మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా
కోరికలనే వలయంలో పడి సతమతమవుతూ ఉంటాడు. ఈ కోరికల్లో మనకు సుఖం లభిస్తూ ఉంటే, మరి మనకు
దుఃఖము ఎందుకు కలుగుతోంది? కోరికలు ఉండటం తప్పా.
కోరికలు తీర్చుకోవడం మంచిదా!కాదా!
అలానే కోరికలను అణుచుకోవడం సరియైనదేనా!
అసలు వీటి గురించి ఎందుకు ఆలోచించాలి? అందరిలాగే
జీవితం ఎందుకు గడపకూడదు?
ఇక్కడ సమస్య ఏమిటి అంటే కోరికలు ఉండాలి, కాని
వాటి వల్ల మనకు దుఃఖము కలుగకూడదు. ఒక వస్తువుని మనం పొందాలి అంటే అందుకు మనకు అర్హత
కావాలి. ఈ అర్హత అనేది మనకు లేనప్పుడు మరియు సరియైన ప్రయత్నం చేయనప్పుడు ఆ వస్తువు
మనకు దక్కదు. మనం అనుకున్నది జరగనప్పుడు మన మనసుకి కష్టం కలుగుతుంది.
మన శాస్త్రాలన్ని కోరికలను నియంత్రించమని
వాటిని అదుపులో ఉంచమని చెప్తాయి. కాని సామాన్య మానవులకు ఇది చాలా కష్టతరమైనది. అందుకే
బాబా ఇలా అనేవారు. నా భక్తులు రకరకాల కోరికలతో నా దగ్గరకు వస్తారు. మొట్టమొదటి వారి
కోరికలను తీర్చుతూ వారిని సక్రమ మార్గంలో నిడిపిస్తాను.
వారికి విషయ వాసనల మీదే మనస్సు ఉంటే వాళ్ళు
మామిడి పూతలాగా రాలిపోతారు అని కూడా బాబా చెప్పారు.
మనము ఈ కోరికల వలయము నుంచి బయటపడాలి. బాబా
మనకు ఇవ్వాలి అనుకున్న ఆ ఖజానని మనం పొందాలి. భగవంతుడు పట్ల శ్రద్ధతో ఉండి బాబా చూపిన
మార్గంలో నడిస్తే మనకు ఈ కోరికల వల్ల కలిగే దుఃఖము నుండి విముక్తి కలుగుతుంది.
కోరికలను నియంత్రించే మార్గం - అర్ధం చేసుకోవాల్సిన
విషయాలు:
విషయాలయందు ఆసక్తి :
మనము వస్తువుల గురించి ఆలోచించే కొలది వాటిపై ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఈ విషయాన్నే భగవద్గీత సాంఖ్య యోగంలో భగవానుడు మనకు చెప్పడం జరిగింది.
కోరిక కర్మకు దారి తీస్తుంది:
మనము ఒక వస్తువు గురించి ఆలోచించగా ఆలోచించగా
వాటి మీద ఆసక్తి ఏర్పడినప్పుడు మనస్సులో నానావిధములైన సుఖాల ప్రాప్తి కొరకు ఇఛ్ఛలు
ప్రబలమగును. ఈ కోరిక తీరడానికి మనము ఏదైనా చేయడానికి సిద్ద పడతాము.
కోరికలలో నుంచే కోపం పుడుతుంది:
మన కోరిక ప్రబలమైనప్పుడు ఆ కోరికతీరనప్పుడు
మనము కారణాల కోసం వెదుకుతాము. ఈ కారణము ఒక పరిస్థితి వల్ల కాని లేదా ఒక వ్యక్తి ద్వారా
సంభవిస్తే మనకు చాలా క్రోధము కలుగుతుంది. కోపము వలన మనలో వివేక శక్తి నశిస్తుంది. అప్పుడు
మంచి చెడ్డల గురించి ఆలోచించము. ఇటువంటి పరిస్థితులలో మనల్ని మనము నియంత్రించుకోలేము.
దీనివల్ల కష్టాలను కొని తెచ్చుకుంటాము. ఈ జన్మలో అనుభవించేది కాకుండా వచ్చే జన్మలలో
కూడా దీని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఆ తరువాత అయ్యో నాకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి
అని భాదపడ్తాము.
కోరికలను హృదయంతో అర్ధం చేసుకోవాలి:
కోరికలు కలగడం సహజం. బాబా వాటిని తీర్చుకోవద్దు
అని చెప్పలేదు. కాని వాటిని నాకు సమర్పించు అప్పుడు ఆ కోరిక నువ్వు తీర్చుకోవచ్చా లేదా
అన్న విచక్షణ నీలో కలుగుతుంది అని చెప్పారు.
మనము ఒక కోరిక గురించి ఆలోచించినప్పుడు కాని
లేదా దాన్ని అనుభవించినప్పుడు మన మానసిక పరిస్థితి ఏంటి అన్న విషయం అర్ధం చేసుకోవాలి.
మనము విషయ సుఖాలను ఇంద్రియాల ద్వారా అనుభవించడానికి
అలవాటు పడ్డాము. కాని ఇక్కడ ఒక మెట్టు పైకి ఎక్కి వాటిని హృదయంతో ఆస్వాదించడం నేర్చుకోవాలి
మామూలుగా మనము ఈ సుఖాల తరంగాలను వస్తువుల వైపు పోనిస్తాము. దానివల్ల పూర్తి ఆనందాన్ని
అనుభవించలేము. ఇలా మనము సుఖాల వైపు పరుగులు తీస్తూనే ఉంటాము. ఒక కోరిక చాలా కోరికలకు
మూల కారణం అవుతుంది, కోరిక ఎప్పటికి తీరదు.
అందుకే ఈ తరంగాలను హృదయం వైపు తిప్పాలి వాటిని
నిజంగా అర్ధం చేసుకున్నపుడు వాటి మీద వ్యామోహం తగ్గుతుంది.
బాబా చెప్పిన సులభమైన మార్గం ఏంటి?
విషయ సుఖాలను నాకు అర్పించి అనుభవించు
అని చెప్పారు. దీని వల్ల మనకు విచక్షణ శక్తి వస్తుంది. ఆ కోరికల వల్ల ప్రాప్తించిన
సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఆ విలువను మనం అర్ధం చేసుకున్నపుడు దాని పట్ల ఆసక్తి
తగ్గుతుంది. అప్పుడు అరిషడ్ వర్గాలు అదుపులో ఉంటాయి. మనస్సుకి శాంతి లభిస్తుంది. ఈ
శాంతి కలిగితే మనకు గురువు పట్ల శ్రద్ధ కుదురుతుంది.
సాయి బందువులారా,
కోరికలను అర్ధం చేసుకుందాము.
వాటి అవసరం మనకు ఎంత వరకు ఉందో తెలుసుకుందాము. మనకు అక్కర లేని వాటి కోసం పరుగులు ఆపేద్దాము.
మన దృష్టిని సాయి వైపు మరల్చుదాము. సాయి అనుగ్రహాన్ని పొంది మామిడి పూతలాగా రాలిపోకుండా
ఆయన బాటలో నడుద్దాము.
ఓం సాయిరాం!
No comments:
Post a Comment