గురు తత్వాన్ని అందరు బోదించవచ్చు, కానీ ఆచరించి చూపించినవారు చాలా
తక్కువమంది. గురువే మార్గమని, గురువే సర్వమని, గురువుని సదా స్మరిస్తే పరమార్ధం
లభిస్తుంది అని షిర్డీ సాయి నాధులవారు చెప్పారు. ఆయన ఆ మార్గాన్నే అనుసరించి చూపించారు.
ఆ గురువు పట్ల శ్రద్ద కలిగి ఉండడమే ఉత్తమ సాధనగా వర్ణించారు.
"గురు" అనే పదమే ఒక దివ్య మంత్రం. గురువుగా సాయిని
మనమందరము పూజించుదాము. సాయిపై నమ్మకాన్ని పెంచుకొందాము. ఊరికినే నమ్మకం అనే పదంతో
సరిపెట్టుకోకుండా ఆ నమ్మకమే మనమవ్వాలి. మన జీవితమే ఒక నమ్మకంగా మారాలి. మనం చేసే ప్రతి పనిలో ఆ శ్రద్ధ ఇమిడి ఉండాలి. అప్పుడే ఆ నమ్మకాన్ని శ్రద్దా అని అంటారు. ఇలా ఉన్నప్పుడే బాబా చెప్పిన శ్రద్ద అనే పదానికి న్యాయం జరుగుతుంది.
గురువు అంటే పరమాత్మ. గురువే సృష్టి, స్థితి మరియు లయము. అందుకే గురు
బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ ధేవో మహేశ్వరః అని మనం చెప్పుకుంటాము. ఆ పరమాత్మకు
ఒక ఆకారం ఆపాదిస్తే, ఒక తత్వాన్ని వ్యక్తం చేస్తే బహిర్గతం అయ్యే వ్యక్తిత్వమే
గురువు.
జగత్తు అంటే ఎప్పుడు మారుతూ ఉండేది. నామరూపాలే ఈ జగత్తు. విశ్వమంతా
గురువుయొక్క ఆకారమే. మనం ఒక చిన్న విగ్రహం పెట్టుకొని, ఇదే నా దేవుడు, ఇదే నా
గురువు అంటే సరిపోతుందా? అన్ని దేహాలలో గురువే ఉన్నారు. కదిలేవి కదలనివి, ఇలా
అన్ని జీవులలో గురువే చైతన్యమై ఉంటారు. అందుకే సాయి ఇలా చెప్పారు. "ఈ మూడు
బారల శరీరం మాత్రమే నేను కాదు, షిర్డీలో మాత్రమే నేను ఉన్నాను అనే అనుకొంటే
ఎలా".
నానా సాహెబ్ తెచ్చిన ప్రసాదంపై ఈగగా ఉన్నా, లక్ష్మిభాయి ఆహారాన్ని కుక్కగా స్వీకరించినా, రకరకాల రూపాలతో వచ్చి తన భక్తులను అనుగ్రహించినా, ఏమి చేసినా ఈ సర్వవ్యాపకత్వాన్నే నేర్పించారు. అదే పరమాత్మ తత్వము. ఇదే నిజమైన గురు తత్వము.
ఈ గురు తత్వాన్ని బాగా అర్ధం చేసుకోవాలి అంటే మనం ఏమి చేయాలి?
మనం మొట్టమొదట సాయిని గురువుగా
స్వీకరించాలి. గురువుగా కొలవడం నేర్చుకోవాలి. దేవుడు మనం అడిగిన వరం మాత్రమే
ఇస్తాడని అంటారు. కానీ గురువు మనలను జన్మజన్మలకు రక్షిస్తారు.
నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివ
రూపిణం !
శిరసా యోగ పీఠస్థం ముక్తి కామ్యార్ధ
సిద్ధయే !!
గురువు ప్రశాంతుడు. ప్రత్యక్ష శివ రూపి. ఇక్కడ శివ రూపి అంటే
పరమాత్మ. యోగ పీఠమందున్న వాడు. యోగ పీఠమంటే మనలోని
చైతన్యము. మన శిరస్సులోని సహస్రార పద్మము లేదా మన హృదయము అనే అర్ధం కూడా చెప్పుకోవచ్చు. అలా ఉన్న సద్గురువుకి మోక్ష సిద్ధికోసమై తలవంచి
నమస్కరిస్తున్నాను.
ఎవరికి పూజ చేస్తే మాయలు మొహాలు నశిస్తాయో, రజో తమో గుణాలు నశించి
ప్రశాంత చిత్తం ఏర్పడుతుందో వారే "గురువు". అందుకే ఆయనను ప్రశాంతుడు అని
అన్నారు. మనలోనే ఆ గురువు కొలువై ఉన్నాడని, ఆయనే మన హృదయకమలంలో ఉన్నారని, ఆయనే మన
సహస్రార పద్మంలో ఉన్నారని భావన చెయ్యాలి. ప్రతిరోజూ మనం ధ్యానం చేసేటప్పుడు ఇలా భావన
చేస్తూ, ఆయన అద్భుతమైన రూపానికి అభిషేకం చెయ్యాలి. ఆయనకు చేయించే స్నానం, అభిషేకం మన తల మీదనుంచి, అంటే ఆయన శరీరం మీదనుంచి, మన శరీరంలోని
ఒక్కో భాగం మీద పడుతూ, మన అంగాలలోని మాలిన్యాన్ని తొలిగిస్తున్నట్లు భావించాలి.
ఇలా ఈ నిరాకార - సాకార పూజ చేస్తే మన జన్మ ధన్యం అవుతుంది. మన పాపాలన్నీ దగ్దమై
మనలో జ్ఞాన బీజం మొలకెత్తుతుంది.
గురువు పాదం మొదలు శిరస్సు వరకు మనోనేత్రంతో దర్శించడం అలవాటు
చేసుకోవాలి. మొట్టమొదటగా గురువు పాదాల మీద మన దృష్టి నిలపాలి.
అప్పుడే గురువు యొక్క చూపులు మన శిరస్సుపై పడతాయి. ఇదే దృష్ఠి పాతంగా మనలోని
అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. అప్పుడు మనం జ్ఞానమయంగా ఉండిపోతాము. ఇలా మనం సదా
గురువుని సేవిస్తూ ఉండాలి. ఈ శరీరం ఉన్నంతవరకు మన గురువుని మనం పూజించాలి. అంతా
సాయి మయం కావాలి. అందరిలో ఆ చైతన్యమే ఉందని గ్రహించాలి.
గురు తత్వమే - సాయి తత్వము
సర్వ వ్యాపకత్వమే - సాయి తత్వము
సత్ చిత్ ఆనందమే - సాయి తత్వము
సమర్ధ సద్గురు సాయినాధ మహారాజ్ కి జై !
No comments:
Post a Comment