In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, April 12, 2017

భగవద్గీత - సాంఖ్య యోగం 2. 10 - కర్మాచరణ


 ఈ ప్రపంచం అంతా కర్మ సిద్ధాంతం మీద నడుస్తూ ఉంటుంది అని మనం అందరము చెప్పుకుంటాము. ఈ సృష్టికి కారణం కూడా అందరి సమిష్టి కర్మయే అని మన శాస్త్రాలు చెపుతాయి. మన శరీరంలో కాని, మానసికంగా గాని మనకు కష్టం కలిగితే అది మనకే ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే మన పూర్వ జన్మ కర్మయే అని అర్ధం చేసుకోవచ్చు. మనం మన చుట్టూ ఉండే వాళ్లు కాని, కొన్ని పరిస్థితులు కాని కారణం అని అనుకోవచ్చు. మన కష్టాలకు వేరే వాళ్లు కారణం ఎప్పుడు కాదు. వారిని తప్పుగా ఆలోచించండం వల్ల ఇంకో పాపపు పని చేస్తున్నామా అని అర్ధం చేసుకోవాలి. అందుకే కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్ధం చేసుకొని, అనుసరించాలి. భగవద్గీతలో భగవానుడు ఈ కర్మ గురించి చాలా విషయాలు చెప్పారు. భగవద్గీతలో మనకు బాగా తెలిసిన శ్లోకం ఇలా ఉంటుంది.

 కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన !
మా కర్మ ఫలహేతుర్భూ: మా తే సంగోస్త్వ కర్మణి !!

కర్తవ్యకర్మమునాచరించుటయందే నీకధికారము గలదు. ఎన్నటికీనీ దాని ఫలముల యందు లేదు. కర్మఫలములకు నీవు హేతువుకారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష  రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను చేయుము.

ఈ శ్లోకాన్ని అర్ధం చేసుకోవాలి అంటే కర్మ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి.

ఒక కర్మ వల్ల వచ్చే ఫలితం అంతటా ఒకే లాగా ఉంటుంది. ఇది దేశకాల పరిస్థితులను బట్టి మారదు. ఒక కర్మ చేసిన తరువాత దాని ఫలితాన్ని వద్దు అంటే కుదరదు. అది ఎప్పుడో అప్పుడు అనుభవించక తప్పదు. కొన్ని కర్మలు ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా, మనలో ఒక వాసనను కూడా మిగిలిస్తాయి. ఈ వాసన కొత్త కర్మలకు, కొత్త జన్మకు కారణం అవుతుంది. ఒక కర్మ ఫలితం అనుభవించాలి అంటే దానికి సరియైన శరీరం, పరిస్థితులు ఉండాలి. అలా లేకపోతె అవి అన్ని సమకూరిందాక ఆ ఫలితం మనం అనుభవించలేము. ఒక్కో సారి ఎవరికన్నా కష్టం వస్తే, అయ్యో మంచివాళ్లకే ఈ కష్టాలన్ని అని మనం అనుకుంటాము. కాని ఈ ఫలితం ఏ జన్మలోదో మనకు తెలియదు.

కొన్ని కర్మలకు కనిపించే ఫలితం ఒకటి ఉంటే, కనపడకుండా ఉండేది, మరియు మన మనస్సుకు అంతు చిక్కని ఫలితం ఇంకొకటి కూడా ఉండచ్చు. బయటకు కనిపించే ఫలితం మన మాటల వల్ల లేదా మన చేతల వల్ల జరిగిన కర్మ ద్వారా వస్తుంది. బయటకు కనిపించని ఫలితం మన మనోభావాన్ని బట్టి వస్తుంది.

ఒక దొంగ దొంగతనం చేసి ఒకరిని కత్తితో పొడిచి చంపాడు. అలానే ఒక డాక్టర్ కత్తితో కోసి ఆపరేషన్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి చనిపోయాడు. రెండు చోట్లా చనిపోవడం జరిగింది. కాని ఉద్దేశాలు వేరు.  వారికి లభించే ఫలితం కూడా వేరు.

ఒక్కో సారి కొన్ని కర్మలకు వచ్చే ఫలితం అస్సలు బయటకు తెలియదు. అసలు మనం ఆ కర్మ చేసాము అని కూడా మనకు తెలియదు. మనం పంచసూనాలు అని విన్నాము. మనం వండి తినే ఆహరం మన దాకా వచ్చే లోపల ఎన్ని క్రిములు, పురుగులు చనిపోయి ఉంటాయో ఒక్కసారి ఊహించండి. మరి ఆ కర్మ ఫలితం ఎవరు అనుభవించాలి. ఈ సమిష్టి కర్మలో పాల్గొన్న వారందరు దీన్ని అనుభవించాలి.

సరే ఈ కర్మలు ఎలా ఉంటే మనకు మంచిది. అవి శాస్త్ర విహితమై ఉండాలి. కాని ఆ శాస్త్రము ఏమిటో మనకు తెలియక పోతే అప్పుడు మనలను ఎవరు రక్షిస్తారు. అందరు ఏదిచేస్తూ ఉంటే అదే మనము చేసుకుంటూ పొతే కష్టాలు తప్పవు. అందుకే భగవానుడు కర్మ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకొని కర్మయోగాన్ని ఆచరించమని చెప్పారు.

అర్జునుడ్ని యుద్ధం చేయమని భగవానుడు చెప్పాడు. కాని ఆయన ప్రతీకారం కోసమో లేక రాజ్య భోగాల కోసమో యుద్ధం చేయకూడదు. యుద్ధం ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే చేయాలి అని భగవానుడు చెప్పారు. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. అలానే మన జీవితంలో మనం రోజు చేసే పనులు ఇదే భావంతో చేయాలి. ప్రతికర్మలో స్వార్ధం తీసివేస్తే కర్మ యోగమే అవుతుంది. ఒక టీచర్ విద్యార్థులకు పాఠాలు చెప్తాడు. ఆయనికి డబ్బులు కూడా ఇస్తారు. కాని ఆయన భావంలో ఆ విద్యార్థులను మంచి పౌరులుగా చెయ్యాలి అని ఉంటే అది కర్మ యోగం అవుతుంది. మన పిల్లలు మంచి కాలేజీలో చేరితే వారి భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన మనకు ఉండచ్చు. కాని దీనివల్ల వారు అందరికి ఉపయోగపడతారు అన్న భావనతో వారిని చదివిస్తే అది కర్మ యోగం అవుతుంది. మనం చేసే ప్రతి పనిలో ఉన్నతమైన భావన ఉంటే మనకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది.

మనం పూర్వంలో చేసిన కర్మలను మనము వెనక్కు వెళ్లి మార్చలేము. ఒక్క సారి కంప్యూటర్లో క్లిక్ బటన్ నొక్కితే అంతే ఆ మెయిల్ ఎవరికీ చేరాలో అక్కడకు వెళ్లి పోతుంది. మనం దాన్ని సరిదిద్దుకోవడం కోసం ఇంకో మెయిల్ పంపించాలి అంటే ఇంకో కర్మ చేయాల్సి ఉంటుంది. కాని ఒక కర్మ చేసే ముందు బుద్ధి అనే దాన్ని ఉపయోగించాలి. 

ఒకరు ఒక వ్యక్తిని కష్టపెట్టే మాట అంటారు. కాని వెంటనే వారి తప్పు తెలుసుకొని సారీ చెప్పారు. ఇక్కడ మొదటి కర్మకు వచ్చే చెడు ఫలితం తప్పదు, కాని ఆ పశ్చత్తాపము వలన ఆ కర్మను అనుభవించే శక్తి మనకు రావచ్చు. లేదా ఒక జబ్బు చేస్తే అది ముందే తెలుసుకొని దాని ఉదృత తగ్గే విధంగా చేసుకొనే వీలు కలగ వచ్చు. ఇలా కర్మల గారడీ జరుగుతూ ఉంటుంది.

మనం పైన చెప్పిన శ్లోకం నుండి నేర్చుకోవాల్సిన అంశాలు.

మనము ధర్మం తెలుసుకొని కర్మయోగంతో కర్మలను ఆచరించాలి.

కర్మలు చేయకుండా ఎవరు తప్పించుకోలేరు. కాని ఆ కర్మలు శాస్త్రవిహితంగా చేయాలి.

కర్మలు చేసే అధికారం అందరికి ఉంది. కాని వాటిఫలితం మీద మాత్రం అధికారం లేదు.

కర్మల ఫలితం గురించి ఆలోచించకుండా కర్తవ్య బుద్ధితో మాత్రమే కర్మలు చేయాలి.
  
  



ఓం శ్రీ సాయి రామ్!

No comments:

Post a Comment