గురు గీతలో కర్మ యోగము, భక్తి యోగాలు మాత్రమే
కాకుండా జ్ఞాన యోగం కూడా బోధించడం జరిగింది. జ్ఞానమార్గంలో కూడా గురు ఉపాసన ఎలా
చేయవచ్చు అని పరమ శివుడు పార్వతి దేవికి ఉపదేశం చేస్తున్నారు. గురువు కన్నా
అధికమైనది ఏది లేదు అని పరమ శివుడు ఒక శాసనంగా చెప్పారు.
జ్ఞేయం సర్వం విలాప్యేత విశుద్ధ జ్ఞాన యోగతః !
జ్ఞాతృత్వ మపి చిన్మాత్రే నాన్య: పంథా ద్వితీయకః
!!
పరిశుద్దమైన జ్ఞాన యోగంతో జ్ఞేయమైనది అంతా
తగులపెట్టి, చిట్ట చివరికి ఆ చిన్మాత్రలో నాకు తెలుసు అనే తన జ్ఞాతృత్వాన్ని కూడా
తగులపెట్టాలి. ఇంక రెండో దారి లేదు అని పరమ శివుడు చెప్పుచున్నారు.
వేదాంత సారం అంతా ఈ శ్లోకంలో ఉందని చెప్పచ్చు.
చాలామంది ఎన్నో ఉపాసనలు చేస్తారు. అనేక సిద్దులను కైవశం చేసుకుంటారు. వారు మహానుభావులుగా, గురువులుగా పూజించబడవచ్చు కూడా. కానీ గమ్యాన్ని చేరలేరు.
ఇక్కడ పరిశుద్దమైన జ్ఞానం అని చెప్పడం జరిగింది.
జ్ఞానంలో మళ్ళా పరిశుద్ధ జ్ఞానం, పరిశుద్ధం కాని జ్ఞానం ఉంటాయా అని మనకు సందేహం
రావచ్చు. మనలో ఎన్నో జన్మలనుంచి పేరుకుపోయి ఉన్న దురవగాహనలు తీసివేస్తే కాని మనకు
నిజమైన జ్ఞానం అంటదు. చాలామంది శాస్త్రాలమీద ప్రవచనాలు చెప్పచ్చు, గురువులుగా వారు
గౌరవించబడవచ్చు. కాని వారికి సత్యం అనుభూతి కాకపొతే ఉపయోగం లేదు. వీరికి పురాణాలు, అనేక శాస్త్రాలు బాగా తెలిసి ఉండవచ్చు. కానీ ఇవన్నీ మనకు
ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించవు.
మనలో ఉన్న చాలా సంకల్పాలు అశుద్ధ జ్ఞానంగా
వ్యక్తమవుతాయి. ఇక్కడే సత్వ గుణ ప్రధానమైన ఈ సంకల్పాలు మనలను గమ్యానికి దూరం
చేస్తాయి. అంతా చూడడానికి సరియైనదిగానే ఉంటుంది. ఇక్కడే పరమ గురువులు మనకు నిజమైన
దారి చూపిస్తారు. మనలో ఉన్న ఈ జ్ఞానం కూడా అవిద్యే. పరమ గురువులు ఒక్కొక్క అవిద్యను తొలిగించడానికి ఒక్కో
రకమైన విద్యను నీలో ప్రవేశ పెట్టవలిసి వస్తుంది. ఇది గురువుకి మాత్రమే
తెలుస్తుంది. అందుకే ఇక్కడ విశుద్ధ జ్ఞాన యోగతః అని చెప్పారు.
నాకు జ్ఞానం కలిగింది అనే జ్ఞాతృత్వాన్ని కూడా
తగులపెట్టాలి అని పరమ శివుడు చెపుతున్నారు. మనం ఆత్మగా ఉంటె నాకు జ్ఞానం కలిగింది
అని చేప్పేదెవరు. అంటే ఇంకా మనసు ఉందా అని మనం ప్రశ్న వేసుకోవాలి. అందుకే గురు గీత
ఈ భావాన్ని కూడా వదలాలి అని చెపుతుంది. మనం సరిగా ఉపయోగించుకుంటే ఈ అశుద్ధ
జ్ఞానాలు కూడా మనకు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఉపయోగపడతాయి.
సాయి సత్చరితలో నానా చందోర్కర్కు భగవద్గీత శ్లోకం గురుంచి బాబా చేసిన బోధ మనం గుర్తు చేసుకోవాలి.
తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా|
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
జ్ఞానినః తత్వదర్శినః||
గురుచరణాలకు సాష్టాంగ
ప్రణామము చేసి, గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే
వారికి జ్ఞానులు జ్ఞానార్ధాన్ని ఉపదేశిస్తారు.
సాయి మొదటి సగం
శ్లోకానికి ఉన్న అర్ధాన్ని అంగీకరించారు. కాని మిగతా సగం శ్లోకానికి సరైన అర్ధం
చెప్పమని నానాని అడగడం జరిగింది. జ్ఞానులు
మరియు తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానమనే శబ్ధానికి నీవు చెప్పిన అర్ధం విన్నాను, కాని దానికి
జ్ఞానమని కాకుండా అజ్ఞానమనే పదం వేస్తే పోయేదేముంది. అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం. పైన గురు గీతలో చెప్పిన
విషయమే బాబా కూడా చెప్పారు.
సాయి తన దగ్గరకు వచ్చిన భక్తుల చిత్తంలో ఏముందో
తెలుసుకొని, వారివారి పూర్వకర్మలను బట్టి, వారికి ఏ విధమైన బోధ చెయ్యాలో అది
మాత్రమే చేసేవారు. మనలో
మనకు తెలియకుండా కొన్ని విక్షేపాలు దాగి ఉంటాయి. అవి గురువు మాత్రమే బయటికి తీయగలరు.
బయటకు తీసి వాటిని సమూలంగా నాశనం చెయ్యగల శక్తి ఒక్క గురువుకే ఉంది. మనమందరం కామ,
క్రోద మధ మాత్సర్యములకు బానిసలమే. ఈ అరిషట్‌వర్గములు అందరిని లొంగ తీసుకుంటాయి.
ఇవె మన అధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడతాయి. బాబా మానసిక పరివర్తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. మనం ఎన్ని
గ్రంధాలు చదివినా ఆ సద్గురువుల కృపలేనిదే మనం కొంచెం కూడా ముందుకు వెళ్ళలేము. సాయి
కోరిన శ్రద్ధ, సబూరి ఉంటే చాలు పెద్ద పర్వతాలనైన కదిలించవచ్చు.
అందుకే సాయిని ఒక
సిద్దాంతానికి, ఒక మతానికి, ఒక ఆచారానికి చెందినట్లు చెప్పలేము. ఈ సకలసృష్టిలో
భిన్నత్వం ఉంది. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఈ ఏకత్వాన్ని అర్ధం చేసుకోవడమే
మానవజన్మ యొక్క లక్ష్యం. ఇదే విశుద్ధ జ్ఞానం.
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !
No comments:
Post a Comment