గురు గీతలో గురువు గొప్పతనం గురించి చెప్పటం జరిగింది.
అలానే గురువంటే ఎవరు, గురువు అనే పదానికి అర్ధం, గురువు గారిని ఎలా ధ్యానం చేయాలి
అనే చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ సాక్షాత్తు పరమ శివుని ద్వారా పార్వతి మాతకు
విన్పించడం జరిగింది. గురువె పరబ్రహ్మ అని మనము చిన్నతనం నుంచి నేర్చుకుంటూనే
ఉన్నాము. గురువు పాదాలలోనే అన్ని క్షేత్రాలు ఉన్నాయి అని కూడా తెలుసుకున్నాము.
గురువు నివాస స్థలమే కాశీ క్షేత్రమని గురు గీత చెపుతుంది. వారి పాదోదకమే పరమ
పవిత్రమైన గంగ. పరబ్రహ్మమైన కాశి విశ్వేశ్వరుడు సాక్షాత్తూ గురువే. ఇక్కడ శివుడు అంటే మంగళ
స్వరూపము. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే పరమ శివుడుగా మనం అర్ధం చేసుకోవాలి. ఆ
శివ స్వరూపమే నారాయణ తత్వము. అందుకే గురు గీత ఇలా చెపుతుంది.
గురు పాదాంకితం యత్ర గయా సాధోక్ష జోద్భవా !
తీర్థరాజ: ప్రయాగోసౌ గురు మూర్తయే నమో నమః !!
గురువు పాద ముద్రలు పడిన చోటే విష్ణు పాదాంకితమైన గయా క్షేత్రం.
గురువున్న ప్రదేశమే గయా తీర్ధం. అలాంటి గురుమూర్తికి నమస్కారము.
ఇలా శివ తత్వానికి మరియు నారాయణ తత్వానికి
బేధం లేదని పరమ శివుడు చెప్పారు. ఏ శక్తి అంతటా వ్యాపించి ఉన్నదో అదే ఈ తత్వము.
గురువు గారి పాద రేణువులు సంసారమనే సముద్రానికి వంతెన కట్టడానికి
సరిపోతాయి అని గురు గీత వక్కాణించి చెపుతుంది. మరి అలాంటి గురువుని ధ్యానించకుండా
ఎలా ఉండగలం!
సంసార సాగరం అంటే ఈ జనన మరణ చక్రమే. అందుకే షిర్డీ సాయి ఈ గురు
మార్గాన్నే బోధించారు. ఇదే సులభమైన మార్గం.
గురుమూర్తిం స్మరేన్నిత్యం గురొర్నామ సదా జపేత్
!
గురో రాజ్ఞామ్ ప్రకుర్వీత గురో రస్యం న భావయేత్ !!
మనం ఎల్లప్పుడూ గురువు గారి రూపాన్నే స్మరించాలి. గురు నామాన్నే
జపించాలి. గురువు ఆజ్ఞనే పాలించాలి. వేరే ఏది భావించరాదు.
ఒక్క సారి గురువు గారిని చేరిన తర్వాత వేరే విషయాలు అంత ముఖ్యం కాదని
తెలుసుకోవాలి. గురువు మనకు ఏది మంచిదో అదే చేస్తారు. ఇక్కడే మనం శ్రద్ధ అనే
మంత్రాన్ని వాడుకోవాలి. ఈ నమ్మకమే మనలను రక్షిస్తుంది. గురువుపై ఉన్న నమ్మకం వలెనే
మనకు జ్ఞానం లభిస్తుంది. పుస్తకాలు చదివితేనో, ఉపన్యాసాలు వింటేనో వచ్చేదో కాదు ఈ
విద్య అనే జ్ఞానము. కానీ గురువు మనకు ఎప్పుడు ఏది నేర్పించాలో అప్పుడు ఎదో ఒక
రూపంలో నేర్పిస్తారు. అది అనుభవం ద్వారా కానీ, శాస్త్ర రూపంలో కానీ లేదా ఎవరి
ద్వారా కానీ జరుగుతుంది. అలానే బాబా దాసగణు మహారాజ్ గారికి ఒక పని పిల్ల ద్వారా
ఈశావాస్యోపనిషత్ అర్ధం అయ్యే లాగా చేశారు.
మనం చేయవలిసిందల్లా సాయి నామాన్ని ఎల్లప్పుడూ తలుచుకోవడమే మనం
చేయవలిసిన పని. ఇలా గురువుని తలవడమే అన్నింటికన్నా మంచి
మార్గమని పరమ శివుడే చెపుతున్నారు.
అనన్యా శ్చింతయంతో యే ధృవం తేషామ్ పరం పదమ్ !
తస్మాత్ సర్వ ప్రయత్నేన గురో రారాధనం కురు !!
వేరే ఏ చింతనే లేకుండా గురువునే ధ్యానించే వారికి ఆ పరమ పదం
తప్పకుండా లభిస్తుంది అని చెపుతూ, అన్ని విధాలా గురు ఆరాధన చేయమని గురు గీత
చెపుతుంది.
మనకు చేతనైనంత వరకు మనం గురు సేవ చేయాలి. ఎన్ని రకాల సేవ చేయగలం అన్న
విషయాన్ని గురుంచి మనమే ఆలోచించుకోవాలి. గొప్పల కోసం ఈ సేవను చేయకూడదు. మనం గురు
సేవ చేసేది మనలోని అహంకారాన్ని పోగొట్టుకోవడానికి అని మనం అర్ధం చేసుకోవాలి.
మనలోని కామ క్రోధాలు తొలిగిపోనిదే గురువుగారు ద్వారా లభించే జ్ఞానం మనకు బోధపడదు.
అసలు గురు సేవలో అర్ధమే మనో శుద్ధి. ఎలాగైతే మనం భూమిని దున్ని విత్తనాలు నాటతామో
అలానే ఈ మనసు అనే భూమి శుభ్రంగా లేకపొతే జ్ఞానమనే విత్తనం మనలో మొలకెత్తదు. మనం
చేసే పూజలు, మంచి పనులు, దానాలు వ్రతాలు అన్ని ఈ మనసు అనే భూమిని దున్నడమే. నామ
జపం కూడా మన మనస్సుని శుద్ధి చేస్తుంది.
శుద్ధమైన మనస్సు అంటే తరంగాలు లేని ఆత్మ అని తెలుసుకోవాలి. ఈ ఆత్మే
పరమాత్మ అని గురువు మనకు అనుభవ పూర్వకంగా అర్ధం అయ్యేలాగా చేస్తారు.
గురో రారాధనం కార్యం స్వజీవత్వం నివేదయేత్ !!
సాయి ఆరాధన ఎలా ఉండాలి అంటే, మన జీవత్వాన్నే నివేదనగా సమర్పించాలి.
అంటే ఒక మనిషిగా, జీవిగా మనకు ఉన్నదంతా గురువుకే అర్పించాలి. అలాగే నేను జీవుడిని
అనే భావాన్నే ఆయనకు నివేదన చేసి, నేను సాక్షాత్ ఆ చైతన్య మూర్తిని, సత్ చిదానంద
స్వరూపిని అనే బ్రహ్మ స్థితిలో ఉండాలి అని గురు గీత మనకు బోధిస్తుంది. ఇదే నిజమైన గురు ఆరాధన. ఇదే బాబా చెప్పిన నిర్గుణ సేవ.
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment