భగవానుడు ఆత్మతత్వము గూర్చి చెప్పిన తరువాత కర్మ
యోగం గురించి చెప్పారు. మనం చేసే ప్రతికర్మ ఒక యోగంగా ఆచరించడం నేర్చుకోవాలి. ఈ
నిష్కామ కర్మ యోగమును ఒక్క సారి మొదలుపెడితే దానికి ఎన్నడును బీజనాశనము లేదు అని
భగవానుడు గట్టిగా చెప్తున్నారు. అలానే దీనికి విపరీతఫలితాలే ఉండవు. ఈ యోగాన్ని
కొంచెం చేసినా అది జన్మ మృత్యు మహాభయంనుండి కాపాడుతుంది.
అసలు కర్మ, కర్మ యోగము అంటే అర్ధం ఏమిటి?
శాస్త్రవిహితమైన ఉత్తమ క్రియనే కర్మ అంటారు. మోహము, కామక్రోధములు, లోభము, మమతాసక్తులు మొదలైనవి లేకుండా సమ
భావముతో తమ తమ వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి కర్మలను చేయటమే కర్మ యోగము అంటారు. ఇలా
కర్మను ఆచరించే కర్మనే భగవానుడు "మత్కర్మ" అంటే నాకు సంబందించిన కర్మ
అని చెప్పారు.
నిష్కామ కర్మ ఆచరించాలి అంటే చాలా కష్టం అని మనము అనుకోవచ్చు. ఈ
సమాజంలో ఇది సాధ్యమేనా! అనే ప్రశ్న మనలో కలగవచ్చు. అందుకే భగవానుడు దీని ఆచరణ
విధానాన్ని కూడా చెప్పారు.
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన !
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినామ్ !!
ఓ అర్జునా! ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉండును.
స్థిర బుద్ధి లేని, సకామ కర్మలు ఆచరించే మనుష్యులు
దారీతెన్నూ లేని కోరికలతో నలువైపులా పరుగులు తీయుచు ఉందురు.
పైన బహుశాఖా అనేపదం వాడారు అంటే ఒక చెట్టుకు అనేక కొమ్మలు, ఆకులు
ఉన్నట్లే వారి మనస్సుకూడా అన్ని విషయాల వైపుకి పరుగులు తీస్తూ ఉంటుంది.
వ్యవసాయాత్మికా బుద్ధి అంటే సమ భావముతో నిశ్చలమైన బుద్ధి. మనము ఏ పని
చేసినా మనకు ఏకాగ్రత కావాలి. ఈ సమత్వ బుద్ధి లేక పొతే మనం ఏమి సాధించలేము. మనకు
అవసరమైన వాటికోసం మనము ఎంతైనా కష్టపడి సాధించుకుంటాము. ఈ ఏకాగ్ర బుద్ధి మన అందరిలో
ఉంది కాని మనం దీనిని ఎంతవరకు వాడుకుంటున్నాము అనే విషయం అర్ధం చేసుకోవాలి. మన
మనస్సులో దేవుడుగూర్చిన చింతన ఎక్కువ అవ్వాలి అంటే వేరే విషయాల ఆలోచన తగ్గాలి. అలా
అని అసలు ఆ పనులు చేయవద్దని భగవానుడు చెప్పడం లేదు. వాటి పట్ల ఆసక్తి తగ్గించుకో
అని మాత్రమే చెప్పారు. మన ఎదురు పడిన ప్రతి విషయం మనకు అవసరం అని అనిపించవచ్చు.
నిజంగా ఆలోచిస్తే ఆ విషయానికి అంత ప్రాముఖ్యత అవసరమా అనే సత్యం బోధపడుతుంది. మనకు
అవసరమైన వాటిని చేస్తూ ఉండాలి, అలానే వాటి మీద ఆసక్తిని పోగొట్టుకోవాలి. అప్పుడే
మనం నిజంగా చేయవలిసిన దాని మీద ఏకాగ్రత వస్తుంది.
ఇప్పడు ఏకాగ్ర బుద్ధి రావాలి అంటే వేటిని వదిలివేయాలో శ్రీకృష్ణ
పరమాత్మ చెప్తున్నారు.
వివేకహీనులు అయిన వారు కేవలము ప్రాపంచిక బోగములయందే తమ దృష్టిని
ఉంచుతారు. వీటితోనే వారి మనస్సు నిండిపోయి ఉంటుంది.
వేదవాదరతులై ఎప్పుడు బాహ్యమైన విషయములపై మాత్రమే వారి దృష్టి ఉంచుతారు. ఇక్కడ "వేదవాదరతా" అనే పదం వాడారు. అంటే వీరు
వేదాలలో ఉన్న కర్మ కాండపై మాత్రమే సుముఖత చూపుతారు. వీరికి
స్వర్గ సుఖాలు, ఇహలోక సుఖాలు మరియు ఫలశృతి
మాత్రమే ముఖ్యము. మనకు తెలియకుండా మనము కూడా ఈ ఫలాసక్తి మీద దృష్టి పెడతాము. అందుకే చక్కగా ప్రవచనాలు చెప్పి, రక రకాల వ్రతాలతో, యజ్ఞాలతో మనలను
ఆకర్షించి సకామ కర్మలను ప్రోత్సహించే గురువుల జోలికి పోవద్దు అని భగవానుడు హెచ్చరిస్తున్నారు. ఇవి మంచివి కాదు అని చెప్పడం లేదు కాని మనకు
ఏకాగ్రత కుదరాలి అంటే వీటిని వదలాలి అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇవి మనలను ఆత్మ సాక్షాత్కారము వైపుగా తీసుకువెళ్ళవు. మన ధ్యానానికి
ఉపయోగపడవు. సకామ కర్మలు మనలను జన్మ మృత్యు కూపంలో పడవేస్తాయి.
మనం ధ్యానం చేద్దామని కూర్చుంటే అనేక ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలన్నీ
ఈ విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం మూలానే వస్తున్నాయి. మనము రోజు చేసే
పనులు ఎంత వరుకు అలోచించాలో అంత వరకే మనస్సులో ఉంచుకోవాలి. ఆ తరువాత వాటిని లయం
చేయాలి. లేక పొతే అవి పేరుకు పోతూ ఉంటాయి. అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత
ఇవ్వకూడదు.
అందుకే భగవానుడు ఇలా చెప్పారు.
త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్య: భవార్జునా !
నిర్ద్వంద్వ: నిత్యసత్వస్తో నిరోగ్యక్షేమ ఆత్మవాన్ !!
ఓ అర్జునా! వేదములలో ఉన్న కర్మ కాండ సత్వ రజస్తమో గుణముల
కార్య రూపములైన సమస్త భోగముల గూర్చి, వాటిని పొందుటకై చేయవలిసిన సాధనాల గూర్చియు
ప్రతిపాదించును. నీవు ఆ భోగములయందు ఆసక్తిని వదిలివేయుము. హర్ష శోకాది
ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మునియందే స్థితుడవు కమ్ము. నీ రోజు వారి యోగక్షేమములగూర్చి ఆరాటపడ వద్దు. నీ
అంతః కరణమును వశమునందు ఉంచుకొనుము.
ఓం శ్రీ సాయి రామ్!
No comments:
Post a Comment