భగవానుడు
ఒట్టి కర్మలకన్నా కర్మయోగం శ్రేష్టమైనది అని చెప్పారు. కర్మయోగం అంటే మనం చేసే
పనుల ఫలితాన్ని గురించి ఆలోచించకుండా ఆ కర్మలను చేయడమే. మనం ఎప్పుడైతే ఫలితం మీద
మనసు పెడతామో అప్పుడు మన దృష్ఠి మనం చేసే దాని మీద పూర్తిగా కేంద్రీకృతం కాదు.
కాబట్టి ఫలితం కూడా అటు ఇటు అవచ్చు. అప్పుడు మనం కోరుకున్న విధంగా ఫలితం రాలేదు
అనే బాధ. ఇలా ఎందుకు జరుగుతుంది? మనకు ఈ విషయాలన్ని అర్ధం అయినా, ఈ
ఊభిలోనుంచి మనం ఎందుకు బయట పడలేక పోతున్నాము? భగవానుడు ఈ ఊబిని గూర్చి దానిలోనుంచి ఎలా బయట పడాలో రాబోయే శ్లోకంలో చెపుతున్నారు.
యదా తే
మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి !
తదా
గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ !!
మొహమనెడి
ఊబినుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన, వినబోవు
ఇహపరలోక సంబంధమైన సమస్తభోగములనుండి వైరాగ్యమును పొందగలవు.
మనం చేసే
ప్రతిపని గురించి వెనకాముందు అలోచించి చేయడం మనలో చాలామందికి బాగా అలవాటు. ఇది ఒక
స్థాయి వరకు మంచిదే కాని అది స్రుతి మించకూడదు. మనం రోజు చేసే చాలా కర్మలు పెద్దగా
ఆలోచించకుండానే చేస్తాము. కొన్ని మాత్రం మన మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ
కర్మలు చాలా క్లిష్టమైనవి లేదా మన జీవితంలో మార్పులు తెచ్చేవి. ఒక్కోసారి ఈ కర్మలు మన వారికి కాని మనకు కాని హాని కలగ చేసేవి కావచ్చు. అందుకే మనం
సందిగ్ధంలో పడేది. అర్జునుడు కూడా ఇదే సందిగ్ధంలో పడ్డాడు. ప్రతిపక్షంలో ఉండే తన
వారిని చంపి తనకు ఏమి ప్రయోజనం అని అనుకున్నాడు. అంతే కాక వారిని చంపడం పాపమని తలచాడు. కాని ధర్మాన్ని మరచాడు. నాది నా
వారు అనే స్వార్ధ బుద్ధే మనలను ఈ ఊబిలోకి తోసేస్తుంది. అప్పడు వివేకం నశిస్తుంది.
వివేకం లేకుండా, మొహంతో వ్యవహరిస్తే తిప్పలు తప్పవు. కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే
మనకు నిజం ఏమిటో అర్ధం అవుతుంది.
ఈ
మొహకలిలం (మోహమనే ఊబి) లో పడకుండా ఉండటానికి కావలిసిన సాధనాలు:
మనం
చేసే ప్రతిపనిలో మన కర్తవ్యం ఎంతవరకో అంతే చేయాలి.
మనం చాలా
కర్మలను చేస్తూ ఉంటాము. కొన్ని మనకు ఇష్టమైనవి కొన్ని మనకు ఇష్టం లేనివి
చేయాల్సివస్తుంది. చిన్నప్పుడు క్రమశిక్షణతో చదువుకోవడం చాలామంది పిల్లలకు ఇష్టం
ఉండదు. కాని వాళ్లు స్కూలుకి వెళ్లి పెద్దచదువులను పూర్తీ చేస్తారు. పెద్ద వాళ్ళ
మీద భయం కొద్దో లేక ఏదోవిధంగా చదువుతారు. మరిపెద్ద అయిన తరువాత వారికి ఏది మంచిది
అనుకుంటే అది చేస్తారు. ఈ మంచిని నిర్ణయించే దగ్గరే మనం అందరం తప్పుదోవ
పడుతున్నామా! ఎందుకు అంటే మనం అనుకునే మంచి జీవితం, డబ్బు, హోదా ఇవేమీ చాలా మందికి
మానసిక శాంతిని ఇవ్వడం లేదు. అందుకే ప్రతివిషయంలో ఉన్న నిజానిజాలను అర్ధం
చేసుకోవాలి.
ఏది
నిజమో ఏది నిజం కాదో తెలుసుకొని, అది ఎంత వరుకు మనకు అవసరమో అర్ధం చేసుకోవాలి.
మన
అందరికి తెలిసిన పచ్చినిజం ఏమిటి అంటే మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాము, ఈ శరీరం
వదిలివేసినప్పుడు ఏమి మనతో మోసుకెళ్ళము. ఈ విషయం చిన్నప్పటినుంచి అందరు చెప్పేదే
కాని మనం ఎందుకు పట్టుకోలేక పోతున్నాము. ఎందుకంటే మనం మన ఇంద్రియాలకు బానిసలం
అయిపోయాము. ఒక రకమైన మోహంలో పడిపోయాము. జీవితంలో మనకు ఏమి అవసరమో అర్ధం చేసుకోలేని
స్థితికి ఎదిగిపోయాము. అందుకే దీన్ని మోహకలిలం అని భగవానుడు అన్నారు. ఇలా మోహంలో
ఎందుకు ఇరుక్కుంటున్నాము?
మనం
చేసే ప్రతి పనిని మమతాసక్తులతో
కాక కర్తవ్య పరంగా చేయాలి.
మనకు
తెలియకుండా ఈ సమాజం మనలను ఒక రకమైన బాటలో ఇరికించింది. అందుకే మనం కష్టాల పాలు
అయ్యాము. ప్రతిఒక్కరు కర్తవ్యంతో కనుక వారి కర్మలను ఆచరిస్తే ఈ మొహంలో పడకుండా
ఉండవచ్చు. దీన్నే కర్మయోగం అంటారు. ఈ కర్మ యోగమే
మనలను ఈ ఊభిలోనుంచి బయట పడేస్తుంది.
కోరికలకు
అవసరాలకు మధ్య వ్యత్యాసం అర్ధం చేసుకోవాలి.
మనకు
అవసరం అయినంతవరకు సంపాదన ఉండాలి. అలానే అది అనుభవించడానికి తగిన ఆరోగ్యం ఉండాలి.
ఆరోగ్యం లేనప్పుడు ఎంత ఉన్నా ప్రయోజనం లేదు. పది తరాలకు కూడపెట్టి చివరికి మన
ఆరోగ్యం పాడుచేసుకొని అయ్యో అని భాద పడాలి. మనం జీవితంలో మంచివి అన్ని వదిలివేసి
మనలను ఊబిలో తోసే వాటివైపే పరుగులు తీస్తాము. నా వాళ్లు సుఖంగా ఉండాలి అనుకోవడంలో
తప్పులేదు. కాని వారు బతకటానికి నిజంగా ఏమి కావాలో తెలుసుకోపోవడం తప్పు.
జీవితంలో
సత్సాంగత్యం చాలా అవసరం. మంచి
ఆలోచనలు చేసే వాళ్లతో ఉండటం చాలా ముఖ్యం. అలానే వ్యతిరేక భావనలతో ఉండే వాళ్ళతో
జాగ్రత్తగా ఉండాలి.
మనకు
చిన్నప్పటినుంచే పరుగులు తీసే స్వభావాన్ని మన విద్యాసంస్థలు అలవాటు చేస్తున్నాయి.
దానికి తల్లితండ్రులుగా మన సాయం మనం చేస్తున్నాము. మంచి చదువుకి అర్ధం
మారిపోయింది. మనకు తెలుసు పిల్లలు స్వార్ధంతో పెరుగుతున్నారు అని. వారికి సమాజంతో
పనిలేదు. ఒకవేళ సమాజ సేవ చేసినా కాని మంచి కాలేజీలో సీటు రావాలి అనే స్వార్ధం
ఎంతమందిలో ఉందో మనం వేరేగా చెప్పుకోనవసరం లేదు. అంటే చిన్నప్పటినుంచి మంచి
అలవాట్లకు మంచివారికి దూరంగా వాళ్ళ మనసుని ఉంచుతున్నాము. అలా పెరిగిన మనం ఊబిలో
పడక ఎలా ఉంటాము.
భగవత్
చింతనతో ఉండి నిష్కామ కర్మలను ఆచరించాలి.
నిష్కామ
కర్మలు చేయాలి అంటే భగవత్ చింతన చాలా అవసరం. మనం పొద్దున లేచిన దగ్గరనుంచి చాలా
పనులు చేయాలి. మన జీవితాన్ని మనమే ఒక చిక్కుల వలయంగా మార్చుకున్నాము. ఈ వలయమే
మోహామై మనలను ఇబ్బంది పెడుతూఉంది. దీనివల్లే మనం సరిగ్గా భగవత్ చింతన కూడా చేయలేము.
దేవుడుదగ్గర కూర్చో గానే రకరకాల ఆలోచనలు చుట్టుముడతాయి. అందుకే పైన పైన శ్లోకంలో
"శ్రుతం" "శ్రోతవ్యం" అనే పదాలతో ఈ ఊబిలో ఇరుక్కోకుండా ఉండే మార్గం చెప్పారు.
నేటివరకు చూసినట్టి, వినినట్టి, అనుభవించినట్టి ఇహ లోక పరలోక భోగాలన్నిటిని
శ్రుతం అని అంటారు. భవిష్యత్తులో అనుభవించేవి, చూడబడేవి, వినబడే వాటిని
శ్రోతవ్యములు అంటారు. మనం ఎప్పుడు జరిగిన వాటిని గురించి కాని, జరగబోయే వాటి
గురించి కాని ఆలోచిస్తూ బాధపడతాము. జరిగి పోయిన వాటిని వెనక్కి వెళ్లి మనం
మార్చలేము. అలానే జరగబోయేవి ఎలా ఉంటాయో మనం పూర్తిగా ఊహించలేము. ఇలా వీటివల్ల
నిస్సహాయులుగా మారే కన్నా ప్రస్తుతం చేయవలిసిన పని మీద లేదా బాధ్యత మీద దృష్ఠి
ఉంచడమే మేలు. ఈ సత్యాన్ని ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే అంత మంచిది. ఎవరికన్నా
తీవ్రమైన జబ్బు వస్తే, నాకే ఎందుకు వచ్చింది అని బాధపడేకన్నా దీన్ని ఎలా నయం
చేసుకోవాలి అని ఆలోచిస్తే ఉపయోగం. అలానే ప్రతి జీవన సమస్యను ఎదుర్కోవాలి. బాధపడుతూ కూర్చుంటే
ఎవరికీ ప్రయోజనం ఉండదు.
భగవానుడు
వైరాగ్యం ఉండాలి అని చెప్పారు. ఇక్కడ వైరాగ్యం అంటే అన్నింటిని వదిలివేయమని కాదు.
వాటి మీద ఆసక్తి లేకుండా వాటిని అనుభవించాలి. ఇదే సూత్రాన్ని ఈశావాస్యోపనిషద్ కూడా
చెప్తుంది. త్యజించి అనుభవించు అని అక్కడ చెప్పారు. అంటే విషయాల మీద ఆసక్తిని
వదిలి అనుభవించు అని అర్ధం. ఇలా చేయగలిగితే మనం భగవంతుడికి దగ్గర అవుతాము.
నిజానిజాలను తెలుసుకోగలుగుతాము. మన నిజ స్వరూపం ఏమిటో తెలుసుకుంటాము. మన నిజ
స్వరూపం తెలుసుకుంటేకాని ఈ మోహవలయంలో నుంచి పూర్తిగా బయటపడము.
ఓం శ్రీ
సాయి రామ్ !
No comments:
Post a Comment