకు కలుగుతోంది? కోరికలు ఉండటం తప్పా.

కోరికలు తీర్చుకోవడం మంచిదా!కాదా!

అలానే కోరికలను అణుచుకోవడం సరియైనదేనా!

అసలు వీటి గురించి ఎందుకు ఆలోచించాలి? అందరిలాగే జీవితం ఎందుకు గడపకూడదు?
ఇక్కడ సమస్య ఏమిటి అంటే కోరికలు ఉండాలి, కాని వాటి వల్ల మనకు దుఃఖము కలుగకూడదు. ఒక వస్తువుని మనం పొందాలి అంటే అందుకు మనకు అర్హత కావాలి. ఈ అర్హత అనేది మనకు లేనప్పుడు మరియు సరియైన ప్రయత్నం చేయనప్పుడు ఆ వస్తువు మనకు దక్కదు. మనం అనుకున్నది జరగనప్పుడు మన మనసుకి కష్టం కలుగుతుంది.

మన శాస్త్రాలన్ని కోరికలను నియంత్రించమని వాటిని అదుపులో ఉంచమని చెప్తాయి. కాని సామాన్య మానవులకు ఇది చాలా కష్టతరమైనది. అందుకే బాబా ఇలా అనేవారు. నా భక్తులు రకరకాల కోరికలతో నా దగ్గరకు వస్తారు. మొట్టమొదటి వారి కోరికలను తీర్చుతూ వారిని సక్రమ మార్గంలో నిడిపిస్తాను.

వారికి విషయ వాసనల మీదే మనస్సు ఉంటే వాళ్ళు మామిడి పూతలాగా రాలిపోతారు  అని కూడా బాబా చెప్పారు.
మనము ఈ కోరికల వలయము నుంచి బయటపడాలి. బాబా మనకు ఇవ్వాలి అనుకున్న ఆ ఖజానని మనం పొందాలి. భగవంతుడు పట్ల శ్రద్ధతో ఉండి బాబా చూపిన మార్గంలో నడిస్తే మనకు ఈ కోరికల వల్ల కలిగే దుఃఖము నుండి విముక్తి కలుగుతుంది.

కోరికలను నియంత్రించే మార్గం - అర్ధం చేసుకోవాల్సిన విషయాలు:

విషయాలయందు ఆసక్తి : 
మనము వస్తువుల గురించి ఆలోచించే కొలది వాటిపై ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఈ విషయాన్నే భగవద్గీత సాంఖ్య యోగంలో భగవానుడు మనకు చెప్పడం జరిగింది.

కోరిక కర్మకు దారి తీస్తుంది:
మనము ఒక వస్తువు గురించి ఆలోచించగా ఆలోచించగా వాటి మీద ఆసక్తి ఏర్పడినప్పుడు మనస్సులో నానావిధములైన సుఖాల ప్రాప్తి కొరకు ఇఛ్ఛలు ప్రబలమగును. ఈ కోరిక తీరడానికి మనము ఏదైనా చేయడానికి సిద్ద పడతాము.

కోరికలలో నుంచే కోపం పుడుతుంది:
మన కోరిక ప్రబలమైనప్పుడు ఆ కోరికతీరనప్పుడు మనము కారణాల కోసం వెదుకుతాము. ఈ కారణము ఒక పరిస్థితి వల్ల కాని లేదా ఒక వ్యక్తి ద్వారా సంభవిస్తే మనకు చాలా క్రోధము కలుగుతుంది. కోపము వలన మనలో వివేక శక్తి నశిస్తుంది. అప్పుడు మంచి చెడ్డల గురించి ఆలోచించము. ఇటువంటి పరిస్థితులలో మనల్ని మనము నియంత్రించుకోలేము. దీనివల్ల కష్టాలను కొని తెచ్చుకుంటాము. ఈ జన్మలో అనుభవించేది కాకుండా వచ్చే జన్మలలో కూడా దీని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఆ తరువాత అయ్యో నాకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని భాదపడ్తాము.

కోరికలను హృదయంతో అర్ధం చేసుకోవాలి:
కోరికలు కలగడం సహజం. బాబా వాటిని తీర్చుకోవద్దు అని చెప్పలేదు. కాని వాటిని నాకు సమర్పించు అప్పుడు ఆ కోరిక నువ్వు తీర్చుకోవచ్చా లేదా అన్న విచక్షణ నీలో కలుగుతుంది అని చెప్పారు.

మనము ఒక కోరిక గురించి ఆలోచించినప్పుడు కాని లేదా దాన్ని అనుభవించినప్పుడు మన మానసిక పరిస్థితి ఏంటి అన్న విషయం అర్ధం చేసుకోవాలి.

మనము విషయ సుఖాలను ఇంద్రియాల ద్వారా అనుభవించడానికి అలవాటు పడ్డాము. కాని ఇక్కడ ఒక మెట్టు పైకి ఎక్కి వాటిని హృదయంతో ఆస్వాదించడం నేర్చుకోవాలి మామూలుగా మనము ఈ సుఖాల తరంగాలను వస్తువుల వైపు పోనిస్తాము. దానివల్ల పూర్తి ఆనందాన్ని అనుభవించలేము. ఇలా మనము సుఖాల వైపు పరుగులు తీస్తూనే ఉంటాము. ఒక కోరిక చాలా కోరికలకు మూల కారణం అవుతుంది, కోరిక ఎప్పటికి తీరదు.

అందుకే ఈ తరంగాలను హృదయం వైపు తిప్పాలి వాటిని నిజంగా అర్ధం చేసుకున్నపుడు వాటి మీద వ్యామోహం తగ్గుతుంది.

బాబా చెప్పిన సులభమైన మార్గం ఏంటి?
విషయ సుఖాలను నాకు అర్పించి అనుభవించు అని చెప్పారు. దీని వల్ల మనకు విచక్షణ శక్తి వస్తుంది. ఆ కోరికల వల్ల ప్రాప్తించిన సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఆ విలువను మనం అర్ధం చేసుకున్నపుడు దాని పట్ల ఆసక్తి తగ్గుతుంది. అప్పుడు అరిషడ్ వర్గాలు అదుపులో ఉంటాయి. మనస్సుకి శాంతి లభిస్తుంది. ఈ శాంతి కలిగితే మనకు గురువు పట్ల శ్రద్ధ కుదురుతుంది.

సాయి బందువులారా, 

కోరికలను అర్ధం చేసుకుందాము. వాటి అవసరం మనకు ఎంత వరకు ఉందో తెలుసుకుందాము. మనకు అక్కర లేని వాటి కోసం పరుగులు ఆపేద్దాము. మన దృష్టిని సాయి వైపు మరల్చుదాము. సాయి అనుగ్రహాన్ని పొంది మామిడి పూతలాగా రాలిపోకుండా ఆయన బాటలో నడుద్దాము.



ఓం సాయిరాం!

Wednesday, June 1, 2016

గురు అష్టకం - శ్రీ శంకరాచార్య విరచితం




1. శరీరమ్ సురూపమ్ తథా వా కళత్రమ్
యశస్చారు చిత్రమ్ ధనమ్ మేరుతుల్యమ్
మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే
తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్ 



భావం : సకల సౌందర్యవంతమైన చక్కని రూపంగల అందమైన భార్య, మేరు పర్వతమంత చాలా డబ్బు, ఇతరులకు సహాయం చేసే మంచి గుణం - కీర్తి, ఇతరులకు కష్టనష్టాలు కలిగించకుండా మంచి జరిగేలా సహాయపడే మనస్తత్వం వంటివన్నీ కలిగి వున్నప్పటికీ.. గురువు పాదాల వద్ద తన మనస్సు, శిరస్సును నిలపలేనివాడికి ఎటువంటి లాభం చేకూరదు.


2. కళత్రమ్ ధనమ్ పుత్ర పౌత్రాధి సర్వమ్
గృహమ్ బాంధవా సర్వ మేతాధి జాతమ్,

మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే

తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్

భావం : మంచి ఇల్లు, సంపద, భార్య, పుత్రులు, మనుమలు, బంధువులు వంటివారు కలిగిన ఒక గొప్ప కుటుంబంలో పుట్టినవాడు గురువు పాదాల వద్ద తన మనస్సును, శిరస్సును నిలపలేనివాడికి ఎటువంటి లాభం లభించదు. అటువంటివాడు భూమి మీద జన్మెత్తి ఏమి లాభం?


3. షడన్గాది వేదో ముఖే శాస్త్ర విద్య
కవిత్వాది గద్యమ్, సుపద్యమ్ కరోతి

మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే

తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్

భావం : ఆరు అంగములలోను, నాలుగు వేదాలలోను ఎంతటి పారంగతుడివైనా గానీ... గద్య, పద్య రచనలలో ఎంతటి ప్రజ్ఞావంతుడివైనా గానీ... గురువు ఆజ్ఞలను శిరసావహించనివాడికి, ఆయన పాదాల వద్ద తన మనస్సును, శిరస్సును నిలుపలేని వాడికి ఎటువంటి లాభం దక్కదు.


4. విదేశేషు మాన్య, స్వదేశేషు ధన్య
సదాచార వృత్తేషు మత్తో న చాన్యా

మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే

తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్

భావం : విదేశాలలో ఎంతటి గొప్పవాడివైనా... స్వదేశంలో ఎంతటి ధనవంతుడివైనా... ఇతరుల ద్వారా సదాచార వృత్తిగలవానిగా జీవించేవాడునంటూ నిత్యం పొగడబడినా... గురువు పాదాల వద్ద మనస్సును నిలుపలేనివాడికి ఎటువంటి లాభాలు అందవు.


5. క్షమా మండలే భూప భూపాల వృందై
సదా సేవితమ్ యస్య పాదారవిందమ్

మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే

తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్

భావం : ఒక దేశాన్ని పాలించే రాజువైనా... ఎందరో రాజులు - రారాజులు నీ పాదాలను సేవిస్తూ, నీ దగ్గరే బంధీగా వుంటూ, నీ గురించి ఎంతగా పొగిడినా.. గురువు పాదాల వద్ద తన మనస్సును నిలుపలేని వాడికి అవన్నీ ఎటువంటి లాభాలను పొందపర్చలేవు.


6. యశో మే గతమ్ భిక్షు దాన ప్రతాప
జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్

మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే

తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్

భావం : కష్టసమయాల్లో వున్నవారిని సహాయం చేయడం... ఇతరులకు చేతనైంతవరకు దానాలు చేయడం వంటి గుణాల వల్ల నీ కీర్తి అన్నివైపులా వ్యపించినా... నీ మంచి సద్గుణాలకు తోడుగా ప్రపంచం మొత్తం నీకు సహాయంగా వున్నా.. గురువు ఆజ్ఞలను శిరసావహించనివాడు.. ఆయన పాదాల వద్ద మనస్సును నిలపవేనివాడు ఎప్పటికీ ప్రయోజితుడు కాలేడు. అటువంటి వాడికి ఏ లాభాలు చేకూరవు.


7. న భోగే, న యోగే, న వా వాజి రాజౌ
న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్

మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే

తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్

భావం : భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము వంటివాటిపై ఎంత శ్రద్ధ చూపించినప్పటికీ... గురువు పాదాల వద్ద తన మనస్సును నిలపలేనివాడికి అటువంటి కార్యాల వల్ల ఎటువంటి లాభం దక్కదు.


8. అరణ్యే న వాసస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె

మనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మే

తథ కిమ్ తథ కిమ్, తథ కిమ్ తథ కిమ్

భావం : అడవిలోగానీ, ఇంట్లోగానీ వుండాలనే కోరిక లేనివారైనా... తన ఒంటిమీద శ్రద్ధలేని వారైనా... ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోయినవారైనా... గురువు పాదాల వద్ద తమ మనస్సును నిలుపలేకపోతే ఎటువంటి లాభాలు అందవు.



9. గురోరష్టకం యః పఠేత్పురాయదేహీ 
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ
లమేద్వాచ్ఛితాథం పదం బ్రహ్మసంఙ్ఞం
 గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ 

ఎంతటి పవిత్ర వ్యక్తులైనా, సన్యాసులైనా, రాజయినా, సజ్జనులైనా, బ్రహ్మచారులైనా, చివరికి పాపాత్ములైనా, ఎవరైనా ఈ గురు అష్టకాన్ని నిత్యం పారాయణం చేసి.. గురువును శ్రద్ధతో సేవిస్తారో.. వారు కోరుకున్న కోరికలను సాక్షాత్తూ బ్రహ్మదేవుడే తీరుస్తాడు.


శ్రీ సాయి గురవే నమః !