సమత్వమే
యోగమని భగవానుడు చెప్పారు. ఈ సమత్వము ద్వారానే మోక్షాన్ని పొందవచ్చు అని గీతలో
చెప్పారు. అందుకే అర్జునుడు 54 వ శ్లోకంలో ఇలా అడిగాడు. ఓ కేశవా! సమత్వముతో ఉన్న
స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు ఏమిటి? అతడు ఎట్లు మాట్లాడును? ఎట్లు
వ్యవహరించును? అతని ఆచరణములు ఎలా ఉండును? అని నాలుగు ప్రశ్నలు అడగడం జరిగింది.
అప్పుడు భగవానుడు 55 వ శ్లోకం నుండి ఈ అధ్యాయము చివరి దాకా స్థితప్రజ్ఞుడు ఎలా
ఉంటాడో చెప్తూ, మానవులు ఎలా ఉండకూడదో కూడా చెప్పారు. అలా ఉండకుండా ఉంటే కలిగే
నష్టాలను కూడా చెప్పారు. ఈ విషయాలు మానవ జీవితానికి ఒక వరం లాంటివి. ఇవి
తెలుసుకొని ఆచరణలో ఉంచగలిగితే ఇక అంతకన్న సుఖప్రదం అయినది ఏమి లేదు. గాంధీగారితో
సహా చాలా మంది మహానుభావులు ఈ శ్లోకాలను రోజు పారాయణం చేసే వారు అని చెప్తారు.
ప్రజహతి
యదా కామాన్ సర్వాన్ పార్ధ మనోగతాన్ !
ఆత్మన్యేవాత్మనా
తుష్ట: స్థితప్రజ్ఞస్తదోచ్యతే !
భగవానుడు
ఇలా పల్కెను. ఓ అర్జున! మనస్సునందలి కోరికలు పూర్తిగా తొలిగిపోయి
ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును
పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు.
కాని
మామూలు మనుషులకు ఇది ఇలా సాధ్యమని మనకు సందేహం రావచ్చు. అందుకే భగవానుడు
కర్మయోగాన్ని బోధించి తరువాత ఈ విషయం చెప్పారు. మనలను కర్మలు చేయమని చెప్పారు,
అలానే వాటి ఫలితం మీద ఆసక్తిని మాత్రమే వదలమని చెప్పారు. ఇలా ఆసక్తిని వదిలి
కర్మలను ఒక స్థితప్రజ్ఞుడు ఎలా చేస్తాడు అనే విషయాన్నే ఇక్కడ భగవానుడు వివరించారు.
కోరికలు
ఉండడం సహజం. ఒక వ్యక్తికి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అనే కోరిక
ఉండచ్చు. అతనికి అర్హత కూడా ఉండచ్చు. ఇక్కడ అది వస్తే సంతోషం లేకపోతె దుఃఖం. ఇది
మనకు వాసన కలిగించే కోరిక. మన జీవితంలో ఇలాంటివి చాలా ఉంటాయి. వీటిని మనం అర్ధం
చేసుకొని అవి ఎంత వరకు మనపై ప్రభావం చూపుతున్నాయి అనే నిజాన్ని తెలుసుకోవాలి. ఇలా
అర్ధం చేసుకోవడం మొదలుపెడితే చాలావరకు బాధ తగ్గుతుంది. సమత్వం అనే స్థితిని కొంచెం
చవిచూడగలుగుతాము.
శరీరము,
ధనము, భార్యాబిడ్డలు, పేరు ప్రతిష్టలు మొదలైనవన్ని మన మనస్సులో అలజడికి కారణం
అవుతాయి. మనం అనుకున్న విధంగా అన్ని జరగాలి అనే తాపత్రయం మనలను ఈ అలజడికి గురి
చేస్తుంది. ఇక్కడ ప్రతివిషయంలో మన భాద్యత ఎంతవరకో గుర్తించడం నేర్చుకోవాలి. శరీరం
ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కాని దానికి అవసరమైన జాగ్రత్తలు
మాత్రం తీసుకోరు. ఎందుకంటె ధనము, ఇంద్రియ విషయాలు ఈ శరీరాన్ని పట్టించుకోకుండా
చేస్తాయి. శరీరాన్ని పట్టించుకోవాలి అంటే కాస్త క్రమశిక్షణ కావాలి. అదే మనస్సుకి
ఇష్టం ఉండదు. ఇలా చాలా విషయాలు మనం అర్ధం చేసుకోము. ఒక్కసారి అర్ధం చేసుకొని
వ్యవహరిస్తే సంతోషం మన సొంతం అవుతుంది.
మనం
దుఃఖం వస్తే కృంగిపోతాము. కాని సుఖం వచ్చినా మనం సుఖపడడం లేదు. ఒక మనిషికి
కావాల్సినవన్ని ఉన్నా సుఖం లేదు. మనకు ఈ సుఖం ఎక్కడ పోతుందో
అన్న ఆలోచనే ఎక్కువ బాధపెడుతోంది.
దుఃఖేష్వనుద్విగ్నమనాః
సుఖేషు విగత స్పృహః !
వీతరాగ
భయ క్రోధః స్థితధీర్ము నిరుచ్యతే !!
దుఃఖములకు
కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును
అయినట్టి మనన శీలుడుని స్థితప్రజ్ఞుడు అనబడును.
మనసుకి
సుఖదుఃఖాల సమ్మేళనం గురించి నేర్పాలి. ఎప్పుడు జీవితం ఒకేలాగా ఉండదు అనే సత్యాన్ని
నేర్పించాలి. అలానే నాణానికి రెండు వైపులు ఉంటాయి అనే తత్వాన్ని అర్ధం చేసుకోవాలి.
ఒకరికి లాటరి ద్వారా చాలా ధనం వచ్చింది. ధనం వచ్చినందుకు చాలా సంతోషం కాని దానిమీద
పన్ను కట్టాలి అనే విషయంలో దుఃఖం. ఇదే మన జీవితం. దీన్ని అర్ధం చేసుకొని
ప్రవర్తించడమే సమత్వము. మనకు జరిగేవి అన్ని కర్మ ప్రకారమే జరుగుతాయి. మనకు మంచి
జరిగితే అది కేవలం మన గొప్పతనం మాత్రమే కాదు. ఇది మనం ఇంతకూ ముందు చేసిన కర్మకు
ఫలితం. అలానే మనకు కష్టం కలిగితే వేరే వాళ్ళు కారణం కాదు. ఇలా అర్ధం చేసుకొని
జీవితంలో వచ్చే వడిదుడుకులను ధైర్యంగా అనుభవించడం
అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఈ సమత్వం మనకు అలవాటు అవుతుంది.
ఓం శ్రీ
సాయి రామ్!