మనము మన చిత్తాన్ని శుద్ది చేసుకొని, సాధన చతుష్టయాన్ని (అంటే వివేకము, వైరాగ్యము, శమదమాది షట్ సంపత్తి మరియు ముముక్షత్వము) బాగా అలవరుచుకుని, ఈ జ్ఞాన భూమికలలో మొట్టమొదటిది రెండవది అయిన శుబేఛ్ఛ మరియు విచారణలను పెంపొందించుకొని గురువు అనుగ్రహము పొందితే అప్పుడు తురీయస్థితికి చేరాలంటే పరమగురువుల అనుగ్రహం తప్పక ఉండాలి. దానికి ఎంతో కృషి చెయ్యాలి. అదే ప్రతి మానవుని యొక్క ముఖ్య లక్ష్యము. మనలో ఈ బ్రహ్మ జిజ్ఞాస బాగా రావాలి. బాబా ఎప్పుడూ మనలను ఈ దారిలో తీసుకువెళ్ళాలని, మనము దాన్ని తప్ప వేరే ఏదీ కోరుకోకూడదని బాబా ఉద్దేశ్యము. కాని ఆయన మన ప్రాపంచిక కోరికలు కూడా తీరుస్తూ మనల్ని ఒక్కోమెట్టు ఎక్కిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మము గురించి తెలుసుకోవడానికి మనము ఏం చేయాలి అనే విషయాలను బాబా సాయి సచ్చరితలో 16,17 అధ్యాయాలలలో చెప్పడం జరిగింది.
సంపన్నుడు మరియు లోభి అయిన ఒకరు బాబాని బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వమని అడగటం జరిగింది. ఈ సంఘటనలో బాబా చాలా చమత్కారంగా అయిదు రూపాయల కోసం ఒక కుర్రవాడిని పంపించడం జరుగుతుంది. కాని 5 రూపాయలు దొరకవు. ఈ సంపన్నుడి దగ్గర చాలా ధనం ఉన్నా, ఆయన దానిని ఇచ్చేందుకు సిద్దంగా లేడు. అప్పుడు బాబా అతని జేబులో ఎంత ధనం ఉందొ చెప్పి, లోభం మనిషికి మంచిది కాదని, అదే సాధనకు అడ్డు అని చెప్తారు. ఇక్కడ బాబా ఆ సంపన్నుని అడ్డుపెట్టుకుని మనందరకు జ్ఞానభోధ చేసారు.
బాబా అడిగిన ఆ అయిదు ఏమిటి ?
1) పంచప్రాణాలు
2) పంచ జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు
3) మనస్సు
4) బుద్ధి
5) అహంకారము.
బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినం. అది అందరికీ సులభ సాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటమై అదృష్టమున్న వారికి అది వెంటనే లభిస్తుంది. కించిత్తయిన విరక్తి లేని వారికి, ఎవరైనా ఈ బ్రహ్మ తత్వోపదేశం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం?
ఉత్తమ అధికారులు బ్రహ్మజ్ఞాన బోధనను గ్రహిస్తారు. కాని సంప్రదాయానికి బద్దులైన మధ్యమాదికారులకు క్రమక్రమంగా బోధించాలి. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మప్రాప్తికి శ్రేష్టమైన మార్గం లేదు. అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలై పోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది.
నేనే బ్రహ్మను అనే జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాత ఆత్మ స్వరూపంలో విలీనమైపోయినప్పుడు, అదే విశ్వాభాస విసర్జన అని శ్రుతి చెప్తుంది. ఆత్మజాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతియై సృష్టి అంతా భస్మమై పోతుంది.
ఆత్మస్థితి లేక బ్రహ్మస్థితి అంటే ఏమిటి?
బ్రహ్మము సత్యము. ఏదైతే అన్ని కాలాలకు అతీతంగా ఉందో, దేనికైతే ఆద్యంతములు లేవో, ఏదైతే మార్పు చెందదో అంటే దేశకాల పరిస్థితులకు మార్పు చెందదో అదే బ్రహ్మము. ఈ బ్రహ్మము మనమే అని అనుభవ పూర్వకంగా తెలుసుకొని, పంచకోశములు (అన్నమయ. ప్రాణమయ, మనోమయ, బుద్ధిమయ, ఆనందమయ కోశములు) మనము కాము అని తెలుసుకొని, సచ్చిదానందస్థితి మాత్రమే మన నిజస్వరూపమని తెలుసుకొని, ఆ స్థితిలో ఉండటమే బ్రహ్మస్థితి. ఒక్క ఆత్మజ్ఞానం తప్ప, బ్రహ్మ ప్రాప్తికి శ్రేష్ఠమైన సాధనం లేదు. మరి ఇది అంత తేలికైన విషయం కాదు. దీనికి అభ్యాసం శ్రమ తప్పక ఉండాలి. సాధనలో ఎముకలు పుల్లలు అయిపోవాలి, అప్పుడే గురుకృపా ప్రకాశంతో బ్రహ్మ జ్ఞానం మెల్ల మెల్లగా చేజిక్కుతుంది.
బ్రహ్మజ్ఞానము (ఆత్మసాక్షాత్కారము) నకు యోగ్యత.
బాబా అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేదు అని చెప్తున్నారు. దానికి కావలసిన యోగ్యతలు ఇక్కడ చెప్పడం జరిగింది.
1) ముముక్షత : ఎవరయితే తాను బద్దుడనని గ్రహించి బందనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వారే ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు.
2) విరక్తి లేదా ఇహపర సుఖములందు విసుగు చెందుట : ఈ లోకములోని సుఖాలయందు , పరలోక సుఖాలయందు, అంటే స్వర్గాదిసుఖములందు ఆసక్తి లేకుండా ఉండటమే నిజమైన విరక్తి.
3) అంతర్ముఖత : మనకు (ఇంద్రియాలకు) బాహ్యమైన వస్తువులను చూచుటకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కనుక మానవులెప్పుడు బయటనున్న వానినే చూచును. కాని మనము ఆత్మసాక్షాత్కరము కోరుకుంటే మన దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానముతో జూడవలెను.
4) పాపవిమోచన పొందుట : మానవుడు దుష్ట కర్మల నుండి మనస్సును మరలించలేనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.
5) సరియైన నడవడి : మనము ఎప్పుడూ సత్యము పలుకుచూ, తపస్సు చేయిచూ, అంతర్‌దృష్టితో బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు.
6) ప్రియమైన వాటి కంటే, మనకి ఏది మంచిదో, అంటే శ్రేయాన్ని కోరుకోవడం ఎంతో ముఖ్యం. ప్రియమైనవన్నీ శ్రేయం కాకపోవచ్చు. అలానే శ్రేయమైనది మనకు ప్రియం కాకపోవచ్చు. ఈ శ్రేయ, ప్రియాల మధ్య మన జీవితం ఊగిసలాడుతూ ఉంటుంది.
7) మనస్సును, ఇంద్రియాలను స్వాధీనమునందుంచుకొనుట : శరీరం రధం, ఆత్మ ఆ రధమును నడుపు సారధి, మనస్సు- కళ్ళెము, ఇంద్రియములు - గుఱ్ఱములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనములో లేవో, అట్టి వాడు గమ్యస్థానము చేరలేడు. ఎవరయితే వీటన్నింటిని ఆధీనములో నుంచునో వారు తప్పక గమ్యస్థానము చేరుకుంటారు.
8) మనస్సుని పావనము చేయుట : మానవుడు ప్రపంచంలో తన విధులను సక్రమంగా నిర్వర్తించితే మరియు ధర్మమార్గంలో ప్రయాణించితే కాని అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు.
9) గురువు యొక్క ఆవశ్యకత : ఆత్మజ్ఞానము చాలా సూక్ష్మము అయినది. మనంతట మనము దానిని పొందలేము. దీనికి గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఆ గురువు ఆత్మసాక్షాత్కారము పొందినవారై యుండాలి. గురువుకు దానిలో ఉన్న లోటుపాట్లు తెలుసు. అందుకే వారు మనలను సరియైన మార్గములో నడిపించగలుగుతారు.
10) భగవంతుని కటాక్షము : "ఆత్మ ఎవరిని ధరించునో వారే దానిని పొందుదురు" అని కఠోపనిషత్తు చెప్పుచున్నది. భగవంతుని కటాక్షము లేనిదే వివేక వైరాగ్యములు కలగవని బాబా ఇక్కడ బోదించడం జరిగింది.
బాబా ఈ పది యోగ్యతలను బోధించి మనందరిని ఉద్దరించారు. వీటన్నింటిని మనము మన నిజజీవితంలో అన్వయించటం నేర్చుకోవాలి. ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం బ్రహ్మ తత్వాన్ని నిర్ధారించడమే. ఇది సాయిని శరణుజొచ్చిన వారిని భవసాగరాన్నుంచి దాటించే నౌక. మనము ఈ సత్యాన్ని ఆకళింపు చేసుకుంటే ప్రతి అధ్యాయంలో బాబా ఆత్మ జ్ఞానం గురించి మాత్రమే బోధిస్తున్నారు అని మనకు అర్ధం అవుతుంది. అనేకమంది సన్యాసులు ఒంటరిగా ఉండి ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తారు. బాబా అలా కాకుండా సమాజంలోనే ఉంటూ అందరిని ఉద్ధరించడానికే అవతరించారు. ఇలాంటి పరమగురువుని పూజించేవారందరు ఆత్మ సాక్షాత్కారము కొరకు సాధన చేయవలసి ఉంటుంది.
శ్రీ సాయినాథార్పణమస్తు !
No comments:
Post a Comment