In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Tuesday, November 29, 2016

శివమ్ - మంగళం - గురు గీత



గురు గీత జీవన విధానాన్ని బోధిస్తుంది. అలానే ఏ శాస్త్రమైన ఈ విషయాన్నే చెప్పడం జరిగింది. మతం అంటే అభిప్రాయము అని సంస్కృతంలో అర్థం. ఈ అభిప్రాయం ఎప్పుడు శాస్త్రానికి భిన్నంగా ఉండకూడదు. ఈ శాస్త్రం అనేది మనకు నిజ జీవితంలో ఉపయోగపడాలి. అందుకనే ఏ గ్రంధాన్ని అయినా సంపూర్ణం చేసేటప్పుడు ఫలశృతి చెప్పడం ఆనవాయితి. అలానే పరమ శివుడు కూడా ఈ గురుగీత వల్ల కలిగే ప్రయోజనాన్ని చెప్పారు. అదేమిటో ఇప్పడు తెలుసుకుందాము.

గురు గీత అతిగుహ్యేయం మయాస్తి కథితా శుభా !
శ్రీ గురుం చిన్మయం ధ్యాయన్ యామహం కలయే సదా !!

ఈ శ్లోకంలో పరమ శివుడు ఒక నిగూఢ రహస్యాన్ని చెప్పారు.
చిన్మయుడైన శ్రీగురువుని ధ్యానిస్తూ నేను నిత్యమూ జపించే అతి రహస్యమైన గురుగీతను నీకు చెప్పాను అని పరమశివుడు పార్వతి మాతతో చెప్పారు.

ఆయన గురుగీతను జపించడం ఎందుకు?
గురువు జ్యోతి స్వరూపము. ఈ ఆత్మ జ్యోతి మనలోనే ఉంది. మనం భగవంతుడికి దీపారాధన చేస్తాము. ఈ దీపం చూస్తూ మనం పూజ చేస్తాము. ఈ దీపమే మనలోని పరమాత్మకు ప్రతీక. మనలో ఉన్న అంతర్ జ్యోతిని అనుభూతి పొందటమే మన జీవిత లక్ష్యం. అందుకే పరమశివుడు జ్యోతిర్లింగాలుగా అవతరించారు. మనకు ఈ నిరాకార తత్వాన్ని బోధించడమే పరమలక్ష్యం.

అందుకే గురు గీతలో గురువు రూపాన్ని ధ్యానించమని చెప్పారు. ఇక్కడ గురువు రూపాన్ని ధ్యానించడం అంటే ఏమిటో చూద్దాము. గురువు సర్వ వ్యాపి, అన్ని రూపాల్లో ఈ పరమాత్మ తత్వమే ఉంది. అప్పుడు మనం గురువు రూపాన్ని ధ్యానించడం అంటే, జీవం ఉన్న వాటిలో మరియు జీవం లేని వాటిలో కూడా ఈ చైతన్య శక్తి ఉంది. అంటే పరమశివుడు ఈ సర్వవ్యాపకత్వ శక్తినే ధ్యానించమంటున్నారు. ఇదే గురు రూప ధ్యానం అంటే. బాబా కూడా ఎల్లప్పుడూ నా గురువునే తలుచుకుంటూ ఉన్నాను. ఇంక వేరే సాధన అవసరం లేదు అని చెప్పారు.

తరువాత గురువు పాదాలనే పూజించాలి అని చెప్పారు. గురువు చూపించిన మార్గంలో నడవటమే నిజమైన పూజ. గురువు వాక్యమే మనకు మంత్రము అని చెప్పారు. గురువు ఎల్లప్పుడూ సత్యాన్నే చెప్తారు. సత్యమైన వస్తువు మనకు అనుభవం అయ్యేలా చేస్తారు. మంత్రము అంటే మనలను రక్షించేది. మంత్ర అంటే మనః త్రాయతే ఇతి మంత్ర: అని సంస్కృతంలో అర్థం చెప్తారు. మనస్సుని శుద్ధి చేసి మనలను సరి అయిన దారిలో నడిపించేదే ఈ మంత్రము. అంటే గురు బోధ మన మంత్రము అని గ్రహించాలి. ఇదే  మనలను   భవబంధాలనుంచి రక్షించి మనకు ముక్తిని ప్రసాదించేది . అందుకే చివరకు మోక్షమూలం గురోర్ కృప అని చెప్పారు. దీన్ని మించిన బోధ మనకు ఇంకేమి అక్కరలేదు. అందుకే గురుగీతకు అంత ప్రాముఖ్యత వచ్చింది. శివమ్ అంటే మంగళ స్వరూపం అని అర్ధం. మనం ఏ పూజ చేసినా చివరకు మంగళం ఉండాల్సిందే. ఈ మంగళం ఒక కర్పూర హారతితోనో లేక ఒక దీపంతోనో చేస్తాము. ఇదే శివ ఐక్యానికి గుర్తు. అంటే పరమాత్మ తత్వాన్ని మనకు తెలియచెప్పడమే ముఖ్య ఉద్దేశం. 

ఈ గురు గీత భక్తితో చదివినా, విన్నా, వ్రాసినా, ఇతరులకు ఇచ్చినా అజ్ఞానం నశిస్తుంది అని పరమ శివుడు చెప్పారు (ఇక్కడ ఇవ్వడం అంటే ఊరికినే పుస్తకం ఇవ్వడం కాదు. ఇతరులకు దీన్ని గురుంచి చెప్పడం లేదా బోధించడం). 

గురు గీతను జపించిడంవల్ల అనంతమైన ఫలం లభిస్తుంది. ఇతర మంత్రాలు దీనిలో పదహారోవంతు ఫలితాన్ని కూడా ఇవ్వవు అని గురు గీత చెప్తుంది. 

గురు గీత సర్వపాపాలను పోగొడుతుంది. అన్ని సంకటాలను హరిస్తుంది. అన్ని సిద్ధులను కలిగిస్తుంది. సర్వ లోకాలను వశం చేస్తుంది. 

గురు గీత దుస్స్వప్న దోషాలను పోగొడుతుంది. సుస్స్వప్న ఫలితాలను కలుగచేస్తుంది. శత్రువులను కూల్చి వేస్తుంది. నిన్ను బృహస్పతి అంత గొప్పవాడిగా చేస్తుంది. ఇక్కడ అజ్ఞానమే దుస్స్వప్నము. గురువు లభించడమే సుస్స్వప్నము. శత్రువులు అంటే కామ క్రోధములే. 

ఎవరైతే మోక్షాన్ని కోరి గురు గీత నిత్యము జపిస్థారో, మోక్ష లక్ష్మిని తప్పకుండా పొందుతారు. పుత్రులు కావాలన్న వారికి పిల్లలు కలుగుతారు. సంపదలు కావాలని కోరితే వారికి అమితమైన ఐశ్వర్యం కలుగుతుంది. 

గురు గీత సర్వ దేవ స్వరూపిణి, సిద్ధిదాయిని. కనుక దీన్ని దేవీ, సూర్య, గణపతి, వైష్ణవ మరియు శైవ ఉపాసకులందరు జపించాలి అని పరమ శివుడు చెప్తున్నారు. 

సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే !
నమశ్శ్రీ గురు నాధాయ ప్రకాశనంద మూర్తయే !!

సర్వ వ్యాపకుడు, పరమాత్మ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అయిన సచ్చిదానందరూప శ్రీ గురుదేవునకు నమస్కారము.  

 విష్ణు స్వరూపుడు, కష్టాలను హరించేవాడు, ఉపనిషత్తులచే తెలియదగినవాడు, మనస్సులకు సాక్షి అయిన సచ్చిదానందరూప శ్రీ గురుదేవునకు నమస్కారము.  

నేనే విష్ణువును, అన్నింటా వ్యాపించి ఉన్న ఆత్మను, ఈ ప్రపంచమంతా నా లోనే కల్పితం అయినది అని ఈ సత్స్వరూపమైన ఆత్మ తత్వాన్ని ఎవరి అనుగ్రహంవల్ల తెలుసుకున్నానో, ఆ సచ్చిదానంద సద్గురువుల పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. 



ఓం శాంతి శాంతి శాంతి:
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 




Wednesday, November 23, 2016

ఆత్మానుసంధానం - గురు గీత




సద్గురువులు సమాజాన్ని సరయిన దారిలో నడిపిస్తారు. బ్రహ్మ సత్యము జగత్తు మిధ్యా అనే సత్యాన్ని అనుభవ పూర్వకంగా మనకు అవగతం చేసే వారే సద్గురువులు. మనకు అనేక సాధనా మార్గములు ఉండచ్చు కానీ చేరవలిసిన గమ్యం మాత్రం ఒక్కటే. మన సనాతన సంప్రదాయంలో గురువుకి ఉన్న ప్రాముఖ్యత మరి ఎవరికీ ఉండదు. మొట్ట మొదట పరమ శివుడు గురువు యొక్క ఆవశ్యకతను తెలియచేసారు. ఇప్పడు గురువులు ఎలా ఈ జ్ఞాన దీపాన్ని వెలిగించుతారో చెప్పబోతున్నారు. 

నిత్యం బ్రహ్మ నిరాకారం  యేన ప్రాప్తం స వై గురుః !
స శిష్యం ప్రాపయేత్ ప్రాప్యం దీపో దీపాంతరం యథా !!

సద్గురువు అంటే ఎవరు ! నిత్యము నిరాకారము అయిన బ్రహ్మ వస్తువును పొందిన వారు. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లుగా గురువులు తమ శిష్యులలో ఈ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తారు. 

గురువు శిష్యుల మధ్య ఉన్న ఈ సంబంధమే అతి ముఖ్యమైనది. మనం గురువుని ప్రాపంచిక కోరికలకు మాత్రమే పరిమితం చేయకుండా, ఈ జ్ఞాన జ్యోతిని వెలిగించమని అర్ధించాలి. దానికి కావాల్సిన అర్హతను సంపాయించాలి. అప్పుడే గురువులు మనలను ఈ దారిలో నడిపించగలుగుతారు. మనకు గురువుదగ్గరనుంచి ఏమి కోరుకోవాలో తెలియదు.  కానీ గురువుకి మాత్రం మనకు ఏమి ఇవ్వాలో తెలుసు. అందుకే మనం మనకు నచ్చింది కాకుండా గురువు ప్రసాదించింది స్వీకరించాలి. అప్పడు మాత్రమే మనకు శ్రేయమైనది లభిస్తుంది. 

సరే గురువు ఈ దీపం వెలిగించాలి అంటే మనం ఏమి చేయాలి?

బాబా ఈ దీపం వెలిగించడానికి కావలసిన యోగ్యతలు చాలా సరళమైన భాషలో చెప్పడం జరిగింది.

1) ముముక్షత : ఎవరయితే తాను బద్దుడనని గ్రహించి బందనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వారే ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు.

2) విరక్తి లేదా ఇహపర సుఖములందు విసుగు చెందుట : ఈ లోకములోని సుఖాలయందు , పరలోక సుఖాలయందు, అంటే స్వర్గాదిసుఖములందు ఆసక్తి లేకుండా ఉండటమే నిజమైన విరక్తి.

3) అంతర్ముఖత : మనకు (ఇంద్రియాలకు) బాహ్యమైన వస్తువులను చూచుటకే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కనుక మానవులెప్పుడు బయటనున్న వానినే చూచును. కాని మనము ఆత్మసాక్షాత్కరము కోరుకుంటే మన దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానముతో జూడవలెను.

4) పాపవిమోచన పొందుట : మానవుడు దుష్ట కర్మల నుండి మనస్సును మరలించలేనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.

5) సరియైన నడవడి : మనము ఎప్పుడూ సత్యము పలుకుచూ, తపస్సు చేయిచూ, అంతర్‌దృష్టితో బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు.

6) ప్రియమైన వాటి కంటే, మనకి ఏది మంచిదో దాన్ని కోరుకోవడం ఎంతో ముఖ్యం.

7) మనస్సును, ఇంద్రియాలను స్వాధీనమునందుంచుకొనుట : శరీరం రధం, ఆత్మ ఆ రధమును నడుపు సారధి, మనస్సు- కళ్ళెము, ఇంద్రియములు - గుఱ్ఱములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనములో లేవో, అట్టి వాడు గమ్యస్థానము చేరలేడు. ఎవరయితే వీటన్నింటిని ఆధీనములో నుంచునో వారు తప్పక గమ్యస్థానము చేరుకుంటారు.

8) మనస్సుని పావనము చేయుట :  మానవుడు ప్రపంచంలో తన విధులను సక్రమంగా నిర్వర్తించితే మరియు ధర్మమార్గంలో ప్రయాణించితే కాని అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు.

9) గురువు యొక్క ఆవశ్యకత : ఆత్మజ్ఞానము చాలా సూక్ష్మము అయినది. మనంతట మనము దానిని పొందలేము. దీనికి గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఆ గురువు ఆత్మసాక్షాత్కారము పొందినవారై యుండాలి. గురువుకు దానిలో ఉన్న లోటుపాట్లు తెలుసు. అందుకే వారు మనలను సరియైన మార్గములో నడిపించగలుగుతారు.

10) భగవంతుని కటాక్షము : "ఆత్మ ఎవరిని ధరించునో వారే దానిని పొందుదురు" అని కఠోపనిషత్తు చెప్పుచున్నది. భగవంతుని కటాక్షము లేనిదే వివేక వైరాగ్యములు కలగవని బాబా ఇక్కడ బోదించడం జరిగింది.

బాబా ఈ పది యోగ్యతలను బోధించి మనందరిని ఉద్దరించారు. వీటన్నింటిని మనము మన నిజజీవితంలో అన్వయించటం నేర్చుకోవాలి.

ఇంకా గురు గీత ఇలా చెప్తుంది. 
గురో: కృపా ప్రసాదేన బ్రహ్మాహ మితి భావయేత్ !
అనేన ముక్తి మార్గేణ హ్యాత్మ జ్ఞానం ప్రకాశయేత్ !!

మనలో అన్ని అర్హతలు కలిగిన తర్వాత, గురు కృపతో లభించిన  "నేనే బ్రహ్మను " అనే జ్ఞానాన్ని భావన చేస్తూ ఉండాలి. ఇదే ముక్తికి మార్గము. ఇలా చేస్తూ ముందుకి సాగితే ఆత్మ జ్ఞానం ప్రకాశిస్తుంది. 


మనము అంతర్ముఖమై మనలోని గుణాలను, అలవాట్లను విశ్లేషణ చేయక పొతే ఇది సాధ్యపడదు. మనలో ఎన్నో జన్మలనుంచి దాగిఉన్న వాసనలు మనకు అడ్డుపడతాయి. గురువు జ్ఞానాన్ని బోధించడం అంటూ ఉండదు, కానీ మనలోఉన్న ఈ అనవసరమైన వాసనలను తీసి వేస్తె అప్పుడు మనం పరబ్రహ్మగా మిగిలిపోతాము. ఆత్మ జ్ఞానం దానంతట అదే ప్రకాశిస్తుంది. ఇదే నిజమైన ఆత్మానుసంధానము. ఇదే సత్యమైన మార్గంగా గురు గీతలో పరమశివుడు బోధించారు. 


                                     శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ! 





Friday, November 11, 2016

ఆత్మ తత్వ సాధనా రహస్యం - గురు గీత




గురువు చూపించిన పధంలో నడుస్తూ, గురు మూర్తినే ధ్యానిస్తూ, గురు వాక్యాలనే వేద వాక్యంగా ధారణ చేస్తూ ఉంటే కలిగే ఫలితమే మోక్షము. ఇప్పుడు గురుతత్వ ధ్యానం ఆత్మ తత్వ ధ్యానం వైపు ఎలా సాగిపోతుందో ఆ రహస్యాన్ని పరమ శివుడు చెప్పబోతున్నారు. 

యథా నిజ స్వభావేన కేయూర కటకాదయః !
సువర్ణత్వెన తిష్ఠన్తి తథాహం బ్రహ్మ శాశ్వతం !!

గాజులు, గొలుసులు మరెన్నో ఆభరణాలకు ఎన్ని ఆకారాలు ఉన్నా నిజానికి అవన్నీ బంగారమే కదా. అలాగే నేను శాశ్వత బ్రహ్మనే ! అని పరమ శివుడు పార్వతి మాతకు గురు గీతలో చెప్పారు. 


ఈ విషయం గురుంచి భగవద్గీతలో భగవానుడు ఇలా చెప్పారు. 

మత్త: పరతరం నాన్యత్ కించిదస్తి ధనుంజయ !
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ !!

ఓ ధనుంజయ ! నా కంటెను పరమ కారణమైనది ఏదియను లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నియును సూత్రమున సూత్ర మణుల వలె నా యందే కూర్చబడి ఉన్నవి. 

రంగులు ఆకారాలు ఎన్ని ఉన్న అన్నింటిలో ఉన్న చైతన్యం ఒక్కటే. మనం చేసే ప్రతిపనిలో ఈ భావం ఉండాలి. మనది అనుకున్నప్పుడు, మనలో ఎక్కడలేని కరుణ, క్షమా గుణం వస్తాయి. అలానే ఈ జగత్తు అంతా పరమాత్మే అనే భావనను దృఢం చేసుకుంటే మనకు సుఖ దుఃఖాలతో పని ఉండదు. వీటికి అతీతంగా ఉండగలుగుతాము. ఇదే పరమానందము. 

ఒక మాదిరిగా మనమందరము ఈ స్థితిని రోజు అనుభవిస్తాము. మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు మనకు ఏమి తెలియదు. సుఖం లేదు. దుఃఖం లేదు. కాని ఆనందం ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ నాది నీది అన్న భావన లేదు. ఈ సాధనే మనలను ఈ బ్రహ్మ భావనకు దగ్గర చేస్తుంది.మనం రోజు చేయాల్సిన పనులలో ఈ తటస్థ భావనను అలవాటు చేసుకోవడమే నిజమైన సాధన. అప్పడు మనము ఆ సమయానికి ఏమి చేయాలో అది మాత్రమే చేస్తాము. అప్పుడు సుఖ దుఃఖాలతో పని లేదు. 

ఇంకా గురు గీత ఇలా చెప్తుంది. 

ఏవం ధ్యాయన్ పరం బ్రహ్మ స్థాతవ్యం యత్ర కుత్రచిత్ !
కీటో భృంగ ఇవ ధ్యానాత్ బ్రహ్మ ఇవ భవతి స్వయమ్ !!

మనం పైన చెప్పినవిధంగా అంతటా ఆ చైతన్య స్వరూపాన్ని చూస్తూ పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండాలి. ఇలా చెయ్యగా పురుగు తుమ్మెద అయినట్లు సాధకుడు తానే బ్రహ్మ అవుతాడు. 

ఈ శ్లోకంలో "యత్ర కుత్రచిత్" అని చెప్పారు. అంటే ఈ సాధన ఎక్కడ ఉన్నా చేయవచ్చు. మనం సంసార జీవితంలో ఉన్నా ఈ సాధన చేయవచ్చు. ఇదే బాబా చెప్పిన సత్యం. అందుకే బాబా ఎప్పుడు సన్యాసం తీసుకోమని తన భక్తులను ప్రోత్సహించలేదు. ఆయన కూడా మనుషలందరిలో ఉండే బోధలు చేశారు. మనం చేసే పనిమీద ఏకాగ్రత ఉండాలి. అంటే శ్రద్ధ ఉండాలి. వేరే వాటిమీదకు మనస్సుని పోనివ్వకూడదు. మనకు జీవితంలో అన్ని విషయాలమీదికి పరిగెత్తటం అలవాటు అయిపొయింది. అందుకే ఏ పనిలో మనకు ఏకాగ్రత కుదరటంలేదు. కానీ మనం మనసు పెడితే చేయగలుగుతాము. 

భూమిలో ఉన్న నీరు బయటకు తీయాలి అంటే ఒకే చోట లోతుగా తవ్వాలి అంతే కాని పదిచోట్ల పైపైన తవ్వితే నీరు రాదు. మనకు నిజంగా మోక్షం కావాలి అంటే ఒక్క గురువుని పట్టుకుంటే సరిపోతుంది. మన జీవితంలో గురువు ప్రవేశించిన తరువాత ఇంకా వేరే సాధనలతో పని లేదు. గురు వాక్యమే మహావాక్యం కావాలి అని పరమశివుడు గురు గీతలో చెప్తున్నారు. గురు కృపే మోక్షానికి దారి అని కూడా చెప్పారు. 

వీక్షణ ధ్యాన సంస్పర్సః మత్స్య కూర్మ విహంగమాః !
పోషయన్తి స్వకాన్ పుత్రాన్ తద్వత్పండిత వృత్తయ:!!

చేప చూపుచేతను, తాబేలు చింతచేతను, పక్షి స్పర్శచేతను తమ గుడ్లను పిల్లలను చేసి పోషించునో అదే విధముగా హస్త సంయోగముచే పక్షివలెను, సంకల్ప శక్తిచే తాబేలువలెను, వీక్షణముచే చేపవలెను తమ శిష్యులను అజ్ఞానమునుంచి జ్ఞానం వైపు తీసుకువెళతారు. 


ఇదే బాబా చెప్పిన నిజమైన సాధన. ఇదే మనలను బ్రహ్మ భావనలో ఉండేటట్లు చేస్తుంది. బాబా ఇలా అన్నారు. నాకు వేరే సాధన తెలియదు, ఎప్పుడు గురువు గురించిన చింతనే. ఇక్కడ గురువు అంటే పరబ్రహ్మె. ఎందుకంటే గురువే దేవుడు, పరమాత్మ అని మన శాస్త్రాలు మనకు చెప్పిన సత్యం. 



శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !


Wednesday, November 9, 2016

అంతర్యామి - గురు గీత



మనం గురు రూపాన్ని ధ్యానించాలి అని పరమశివుడు చెప్పారు. గురువు భూమి మీద ఉన్న చరా చరా లన్నింటిలోను శాంతుడై, పరమాత్మ స్వరూపుడై ఉన్నారని తెలుసుకోవాలి. అలానే వాటన్నింటిలో మనం గురువునే చూడాలి. మనకు ధ్యానమార్గాలు చాలా ఉండచ్చు. కానీ మనం ఏ మార్గంలో పోవాలో ఇక్కడ పరమ శివుడు చెప్తున్నారు. 

శ్రీ గురుం సచ్చిదానందం భావాతీతం విభావ్య చ !
తన్నిదర్శిత మార్గేణ ధ్యాన మగ్నో భవత్సుధీ: !!

సచ్చిదానందుడు, భావాతీతుడు అయిన శ్రీ గురువుని ముందుగా మనస్సులో నిలుపుకొని, విజ్ఞుడైనవాడు గురువు చెప్పిన మార్గంలో ధ్యానంలో ముందుకు సాగుతాడు. 

ఇంతకు ముందు భక్తి పరంగా గురువుని పూజించడం నేర్పారు. గురువుని అనేక గుణాలతో రూపయుక్తంగా భావించడం ఆయనకు ఎలా సపర్యలు చేయడం ఇలాంటి విషయాలను చెప్పారు. ఇప్పుడు జ్ఞానపరంగా గురువుని ధ్యానించడం ఎలానో, నిరాకార మార్గంలో ఆధ్యాత్మికంగా ఎలా ముందుకు సాగాలో చెప్తున్నారు. 

ఇక్కడ బాబా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుందాము. నన్ను నిరాకారంగా ధ్యానించండి. ఇది కుదరకపోతే నా ఈ రూపాన్ని మీ హృదయంలో ఉంచి ధ్యానించండి అని చెప్పారు. ఈ విషయాన్నే పరమశివుడు రాబోయే శ్లోకాల్లో చెపుతున్నారు. 

పరాత్పరతరం ధ్యాయేత్ శుద్ధ స్ఫటిక సన్నిభమ్ !
హృదయాకాశ మధ్యస్థం స్వాంగుష్ఠ పరిమాణకమ్ !!

స్పటికంవలె పరిశుద్ధుడు, పరాత్పరుడు అయిన శ్రీ గురువుని మన హృదయాకాశం మధ్యలో బొటన వేలు పరిమాణంగా ధ్యానించాలి. 
ఈ విషయాన్నే మనం మంత్ర పుష్పంలో చెప్పుకుంటాము. మన చేసే ప్రతీ పూజా పూర్తి  అయిన తర్వాత మంత్ర పుష్పము చదివించడానికి కారణము ఇదే. భగవంతుడు అన్నిటా ఉన్నా నీలోనే నువ్వు చూడగలవు అని చెప్పడమే. అందుకే మంత్ర పుష్పంలో ఇలా చెప్పారు. ఈ మంత్ర పుష్పం కృష్ణ యజుర్వేదంలో నుంచి తీసుకోవడం జరిగింది. 

యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా 
అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః !!
పద్మ కోశ ప్రతీకాశగం హృదయం చాప్యధో ముఖం !
అథో నిష్టా వితస్యాంతే నాభ్యాముపరితిష్ఠతి !!

ఈ కనిపించే, వినిపించే సమస్త జగత్తు అంతా, లోపలా బయటా పరమాత్మే వ్యాపించి ఉన్నాడు అని చెప్తూ, మనలను మన లోపలికే తీసుకువెళ్లి,  కంఠానికి క్రింద నాభికి పైన ఉన్న హృదయాకాశ కుహరంలో తామర మొగ్గలాంటి పద్మ కోశంలోనే ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉన్నట్లుగా మంత్ర పుష్పం చెపుతుంది. 

మనమే బ్రహ్మము అని జ్ఞానపరంగా వింటూ మళ్లా ఈ గురు ధ్యానం ఎందుకు అని మనకు అనుమానం రావచ్చు. కాని గురువు చెప్పిన దారిలో నడుస్తూ సాధన చేయడం అంత సులభం కాదు. మనము మన అహంకారం వల్ల మన మనసులో కలిగిన భావాలను గురువు చెప్పినవిగా భ్రమ పడి మాయాలో పడిపోతూ ఉంటాము. సరే ఇది ఎలా అర్ధం చేసుకోవడం. గురువు ఎప్పడు మనలను మోక్షానికి, అంటే ఆత్మ సాక్షాత్కారం వైపే తీసుకువెళతారు. మనం వెళ్లే దారి దీనికి బిన్నంగా ఉంటె మనం పక్క దారి పట్టినట్లే. ఇక్కడ మంచి పనులు (అంటే సత్వ గుణంతో కూడుకున్న కార్యాలు) కూడా మనలను దారి తప్పిస్తాయి. ఎందుకు అంటే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. అందుకని గురువు చెప్పిన మార్గంలోనే నడవాలి. సరే ఈ మార్గం తప్పకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి ?

గురువుని మన హృదయాకాశం మధ్యలో ఒక చైతన్య స్వరూపంగా ధ్యానించాలి. ఇలా ధ్యానిస్తూ ఉంటె మనం అనుసరించవలిసిన మార్గం బోధపడుతుంది. మనం ఇక్కడ ఏకాగ్రతో ఉండాలి. ఆలా కాకుండా వేరే దారులన్నీ అనుసరిస్తూ ఈ ధ్యానం చేయాలి అంటే కుదరదు. మళ్ళా మనం తప్పుడు మార్గంలో ప్రయాణం చేయవచ్చు. చాలా మంది నాకు బాబా ఎందుకు దర్శనం ఇవ్వడం లేదు అని అనుకొంటారు. ఒకే ఆలోచనతో, భక్తిభావంతో ఒక్క దేవతనే పూజిస్తే ఆ దేవత తప్పకుండా అనుగ్రహించడం జరుగుతుంది. అలా కాకుండా అన్ని రూపాలను మనసులో ఉంచితే, దేని మీద ఏకాగ్రత ఏర్పడదు. 

ధ్యానం అంటేనే ఒక్క దాని మీద మనసు నిలపి, ఆ వస్తువే మనం అయిపోవడం. ఇలా మనసు నిలపడాన్ని ధారణ అని అంటారు. చాలా సార్లు మనం చేసేది ధారణ మాత్రమే. ఇందులో ముందుకి సాగితే అప్పుడు ధ్యానం చేయగలుగుతాము. ఈ ధ్యానమే మనలను సమాధి అనే స్థితికి చేరుస్తుంది. అందుకే గురువుని మనలో చూడమని పరమ శివుడు గురు గీతలో చెపుతున్నారు. 

  
అంగుష్ఠ మాత్రం పురుషం ధ్యాయత శ్చిన్మయం హృది !
తత్ర స్పురతి యో భావః శృణు తత్ కథయామి తే !!

ఇలా చిన్మయుడు, అంగుష్ఠ మాత్రుడు అయిన శ్రీ గురువును ధ్యానిస్తే ఎలాంటి అనుభవం కలుగుతుందో చెపుతాను విను అని పరమ శివుడు అంటున్నారు. 

విరజం పరమాకాశం ధ్రువమానంద మవ్యయమ్ !
అగోచరం తధాగమ్యం నామ రూప వివర్జితం !
తదహం బ్రహ్మ కైవల్య మితి బోధః ప్రజాయతే !!

నిర్మలము, అనంతము, శాశ్వతము, ఆనంద స్వరూపము, అగోచరము, అగమ్యము, నామరూప రహితము అయిన పరబ్రహ్మము తానే అన్న జ్ఞానం కలుగుతుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారము. 



                                                   శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !

Wednesday, November 2, 2016

విశుద్ధ జ్ఞానం - గురు గీత




గురు గీతలో కర్మ యోగము, భక్తి యోగాలు మాత్రమే కాకుండా జ్ఞాన యోగం కూడా బోధించడం జరిగింది. జ్ఞానమార్గంలో కూడా గురు ఉపాసన ఎలా చేయవచ్చు అని పరమ శివుడు పార్వతి దేవికి ఉపదేశం చేస్తున్నారు. గురువు కన్నా అధికమైనది ఏది లేదు అని పరమ శివుడు ఒక శాసనంగా చెప్పారు. 

జ్ఞేయం సర్వం విలాప్యేత  విశుద్ధ జ్ఞాన యోగతః !
జ్ఞాతృత్వ మపి చిన్మాత్రే నాన్య: పంథా ద్వితీయకః !!

పరిశుద్దమైన జ్ఞాన యోగంతో జ్ఞేయమైనది అంతా తగులపెట్టి, చిట్ట చివరికి ఆ చిన్మాత్రలో నాకు తెలుసు అనే తన జ్ఞాతృత్వాన్ని కూడా తగులపెట్టాలి. ఇంక రెండో దారి లేదు అని పరమ శివుడు చెప్పుచున్నారు. 

వేదాంత సారం అంతా ఈ శ్లోకంలో ఉందని చెప్పచ్చు. చాలామంది ఎన్నో ఉపాసనలు చేస్తారు. అనేక సిద్దులను కైవశం చేసుకుంటారు.  వారు మహానుభావులుగా, గురువులుగా పూజించబడవచ్చు కూడా.  కానీ గమ్యాన్ని చేరలేరు.

ఇక్కడ పరిశుద్దమైన జ్ఞానం అని చెప్పడం జరిగింది. జ్ఞానంలో మళ్ళా పరిశుద్ధ జ్ఞానం, పరిశుద్ధం కాని జ్ఞానం ఉంటాయా అని మనకు సందేహం రావచ్చు. మనలో ఎన్నో జన్మలనుంచి పేరుకుపోయి ఉన్న దురవగాహనలు తీసివేస్తే కాని మనకు నిజమైన జ్ఞానం అంటదు. చాలామంది శాస్త్రాలమీద ప్రవచనాలు చెప్పచ్చు, గురువులుగా వారు గౌరవించబడవచ్చు. కాని వారికి సత్యం అనుభూతి కాకపొతే ఉపయోగం లేదు. వీరికి పురాణాలు, అనేక శాస్త్రాలు బాగా తెలిసి ఉండవచ్చు. కానీ ఇవన్నీ మనకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించవు. 

మనలో ఉన్న చాలా సంకల్పాలు అశుద్ధ జ్ఞానంగా వ్యక్తమవుతాయి. ఇక్కడే సత్వ గుణ ప్రధానమైన ఈ సంకల్పాలు మనలను గమ్యానికి దూరం చేస్తాయి. అంతా చూడడానికి సరియైనదిగానే ఉంటుంది. ఇక్కడే పరమ గురువులు మనకు నిజమైన దారి చూపిస్తారు. మనలో ఉన్న ఈ జ్ఞానం కూడా అవిద్యే. పరమ గురువులు ఒక్కొక్క అవిద్యను తొలిగించడానికి ఒక్కో రకమైన విద్యను నీలో ప్రవేశ పెట్టవలిసి వస్తుంది. ఇది గురువుకి మాత్రమే తెలుస్తుంది. అందుకే ఇక్కడ విశుద్ధ జ్ఞాన యోగతః అని చెప్పారు. 

నాకు జ్ఞానం కలిగింది అనే జ్ఞాతృత్వాన్ని కూడా తగులపెట్టాలి అని పరమ శివుడు చెపుతున్నారు. మనం ఆత్మగా ఉంటె నాకు జ్ఞానం కలిగింది అని చేప్పేదెవరు. అంటే ఇంకా మనసు ఉందా అని మనం ప్రశ్న వేసుకోవాలి. అందుకే గురు గీత ఈ భావాన్ని కూడా వదలాలి అని చెపుతుంది. మనం సరిగా ఉపయోగించుకుంటే ఈ అశుద్ధ జ్ఞానాలు కూడా మనకు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఉపయోగపడతాయి. 

సాయి సత్చరితలో నానా చందోర్కర్కు భగవద్గీత శ్లోకం గురుంచి బాబా చేసిన బోధ మనం గుర్తు చేసుకోవాలి.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా|
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః||

గురుచరణాలకు సాష్టాంగ ప్రణామము చేసి, గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్ధాన్ని ఉపదేశిస్తారు.

సాయి మొదటి సగం శ్లోకానికి ఉన్న అర్ధాన్ని అంగీకరించారు. కాని మిగతా సగం శ్లోకానికి సరైన అర్ధం చెప్పమని నానాని అడగడం జరిగింది. జ్ఞానులు మరియు తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానమనే శబ్ధానికి నీవు చెప్పిన అర్ధం విన్నాను, కాని దానికి జ్ఞానమని కాకుండా అజ్ఞానమనే పదం వేస్తే పోయేదేముంది. అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం, జ్ఞానం వాక్కుకు అతీతమైన విషయం. పైన గురు గీతలో చెప్పిన విషయమే బాబా కూడా చెప్పారు. 

 సాయి తన దగ్గరకు వచ్చిన భక్తుల చిత్తంలో ఏముందో తెలుసుకొని, వారివారి పూర్వకర్మలను బట్టి, వారికి ఏ విధమైన బోధ చెయ్యాలో అది మాత్రమే చేసేవారు. మనలో మనకు తెలియకుండా కొన్ని విక్షేపాలు దాగి ఉంటాయి. అవి గురువు మాత్రమే బయటికి తీయగలరు. బయటకు తీసి వాటిని సమూలంగా నాశనం చెయ్యగల శక్తి ఒక్క గురువుకే ఉంది. మనమందరం కామ, క్రోద మధ మాత్సర్యములకు బానిసలమే. ఈ అరిషట్‌వర్గములు అందరిని లొంగ తీసుకుంటాయి. ఇవె మన అధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడతాయి. బాబా మానసిక పరివర్తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. మనం ఎన్ని గ్రంధాలు చదివినా ఆ సద్గురువుల కృపలేనిదే మనం కొంచెం కూడా ముందుకు వెళ్ళలేము. సాయి కోరిన శ్రద్ధ, సబూరి ఉంటే చాలు పెద్ద పర్వతాలనైన కదిలించవచ్చు. 

అందుకే సాయిని ఒక సిద్దాంతానికి, ఒక మతానికి, ఒక ఆచారానికి చెందినట్లు చెప్పలేము. ఈ సకలసృష్టిలో భిన్నత్వం ఉంది. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఈ ఏకత్వాన్ని అర్ధం చేసుకోవడమే మానవజన్మ యొక్క లక్ష్యం. ఇదే విశుద్ధ జ్ఞానం. 

శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై !