In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, March 14, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 26



ఆత్మ స్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలలతో బహుచక్కగా కనిపిస్తుంది. అద్దంలో కనిపించేవన్ని వాస్తవానికి అద్దంలో ఉండవు. నిద్రలో కనిపించినవి మెలుకువ రాగానే నశించిపోతాయి. జాగ్రదావస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. విశ్వం యొక్క స్పురణ, సత్తా మరియు ఆధిష్టానమైన, గుర్వాత్మ అగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ స్వరూపము సత్య స్వరూపము మరియు స్వప్రకాశకమైనది. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయమైన ఈ దృశ్యజగత్తు తత్వ జ్ఞానంతో  లయమై పోతుంది. 

హేమద్‌పంత్ ఈ అధ్యాయంలో సాయి మానసపూజను చక్కగా వ్యక్తపరిచారు.

సాయిదేవా! మాకు ప్రేరణ కలిగించేది మీరే. మావాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయడానికి నేనెవరిని? చేసేవారు చేయించేవారు మీరొక్కరే. మీతో సత్య సమాగం మాకు ఆగమనిగమాలు. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామవర్తనే మాకు కథా కీర్తన. అదే మా నిత్యానుష్టానం, అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాల మాకు వద్దు. పరమార్ధంలో ఇంతకంటే అధికంగా అధఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి?

ఆనందాశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాను. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను. బాహ్యోపచారపూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నులను చేసి సుఖ సంతుష్టుణ్ణి అవుతాను. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనస్సుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధ, భక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసమనే మొలత్రాటిని మీ నడుముకు బంధించి, మీ పాదాంగుష్టాల  యందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ప్రేమరత్నాలతో మిమ్ములను అలకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదిడుపు దిష్టి తీస్తాను. నా పంచప్రాణాలను వింజూమరలుగా వీస్తాను. మీ తాపనివారణ కొరకు తన్మయత్వమనే గొడుగు పట్టుతాను. ఈ విధంగా గంధం, అర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా! మా మంచికోసం మీకు స్వానందపూజ చేస్తాను. నా మనోభీష్టాలు తీరడానికి ఎల్లప్పుడూ సాయి సమర్ధ అని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్ధం సాధిస్తాను. నిష్ఠతో కృతార్థుడను అవుతాను. 

భక్త పంత్
ఇలా చెప్పిన తరువాత భక్త పంత్ గారి అనుభవాలను ఈ అధ్యాయంలో చెప్పారు. పంత్ గారు ఒక సారి బంధువులతో మరియు స్నేహితులతో కలిసి రైలు ప్రయాణంలో వెళ్తూ ఉంటె వారు ఆయనను షిర్డీకి రమ్మని పిలుస్తారు. కాని ఆయనకు అప్పటికే ఒక సద్గురువు ఉన్నారు. ఇష్టం లేక పోయినా వారి మాట కాదనలేక షిర్డీకి వెళ్తారు. ద్వారకామాయికి వెళ్ళగానే పంత్ గారికి మూర్ఛ వచ్చి పడిపోతారు. అందరు కంగారుపడతారు. తరువాత బాబా కటాక్షముతో ఆయన దాని నుండి తేరుకొని కూర్చుంటారు. అప్పుడు బాబా ఇలా అంటారు. ఏమైనను కానిండు. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. నీ గురువునందే యాశ్రయము నిలుపుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి యుండుము అని చెప్పిరి. పంత్ గారు ఈ మాటల ప్రాముఖ్యాన్ని  గ్రహించెను.  ఇలా బాబా  మతాలను కూడా మారవద్దని, మనము ఏ గురువుని నమ్మితే ఆ మార్గంలోనే నడవమని ప్రోత్సహించే వారు. దేవుడొక్కడే అని, ఆయనే సర్వాధికారి అని ఎల్లప్పుడూ అంటూ ఉండేవారు. 

హరిశ్చంద్ర పితలే
హరిశ్చంద్ర పితలే గారి విషయంలో కూడా బాబా వారి పూర్వీకుల గురువుల అనుబంధాన్ని గుర్తు చేస్తారు. పితలే గారికి మూర్ఛ రోగంతో బాధపడుతున్న ఒక కుమారుడు ఉండే వాడు. వానికి ఎన్నో వైద్యాలు చేపించినా ఆ జబ్బు తగ్గక చివరికి దాసగణు గారి కీర్తనల ద్వారా తెలుసుకొని బాబాను చేరుకుంటారు. ఆ బాబుని భార్యాభర్తలు సాయి పాదాల దగ్గర ఉంచుతారు. ఆ పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రన తిప్పి పడిపోతాడు. అతని నోటివెంట చొంగ కూడా కారి స్పృహ కోల్పోతాడు. అప్పుడు వాని తల్లి గాబరపడి కంటినీరు పెట్టుకుంటే బాబా ఆమెకు దైర్యం చెప్పి వాడాకు వెళ్ళమంటారు. ఒక అరగంట తరువాత వానికి తెలివి వస్తుంది. తరువాత వానికి ఈ జబ్బు నయం అవుతుంది. ఆ దంపతులు మరల ద్వారకామాయికి వెళ్ళినప్పుడు బాబా ఇలా అంటారు  " నీ యాలోచనలు, సంశయములు, భయోత్పాతములు, ఇప్పుడు చల్లబడినవా ? ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో, వారిని తప్పక భగవంతుడు రక్షించును" అని చెప్పారు. 

కొద్ది రోజుల తరువాత వారు ఇంటికి వెళ్లదలిచి బాబా దగ్గరకు వెళ్తారు. అప్పుడు బాబా పితలేకు ఊది ఇచ్చి ఇలా అంటారు "బాపూ ! అంతకుముందు రెండు రూపాయలు ఇచ్చివుంటిని, ఇప్పడు మూడు రూపాయలు ఇస్తున్నాను. ఇవి మీ పూజామందిరంలో పెట్టుకొని పూజించుము. నీవు మేలు పొందెదవు" అని వారిని పంపించెను. కాని ఇంతకు ముందెన్నడూ బాబాను వారు కలవలేదు మరి ఆయన రెండు రూపాయలు ఎప్పుడు ఇచ్చారు అనుకుంటూ వాళ్ళ అమ్మకు ఈ విషయం చెప్తారు. అప్పుడు ఆమెకు తన భర్తకు అక్కల్కోట మహారాజ్ గారు ఇచ్చిన రెండు రూపాయలు గుర్తుకి వచ్చి ఆ విషయం చెప్తారు. సాయి సర్వజ్ఞతను వారందరు అర్ధం చేసుకొని పరవశం పొందుతారు. 

గోపాల నారాయణ అంబాడేకర్ అనే ఆయన బాబాకు మంచి భక్తుడు. ఆయన ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత ఇంకో ఉద్యోగం వెతుక్కోవలిసి వస్తుంది. ఎన్ని రోజులు ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు. నిరాశపడి చివరకు షిర్డీలో ప్రాణ త్యాగం చెయ్యాలని వస్తాడు. అక్కడవున్న నూతిలో దూకి చనిపోవాలని ఒక రాత్రి అక్కడ తిరుగుతూ ఉంటె సగుణమేరు నాయక్ ఆయనను పిలిచి అక్కల్కోట మహారాజుగారి చరిత్రను చదవమని ఒక పుస్తకం ఇస్తాడు. అప్పుడు అంబాడేకర్ పుస్తకాన్ని తెరిస్తే ఇలా వ్రాసి ఉంటుంది " గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తికాకున్నచో ప్రాణ త్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలం ఈ కర్మ అనుభవించరాదు? గత జన్మల పాపములను 
ఏల తుడిచివేయరాదు ? దీనిని శాశ్వతముగా పోవునట్లు చేయుము." ఇలా సమయానికి ఆ కథ ద్వారా సత్యాన్ని తెలుసుకొని తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుంటాడు అంబాడేకర్. ఈయన తండ్రికూడా అక్కల్కోట మహారాజ్ గారి భక్తుడు. తరువాత అంబాడేకర్ బాబాపై నమ్మకం దృఢం చేసుకొని జీవితంలో స్థిరపడతాడు. 

శ్రీ సాయినాథార్పణమస్తు !










No comments:

Post a Comment