భగవంతునికి నైవేద్యం
సమర్పించిన, దక్షిణగా కానుకలు ఇచ్చినా మనం ఎందుకు ఇస్తున్నాము అనే ప్రశ్న మనస్సులో
ఉదయించాలి. ఈ సృష్టిలో భగవంతుడు మనకు ఇచ్చిన వాటిని తిరిగి మనం ఆయనకే ఇవ్వడానికి
ప్రయత్నిస్తాము. ఈ విషయం పట్ల మనం అంతర్ముఖమై ఆలోచించాలి. ఈ అధ్యాయంలో హేమద్పంత్
గారు దక్షిణ గురించిన విషయాలను మరియు పిల్లలకోసం బాబాను శరణువేడిన భక్తుల గురించి
చెప్పారు.
సత్పురుషుల చరిత్రలు ప్రవ్రుత్తి మార్గాన్ని
చూపిస్తూనే నివృత్తి మార్గంలో తీసుకువెళ్తాయి. సాయి సత్చరిత బాహ్యంగా
భక్తులగురించి చెప్పినా అంతర్గతంగా మనకు పరమార్ధాన్ని నేర్పిస్తుంది. సాయి చేసిన
ప్రతీ లీల
వెనక ఎదో ఒక పరమార్ధం ఉంటుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కాని ఈ మానవ జన్మ
లభించదు అని మన శాస్త్రాలు చెప్తాయి. తల్లితండ్రి, అన్న చెల్లి, భార్య భర్త,
కొడుకు కూతురు ఇలా అన్ని సంబంధాలు నదీ ప్రవాహంలో కఱ్ఱలవలె ఒక చోట కలిసిఉన్నట్లు
ఉంటారు. అవి కొంచెం సేపు కలిసి ఉన్నట్లు ఉన్నా తరువాత విడిపోయి మరల కలుసుకోక
పోవచ్చు. అట్లే ఈ బంధాలు కూడా ఈ జన్మ తరువాత కలవక పోవచ్చు. జీవుడు జన్మించిన
వెంటనే మృత్యు మార్గంలో పడతాడు. ఎప్పుడు ఈ శరీరం వదిలివెళ్ళాలో తెలుసుకోవడం కష్టం. భగవంతుని
చేరుకునే మార్గం కేవలం ఈ శరీరం ద్వారానే కలుగుతుంది కాబట్టి దీన్ని అవసరం ఉన్నంత
వరకు కాపాడుకుంటూ సాధన చేయాలి. లేకపోతె మనకు జంతువులకు తేడా ఏమి ఉండదు. మనం
అప్రమత్తంగా ఉండి సాయి చూపిన మార్గంలో నడవాలి. గురువే మనలను మోక్షానికి దగ్గరగా
తీసుకువెళతారు. సాయి కథను ప్రేమతో వింటే శుభం కలుగుతుంది. అలానే సాయి చరణాలయందు
భక్తి అధికమై సుఖాల నిధి లభిస్తుంది. మనలో ఉదాసీనత, సోమరితనం నశించి మనలను
పరమార్ధానికి చేరువ చేస్తుంది. వస్తువులు ఎన్ని ఆకారాలలో ఉన్నా అగ్నిలో దగ్ధం
అయితే చివరికి మిగిలేది ఒక్క బూడిదే. అలానే ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నా చివరికి
మిగిలేది ఒక్క
చైతన్యమే. జ్ఞానాగ్నిలో నేను, నాది, నా వారు అన్న భావనలు తొలిగిపోతే ఇక అంతా
చైతన్యమే.
రతన్ జీ వాఁడియా
రతన్ జీ వాఁడియా
హేమద్పంత్ చక్కటి సత్యాలను
మొట్టమొదటగా కూర్చి తరువాత బాబా తన భక్తుల మనోభీష్టాలను ఎలా తీర్చారో
చెప్పబోతున్నారు. రతన్ జీ వాఁడియా అనే పార్సీ వ్యాపారి నాందేడ్ ప్రాంతంలో ఉండే
వారు. ఆయనకు కావాల్సిన అంత సంపద ఉంది, అందరికి లేదనకుండా సహాయం చేసే వారు. ఆయన
గొప్ప ధార్మికుడు. చూసేవారికి ఆయన ఏంతో సంతోషంలో ఉన్నట్లు అనిపించినా ఆయనకు మాత్రం జీవితం కొరతగా అనిపించేది.
ఆయన పుత్రులకోసం చేయని పూజలు లేవు. ఆయన భగవంతుడిని ప్రార్ధిస్తూ ఒక్క కుమారుడ్ని
ఇవ్వమని విలపించేవాడు. ఒక రోజున దాసగణు మహారాజుకు తన కష్టాలను చెప్పుకున్నాడు. ఆయన
సలహాతో షిర్డీ ప్రయాణం కట్టాడు. బాబా ఆశీర్వాదంతో ఆయన కష్టాలన్నీ తీరుతాయి అని
దాసగణు మహారాజ్ సెలవిస్తారు. అప్పుడు రతన్ జీ మంచి పూల దండలు ఫలాలు బాబాకు
సమర్పించి ఆయన పాదాలపై మోకరిల్లుతాడు. బాబా దక్షిణ ఇమ్మని అడుగుతారు. మొత్తం 5
రూపాయలు అడిగి ఇంతకుముందు నువ్వు మూడు రూపాయల 14 అణాలు ఇచ్చావు, ఇప్పుడు మిగిలినవి
ఇవ్వు అని అడుగుతారు. రతన్ జీ ఏమి అర్ధం కాక మిగిలిన పైకాన్ని బాబాకు దక్షిణగా
ఇస్తాడు. కాని ఆయన మనసులో మాత్రం నేను ఇంతకు ముందెన్నడూ బాబాను కలవలేదు దక్షిణ
ఇవ్వలేదు మరి బాబా ఇలా ఎందుకు అన్నారు అని అనుకుంటాడు. సరే బాబా ఆశీర్వాదం ఇచ్చారు
నాకు అది చాలు అని నాందేడ్ వెళ్తాడు. ఇదే విషయం దాసగణు మహారాజ్కు చెప్పగా ఇద్దరు
ఆశ్చర్యపడతారు. చివరికి వారికి అర్ధం అవుతుంది రతన్ జీ మౌల్వి సాహెబ్ కు ఆతిధ్యం
ఇచ్చినప్పుడు అయిన ఖర్చు 3 రూపాయల 14 అణాలు అని. అప్పుడు వారికి బాబా సర్వజ్ఞత
అర్ధం అవుతుంది. బాబా సర్వ జీవులలో నేను ఉన్నాను అనే సత్యాన్ని ఇక్కడ అర్ధం
అయ్యేలా చేశారు. బాబాకు సర్వం ఎరుకే. కొంతకాలం తరువాత రతన్ గారికి పుత్ర సంతానం కలుగుతుంది.
ఇలానే హరివినాయక్ సాఠే గారి విషయంలో కూడా జరుగుతుంది. ఆయన మొదటి భార్య చనిపోతే
అందరు మరల పెళ్లి చేసుకోమని బలవంత పెడితే ఆయనకు కొడుకు పుడతాడు అని బాబా
ఆశీర్వదిస్తే చేసుకుంటాను అంటాడు. అలానే బాబా ఆశీర్వాదంతో రెండో పెళ్లి చేసుకొని
కొడుకుని పొందుతాడు. మొట్టమొదట ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టి ఆ తరువాత మగపిల్ల
వాడు పుడతాడు. ఆయన కొంచెం నిరాశ చెందినా బాబాపై నమ్మకాన్ని మాత్రం వదలడు. ఇలా బాబా
తన భక్తుల కోరికలను తీరుస్తూనే వారిని సన్మార్గంలో నడిపించారు.
పూర్వకాలంలో అబ్బాయి
పుట్టాలి అన్న కోరిక చాలామందిలో ఉండేది. ఇప్పటికి ఈ చింతన మనం చూస్తాము. ఈ ఆడ మగ
తేడాలను కొంచెం సేపు పక్కన పెట్టి పరమార్ధాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాము.
బాహ్యంగా చూస్తే ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఆ కాలంలో
మగపిల్లలు తల్లి తండ్రుల దగ్గర ఉండి వారికి చేదోడు వాదోడుగా ఉండే వారు. ఇప్పటి
కాలంలో చదువుల మూలాన కాని మరి ఇంకా ఏ కారణమైన కాని అందరు ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారు. దీనికి
సమాజంలోని మార్పులే కారణం. సమాజం అంటే మనుషులే. ఇక ఆధ్యాత్మికం చూస్తే, పురుషుడు
అంటే నిరాకార పరబ్రహ్మ, స్త్రీ అంటే శక్తి మరియు ప్రకృతి. మన గమ్యం ఆ భగవంతుని
చేరుకోవడం అంటే పరమేశ్వరుడిగా నిలిచిపోవడం. సరే మనం ఇలా నిలిచిపోవాలి అంటే మనం
మనది అనుకునే వాటిని దక్షిణగా సమర్పించుకోవాలి. అందుకే తరువాత ఈ అధ్యాయంలో దక్షిణ
గురించి చెప్పారు.
మానవులలో ఉండే చెడ్డ గుణం లోభం. మనవి అనుకున్నవి వదలటం అస్సలు ఇష్టం ఉండదు. బాబా తన భక్తులను ఈ లోభమనే ఊబినుండి బయటకు లాగడానికే దక్షిణను అలవాటు చేస్తారు. తైత్తరీయ ఉపనిషత్ దానం గురించి ఇలా చెప్తుంది. దానం ఎప్పుడూ శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. ఏదైనా సరే అణుకువతో ఇవ్వాలి. అందుకే బాబా దయ కలిగి ఉండండి, సంయమనంతో ఉంటె అత్యంత సుఖం పొందుతారు అని చెప్పారు. పరమ దయాళువు అయిన సాయి భక్తులకు త్యాగం అలవాటు చేయడానికే ఈ దక్షిణను స్వీకరించేవారు. ఆయన ఫకీరు, భిక్షతో జీవనం సాగించారు. ఆయనకు డబ్బుతో పని లేదు. ఆయన ఆశ్రమాలను స్థాపించాలని కాని, ఆస్తులను కూడపెట్టాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఇంకా కొత్తవి ఏమైనా కట్టేటప్పుడు ఆయన వాటిని ప్రోత్సహించేవారు కారు. మొట్టమొదటి రోజుల్లో బాబా అసలు ఏమి తీసుకొనే వారు కాదు. ఎవరైనా ఒక పైసా ఇస్తే తీసుకునే వారు. రెండు పైసలు ఇస్తే వద్దు అనే వారు. తరువాత కాలంలో భక్తుల సంఖ్య పెరిగి, వారి కర్మల అనుగుణంగా వారు ఇవ్వాలి అనుకున్న దక్షిణ మాత్రం తీసుకునే వారు. వారు దక్షిణ అడిగారు అంటే దాని వెనక ఏదో పరమార్ధం ఉంటుంది. అలా అని అందరి దగ్గర దక్షిణ తీసుకొనే వారు కాదు. ధనవంతులను కూడా పంపించి వేరే వారి దగ్గర నుంచి దక్షిణ అడిగి తెమ్మని కోరే వారు. వారికి పేద ధనవంతుల మధ్య తేడా లేదు. ఎవరి జీవితంలో ఏది అవసరమో అది మాత్రమే చేసే వారు.
దక్షిణ అనేది ఒక్కో సారి
డబ్బు రూపంలోనే కాకుండా వేరే రూపాలలో కూడా అడిగే వారు. ఒక సారి జి. జి నార్కే
గారిని 15 రూపాయల దక్షిణ అడిగారు. ఆయన దగ్గర పైసా కూడా లేదు అయిన దక్షిణ అడుగుతారు.
ఆయన చదివే యోగ వాసిష్టంలో చదివిన వాటిని అనుసరించి వాటినే దక్షిణగా ఇమ్మన్నారు.
అలానే తర్ఖడ్ భార్యను కామ క్రోధాలనే అరిషడ్ వర్గాలను 6 రూపాయలగా ఇమ్మని అడుగుతారు.
ఇలా ఎవరికి ఏది ఉపయోగపడుతుందో అది మాత్రమే కోరే వారు.
బాబాకు ఒక్కో రోజు దక్షిణగా
చాలా ధనం వచ్చేది కాని సాయంత్రము అయ్యే సమయానికి బాబా అందరికి పంచేసే వారు. మరల
తరువాత రోజు మామూలే. ఇలా బాబా మహాసమాధి నాటికి బాబా దగ్గర ఏమి మిగల లేదు. బాబా ఒక
సారి నానా చాందోర్కర్తో ఇలా చెప్పారు. ఆయన దగ్గర ఉన్న ప్రాపంచికమైన ఆస్థి ఏమిటి అంటే, ఒక
చిలుం, ఒక డబ్బా, జోలి, కఫ్నీ మరియు గోచి అని చెప్పేవారు. కాని మహానుభావుల నిజమైన ఆస్తి
అందరిపట్ల, అన్ని జీవుల పట్ల సమ భావన, కరుణ, దయ, మరియు ఆత్మ స్థితి. ఇదే మనం నిజంగా నేర్చుకోవాల్సిన,
అనుసరించాల్సిన మార్గం. ఈ మార్గమే షిర్డి మార్గం అంటే సాయి మార్గం.
ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!
No comments:
Post a Comment