ఎన్నో జన్మల
పుణ్యఫలం వల్ల సాయి మన జీవితంలో ప్రవేశించారు. సాయి తన భక్తులను జాగ్రత్తగా
కాపాడుతు ఆధ్యాత్మిక పధంలో నడిపిస్తారు. సాయి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఉంటే
చాలు మనం ఈ భవసాగరాన్ని దాటవచ్చు. సాయి భక్తులు ఎన్నడు నిరాశకు లోనవ్వరు. వారి
జీవితంలో సుఖశాంతులికి కొదవ ఉండదు. సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్పారు.
ఒక్కోసారి మనం దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం
అవుతాము. దేవుడికి ఎంత చేసినా తక్కువే, కాని బాబా ఎందుకు నిరాడంబరతకు ప్రాముఖ్యత
ఇచ్చారు అంటే ఆధ్యాత్మిక సాధనలో నిరాడంబరత అవసరం ఎంతో ఉంటుంది. లేక పొతే ఈ ఆడంబర
పూజలే వాసనలై చివరికి మనలను వేధిస్తాయి. ఆత్మ సాక్షాత్కారానికి నేను, నాది అనే
అహంకారమే అడ్డుగా నిలుస్తుంది.
సాయి సమర్ధుని కృపతో
దాసగణు మహారాజ్ సత్పురుషుల కథలను రచించి, ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి
ప్రసిద్ధి చెందారు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేసారు. ఆత్మానంద
సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించారు. దాసగణు షిర్డీకి రావడానికి కారణం నానాచందోర్కర్. నానా
వల్ల సాయి భక్తి నలుదిశలా వ్యాపించింది. ఒక సారి దాసగణు మహారాజ్ షిర్డీ గ్రామంలో
హరికథా కీర్తన కోసమని శరీరంపై కోటు, కండువా, తలకు పాగా కట్టి బయలుదేరారు. బాబా ఆశీర్వాదం కోసమని వస్తే బాబా ఇలా అంటారు. "వాహ్వా పెళ్ళికొడుకు
లాగా అలంకరించుకుని, ఎక్కడకు వెళ్తున్నావు? అని అడుగుతారు. కీర్తన చెప్పడానికి
ఇవన్నీ అవసరమా! వీనిని నా ఎదుట తీసివేయి అని చెప్తారు. అప్పటినుంచి దాసగణు మహారాజ్
ఒక్క పంచ కట్టుకొని చొక్కా లేకుండా, చేతిలో చిడతలు మరియు మేడలో మాల వేసుకొని హరికథ
చెప్పేవారు. ఇదే ప్రసిద్ధమైన నారదీయ పద్దతి. బాబా ఈ నిరాడంబరతనే కోరుకునే వారు.
ఇక్కడ మన ధ్యేయం అంతరంగ పరిశుద్ధత.
ఒక సారి ఠాణా
జిల్లాలో కౌపీనేశ్వర దేవాలయంలో దాసగణు గారి హరికథా ఏర్పాటు చేశారు. అక్కడకు
చోల్కర్ అనే ఒక సామాన్య ఉద్యోగి కూడా వచ్చాడు. ఆయన సాయి మహిమల గురించి విని పరవశం
పొందుతారు. అక్కడకు వచ్చిన వారు కొంతమంది దాసగణు గారి కీర్తన విధానం కోసం వస్తే,
మరికొంత మంది గానం కోసం లేదా నృత్యం కోసం వస్తారు. కాని చోల్కర్ మాత్రం సాయి
లీలామృతంలో మునిగిపోయాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది. అప్పుడు సాయిని ఈ విధంగా
ప్రార్ధిస్తాడు. "సాయి దయామయా! ఈ దీనుని అనుగ్రహించు, నాది పేద సంసారం.
ఉద్యోగంపైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలి అంటే పరీక్ష ఉత్తీర్ణుడవ్వాలి. నా
జీవితం ఉద్యోగంపైనే ఆధారపడివుంది. మీ కృపతో ఇది నెరవేరితే మీ దర్శనం చేసుకొని మీకు
పటిక బెల్లం సమర్పిస్తాను అని వేడుకుంటాడు. అతని కోరిక నెరవేరి ఉద్యోగం
నిలబడుతుంది. షిర్డి వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అందుకని తన ఖర్చులను
తగ్గించుకొన్నాడు. ఆఖరికి చెక్కర లేకుండా టీ తాగడం కూడా అలవాటు చేసుకుంటాడు. ఇలా
కొంత డబ్బు ఆదా చేసి షిర్డీకి వెళ్తాడు.
బాబాను దర్శించుకొని
పటిక బెల్లం మరియు కొబ్బరికాయను సమర్పించి ఈ రోజు నా సకల కోరికలు తీరి నా జీవితం
సఫలం అయ్యింది. చోల్కర్ జోగ్ ఇంట్లో అతిధిగా ఉంటారు. చోల్కర్ జోగ్ తో బయల్దెరపోతే
బాబా జోగ్ తో ఇలా అంటారు. "ఇతనికి త్రాగటానికి కప్పులో చెక్కెర బాగా ఎక్కువగా
వేసి టీ ఇవ్వు". జోగ్ కి వింతగా అనిపిస్తుంది కాని చోల్కర్కి మాత్రం
ఆనందాశ్రువులు దొర్లుతుండగా బాబా కాళ్లపై తన శిరసు ఉంచాడు. అప్పుడు బాబా "
చోల్కర్ నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. నీ త్యాగనియమం కూడా పూర్తిఅయింది. మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు.
మీరెవరైనా ఎక్కడున్నా భక్తితో నా వైపు మళ్లితే ఎల్లప్పుడు మీతోనే ఉంటాను. ఈ శరీరం
ఇక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో
ఎక్కడికైనా వెళ్ళండి నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. మీ హృదయంలో
ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. అన్ని జీవరాసులలో నేనే ఉన్నాను నన్ను
తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు. బాబా ఎంతో ప్రేమతో చోల్కర్ భక్తిని
స్థిరపరిచారు.
బాబాకి సర్వం ఎరుక.
అందుకే సాయి అష్టోత్తరంలో కాలాతీతాయా నమః అని చెప్పారు. మనం కాలాతీతులమైతే భూత
భవిష్యత్తులు వర్తమానంలో వ్యక్తమవుతాయి. అందుకే బాబా అందరి జీవితాలలో ఏమి
జరగపోతుందో దాన్ని బట్టి ఆయన మనలను హెచ్చరించేవారు. అలానే ఒక సారి చమత్కారంగా ఒక
బల్లి తన చెల్లెలు కోసమే ఎదురుచూస్తుంది అని చెప్పారు. ద్వారకామాయిలో ఉన్న బల్లి
సంతోషంతో టిక్కు టిక్కు మని పలుకుతూ ఉంటె, ఎక్కడో ఔరంగాబాద్
నుంచి ఎవరో గుర్రం మీద వచ్చి గుర్రానికి అలసటగా ఉందని అక్కడ ఆగుతాడు. తన భుజం మీద
ఉన్న ఉలవలు సంచి విదిలిస్తే ఒక బల్లి కింద పది గోడ మీదకు పాకుతుంది. అప్పుడు ఆ
రెండు బల్లులు అక్క చెల్లెళ్ళ వలె సంతోషంతో ముద్దులాడునవి అని హేమద్పంత్ గారు
సత్చరితలో చెప్పారు. ఇలా బాబాకు సర్వం తెలుసు అనే సత్యాన్ని మనకు చిన్న చిన్న
ఉదాహరణల ద్వారా చూపించారు.
సాయి భక్తులుగా మనం
మన జీవితాల్లో కూడా బాబా చెప్పిన నిరాడంబరతను అలవరచుకోవాలి. మనం అణుకువతో ఉండడటం
నేర్చుకోవాలి. చోల్కర్ లాంటి భక్తిశ్రద్ధలు ఉండాలి. జీవితంలో కొన్నింటిని వదలటం
నేర్చుకోవాలి. చోల్కర్ తీపి పదార్ధాలను వదలివేసాడు అని కథలో మనము చెప్పుకున్నాము.
ఇక్కడ నిజమైన అర్ధం ఏమిటి అంటే, మనం సుఖాల కోసం కొంచెం కష్టాన్ని కూడా తట్టుకోవడానికి
ఇష్టపడం. ఇది నేర్పించడానికి బాబా ఇలాంటి చమత్కారాలు చేయడం జరిగింది. బాబా
సర్వజ్ఞులు అని మనం గుర్తు ఉంచుకోవాలి. ఎప్పుడు శ్రద్ధ సభూరి అనే మంత్రాలను
మర్చిపోకూడదు.
ఓం శ్రీ
సాయినాథార్పణమస్తు!
No comments:
Post a Comment