In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, June 20, 2018

శ్రీ సాయిసత్చరిత అధ్యాయం - 40



భక్తులు ఎప్పుడైతే భక్తిభావంతో సద్గురు సాయినాథునికి అనన్య శరణుజొచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషం. కన్నతల్లికి పసిబిడ్డలపై ప్రేమ. అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్నతల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగుపరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు?

 దేవుగారింట ఉద్యాపన వ్రతం 
బి . వి . దేవ్ గారి తల్లి చాలా నోములు నోచి ఉద్యాపన చెయ్యాలి అని నిశ్చయించి 100, 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలిసియుండెను. ఈ శుభకార్యమునకు మంచి ముహూర్తం నిర్ణయించి బాబా వస్తే బాగుంటుంది అని జోగ్ గారికి ఒక లేఖ రాస్తారు. జోగ్ ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించెను. అప్పుడు బాబా ఇట్లా అన్నారు " నన్నే గుర్తుంచుకున్న వారిని నేను మరువను. నాకు బండి కాని, టాంగా గాని, రైలు గాని, విమానము గాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరిగెత్తి పోయి ప్రత్యక్షమయ్యెదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము" అని బాబా చెప్పారు. జోగ్ బాబా చెప్పినదంతా ఒక జవాబుగా దేవ్ గారికి ఉత్తరం వ్రాసారు. దేవ్ అది చూసి ఎంతో సంతోష పడ్డాడు. దేవ్ కి బాబా ఎక్కడకు రారు అని తెలుసు కాని సర్వాంతర్యామి అయిన బాబా ఏ రూపంలో అయినా రావచ్చు అని భావించి తన పనులలో నిమగ్నం అవుతాడు. 

ఉద్యాపనకు కొన్ని రోజుల ముందు గోరక్షణకు చందాలు వసూలు చెయ్యాలి అని ఒక బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి వస్తాడు. ఆయన మొట్టమొదట అక్కడ స్టేషన్ మాస్టారును కలుస్తాడు. ఆయన మామలతదార్ అయిన దేవ్ గారిని కలిస్తే మంచిది అని స్టేషన్ మాస్టర్ చెప్తారు. ఆ సన్యాసి దేవ్ గారిని కలిసి తాను గోరక్షణార్థం చందాలు వసూల్ చేస్తున్నానని, అందుకు దేవ్ గారు సహాయం చెయ్యాలి అని కోరతాడు. అప్పుడే ఇంకొక ఉద్దేశం కోసం మరొకరు చందాలు వసూలు చేస్తున్నట్లు చెప్పి నాలుగు నెలలు ఆగి వస్తే మంచిది అని చెప్తారు. తరువాత ఉద్యాపన రోజున మరల ఆ సన్యాసి రావటం చూసి ఆయన చందాల కోసం వచ్చాడు అనుకుంటాడు. కాని నేను భోజనానికి వచ్చాను అని చెప్తారు. దేవ్ చాలా సంతోషంతో ఆయనను ఆహ్వానిస్తాడు. తనతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు అని ఆ సన్యాసి చెప్తే వారిని కూడా తీసుకురమ్మని చెప్తాడు దేవ్. అందరికి దేవ్ చక్కగా మర్యాదలు చేసి భోజనం
వడ్డిస్తాడు. ఉద్యాపన అయిన తరువాత దేవ్ బాబా రాలేదు అనుకుంటూ జోగ్ కి మరల ఉత్తరం వ్రాస్తాడు. బాబా ఈ విషయం విని తాను వచ్చినా దేవ్ గుర్తు పట్టలేదని ఆ సన్యాసిగా వచ్చింది తానే అని, తనతో పాటు మరో ఇద్దరిని కూడా తెచ్చాను అని బాబా ఉత్తరం వ్రాయమంటారు. దేవ్ ఈ ఉత్తరం చూసి సన్యాసి రూపంలో వచ్చింది బాబానే అని తెలుసుకొని సంతోషపడతాడు. తాను బాబాను తప్పుపట్టినందుకు సిగ్గు పడతాడు. ఇక్కడ బాబా ముందుగానే సన్యాసి రూపంలో చందాలు అడిగే వాడి లాగా వచ్చి దేవ్ ని సందిగ్ధంలో పడవేశారు. పూర్వ పరిచయం లేని వారు వచ్చిఉంటే సాయే అని నిశ్చయంగా అనిపించేది. కాని సత్పురుషుల పద్దతే ఇంత. ఎన్నడూ సంభవించని అద్భుతమైన లీలలను చేస్తారు. వారు భక్తుల గృహాలలోని కార్యాలను, ప్రణాళికను ముందుగానే తయారుచేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభకార్యాలను ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు. చింతామణి తలిచినదానిని ఇస్తుంది. కాని గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానింపబడి వచ్చారు. ఒక్కోసారి పిలవకుండానే వస్తారు. ఏ రూపంలోనైనా సాయి రావచ్చు. 

తరువాత హేమాడపంత్ గారు ఒక పటం రూపంలో తన ఇంటికి ఎలా వచ్చారో చెప్పారు. 1917 లో ఒక రోజు హేమాడపంత్ నిద్రలో ఉండగా బాబా కలలో కన్పించి తన ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్తారు. హేమద్పంత్ భార్యతో ఈ విషయం చెప్పి ఆ రోజు కొంచెం ఎక్కువ వండాలి అని చెప్తారు. అదే రోజు హోళీ పర్వదినం కాబట్టి తన బంధువులందరూ భోజనానికి వచ్చి ఉంటారు. మధ్యలో బాబాకోసమని ఒక పీట వేసి అన్ని వడ్డించి ఉంచారు. అక్కడ చుట్టూ మంచి మంచి ముగ్గులతో అలంకరిస్తారు. పన్నెండు కాగానే ఒక్కక్కరే వచ్చి భోజనానికి కూర్చున్నారు. మధ్య పళ్లెం వద్ద మాత్రం ఎవరూ లేరు. అందరూ చాలా సేపు ఎదురు చూస్తారు. బాబా వస్తారా! కాని బాబా ఎదో ఒక రూపంలో రావచ్చు అనే నమ్మకం. వారు భగవంతునికి ప్రార్థన చేస్తుంటే బయట అడుగుల చప్పుడు వినపడుతుంది. వెంటనే హేమద్పంత్ తలుపు తీస్తారు. ఇద్దరు వ్యక్తులు తలుపు దగ్గర ఉంటారు. వారిలో ఒకరు అలీ మొహమ్మద్. రెండవ వారు మౌలానా శిష్యుడు ఇస్మూముజావర్. అందరూ భోజనానికి కూర్చొని ఉండటం చూసి క్షమించమని అడిగి ఒక ప్యాకెట్టును టేబుల్ మీద ఉంచి దానిని విప్పాడు అలీ.   విప్పగానే బాబా చిత్రం చూసి హేమద్పంత్ తన శరీరం రోమాంచితం అయ్యింది అని వ్రాస్తారు. అప్పుడు గద్గద హృదయంతో బాబా చరణాలయందు తన శిరస్సును ఉంచి ఆ చిత్రాన్ని మధ్యలో పీట వేసిన చోట ఉంచుతారు. హేమద్పంత్ ఈ చిత్రం ఎక్కడ నుండి తెచ్చారు అని అలీ అడుగుతారు. ఇది అంగడిలో కొన్నాను కాని ఇప్పుడు ఆ పటం గురించి చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది. మీరు భోజనాలు చేయండి. ఇంకో సారి ఎప్పుడన్నా మీకు ఆ విషయం చెప్తాను అని అలీ వెళ్ళిపోతారు. సమయానికి బాబా పటం రూపంలో వచ్చినందుకు చాలా సంతోషం. అక్కడ ఉన్నవారందరికి బాబా లీల అద్భుతంగా అనిపించింది. అప్పటినుంచి హేమద్పంత్ గారి ఇంట్లో హోళీ పండగ రోజు బాబా పటాన్ని ఉంచి అందరూ భోజనం చేయడం ఆనవాయితి అయ్యింది. 


ఓం శ్రీ సాయినాథార్పణమస్తు!













No comments:

Post a Comment