In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, June 22, 2016

హేళనవద్దు-నమ్మకం ముద్దు



బాబా చెప్పిన మాటలు చెవిన పడగానే శ్రోతల మనసులు ఆనందంతో ఊగి శరీరం రోమాంచితం కాకపోతే ఆ మాటల వలన ప్రయోజనం ఏమిటి? అది వ్యర్ధమే. మహానుభావులు మనపై కరుణతో మనకు మంచి మార్గాన్ని బోధిస్తారు. దాన్ని మనం పట్టుకుంటాము, లేదా అన్నది మన చేతుల్లో ఉంది. వారి మాటల వల్ల మన మనసు కరగకపోతే, బాష్పాలతో వారి కంఠం గద్గదమై నయనాల నుండి ప్రేమానందాశ్రవులు ప్రవహించకపోతే ఆ మాటలు వ్యర్ధమే. బాబా యొక్క వాణి మనోహరం. వారి ఉపదేశ పద్ధతి అలౌకికం. వారి ప్రతి మాటలోను కొత్తదనం ఉంటుంది. 

బాబా నోటి నుంచి వచ్చిన ప్రతీమాటా మానవాళికి ఉపయోగపడేదే. అలాంటి ఒక బోధే హేళన వద్దు-నమ్మకం ముద్దు. మనం వేరే వాళ్ళుచేసే పనులను, వారి నమ్మకాన్ని అవహేళన చేస్తాము. ఇదే ఒక వకీలు కథలాగా సచ్చరితలో చెప్పబడింది.

ఒకసారి ఒక వకీలు షిర్డీకి వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబాకి దక్షిణ ఇచ్చి, పాదాభివందనము చేసి ఒక ప్రక్కన కూర్చున్నాడు. బాబా ఎవరితోనో సంభాషిస్తుంటే అతనికి వినాలన్న కోరిక కలిగింది. బాబా అతని కేసి చూస్తూ ఇలా అన్నారు, జనులు ఎంత మోసగాళ్ళు, పాదాలపై పడతారు, దక్షిణ కూడా ఇస్తారు మనసులో తిడతారు కూడా, ఎంతటి ఆశ్చర్యం? ఆ మాటలను విన్న వకీలు ఆ మాటల్లోని అర్ధాన్ని గ్రహించాడు. అది తన మనసులో బలంగా నాటుకుంది. కాని అక్కడ ఉన్న ఎవరికి దాని అర్ధం పూర్తిగా బోధపడలేదు. 

తరువాత ఈ వకీలు తన బసకు వెళ్ళి దీక్షిత్తో ఇలా అంటాడు.

బాబా చెప్పిన మాటలన్ని అర్ధభరితమైనవి. నేను రాగానే నాపై చెణుకు విసిరారు. నిందాహేళనలతో ఎవరి మనసుని బాధపెట్టరాదని సూచించారు. మా మునసబు ఆరోగ్యం బాగాలేక బాధపడుతూ శరీరం కుదుటపడాలని సెలవు మీద ఇక్కడకు వచ్చాడు. మేము వకీలు కూర్చునే గదిలో ఉండగా ఆయన గురించి అనేక రకాల అర్ధం పర్ధం లేని చర్చలు చేసాము. ఆయన సాయిని ఆశ్రయించినంత మాత్రాన జబ్బులు తగ్గుతాయా! మునసబు లాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సబబా అని అందరూ ఆయన గురించి  అపహాస్యం చేసారు. నేను కూడా నా వంతు హేళన చేయడం జరిగింది. బాబా అన్న మాటలు అనుచితం కాదు. అది వారి ఆగ్రహము కాదు. వారి అనుగ్రహం, అని వకీలు గట్టిగా నమ్మాడు. ఈ నమ్మకమే ఆయన మార్పుకు కారణం అయింది. వారెక్కడో చేసిన ఈ చర్చ గురించి బాబాకు తెలుసు. ఈ హేళన మంచిది కాదు అని చూపించడానికే బాబా ఈ లీల చూపించడం జరిగింది.

ఈ కథ నుంచి  మనం నేర్చుకోవలసిన విషయాలు.
1. వందల మైళ్ళ దూరంలో ఉన్నా సాయిబాబా అందరి అంతరంగాలను తెలుసుకుంటారని మనం గ్రహించాలి. నిజంగా బాబా ఎంతటి అంతర్ జ్ఞాని. పర్వతాల వంటివి ఎన్ని అడ్డం ఉన్నా వారి దృష్టికి ఏవీ అడ్డుతగలవు. ఎంతో రహస్యంగా ఉన్నవి వారికి తేటతెల్లం.

2.మన ఎదుటి వారి నమ్మకాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉండే మనుషులు రకరకాలుగా ఉంటారు. కొందరికి కొన్ని నమ్మకాలు, కొన్ని ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. అవి మన దృష్టిలో సరియైనవి కాకపోవచ్చు. కాని వారికి మాత్రం అవి విశేషమైనవి. వారు ఆ నమ్మకం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. వారి మనోభావాల్ని అర్ధం చేసుకొనేంత శక్తి మనకు లేకపోవచ్చు. కానీ ఎదుటి వారిని, వారి నమ్మకాలను హేళనచేయవద్దు.

మనము వారి నమ్మకాన్ని గౌరవించకపోవచ్చు, కాని హేళన మాత్రం చేయకూడదు. ఇలా హేళనచేయడం మూలానా మనం మనసుకు తాత్కాలిక ఉల్లాసం కలిగిస్తాము. కాని మన నిజ స్వరూపం ప్రేమ, శాంతం మరియు ఆనంద స్వరూపం. ఇలా చేయడం వలన మనకు తెలియకుండా మనసులోతుల్లో ఒక అగాధం ఏర్పడుతుంది. కాని మనము దాన్ని చూడలేము. ఇది కాలాంతరంలో ఒక సంచితకర్మలాగా మారి, మనలను కూడా ఈ దుఃఖాన్ని అనుభవించేలాగా చేస్తుంది. అందుకని బాబా ఈ బోధలు చేయడం. 

మనమందరం ఆయన భక్తులం. మనం కష్టపడితే ఆయన చూడలేరు. కాని మనం కష్టాలను కోరి తెచ్చుకుంటాము. ఒక్కోసారి మనం ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది? నేనేం తప్పు చేసాను? అని అంటాము. ఇక్కడ మనం తెలుసుకోవల్సింది ఏమిటి అంటే మనం మనకి తెలిసి తెలియకుండా ఎన్నో తప్పులు చేసాము. వాటిని ఎప్పుడో ఒకప్పుడు ఫలితం రూపంలో అనుభవించాల్సి ఉంటుంది.

ఈ విషయం అర్ధం చేసుకుని బాబా మాటలను దృడంగా మన మనసులో నాటుకునేట్లు చేద్దాము. మనం ఎక్కడ ఏం చేస్తున్నా అది సాయి దృష్టిలో పడకుండా ఉండదు. 

సాయి సర్వాంతర్యామి.



ఓం శ్రీ సాయిరాం!

No comments:

Post a Comment