గురువు గారి కుడి పాదంలో సర్వ తీర్థాలు ఉన్నాయి అని మన శాస్త్రం
చెపుతుంది. ఇక్కడ తీర్ధాలు అంటే పుణ్య నదులు, పుణ్య క్షేత్రాలు అని అర్ధం
చేసుకోవాలి. అందుకే ఇలా చెప్పబడింది.
తీర్ధాని దక్షిణే పాదే వేదా స్తన్ముఖ మాశ్రిత : !
పీయూషభాజనం హంహో సద్గురో: కరనేత్రయో:!!
ఆయన ముఖమే వేదం అని చెప్పారు. ఆ ముఖాన్ని
ధ్యానం చేస్తే అన్ని వేదాలు పారాయణ చేసిన ఫలితం కలుగుతుంది. ఆయన కళ్ళు చేతులు ఇలా
సర్వాంగములు అమృతమయాలు. సద్గురు కరస్పర్శ వల్ల, ఆయన చూపు వల్ల యోగామృతం మనలోకి
ప్రవహిస్తుంది. మనం సంపూర్ణంగా గురువుగారి రూపాన్ని ధ్యానించాలి.
గురువు గారి పాదాల్లో సర్వ తీర్ధాలు ఉన్నాయి
అని బాబా ఒక సారి తన లీలను చూపించారు.
ఒక విశేష పర్వదినాన దాసగణు మహారాజుకి ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలి అన్న సంకల్పం కలిగి
బాబా అనుమతి కోసం షిర్డీ వస్తారు. అప్పుడు బాబా దాని కోసం అంత దూరం వెళ్లాలా, ఇదే
నీ ప్రయాగ తీర్థం. నీ మనసులో దృఢమైన విశ్వాసం ఉంచు అని చెప్పారు. దాసగణు బాబా
పాదాల మీద తన శిరస్సుని ఉంచగానే వారి రెండు బొటన వేళ్ళ నుండి గంగా యమునల నీరు
ప్రవహించింది. ఆ చమత్కారాన్ని చూచి దాసగణు గగుర్పాటు చెందాడు. బాబా యొక్క
అనుగ్రహానికి అతని కళ్ళనుండి అశ్రుధారలు కారాయి. అతనిలో ప్రేమ ఉప్పొంగి బాబా యొక్క
అఘటిత లీలను, అగాధ శక్తిని వర్ణించి తృప్తి చెందాడు.
దాసగణు ఇలా బాబాలీలను వర్ణిస్తూ ఇలా అంటారు.
ప్రజలు తమ పాపాలను పోగొట్టుకోవడానికి గంగ మొదలగు నదులలో స్నానం చేస్తారు. కానీ గంగ
మాత్రం సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తుంది. అందువలన ఈ సాయి సత్పురుషుని
పవిత్రాచరణాలను వదిలి గంగా గోదావరి తీర్థ యాత్రలకు వెళ్లవలిసిన అవసరం లేదు.
అందుకే గురు గీతలో పరమశివుడు పార్వతికి ఇలా
చెప్పారు.
గురో : పాదోదకం పీత్వా ధృత్వా శిరసి పావనమ్ !
సర్వ తీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః !!
గురువుగారి పాదోదకాన్ని త్రాగినా, శిరస్సున
ధరించినా సర్వ తీర్థాలలోను
స్నానం చేసిన ఫలం వస్తుంది.
కామక్రోధ మద మాత్సర్యాలతో కూడిన మనం పరిశుద్ధం కావాలి అంటే మామూలు స్నానాల వల్ల కలుగదు. అందుకే
గురువు గారి పాదోదకాన్ని భక్తితో , గురువుగారి అనుగ్రహంతో తాగినప్పుడు మనం
పరిశుద్దులం అవుతాము.
పార్వతి మాతతో పరమశివుడు ఇంకా ఇలా చెపుతున్నారు.
శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః !
గురో : పాదోదకం దేవి సంసారార్ణవ తారకం !!
దేవీ! గురు పాదోదకం "పాపాలు" అనే
బురదను యెండగొడుతుంది. జ్ఞానమనే వెలుగును వెలిగిస్తుంది. సంసార సముద్రాన్ని
దాటిస్తుంది.
అవిద్యా మూల నాశాయ జన్మ కర్మ నివృత్తయే !
జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం గురు పాదోదకం
పిబేత్ !!
అజ్ఞానం పూర్తిగా తొలిగిపోవాలన్నా, జన్మలకు
కారణమైనా కర్మలు నశించాలి అన్నా, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించాలన్నా గురు పాదోదకం
త్రాగాలి.
గురు పాదోదకం పానం గురొరుచ్చిష్ట భోజనం !
గురుమూర్తే స్సదా ధ్యానం గురుస్తోత్రం పరో
జపః !!
గురువుగారి పాదోదకమే మనకు పానీయం కావాలి .
గురువుగారి ఉచ్ఛిష్టమే నీకు భోజనం కావాలి.
నిరంతరంగా సర్వకాల సర్వావస్థలయందు
గురుమూర్తిని ధ్యానించాలి. గురు స్తోత్రమే
ఉత్తమ జపంగా ఆచరించాలి .
ఈ సత్యాలు మనం
సాక్షాత్తు పరమశివుని ద్వారా విన్నాము. ఇంతకన్నా మనకు ఏ ఆధారం కావాలి.
సాయి బంధువులారా
ఆలోచించండి !
మేలుకోండి !
మన సాయిని
పరమగురువుగా గుర్తించండి.
గురువుగా ఆరాధించండి.
మనం రోజు సాయి పూజకు తీర్థంగా పెట్టే నీటిని సాయి పాదాలకు తాకించి స్వీకరించండి.
అదే సాయి పాదోదకం.
మనం ఎప్పుడు మంచి నీరు తీసుకున్నా అది సాయి పాదోదకంగా భావించి తీసుకుందాము.
మనం ఏ ఆహారం
తీసుకున్నా అది సాయి ఉచ్ఛిష్ఠంగా భావించి తీసుకుందాము.
కేవలం సాయి నామాన్నే
స్మరిద్దాము.
"సాయి!
సాయి!" అంటే చాలు అయన మనలను ప్రతి జన్మలోను
రక్షిస్తారు.
సమర్థ
సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment