ప్రియమైనవన్నీ
శ్రేయం కాకపోవచ్చు. అలానే శ్రేయమైనది మనకు ప్రియం కాకపోవచ్చు. ఈ శ్రేయ, ప్రియాల మధ్య
మన జీవితం ఊగిసలాడుతూ ఉంటుంది. మన వ్యక్తిత్వానికి ఒక రూపం ఆపాదిస్తుంది. ఒక్కోసారి
ఈ వ్యక్తిత్వం సమాజం కోసమా అన్నట్లు ఉంటుంది.
దీని వెనుక ఒక మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనము మన కుటుంబం కోసం, సమాజం కోసం మనకు ప్రియమైనవాటిని అణిచిపెట్టుకోవచ్చు. కాని దీని మూలంగా మనిషిలో
ఒక అసంతృప్తి మొదలవుతుంది. దీనిలో నుంచి నిర్లిప్తత, బాధ, దుఃఖము కలగవచ్చు. లోకంలో
చాలా మంది పరిస్థితి ఇదే అవ్వచ్చు. కాని కొంత మంది ఇదేమి లెక్కచేయకుండా, వాళ్ళకు ఇష్టమైన
రీతిలో ప్రవర్తించవచ్చు. వీరు బయటకు అన్ని సుఖాలను అనుభవిస్తున్నట్లు మనకు అనిపించవచ్చు.
కాని వారిలో ఒక అబద్రత బావం ఉంటుంది. ఈ అబద్రతా భావమే వారిని తప్పుదోవ పట్టేట్లు చేస్తుంది.
వారిని వివేకహీనులుగా, మందబుద్ధులుగా మారుస్తుంది.
చీకటి
వెలుగులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నా, అవి పరస్పరం భిన్నంగా ఉంటాయి. అలానే శ్రేయ-ప్రియాలు
ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఏది నిజమో ఏది కాదో తేల్చుకోలేని పరిస్థితి. మానవులుగా
మనం ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసాన్ని అర్ధంచేసుకోలేక పోతున్నాము. మన ఋషులు చూపించిన
మార్గాన్ని మనము ఎప్పుడో వదిలేశాము. అందుకే మానవ జీవితం మరింత దుర్భరమైపోతుంది. అందరం
క్షణిక సుఖాల కోసం పరుగులు తీస్తూ ఉంటాము. ప్రియమైన వాటి కోసం పరుగులు తీసే మనసు గలవారు
స్వార్ధంతో పతనమైపోతారు. అందుకే ఈ రెండింటి మధ్య బేధం తెలుసుకోవాలి. మన జీవితాల్ని మార్చుకోవాలి. సాయి చేసిన ప్రతి బోధలో ఈ తత్వం కనిపిస్తుంది.
శ్రేయాలు ఏవి? ప్రియాలు ఏవి?
ఈ
రెండింటిని మానవులు బాగా తెలుసుకున్నా, స్వతంత్ర బుద్ధి కలవారవటం వలన రెండింటిలో దేనిని
గ్రహించాలి అన్నది వారి ఆధీనంలోనే ఉంటుంది. అయినప్పటికీ రెండూ లభించినప్పుడు దేనిని
గ్రహించాలో నిర్ణయించుకోవటం కష్టం.
శ్రేయం వివేక రూపమైతే, ప్రియం అవివేక రూపం.
శ్రేయాలకు సంబంధించిన విషయాలు కేవలం జ్ఞానికి సంబంధించినవి.
ప్రియాలు అజ్ఞానికి సంబంధించినవి. ప్రియాలు వివేకులను
ఎప్పుడూ పొరపాటు పడనివ్వవు.
మరి శ్రేయాలు అజ్ఞానులకు రుచించవు.
ఇంద్రియ విషయ సుఖాలపై
కోరిక ప్రభలంగా ఉన్నంత వరకు, వివేక వైరాగ్యాలు లేనంతవరకు ప్రియాలే మధురంగా ఉంటాయి. నీళ్ళు,
పాలు కలిసిపోయినట్లు ఈ శ్రేయ, ప్రియాలు కలిసిపోయి ఉంటాయి. కేవలం ధీరులు, బుద్ధిమంతులు
మాత్రమే శ్రేయాన్ని ఆపేక్షిస్తారు. మానస సరోవరంలోని హంస పాలను మాత్రమే సేవించి నీటిని
వదిలేస్తుంది. అలానే వివేకవంతులు శ్రేయాన్ని మాత్రమే గ్రహించి ప్రియానికి విముఖంగా
ఉంటారు. కాని మందబుద్ధులు శరీరం, సంతానం, ధనం, గౌరవం మొదలగు యోగ క్షేమాల వెంటబడి ఒక్క
ప్రియాలనే సాధించుకుంటారు.
మనం
శ్రేయాన్ని తెలివిగా గ్రహించడం, ప్రియంలో ఉన్న అనర్ధాన్ని అర్ధం చేసుకోవడమే పురుషార్ధం.
సరే
ఈ చిక్కుముడిని విప్పడం ఎలా, ఏది శ్రేయమో ఏది ప్రియమో అర్ధంచేసుకోవడం ఎలా?
మనం అసలు
ఈ విషయం ఎందుకు అర్ధంచేసుకోవాలి?
ప్రపంచం
యొక్క చక్రభ్రమణం అంతుపట్టనిది. అహర్నిశలూ ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. అంటే మానవుడు
త్రితాపాలను అనుభవిస్తూ సహిస్తూ ఉంటాడు. దానివలన అత్యధికమైన దుఃఖాలను సహిస్తూ, విసిగిపోయి
వానిని తొలంగించుకోవడానికి సుఖకరమైన సాధనాలను వెతుకుతాడు. భరించలేని భవచక్ర భ్రమణం
(అంటే జనన మరణ చక్రం) లో పడి నలిగిపోతూ ఉంటాడు. ఈ భ్రమణం ఆగటానికి ఏఏ సాధనాలు ఉన్నాయని
అన్వేషిస్తాడూ. గొప్ప భాగ్యం వలన ఇటువంటి బుద్ధి పుట్టినప్పుడు పురుషార్ధం అనేది ఉదయిస్తుంది.
ముందుగా
శ్రేయం దేనిలో ఉంది అని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ తరువాత ఏమైనా ప్రతిబంధకాలు కలిగితే
వానిని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఇక్కడే పురుషార్ధాలు కళ్ళెదుట గట్టిగా నిలబడతాయి.
కనుక బుద్ధితో బాగా నిశ్చయించుకొని శ్రేయాల కొరకే పోరాడాలి. మన శాస్త్రాలు సాధన చతుష్టయంలో
నిత్యానిత్య వస్తు వివేకం గూర్చి చెప్పడం జరిగింది. ఏది నిజమో ఏది అశాశ్వతమో తెలుసుకోవాలి.
ఈ విచక్షణ రావాలి అంటే దైవము మరియు గురుకృప కావాలి. మన పుణ్యము, సదాచారము, సత్సంగము
మనలను ఆ దారిలో నడిపిస్తాయి.
స్వప్నంలో
బంగారపు వడగళ్ళవాన పడుతుంది. అవసరానికి పనికివస్తుందని అత్యంత శ్రమతో వానిని మూటకట్టుకునే
ప్రయత్నం చేస్తే మెలుకువ రాగానే అవి మాయమైపోతాయి. కనిపించే వాటిని కనిపించని వాటిని
అనుభవించాలన్న తృష్ణ, కోరిక ప్రతిబంధకం అవుతుంది. ముందు వీనిని సమూలంగా తీసివేయాలి.
మన
బుద్ధికి అందని దానిని, నిత్యమైన దానిని, నాశనంలేని దానిని మనం చూడలేము. కాని ఈ వివేకాన్ని
ఒక్క గురువు మాత్రమే ఇవ్వగలరు. కామక్రోధాలనే మనోవృత్తులు జ్ఞానప్రాప్తిని
కలుగనివ్వవు. మన వివేకాన్ని దెబ్బతీస్తాయి. కర్పూరం కనుక దీపంతో కలిస్తే చాలు అదే కర్పూరం
దీపమై వెలుగుతుంది. అలానే మనం వివేకంతో శ్రేయాన్ని ఆశ్రయిస్తే మనలో జ్ఞానదీపం వెలుగుతుంది.
ఒక్కసారి ఈ దీపం వెలిగితే, మనలోని వివేక వైరాగ్యాలు ఈ ప్రియాలు అనే చీకటిని తొలగిస్తాయి.
నిశ్చలమైన మనసుతో ఆత్మానుసంధానం చేసే వాడొక్కడే జ్ఞానసంపన్నుడు.
అంతఃకరణంలోని
కలవరం కారణంగా, ఎప్పుడూ అశాంతిగా ఉండేవారు, ఇంద్రియలోలత్వం వలన మనసులో ఆందోళన పడేవారు,
జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. సదాచారంతో శాస్త్రాలను తెలుసుకొని శ్రేయాన్ని ఆశ్రయించిన
వాడు మనసులో సంతృప్తిని కలిగి ఉంటాడు. మనసు ఎప్పుడూ చెడుగా ఉన్నవారికి శాంతి ఉండదు.
వారికి పరబ్రహ్మ ప్రాప్తికలగదు. జనన మరణాల చక్రం తప్పదు. మంచివి మరియు శ్రేయమైన అంటే
విహితకర్మలు చేయకపోతే చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధిలేక జ్ఞానసంపాదన సంభవం కాదు. పరిశుద్ధమైన అంతః కరణంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై, సాధన సంపత్తి లభించిన ఈ
శరీరమందే మోక్ష ప్రాప్తికలుగుతుంది.
సాయి మనలను ఈ మార్గంలో నడిపించడానికే వచ్చారు.
ఆయనను నమ్ముకున్నచో మనకు ఏవి మంచివో అంటే ఏది శ్రేయమో అదే ఇస్తారు. మనల్ని ప్రియమైన
మరియు దుఃఖ కారకము అయిన వాటినుండి రక్షిస్తారు. ఇది కేవలం సాయిలాంటి సద్గురువులకే సాధ్యపడుతుంది.
ఓం సాయిరాం
No comments:
Post a Comment