సాయిలాంటి
సద్గురువులు మన బుద్ధిని వికసింపచేసి, మనలో భక్తిని వృద్ధి చేసి ఆత్మజ్ఞానమనే
బీజాన్ని నాటుతారు. మనం వివేక వైరాగ్యాలతో సాధన చేస్తే ఆత్మ సాక్షాత్కారం
కలుగుతుంది. సత్చరిత 18-19 అధ్యాయాలలో హేమద్పంత్ గారు తన ఆలోచనా విధానాన్ని బాబా
ఎలా మార్చారో, అలానే సాఠే గారి గురించి, రాధాబాయి కథను, ఇంకా బాబా చెప్పిన అతి ముఖ్యమైన అద్ధ్యాత్మిక సాధనను గురించి చెప్పారు.
సాఠే అనే ఒక పెద్దమనిషి వ్యాపారంలో దాదాపు అంతా పోగొట్టుకున్నాడు.
మానసికంగా ఎంతో కృంగిపోయాడు. ఎవరో షిరిడికి వెళ్ళమని చెపితే వచ్చి బాబాను
దర్శించాడు. గురు చరిత్ర పారాయణం చేశాడు. ఆ ఏడవ రోజు స్వప్నంలో బాబా గురుచరిత్రను
వివరిస్తునట్లుగా చూశాడు. ఈ విషయం దీక్షిత్‌కు చెప్పగా అక్కడే ఉన్న హేమద్ మనసులో
కలవరం మొదలయింది. ఈ సాఠే ఒక్కసారి పారాయణం చెయ్యగానే బాబా స్వప్న దర్శనం ఇచ్చారు.
కాని నేను 40 ఏళ్ళుగా చేస్తున్నా నాకు ఎన్నడు ఇటువంటి అదృష్టము కలగలేదు అని
అనుకున్నాడు. ఇది పసిగట్టిన బాబా హేమద్‌ను 15 రూపాయల దక్షిణ తెమ్మని శ్యామా ఇంటికి
పంపించారు. ఆ తరువాత శ్యామా చెప్పే మాటలను జాగ్రత్తగా వినమన్నారు. ఆ తరువాత కథ
మనము చదివిందే. శ్యామా 15 నమస్కారాలు దక్షిణగా ఇచ్చి రాధాబాయి దేశ్‌ముఖ్ కథ
చెప్పారు.
రాధాబాయి సాయి
కీర్తిని విని బాబాని గురువుగా స్వీకరించి ఆయన దగ్గర ఉపదేశం పొందాలి అని సంగమునేరు
అనే ప్రాంతంనుంచి వస్తారు. ఆమె బాబా తనను అనుగ్రహించిన దాకా ఉపవాస దీక్షలో ఉండాలి
అని నిర్ణయం తీసుకుంటుంది. శ్యామా కలుగచేసుకుని బాబాకు ఆమెను కరుణించమని
అర్ధిస్తాడు. అప్పుడు బాబా ఆమెకు ఈ విధంగా చెప్తారు. " అమ్మా! నేను నా
గురువుకి 12 సంవత్సరాలు సేవ చేసాను, ఆయన నా దగ్గర నుంచి రెండు పైసలు
దక్షిణగా అడిగారు, కాని నాకు ఏ మంత్రము ఇవ్వలేదు. కేవలము ఆయన సన్నిహిత్యంలోనే చాలా
నేర్చుకున్నాను. ఆయన ద్యాస తప్పితే వేరే ఆలోచనే ఉండేది కాదు. ఆయన చల్లని చూపులు
నాపై ఎల్లప్పుడు ఉండేవి. ఎప్పుడు ఆయన గూర్చే నా ధ్యానం. రోజూ ఆయనను తప్పితే మరో
స్మరణ ఉండేది కాదు. ఆయన నన్ను అడిగిన రెండు పైసలు శ్రద్ధ, సభూరి. ఇదే ఆయన
నాకిచ్చిన ఉపదేశము. ఎంత దైన్య పరిస్థితి ఎదురైనా గురువుపై నమ్మకాన్ని వదలకూడదు.
ఇక్కడే సహనం కావాలి. గొప్ప పండితుడైన, గుణవంతుడైనా సహనం లేకపోతె వారి
జీవితం వ్యర్థం. నన్ను ఒకప్పుడు ఆయన పాదాల వద్ద లేక
సముద్రపు వడ్డున ఆవలి వైపు ఉంచేవారు. ఎలాగైతే తాబేలు తన పిల్లలకు తన దృష్టి
ద్వారానే ఆహారాన్ని సమకూర్చేదో అలానే మా గురువుగారు కూడా కృపాదృష్టితో పోషిస్తారు.
అందుకే నీవు కూడా ఈ మంత్రాల జోలికి వెళ్లకుండా చక్కగా గురువుని అనుసరించు అని బాబా
చెప్పారు. ఈ సంఘటన ద్వారా బాబా హేమద్‌కి చాలా
విషయాలు నేర్పించారు. అవి ఏమిటో మనము ఇప్పుడు పరిశీలిద్దాము.
మొట్టమొదటగా హేమద్‌కు
ఆ రోజు ఒక నియమ భంగం కలిగింది. ఆయన రోజు భాగవతం పారాయణం చేస్తారు. కాని ఆ రోజు
బాబా గోష్టిలో పాల్గొనాలి అని పారాయణం చేయకుండా మశీదుకు వెళ్తారు. శ్యామా ఇంటిలో
ఉన్న భాగవత పుస్తకంలో సరిగ్గా అదే పుటను చూపించి తను ఎక్కడైతే పారాయణం ఆపాడో
అక్కడే మరల చదివిస్తారు. ఇదే బాబా మనకు బోదిస్తున్న విషయం. మనము చేసే పనిలో శ్రద్ధ
ఉండాలి. మన ఆలోచనలు మనల్ని బానిసలుగా మార్చుకోకూడదు. తరువాత రాధాభాయి కథను మసీదులో
బాబాకు హేమద్ వినిపిస్తాడు. అప్పుడు సాయి హేమద్‌కు ఈ విధంగా బోధచేస్తారు.
ఆత్మజ్ఞానమే సమ్యక్
విజ్ఞానం. ఈ సమ్యక్ విజ్ఞానం ధ్యానం ద్వారానే సంభవం. ధ్యానమే ఆత్మనుష్టానం. దీని
ద్వారా మనలోని చిత్తవృత్తులు అన్ని సమాధాన పడ్తాయి.ముందుగా నువ్వు ఈ సర్వ ఈషణలు నుండి ముక్తుడవు అవ్వాలి. (ఇక్కడ ఈషణలు అంటే మనకు జీవితంలో కలిగే
కోరికలు, తపనలు, ప్రేమానురాగాలు). తర్వాత సర్వ భూతస్థ ఆత్మను ధ్యానించాలి. (అంటే
నిరాకార ధ్యానం) అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇది కనక కష్టమైతే నా ఈ సగుణ
రూపాన్ని ధ్యానించు. ఇలాచేస్తే నీ మనసు ఏకాగ్రమవుతుంది. నువ్వు బ్రహ్మంతో
ఏకమవుతావు. అని చక్కని బోధ బాబా హేమద్‌కు చేయడం జరిగింది. ఆ తరువాత బాబా
వీటన్నింటిని చక్కగా శ్రవణ మన్న నిధి ధ్యానాల ద్వారా మహదానందాన్ని పొందవచ్చు అని
చెప్పారు.
సద్గురువులు మనకు
ఎన్నోవిషయాలు చెప్పవచ్చు కాని అవి మన నిజజీవితంలోకి అన్వయించుకుంటేనే అవి మనకు
ఉపయోగపడ్తాయి. ఇక్కడ రాధాభాయి కథ ద్వారా శ్రద్ధ, సబూరి అనే గొప్ప మంత్రాల్ని బాబా
మనకు ఇచ్చారు. మనకు ఉపనిషత్తులు అన్ని బాగా తెలియవచ్చు. కాని నిజజీవితంలో మార్పులు
రాకపోతే ఆ జ్ఞానం మనల్ని ముందుకు తీసుకువెళ్ళదు. ఇక్కడ హేమద్‌పంత్ యొక్క అంతర్
శత్రువులను బాబా వెలికి తీసుకువచ్చి ఒక్కొక్కటిగా పారద్రోలి, తను ముందు ముందు
చేయించబోయే సత్కర్మలకు సిద్ధం చేసారు. ఈ సందర్భంలోనే బాబా చాలా సూక్తులు
వినిపించారు. పూర్వజన్మ బంధనం లేనిదే ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు. కాబట్టి మనిషి,
పశువు, పక్షి ఏదైనా నిన్ను చేరవస్తే చీ కొట్టి తరిమేయకు. నీవద్దకు ఎవరు వచ్చినా
తగినట్లుగా ఆదరించు. దాహార్తులకు మంచినీళ్ళు ఇవ్వు, ఆకలిగా ఉన్నవారికి అన్నము
పెట్టు. వస్త్రాలు లేని వారికి దుస్తులు ఇవ్వు. అనాశ్రితులకు ఆశ్రయమివ్వు ఇలా చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు. ఒకరు నిన్ను దానం
అడుగుతారు ఇస్తే ఇవ్వు అంతేకాని వారిని నిందించవద్దు. ఇతరులు నిన్ను మాటలతో
గాయపరుస్తారు. ఆ నిందలను నువ్వు ఓర్పుతో భరిస్తే నీకు అపరిమితమైన ఆనందం
అనుభూతమవుతుంది. ఈ లోకం అడ్డదిడ్డంగా పోవచ్చు, కాని మనం మాత్రం తడబడరాదు. మనం
మననేలపై స్థిరంగా నిలచి ఈ విశ్వక్రీడను తిలకిస్తూ ఉండాలి. నీకూ నాకూ మధ్యన ఉండే
గోడను పూర్తిగా కూల్చివేయి. అప్పుడు మనకు దారి ఏర్పడుతుంది. నీవు నేను అన్న భావనే
ఈ అడ్డుగోడ అని చక్కని ఉపదేశాన్ని బాబా చెప్పారు. ఇక్కడే బాబా పరనింద కూడా వద్దు అని చెప్పారు.
మనం ఆధ్యాత్మిక
ప్రగతి సాధించాలి అంటే పూజలు, ధ్యానాలతో బాటు మనజీవితంలో బాబా
చెప్పిన మార్పులు రావాలి. అవి రాకుండా మనకు బ్రహ్మా జ్ఞానానికి కావలసిన అర్హత
రాదు. అందుకే బాబా తన భక్తులను ముందుగా ఈ విషయంలో మార్పు తీసుకురావడానికి
ప్రయత్నించేవారు. కాని మనకి ఆయన మీద నమ్మకం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు
వెళ్ళలేము.
శ్రీ
సాయినాథార్పణమస్తు!
No comments:
Post a Comment